Select Page

థైరాయిడ్ క్యాన్సర్, కారణాలు, లక్షణాలు, రకాలు, నిర్ధారణ, చికిత్స

థైరాయిడ్ క్యాన్సర్, కారణాలు, లక్షణాలు, రకాలు, నిర్ధారణ, చికిత్స

థైరాయిడ్ గ్రంథి మన శరీరంలోని మెడ భాగంలో సీతాకోక చిలుక ఆకారంలో ఉంటుంది, శరీరానికి అవసరమైన హార్మోన్లను ఉత్పత్తి చేసే గ్రంథులలో థైరాయిడ్ గ్రంథి కూడా ఒకటి. మన శరీరంలో హార్మోన్లను ఉత్పత్తి చేసే వ్యవస్థను ఎండోక్రైన్ వ్యవస్థ అంటారు. ఎండోక్రైన్ వ్యవస్థలో థైరాయిడ్ గ్రంథి ముఖ్యమైనది. థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్ (T-4) మరియు ట్రైయోడోథైరోనిన్ (T-3) అనే రెండు హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. శరీరంలో జీవక్రియకు ఈ హార్మోన్లు చాలా అవసరం అవుతాయి. కొన్ని కారణాల వలన థైరాయిడ్ గ్రంథి పరిమాణం పెరిగే అవకాశం ఉంది, అంతే కాకుండా ఈ కణజాలం పెరుగుదల క్యాన్సర్ కు కారణం కావచ్చు. మన శరీరంలో ఈ విధంగా థైరాయిడ్ గ్రంథికి వచ్చే క్యాన్సర్ ను థైరాయిడ్ క్యాన్సర్ అంటారు.

థైరాయిడ్ క్యాన్సర్ రకాలు

థైరాయిడ్ గ్రంథికి వచ్చే క్యాన్సర్ నాలుగు రకాలుగా వర్గీకరించబడింది. అవి

  • పాపిల్లరీ థైరాయిడ్ క్యానర్
  • ఫోలిక్యులర్ థైరాయిడ్ క్యాన్సర్
  • మెడల్లరీ థైరాయిడ్ క్యాన్సర్
  • అనాప్లాస్టిక్ థైరాయిడ్ క్యాన్సర్

పాపిల్లరీ థైరాయిడ్ క్యానర్ : థైరాయిడ్ క్యాన్సర్ లలో ఇది సాధారణమైనది. 45 సంవత్సరాలు దాటిన వారిలో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. థైరాయిడ్ క్యాన్సర్ బారిన పడుతున్నవారిలో 75 నుండి 80 శాతం పేషేంట్లలో పాపిల్లరీ థైరాయిడ్ క్యానర్ వస్తుంది. ఇతర క్యాన్సర్లతో పోలిస్తే పాపిల్లరీ థైరాయిడ్ క్యానర్ నెమ్మదిగా వ్యాప్తి చెందుతుంది, ఈ లక్షణం కారణంగా ఈ క్యాన్సర్ ను పూర్తిగా నయం చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఫోలిక్యులర్ థైరాయిడ్ క్యాన్సర్ : థైరాయిడ్ గ్రంథి లో ఉండే ఫోలిక్యులర్ కణాలలో ప్రారంభమయ్యే క్యాన్సర్ ను ఫోలిక్యులర్ థైరాయిడ్ క్యాన్సర్ గా పరిగణిస్తారు. ఫోలిక్యులర్ థైరాయిడ్ క్యాన్సర్ కూడా నెమ్మదిగా వ్యాప్తి చెందే కారణం చేత ఈ క్యాన్సర్ ను పూర్తిగా నయం చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ క్యాన్సర్ లక్షణాలు త్వరగా బయటపడవు, తరచుగా మెడనొప్పి లేదా లేదా మెడ దగ్గర వాపు కనిపిస్తుంటే డాక్టర్ ను సంప్రదించి నిర్దారించుకోవడం అవసరం.

మెడల్లరీ థైరాయిడ్ క్యాన్సర్ : థైరాయిడ్ గ్రంథి లోని సి – కణాలు కాల్సిటోనిన్ అనే హార్మోన్ ను ఉత్పత్తి చేస్తాయి. ఈ కణాలలో వచ్చే క్యాన్సర్ ను మెడల్లరీ థైరాయిడ్ క్యాన్సర్ గా పరిగణిస్తారు. ఇతర థైరాయిడ్ క్యాన్సర్లతో పోలిస్తే ఈ క్యాన్సర్ కణాలు వేగంగా వ్యాప్తి చెందుతాయి. మెడల్లరీ థైరాయిడ్ క్యాన్సర్ మొదటి దశలో పేషేంట్ కు తెలియకపోవచ్చు, అయితే క్రమంగా గొంతు నొప్పి, మెడ నొప్పి, ఆహారం మింగడంలో ఇబ్బంది మొదలైన లక్షణాలు కనిపించవచ్చు.

అనాప్లాస్టిక్ థైరాయిడ్ క్యాన్సర్ : థైరాయిడ్ గ్రంథిలో వచ్చే అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్ అనాప్లాస్టిక్ థైరాయిడ్ క్యాన్సర్. ఈ క్యాన్సర్ చాలా ప్రమాదకరమైనది మరియు ఇతర శరీర భాగాలకు అత్యంత వేగంగా వ్యాపించే లక్షణాలను కలిగి ఉంటుంది. మొదటి దశలోనే ఈ క్యాన్సర్ ను గుర్తించి చికిత్స చేయలేకపోతే ప్రాణాంతకమైన స్థితికి వెళ్లే ప్రమాదం ఉంది. అనాప్లాస్టిక్ థైరాయిడ్ క్యాన్సర్ ఉన్నవారికి తీవ్రమైన మెడ నొప్పి, ఆహరం తీసుకోవడంలో ఇబ్బంది, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలైన లక్షణాలు కనిపిస్తాయి.

థైరాయిడ్ క్యాన్సర్ రావడానికి గల కారణాలు

థైరాయిడ్ క్యాన్సర్ రావడానికి వివిధ కారణాలు ఉన్నాయి, వాటిని ఇక్కడ వివరంగా తెలుసుకోవచ్చు.

జన్యుపరమైన కారణాలు : థైరాయిడ్ క్యాన్సర్ జన్యుపరమైన కారణాల వలన ఎక్కువగా సంక్రమించే అవకాశం ఉంది. వంశపారంపర్యంగా ఈ క్యాన్సర్ రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. కుటుంబలో థైరాయిడ్ క్యాన్సర్ మాత్రమే కాకుండా అడినోమాటస్ పాలిపోసిస్, గార్డనర్ సిండ్రోమ్, కౌడెన్ సిండ్రోమ్ ఉన్నవారికి కూడా ఈ క్యాన్సర్ సంక్రమించే అవకాశం ఉంది.

రేడియేషన్ : మన శరీరంలోని థైరాయిడ్ గ్రంథి రేడియేషన్ కు గురికావడం వలన లేదా గతంలో ఏదైనా రేడియేషన్ థెరపీ చికిత్స తీసుకున్న వారికి థైరాయిడ్ క్యాన్సర్ సంక్రమించే అవకాశం ఉంది. తల లేదా మెడ ప్రాంతంలో రేడియేషన్ కు గురి కావడం వలన థైరాయిడ్ క్యాన్సర్ సంక్రమించే ప్రమాదం ఉంది.

అయోడిన్ లోపం : మన శరీరానికి, ముఖ్యంగా థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయడానికి అయోడిన్ అవసరం అవుతుంది. అయోడిన్ లోపం సమస్య తలెత్తితే దాని వలన థైరాయిడ్ క్యాన్సర్ సంక్రమించే అవకాశం ఎక్కువగా ఉంది. దానితో పాటుగా ఇతర అనారోగ్యాలకు కూడా కారణం అవుతుంది.

గాయిటర్ : థైరాయిడ్ గ్రంథి వాపును గాయిటర్ గా పరిగణిస్తారు. ఈ వాపు థైరాయిడ్ గ్రంథికి రెండు వైపులా లేదా ఒక వైపు మాత్రమే రావచ్చు. కొన్నిసార్లు వాపుతో పాటుగా థైరాయిడ్ గ్రంథిలో గడ్డలు కూడా ఏర్పడవచ్చు. ఇలా ఏర్పడిన గడ్డలు క్యాన్సర్ గా మారే అవకాశం ఉంది.

థైరాయిడ్ వ్యాధి : థైరాయిడ్ గ్రంథి మన శరీరానికి కావాల్సిన హార్మోలను ఉత్పత్తి చేస్తుంది. అయితే థైరాయిడ్ గ్రంథి పనితీరులో లోపం వలన ఈ హార్మోన్లు ఎక్కువగా లేదా తక్కువగా ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. దీని వలన థైరాయిడ్ గ్రంథి క్యాన్సర్ ఏర్పడవచ్చు.

ఊబకాయం : మనం అధిక బరువు మరియు ఊబకాయం సమస్యలను పెద్దగా పట్టించుకోము, కానీ ఊబకాయం వలన మన శరీరంలో అనేక అనారోగ్య సమస్యలు కలుగుతాయి. థైరాయిడ్ క్యాన్సర్ కు ఊబకాయం కూడా కారణమయ్యే అవకాశం ఉంది.

థైరాయిడ్ క్యాన్సర్ ను నిర్దారించడానికి ఎలాంటి పరీక్షలు అవసరం?

థైరాయిడ్ క్యాన్సర్ ను నిర్ధారించడానికి పేషేంట్ కు ఉన్న లక్షణాలను బట్టి పరీక్షను ఆంకాలజిస్ట్ ఎంపిక చేస్తారు. సాధారణంగా థైరాయిడ్ క్యాన్సర్ నిర్ధారణ కోసం ఈ క్రింది పరీక్షలను ఉపయోగిస్తారు. .

  • అల్ట్రాసౌండ్ : శరీరంలో థైరాయిడ్ క్యాన్సర్ కణితులు లేదా థైరాయిడ్ గడ్డలు గురించి తెలుసుకోవడానికి మరియు వాటి పరిమాణం గురించి తెలుసుకోవడానికి అల్ట్రా సౌండ్ పరీక్ష చేయాల్సి ఉంటుంది.
  • బయాప్సీ : ఈ పద్దతిలో ఒక సూది ద్వారా థైరాయిడ్ గ్రంథి లోని కణజాలాన్ని సేకరిస్తారు, ఆ కణజాలాన్ని పరీక్షించడం ద్వారా క్యాన్సర్ ను నిర్ధారిస్తారు.
  • CT స్కాన్ : థైరాయిడ్ క్యాన్సర్ దశను బట్టి ఇతర భాగాలకు కూడా వ్యాపించే ప్రమాదం ఉంది, ఈ పరిస్థితిని నిర్దారించడానికి CT స్కాన్ ను ఉపయోగిస్తారు.
  • ఇమేజింగ్ పరీక్ష: థైరాయిడ్ క్యాన్సర్ నిర్ధారణ కోసం ఇతర ఇమేజింగ్ పరీక్షలు కూడా అవసరం అవుతాయి.

థైరాయిడ్ క్యాన్సర్ లక్షణాలు

Thyroid cancer

థైరాయిడ్ క్యాన్సర్ ఉన్నవారిలో ఈ క్రింది లక్షణాలు కనిపించవచ్చు. అయితే మొదటి దశలో ఈ లక్షణాలు కనిపించకపోవచ్చు.మగవారితో పోల్చితే ఆడవారిలో థైరాయిడ్ క్యాన్సర్ సంక్రమించే ప్రమాదం ఎక్కువగా ఉంది, ఆడవారిలో కూడా థైరాయిడ్ క్యాన్సర్ లక్షణాలు కూడా ఇలాగే ఉండవచ్చు.

  • మెడ నొప్పి : థైరాయిడ్ క్యాన్సర్ ఉన్నవారిలో మెడ నొప్పి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఒకొక్కసారి క్యాన్సర్ ఉన్నా కూడా పేషేంట్ కు నొప్పి కలగకపోవచ్చు. అత్యధిక మంది పేషేంట్లలో మెడ నొప్పి తీవ్రంగా మరియు తరచుగా ఉంటుంది.
  • మెడ వాపు : థైరాయిడ్ క్యాన్సర్ ఉన్నవారికి మెడ వాపు కనిపిస్తుంది మరియు మెడ దగ్గర గడ్డలు ఉన్నట్టు అనిపించవచ్చు.
  • ఆహారం మింగడంలో ఇబ్బంది: థైరాయిడ్ క్యానర్ ఉన్నవారిలో ఆహారం తీసుకునే సందర్భంలో ఇబ్బందిగా ఉంటుంది, ఆహారం మింగుడు పడకపోవడం లేదా ఆహారం మింగే సమయంలో నొప్పి మొదలైన లక్షణాలు కనిపిస్తాయి.
  • మాట్లాడడంలో ఇబ్బంది: థైరాయిడ్ క్యాన్సర్ ఉన్నవారు మాట్లాడడంలో కూడా ఇబ్బంది పడవచ్చు. కొన్నిసార్లు ఈ క్యాన్సర్ ఉన్నవారి గొంతు పూర్తిగా బొంగురు గొంతు లాగా మారవచ్చు.
  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది : థైరాయిడ్ క్యాన్సర్ కణాలు మెడ భాగంలో ఏర్పడినందున ఇవి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగిస్తాయి.
  • అలసట అధికంగా ఉండడం : థైరాయిడ్ క్యాన్సర్ ఉన్నవారు చిన్న చిన్న పనులకే అలసిపోతూ ఉంటారు. అలసట ఎక్కువకాలం ఉన్నట్టు ఉంటుంది.
  • బరువు తగ్గడం : థైరాయిడ్ క్యాన్సర్ ఉన్నవారు అకస్మాత్తుగా బరువు తగ్గే ప్రమాదం ఉంది.
  • ఆకలి లేకపోవడం : థైరాయిడ్ క్యాన్సర్ ఉన్నవారిలో ఆకలి మందగిస్తుంది. సమయానికి ఆకలి కలగదు.
పై లక్షణాలు మీలో కనిపిస్తున్నాయా?

థైరాయిడ్ క్యాన్సర్ చికిత్స విధానాలు

థైరాయిడ్ క్యాన్సర్ ను తొలిదశలోనే గుర్తించగలిగితే పూర్తిగా నయం చేసే అవకాశం ఉంది. అయితే థైరాయిడ్ క్యాన్సర్ కు అందించే చికిత్స క్యాన్సర్ దశ, క్యాన్సర్ కణాల పరిమాణం, క్యాన్సర్ కణాలు ఉన్న ప్రదేశాన్ని బట్టి పేషేంట్ కు చేయాల్సిన చికిత్సను ఆంకాలజిస్ట్ నిర్ణయిస్తారు. థైరాయిడ్ క్యాన్సర్ ను నయం చేయడానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సలను ఇక్కడ తెలుసుకోవచ్చు.

  • సర్జరీ : థైరాయిడ్ క్యాన్సర్ కణాలను శస్త్రచికిత్స చేయడం ద్వారా కొంత భాగం లేదా పూర్తిగా తొలగిస్తారు. ఈ విధంగా థైరాయిడ్ క్యాన్సర్ కణుతులను తొలగించడాన్ని థైరాయిడెక్టమీ అని అంటారు.
  • రేడియేషన్ థెరపీ : థైరాయిడ్ క్యాన్సర్ ను నయం చేయడానికి రేడియేషన్ థెరపీ కూడా అందుబాటులో ఉంది. రేడియేషన్ థెరపీ కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన మిషన్ ద్వారా పేషేంట్ శరీరంలో ఉన్న క్యాన్సర్ కణాల మీద రేడియేషన్ ప్రసరిస్తారు. ఈ రేడియేషన్ కిరణాలు, క్యాన్సర్ కణాలను నిర్ములించడంలో తోడ్పడతాయి.
  • ఇమ్యునో థెరపీ : సాధారణంగా మన శరీరంలో కలిగే అనారోగ్యాలను నిర్ములించడానికి రోగ నిరోధక శక్తి పనిచేస్తుంది. అయితే క్యాన్సర్ కణాలు రోగ నిరోధక శక్తిని కూడా తట్టుకుని శరీరంలో ఇతర భాగాలకు వ్యాపించగలవు. క్యాన్సర్ కణాలు ఇలా వ్యాపించకుండా కొన్ని రకాల మందుల ద్వారా మన శరీరం యొక్క రోగనిరోధక శక్తిని పెంచుతారు. ఇలా పేషేంట్ శరీరంలో పెరిగిన రోగ నిరోధక శక్తి క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుంది.
  • టార్గెట్ థెరపీ : టార్గెట్ థెరపీ అంటే కేవలం మన శరీరంలో ఉన్న క్యాన్సర్ కణాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని వాటిని నాశనం చేయడానికి పని చేస్తుంది. అయితే ఈ చికిత్స వలన శరీరంలోని ఇతర కణాలు కొంతమేర ప్రభావితమయ్యే అవకాశం ఉంది.
  • కీమోథెరపీ : థైరాయిడ్ క్యాన్సర్ చికిత్సలో భాగంగా కీమోథెరపీ ను కూడా డాక్టర్ సూచించవచ్చు. ఈ విధానంలో కూడా క్యాన్సర్ కణాలను నిర్ములించడానికి అవసరమైన మందులను ఇస్తారు. అవసరాన్ని బట్టి కీమోథెరపీ తో పాటుగా సర్జరీ లేదా రేడియేషన్ థెరపీ కూడా ఉపయోగించవచ్చు.

మీ ఆరోగ్య సంరక్షణ గురించి ఏవైనా సందేహాలు ఉన్నాయా? సహాయం చేయడానికి మేము సిద్దంగా ఉన్నాము! మా అనుభవంతులైన నిపుణుల సలహా కొరకు +918929967127 కి కాల్ చేయగలరు.

About Author –

Dr. Sudha Sinha, Clinical Director & HOD, Medical Oncology Sr. Consultant, Medical Oncology & Hemato-Oncology

About Author

Sudha sinha

Dr. Sudha Sinha

MBBS, MD (USA), DM (USA), Diplomate American Board

Clinical Director & HOD, Medical Oncology Sr. Consultant, Medical Oncology & Hemato-Oncology