Select Page

మంగు మచ్చలు (పిగ్మెంటేషన్) : కారణాలు, లక్షణాలు,రకాలు, నివారణ, చికిత్స

మంగు మచ్చలు (పిగ్మెంటేషన్) : కారణాలు, లక్షణాలు,రకాలు, నివారణ, చికిత్స

మంగు మచ్చలు అంటే ఏమిటి?

మన చర్మంపై ముఖం మీద గోధుమ రంగు లేదా నలుపు రంగులో ఏర్పడే మచ్చలను మంగు మచ్చలు (పిగ్మెంటేషన్) అని అంటారు. మన చర్మం అతినీల లోహిత కిరణాలకు గురికావడం, హార్మోన్ హెచ్చు తగ్గులు, గర్భ నిరోధక మాత్రల వాడకం వలన ఈ మంగు మచ్చలు ఏర్పడవచ్చు. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో కలిగే హార్మోన్ మార్పుల వలన ఈ మచ్చలు ఏర్పడినప్పుడు వాటిని మెలస్మా గా వ్యవహరిస్తారు. ఈ మచ్చలు నుదురు, బుగ్గలు, ముక్కు, చేతులు, కాళ్ళ మీద కూడా రావచ్చు. మంగు మచ్చలు రావడానికి ఇతర కారణాలు ఏంటి? ఈ మచ్చలు రాకుండా నివారించవచ్చా? వీటికి ఎలాంటి చికిత్స చేస్తారు అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం.

మంగు మచ్చలు రావడానికి గల కారణాలు

మన చర్మంపై మంగు మచ్చలు ఏర్పడడానికి అనేక కారణాలు ఉన్నాయి, వాటి గురించి ఇక్కడ వివరంగా తెలుసుకోవచ్చు.

  • మెలనోసైట్లు: మన శరీరంలో మెలనోసైట్లు అనే కణాలు ఉంటాయి, ఇవి మన అతినీలలోహిత కిరణాల నుండి మన చర్మం రంగును కాపాడడానికి మెలనిన్ అనే ద్రవాన్ని ఉత్పత్తి చేస్తాయి. కొన్ని సందర్భాలలో మెలనిన్ చర్మానికి అవసరమైన దానికంటే ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది, ఈ ప్రతిచర్య కారణంగా శరీరంపై మచ్చలు ఏర్పడవచ్చు.
  • హార్మోన్ మార్పులు : మన శరీరంలో ముఖ్యంగా గర్భధారణ సమయంలో జరిగే హార్మోన్ మార్పుల కారణంగా ఈ మచ్చలు ఏర్పడతాయి. అంతే కాకుండా ఊబకాయం, ఇతర కారణాల వలన హార్మోన్ల ఉత్పత్తిలో మార్పులు కలగడం వలన మంగు మచ్చలు ఏర్పడతాయి.
  • అతినీలలోహిత కిరణాలు : సూర్యరశ్మిలో ఎక్కువగా పనిచేసే వారిమీద అతినీలలోహిత (UV) కిరణాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సందర్భంలో శరీరం రంగును కాపాడడానికి మెలనిన్ ఉత్పత్తి అవుతుంది. అయితే అవసరమైన దానికంటే ఎక్కువ మెలనిన్ ఉత్పత్తి అయినప్పుడు అది శరీరంపై మంగు మచ్చలు ఏర్పడడానికి కారణం అవుతుంది.
  • గాయాలు : మన ముఖం లేదా ఇతర భాగాల్లో తగిలిన గాయాల వలన కూడా మంగు మచ్చలు ఏర్పడవచ్చు. గాయం పూర్తిగా మానినప్పటికీ అక్కడ ఏర్పడిన మంగు మచ్చలు అలాగే ఉండిపోతాయి.
  • కొన్నిరకాల మందులు : గర్భనిరోధక మాత్రలు మరియు కొన్ని ఇతర మాత్రల కారణంగా కూడా మంగు మచ్చలు ఏర్పడడానికి కారణం అవుతాయి.
  • ఒత్తిడి : మానసిక ఒత్తిడి అనేది మన శరీరంలో ఉత్పత్తయ్యే హార్మోన్ల హెచ్చు తగ్గులకు కారణం అవుతుంది. మనం తరచుగా ఒత్తిడికి లోనైతే దాని ప్రభావం వలన ముఖం మరియు ఇతర భాగాల్లో మంగు మచ్చలు రావచ్చు.
  • థైరాయిడ్ వ్యాధి : మన శరీరంలో థైరాయిడ్ గ్రంథి చాలా ముఖ్యమైనది, థైరాయిడ్ గ్రంథిలో ఏదైనా సమస్యలు వస్తే దాని కారణంగా శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది, ఫలితంగా అది మంగు మచ్చలు ఏర్పడడానికి కారణం అవుతుంది.
  • ఊబకాయం : అధిక బరువు, ఊబకాయం అనేవి మన శరీరంలో అనేక అనారోగ్యాలను కలుగజేస్తాయి, అంతే కాకుండా మన అందాన్ని కూడా తగ్గిస్తాయి. ఊబకాయం వలన శరీరంలో అనేక ముడతలు ఏర్పడతాయి, దీర్ఘకాలికంగా ఈ ముడతలు ఉండడం వలన అక్కడి చర్మంపై మంగు మచ్చలు ఏర్పడతాయి.
  • మొటిమలు : మన శరీరంపై మొటిమలు రావడం అనేది చాలా సాధారణం, మొటిమలు ముఖ్యంగా ముఖం మీద ఎక్కువ వస్తూ ఉంటాయి. వీటిని గిల్లినప్పుడు ముఖం మీద మచ్చలు ఏర్పడతాయి. ముఖం మీద మొటిమలు మానిన తర్వాత కూడా ఈ మంగు మచ్చలు అలాగే ఉంటాయి.
  • చర్మ వ్యాధులు : సోరియాసిస్, ఎగ్జిమా మరియు ఇతర చర్మ వ్యాధుల కారణంగా చర్మంపై కొంత భాగం గాయమైనట్టు లేదా పైపొర తొలగినట్టు లక్షణాలు ఉండవచ్చు. ఇలాంటి సందర్భాలలో తొలగిన చర్మం ప్రదేశంలో నల్లగా మంగు మచ్చలు ఏర్పడే అవకాశం ఉంది.
  • అలర్జీలు : మన చర్మంపై వివిధ కారణాల వలన అనేక అలర్జీలు కలుగుతాయి, కొన్నిసార్లు ఈ అలర్జీలు నయం అయిన తర్వాత ఆ ప్రదేశంలో మచ్చలు అలాగే ఉండిపోతాయి.
  • కాస్మోటిక్స్ : సాధారణంగా మనం అందంగా కనిపించడానికి కాస్మోటిక్స్ ను ఉపయోగిస్తూ ఉంటాం, అయితే వీటిలో కొన్ని రకాల రసాయనాలు కలవడం వలన లేదా మన చర్మానికి కాస్మోటిక్ పడకపోవడం వలన నల్లగా మంగు మచ్చలు ఏర్పడే అవకాశం ఉంది. కాస్మోటిక్స్ వాడే సందర్భంలో వాటి తయారీలో వాడిన పదార్ధాల గురించి కూడా అవగాహన కలిగి ఉండడం ముఖ్యం.
  • కీమో థెరపీ మరియు ఇతర చికిత్సలు : క్యాన్సర్ నయం చేయడానికి కీమోథెరపీ వంటి చికిత్స తీసుకున్నప్పుడు ఆ చికిత్స యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా ముఖం లేదా ఇతర భాగాల్లో ఈ మంగు మచ్చలు ఏర్పడవచ్చు.

Pigmentation

మంగుమచ్చల వలన మీ మనోస్థైర్యం కోల్పోకండి

మంగు మచ్చల లక్షణాలు

మన శరీరంపై ఏర్పడిన మంగు మచ్చలు నల్లగా వివిధ పరిమాణాల్లో ఉంటాయి, సాధారణంగా ఈ మచ్చల వలన ఎటువంటి నొప్పి కలగదు. అయితే ముఖంపై ఏర్పడిన ఈ మచ్చల వలన అందం సన్నగిల్లుతుంది, కొంతమంది ఈ మచ్చల వలన ఆత్మనూన్యతకు గురవుతారు. శరీరంపై ఏర్పడే మంగు మచ్చల లక్షణాలు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

  • ముఖంపై మచ్చలు : మంగు మచ్చలు ఎక్కువగా ముఖంపై ఏర్పడుతూ ఉంటాయి. కొంతమందిలో వీటి పరిమాణం చిన్నగాను, మరికొంతమందిలో పెద్దగానూ ఉండవచ్చు. ముక్కు, చెంపలు, నుదురు, పెదవుల మీద ఈ మంగు మచ్చలు ఏర్పడవచ్చు.
  • నలుపు లేదా గోధుమ రంగు : మంగు మచ్చలు కేవలం నలుపు రంగులో మాత్రమే కాకుండా, కొంతమందిలో గోధుమ రంగు లో కూడా ఉండవచ్చు. శరీరం యొక్క సాధారణ రంగు కంటే ఇవి భిన్నంగా ఉంటూ స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి.
  • ఎండలో రంగు మారడం: మంగు మచ్చలు సూర్యరశ్మికి గురైనప్పుడు మరింత నల్లగా లేదా మరింత ముదురు గోధుమ రంగులోకి మారతాయి. సూర్యరశ్మికి ఈ మచ్చలు సున్నితంగా ఉంటాయి.

మంగు మచ్చలు ఎన్ని రకాలు?

మంగు మచ్చలు ,వాటి లక్షణాలు, మరియు కారణాల ఆధారంగా ఈ క్రింది విధంగా విభజించబడ్డాయి.

  • హైపర్ పిగ్మెంటేషన్ : మన శరీరంలో మెలనిన్ ఎక్కువగా ఉత్పత్తి కావడం వలన నల్లటి లేదా గోధుమ రంగు మచ్చలు ఏర్పడడాన్ని హైపర్ పిగ్మెంటేషన్ అంటారు. శరీరం యొక్క సాధారణ రంగు కంటే ఇవి నల్లగా లేదా గోధుమ రంగులో కనిపిస్తాయి.
  • మెలస్మా : మెలస్మా కూడా హైపర్ పిగ్మెంటేషన్ లోని భాగం అనే చెప్పవచ్చు, అయితే మన శరీరంలో హార్మోన్ అసమతుల్యత కారణంగా ఏర్పడిన మచ్చలను మెలస్మా అని అంటారు. మిగిలిన కారణాల వలన ఏర్పడే మచ్చలను పిగ్మెంటేషన్ గా నిర్దారిస్తారు. మెలస్మా కూడా పిగ్మెంటేషన్ లో భాగమే, పిగ్మెంటేషన్ లో ఉండే లక్షణాలే మెలస్మా మచ్చలలో కూడా ఉంటాయి.
  • హైపో పిగ్మెంటేషన్ : మన శరీరంలో ఏదైనా కారణాల వలన శరీరం యొక్క సాధారణ రంగు కంటే కొంత భాగం తక్కువ రంగులో లేదా తెల్లటి మచ్చలు కలిగి ఉండడాన్ని హైపో పిగ్మెంటేషన్ అంటారు.

మంగు మచ్చలకు ఎలాంటి చికిత్స చేస్తారు?

శరీరంపై ఏర్పడిన మంగు మచ్చలు పోగొట్టడానికి కొన్ని ప్రత్యేక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. పిగ్మెంటేషన్ యొక్క చికిత్స విధానాలను ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

  • మందులు మరియు క్రీమ్లు : ముఖంపై ఏర్పడిన మంగు మచ్చలు మరియు డార్క్ స్పాట్స్ ను తొలగించడానికి హైడ్రో క్వినోన్, టెట్రా సైక్లిన్, గ్లైకో యాసిడ్ మొదలైన మందులు కలిగిన క్రీమ్ లను డెర్మటాలజిస్ట్ సూచించవచ్చు. ముఖంపై ఉన్న డార్క్ స్పాట్స్ కేవలం చర్మం యొక్క పైన పొరల్లో ఉంటే ఈ క్రీమ్ వాడడం ద్వారా వాటిని తొలగించవచ్చు.
  • లేజర్ ట్రీట్మెంట్ : ముఖం లేదా ఇతర భాగాల్లో ఉన్న మంగు మచ్చలపై లేజర్ కిరణాలను ప్రయోగించడం ద్వారా ఆ మచ్చలను తొలగిస్తారు. ఈ చికిత్స ద్వారా ఒకసారి మంగు మచ్చలను తొలగించిన తర్వాత అవి మళ్ళీ రావడానికి అవకాశం ఉండదు.
  • మైక్రో నీడిలింగ్ : మన శరీరంలో మంగు మచ్చలు ఏర్పడిన ప్రదేశంలో చెమట చిన్న సూదులతో రంధ్రాలు చేయడం వలన ఆ భాగంలో కొల్లాజెన్ మరియు ఎలాస్టిన్ అనే ప్రొటీన్ల ఉత్పత్తిని పెంచుతుంది. వీటి కారణంగా మంగు మచ్చలు తొలగిపోయి ఆ స్థానంలో కొత్త చర్మం ఏర్పడుతుంది.
  • కెమికల్ పీల్ : శరీరానికి హాని చేయని ప్రత్యేకమైన రసాయనాన్ని ఉపయోగించి చర్మం యొక్క పై పొరను తొలగిస్తారు. ఇలా తొలగించిన తర్వాత ఆ స్థానంలో కొత్త పొర ఏర్పడుతుంది, తద్వారా మంగు మచ్చలు తొలగిపోతాయి.

మంగు మచ్చలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఏదైనా సమస్య ఏర్పడిన తర్వాత చికిత్స చేయడం కంటే ఆ సమస్య రాకుండా ముందు జాగ్రత్త తీసుకోవడం అవసరం. ఈ క్రింద వివరించిన జాగ్రత్తలు పాటించడం ద్వారా మంగు మచ్చలు రాకుండా నివారించవచ్చు.

  • సన్ స్క్రీన్ వాడకం : మంగు మచ్చలు అనేవి ఎక్కువగా సూర్యరశ్మి కారణంగా ఏర్పడతాయి కాబట్టి ఎండలో పనిచేసేవారు ప్రతీరోజూ సన్ స్క్రీన్ ఉపయోగించడం అవసరం. సన్ స్క్రీన్ యొక్క SPF ఎంత ఉండాలి అనేది డెర్మటాలజిస్ట్ ను సంప్రదించి నిర్ణయం తీసుకోవచ్చు.
  • తరచుగా ముఖం కడగడం : చాలామంది రోజూ స్నానం చేసే సందర్భంలో తప్ప ప్రత్యేకంగా ముఖాన్ని శుభ్రం చేసుకోరు. కానీ ఎండలో పని చేసే అప్పుడు లేదా ఎక్కువగా ప్రయాణాలు చేసే సందర్భంలో రోజుకు మూడు నుండి నాలుగు సార్లు ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రం చేసుకోవడం వలన మంగు మచ్చలు ఏర్పడకుండా నివారించవచ్చు.
  • కాస్మోటిక్స్ వాడకం తగ్గించడం : చాలా వరకూ కాస్మోటిక్స్ తయారీలో కొన్ని రసాయనాల వాడకం ఉంటుంది, ఆయా రసాయనాల వలన తాత్కాలికంగా ముఖంలో మంచి రంగు వచ్చినా కూడా వాటి వాడకం ఆపిన తర్వాత డార్క్ స్పాట్స్ మరియు మంగు మచ్చలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకూ కృత్రిమంగా తయారయ్యే కాస్మోటిక్స్ కు దూరంగా ఉండడం మంచిది.
  • సహజ ఉత్పత్తులతో ఫేస్ ప్యాక్ : ముఖానికి ఫేస్ ప్యాక్ వేసుకునే సందర్భంలో పసుపు, కలబంద, పాలు మొదలైన సహజమైన ఉత్పత్తులు వాడడం వలన చర్మం ప్రకాశవంతంగా కనిపించడమే కాకుండా మంగు మచ్చలు రాకుండా నివారిస్తాయి.

ముగింపు

అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలి అనే ఉద్దేశంతో చాలామంది కెమికల్స్ ఉన్న కాస్మోటిక్స్ ను ఉపయోగిస్తున్నారు. వీటి వలన దీర్ఘకాలికంగా చర్మంపై నల్లటి మచ్చలు ఏర్పడవచ్చు. సహజమైన పద్ధతుల్లో తయారు చేసిన ఉత్పత్తులను వాడడం వలన ఇలాంటి మంగు మచ్చలు రాకుండా నివారించవచ్చు. ఒకవేళ మీరు ఇప్పటికే మంగు మచ్చల సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు ఐతే అనుభవజ్ఞులైన యశోద హాస్పిటల్స్ డెర్మటాలజిస్ట్ ను సంప్రదించి మీ చర్మానికి సరిపోయే చికిత్స విధానం గురించి వివరంగా తెలుసుకుని తద్వారా మీ మచ్చలను తొలగించుకోవచ్చు.

మీ ఆరోగ్య సంరక్షణ గురించి ఏవైనా సందేహాలు ఉన్నాయా? సహాయం చేయడానికి మేము సిద్దంగా ఉన్నాము! మా అనుభవజ్ఞులైన నిపుణుల సలహా కొరకు +918929967127 కి కాల్ చేయగలరు.

About Author –

Dr. Padmaja, MD (Dermatology)

About Author

Dr. Padmaja | yashoda hospitals

Dr. Padmaja

MD (Dermatology)

Consultant Dermatologist