లివర్ సిర్రోసిస్ : కారణాలు, లక్షణాలు, జాగ్రత్తలు, నిర్ధారణ, చికిత్స

లివర్ సిర్రోసిస్ అంటే ఏమిటి?
మన శరీరంలో కాలేయం అతిపెద్ద అవయవం, ఇది అనేక పనులను నిర్వహిస్తూ ఉంటుంది. మనం తీసుకునే ఆహారంలో అనేక రకాలైన కొవ్వు పదార్ధాలు ఉంటాయి, వీటిని జీర్ణం చేయడానికి కాలేయం పిత్తం అనే ద్రవాన్ని ఉత్పత్తి చేస్తుంది. మనం తీసుకున్న కొవ్వు పదార్ధాలను జీర్ణం చేయడానికి ఈ ద్రవం సహాయపడుతుంది. దీనితో పాటుగా కాలేయం మన రక్తాన్ని శుద్ధి చేస్తుంది, రక్తంలో ఉన్న విష పదార్ధాలను విచ్చిన్నం చేస్తుంది. మన శరీరంలో ఉండాల్సిన రక్తం పరిమాణాన్ని నియంత్రణలో ఉంచుతుంది. శరీరానికి అవసరమైన చక్కెరను గ్లైకోజెన్ రూపంలో నిల్వ చేస్తుంది. అంతే కాకుండా రక్తం గడ్డకట్టడానికి అవసరమైన పదార్ధాలను కూడా కాలేయం ఉత్పత్తి చేస్తుంది. అయితే మన ఆహారపు అలవాట్లు మరియు జీవనశైలి కారణంగా కాలేయం పనితీరులో సమస్యలు ఏర్పడవచ్చు. ఈ సమస్యలకు దీర్ఘకాలికంగా ఎటువంటి చికిత్స చేయకుండా, జీవనశైలి మార్చుకోకుండా ఉంటే ఇది దశల వారీగా లివర్ సిర్రోసిస్ అనే పరిస్థితికి దారి తీయవచ్చు. మృదువుగా ఉండాల్సిన లివర్, ఈ స్థితిలో గట్టిగా మారిపోతుంది, అంతేకాకుండా లివర్ పనితీరు పూర్తిగా తగ్గిపోతుంది మరియు కాలేయం వైఫల్యానికి దారి తీస్తుంది. లివర్ సిర్రోసిస్ సమస్య ప్రాణాంతకమైనది, ఈ పరిస్థితుల్లో లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయకపోతే పేషేంట్ ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి లివర్ సిర్రోసిస్ రాకుండా,ముందు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. లివర్ సిర్రోసిస్ వ్యాధి గురించి పూర్తిగా తెలుసుకుందాం.
లివర్ సిర్రోసిస్ దశలు
లివర్ సిర్రోసిస్ పరిస్థితి ఒక్కసారిగా ఏర్పడదు, ఆరోగ్యకరమైన లివర్ నుండి ఫ్యాటీ లివర్, తర్వాత లివర్ ఫైబ్రోసిస్ తర్వాత లివర్ సిర్రోసిస్ పరిస్థితి ఏర్పడుతుంది, ఈ సమస్య మరింత తీవ్రమైతే కాలేయం వైఫల్యం చెందుతుంది. లివర్ సిర్రోసిస్ దశల గురించి ఇక్కడ వివరంగా తెలుసుకోండి.
- ఫ్యాటీ లివర్ : ఫ్యాటీ లివర్ అనేది కాలేయం వాపుకు గురవ్వడం. ఫ్యాటీ లివర్ రెండు రకాలుగా ఉంటుంది. మొదటిది ఆల్కహాలిక్ అసోసియేటెడ్ ఫ్యాటీ లివర్ డిసీజ్ కాగా, రెండవది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. ఊబకాయం, ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ సమస్య ఏర్పడుతుంది. మద్యపానం ఎక్కువగా తీసుకోవడం వలన కలిగే ఫ్యాటీ లివర్ ను ఆల్కహాల్ అసోసియేటెడ్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు. ఈ దశలో ఫ్యాటీ లివర్ లక్షణాలు త్వరగా కనిపించవు.
- లివర్ ఫైబ్రోసిస్ : లివర్ మీద మచ్చ కణజాలం ఏర్పడడాన్ని లివర్ ఫైబ్రోసిస్ అంటారు. లివర్ ఫైబ్రోసిస్ దశలో పేషేంట్ కు ఎటువంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. అలాగే లివర్ ఫైబ్రోసిస్ దశను సాధారణ పరీక్షల ద్వారా గుర్తించడం కష్టం అవుతుంది. లివర్ ఫైబ్రోసిస్ దశలో ఉన్నప్పుడు తెలుసుకోగలిగితే తగిన చికిత్స ద్వారా లివర్ సిర్రోసిస్ దశ రాకుండా నివారించే అవకాశం ఉంది. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ఫైబ్రో స్కాన్ అనే అత్యాధునిక పరీక్ష ద్వారా లివర్ ఫైబ్రోసిస్ ను గుర్తించవచ్చు. దీని ద్వారా లివర్ సిర్రోసిస్ రాకుండా నివారించడం సులువుగా ఉంటుంది.
- లివర్ సిర్రోసిస్ : ఈ దశలో మచ్చ కణజాలం లివర్ మీద పూర్తిగా ఏర్పడుతుంది, కాలేయం గట్టిపడిపోతుంది. దీని వలన లివర్ పనితీరు మందగిస్తుంది. దీని వలన శరీరం బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, వాంతులు మరియు ఇంకొన్ని లక్షణాలు కనిపిస్తాయి. లివర్ సిర్రోసిస్ అనేది కాలేయ వ్యాధి యొక్క చివరి దశ. ఈ దశలో కొన్ని మందుల ద్వారా లివర్ పనితీరును కొంతకాలం వరకూ పొడిగించగలం కానీ లివర్ సిర్రోసిస్ నుండి లివర్ మళ్ళీ సాధారణ స్థితికి రాదు. లివర్ సిర్రోసిస్ తీవ్రమైన సందర్భంలో లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సి ఉంటుంది.
లివర్ సిర్రోసిస్ సమస్య ఏర్పడడానికి గల కారణాలు
లివర్ సిర్రోసిస్ ఏర్పడడానికి మన ఆహారపు అలవాట్లతో పాటుగా, జీవనశైలి మరియు అనేక ఇతర కారణాలు ఉన్నాయి. లివర్ సిర్రోసిస్ ఏర్పడడానికి గల కారణాలను ఇక్కడ వివరంగా తెలుసుకోవచ్చు.
- మద్యపానం : ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే అలవాటు ఉన్నవారికి లివర్ సమస్యలు కూడా ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది. అతిగా మద్యం సేవించడం లివర్ సిర్రోసిస్ సమస్యకు ముఖ్య కారణం.
- హెపటైటిస్ B, హెపటైటిస్ C : హెపటైటిస్ B మరియు C వైరస్ ల కారణంగా లివర్ సిర్రోసిస్ ఏర్పడవచ్చు. ఈ వైరల్ ఇన్ఫెక్షన్లు దీర్ఘకాలికంగా కాలేయానికి నష్టం కలిగిస్తాయి, సరైన సమయానికి చికిత్స అందకపోతే కాలేయానికి అపారమైన నష్టం కలిగే ప్రమాదం ఉంది.
- ఊబకాయం : అధిక బరువు మరియు ఊబకాయం అంటే మన శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉండడమే, ఈ కారణాల వలన కాలేయం లో కూడా కొవ్వు పేరుకునిపోతుంది. దీర్ఘకాలికంగా ఊబకాయంతో బాధ పడుతున్న వారికి లివర్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ కలిగే అవకాశం ఉంది. ఈ పరిస్థితి నుండి లివర్ సిర్రోసిస్ కు ఇది పరిణామం చెందుతుంది.
- ఆహారపు అలవాట్లు : మనం తీసుకునే ఆహారాన్ని జీర్ణం చేయడానికి కాలేయం కొన్ని ద్రవాలను ఉత్పత్తి చేస్తుంది. అయితే మనం తీసుకునే ఆహారంలో ఎక్కువగా కొవ్వు పదార్ధాలు ఎక్కువగా ఉంటే అవి జీర్ణం కావడానికి కాలేయం ఎక్కువగా పని చేయాల్సి ఉంటుంది. దీర్ఘకాలికంగా కాలేయం పైన భారం కలిగితే అది దశలవారీగా లివర్ సిర్రోసిస్ కు దారి తీయవచ్చు.
- ఆటో ఇమ్యూన్ రుగ్మతలు : మన శరీరాన్ని వివిధ వ్యాధుల నుండి కాపాడే రోగ నిరోధక వ్యవస్థ కొన్ని సందర్భాలలో శరీరంలోకి వచ్చే వైరస్ లేదా బాక్టీరియా మీద కాకుండా ఆరోగ్యకరమైన అవయవాల మీద ప్రభావం చూపించడం జరుగుతుంది. ఇలా రోగ నిరోధక వ్యవస్థ కాలేయం మీద ప్రభావం చూపడం వలన లివర్ సిర్రోసిస్ పరిస్థితి ఏర్పడుతుంది.
- పోషకాహార లోపం : మనం ప్రతీరోజూ శరీరానికి అవసరమైన పోషకాలను తీసుకోకపోవడం వలన కాలేయం మీద ఎక్కువ భారం కలుగుతుంది. దీని కారణంగా కూడా లివర్ సిర్రోసిస్ ఏర్పడే ప్రమాదం ఉంది.
- మధుమేహం : డయాబెటీస్ వలన కూడా కాలేయ సంబంధిత సమస్యలు కలిగే ప్రమాదం ఉంది. ముఖ్యంగా టైప్ 2 డయాబెటీస్ లివర్ ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. మధుమేహం వలన ఇన్సులిన్ ఉత్పత్తి నిరోధించబడుతుంది దీని కారణంగా కాలేయం వాపుకు(NAFLD) గురవుతుంది, ఈ పరిస్థితి క్రమక్రమంగా లివర్ సిర్రోసిస్ దశకు దారితీస్తుంది.
లివర్ సిర్రోసిస్ నిర్ధారించడానికి అవసరమైన పరీక్షలు
లివర్ సిర్రోసిస్ సమస్యను నిర్ధారించడానికి వివిధ రకాల వైద్య పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. ఈ పరీక్షల గురించి ఇక్కడ వివరంగా తెలుసుకోవచ్చు.
- అల్ట్రా సౌండ్ : ఈ స్కానింగ్ పద్ధతి ద్వారా లివర్ పరిమాణం, ఆకారం, లివర్ కు వచ్చే రక్తప్రసరణ, లివర్ పై ఏర్పడిన మచ్చ కణజాలం లేదా ఇతర అసాధారణ కణజాలం గురించి తెలుసుకోవచ్చు.
- MRI : లివర్ సిర్రోసిస్ ను గుర్తించడానికి MRI స్కాన్ అవసరమవుతుంది. ఈ స్కానింగ్ విధానంలో కూడా లివర్ పరిమాణం, లివర్ పై ఏర్పడిన మచ్చ కణజాలం గురించి తెలుసుకోవచ్చు. కాలేయం మీద ఏర్పడిన కణుతులను వాటి మరియు మచ్చలను వాటి పరిమాణాన్ని కచ్చితంగా గుర్తించడంలో MRI స్కానింగ్ సహాయపడుతుంది. లివ్ పై ఏర్పడే క్యాన్సర్ కణుతులను గుర్తించడంలో కూడా MRI స్కాన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
- CT స్కాన్ : లివర్ పై భాగంలో ఏర్పడిన మచ్చలను నిర్ధారించడానికి CT స్కాన్ ను ఉపయోగిస్తారు. లివర్ పై ఏర్పడిన మచ్చల ఇమేజ్ రూపొందించడంలో CT స్కాన్ సహాయపడుతుంది.
- బయాప్సీ : ఈ విధానంలో ఒక ప్రత్యేకమైన సూది ద్వారా కాలేయంలో చిన్న భాగాన్ని బయటకు తీసి దానిని పరీక్ష చేస్తారు. ఈ పరీక్ష ద్వారా లివర్ సిర్రోసిస్ స్థితిని నిర్ధారిస్తారు.
- ట్రాన్సియెంట్ ఎలాస్టోగ్రఫీ (ఫైబ్రో స్కాన్ ) : లివర్ సిర్రోసిస్ సమస్యను నిర్ధారించాడనికి చేసే నాన్ ఇన్వాసివ్ పద్ధతి ట్రాన్సియెంట్ ఎలాస్టోగ్రఫీ. ఈ విధానంలో ఒక ట్రాన్స్ డ్యూసర్ ను ఉపయోగించి కొన్ని వేవ్స్ ను శరీరంలోకి పంపిస్తారు. ఈ వేవ్స్ కదలికల వేగం ఎక్కువగా ఉంటే కాలేయం గట్టిగా ఉన్నట్టు మరియు వీటి వేగం తక్కువగా ఉంటే లివర్ మృదువుగా ఉన్నట్టు సూచిస్తుంది. ఈ పరీక్ష ద్వారా లివర్ ఫైబ్రోసిస్ దశలోనే కాలేయం పైన ఉన్న మచ్చ కణజాలాన్ని మరియు లివర్ గట్టితనాన్ని ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. దీని ద్వారా లివర్ ఫైబ్రోసిస్ దశ నుండి సిర్రోసిస్ దశకు వెళ్లకుండా నివారించే అవకాశం ఉంది. ఈ పరీక్ష నాన్ ఇన్వాసివ్ పద్దతిలో నిర్వహించబడుతుంది అంతే కాకుండా అతి తక్కువ సమయంలో లివర్ యొక్క పరిస్థితిని తెలుసుకోవచ్చు.
లివర్ సిర్రోసిస్ వలన ఏర్పడే ఇతర సమస్యలు
లివర్ సిర్రోసిస్ అనేది కాలేయ వ్యాధి యొక్క చివరి దశ, కాబట్టి ఈ దశలో లివర్ పనితీరు ఘననీయంగా తగ్గిపోతుంది. దీని వలన మన శరీరంలో ఇతర సమస్యలు ఏర్పడవచ్చు. లివర్ సిర్రోసిస్ వలన కలిగే సమస్యల గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
- పోర్టల్ హైపర్ టెన్షన్ : మన శరీరంలో ఉన్న జీర్ణ అవయవాలైన కడుపు, ప్రేగులు, పాంక్రియాస్, ప్లీహము మొదలైన వాటి నుండి కాలేయానికి రక్తం సరఫరా చేయబడుతుంది. లివర్ సిర్రోసిస్ ఏర్పడినప్పుడు ఈ అవయవాల నుండి వచ్చే రక్తాన్ని కాలేయం అంగీకరించదు. ఫలితంగా కాలేయానికి రక్తం సరఫరా చేసే సిరలో రక్తపోటు పెరిగిపోతుంది, దీనిని పోర్టల్ హైపర్ టెన్షన్ అంటారు.
- అసైటిస్ : అసైటిస్ అంటే ద్రవంతో కడుపు నిండిపోవడం అని చెప్పవచ్చు, లివర్ సిర్రోసిస్ ఉన్నవారిలో ఈ సమస్య ఏర్పడే ప్రమాదం ఉంది. దీని వలన కడుపు ఉబ్బరం, వికారం, వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలైన లక్షణాలు కనిపిస్తాయి.
- కాళ్ళ వాపు : లివర్ సిర్రోసిస్ వలన కాలేయం పనితీరు మందగించినప్పుడు రక్తనాళ్ళలో రక్తం ఎక్కువ అవుతుంది, ఆ సందర్భంలో రక్తనాళాల్లో ఉన్న రక్తం బయట కణజాలంలోకి వస్తుంది. దీనివలన కాళ్ళు మరియు చీలమండ దగ్గర వాపు ఏర్పడుతుంది, ఈ పరిస్థితిని ఎడిమా అని అంటారు.
- ప్లీహం పెరుగుదల : మన శరీరంలో ఉండే ప్లీహం రక్తకణాలను వడపోస్తుంది. అయితే లివర్ సిర్రోసిస్ కారణంగా ప్లీహం పరిమాణంలో పెరుగుదల కనిపిస్తుంది.
- రోగనిరోధక శక్తి తగ్గుదల : లివర్ సిర్రోసిస్ వలన రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. ఫలితంగా అనేక అంటువ్యాధులు మరియు ఇన్ఫెక్షన్లు కలగవచ్చు.
- కామెర్లు : లివర్ సిర్రోసిస్ కారణంగా కామెర్ల వ్యాధి వచ్చే అవకాశం ఉంది. దీని వలన రక్తంలో పిత్తం అనే ద్రవం పెరిగిపోతుంది.
లివర్ సిర్రోసిస్ లక్షణాలు ఎలా ఉంటాయి?
లివర్ సిర్రోసిస్ చాలా ప్రమాదకరమైన పరిస్థితి, ఈ స్థితిలో పేషేంట్ వివిధ లక్షణాలు కనిపించవచ్చు. లివర్ సిర్రోసిస్ వలన ఏర్పడే లక్షణాలను ఇక్కడ వివరంగా తెలుసుకోవచ్చు.
- కడుపు లేదా పొత్తికడుపు నొప్పి : లివర్ సిర్రోసిస్ ఉన్నవారికి తరచుగా కడుపు నొప్పి వస్తుంది. ఇది కొన్నిసార్లు పొత్తి కడుపు నొప్పికి కూడా కారణం కావచ్చు.
- అలసట: లివర్ సిర్రోసిస్ ఉన్నవారు చిన్న పనులకు కూడా అలసిపోతారు. ఎంత ఆహారం తీసుకున్నా కూడా అలసట గానే ఉంటారు.
- ఆకలి లేకపోవడం : లివర్ సిర్రోసిస్ ఉన్నవారికి ఆకలి తక్కువగా ఉంటుంది. మనం తీసుకున్న ఆహారం జీర్ణం అవ్వడం ఆలస్యం అవుతుంది కాబట్టి అధిక సమయం పాటు కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది.
- చర్మం దురద : లివర్ సిర్రోసిస్ ఉన్నప్పుడు చర్మంపై ఎటువంటి దద్దుర్లు మరియు చర్మ సంబంధిత సమస్యలు లేకపోయినా కూడా దురద కలుగుతుంది.
- చేతులు, కాళ్ళు మరియు ముఖంలో వాపు : లివర్ సిర్రోసిస్ ఉన్నప్పుడు రక్తనాళాల్లో రక్త ప్రసరణ నెమ్మదిగా ఉటుంది. దీని కారణంగా కొన్ని రక్తనాళాల్లో రక్తం ఎక్కువగా ఉండిపోతుంది, ఫలితంగా కాళ్ళు, చేతులు ముఖం వంటి భాగాల్లో వాపు ఏర్పడుతుంది.
- బరువు తగ్గడం : లివర్ సిర్రోసిస్ ఉన్నప్పుడు అకస్మాత్తుగా బరువు తగ్గిపోతారు. లివర్ సిర్రోసిస్ వలన జీర్ణక్రియ మందగిస్తుంది. ఈ కారణంగా పేషేంట్ త్వరగా బరువు తగ్గుతారు.
లివర్ సిర్రోసిస్ చికిత్స
ఒకసారి లివర్ సిర్రోసిస్ దశకు చేరుకున్న తర్వాత లివర్ మళ్ళీ ఆరోగ్యమైన స్థితికి వచ్చే అవకాశం లేదు. లివర్ సిర్రోసిస్ దశకు వచ్చిన తర్వాత డాక్టర్ చెప్పే జాగ్రత్తలు పాటిస్తూ వీలైనంత వరకూ కాలేయం మీద భారం తగ్గించాలి. లివర్ సిర్రోసిస్ కారణంగా వచ్చే ఇతర సమస్యలకు చేయడం ద్వారా పేషేంట్ కు కలిగే నొప్పి మరియు ఇతర లక్షణాల నుండి ఉపశమనం పొందవచ్చు. లివర్ సిర్రోసిస్ ను తగ్గించే మందులు మరియు చికిత్స లేదు కాబట్టి ఈ పరిస్థితి రాకుండా నివారించడం అవసరం. లివర్ సిర్రోసిస్ కారణంగా కాలేయ వైఫల్యం చెందే ప్రమాదం ఉన్నప్పుడు లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సి ఉంటుంది.
లివర్ సిర్రోసిస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
లివర్ సిర్రోసిస్ అనేది చాలా ప్రమాదకరమైన పరిస్థితి, ఒకసారి లివర్ సిర్రోసిస్ వస్తే దానికి చికిత్స లేదు కాబట్టి ఈ పరిస్థితి రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. లివర్ సిర్రోసిస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇక్కడ తెలుసుకోవచ్చు.
- మద్యపానం మానడం : మద్యం తీసుకోవడం వలన మన శరీరంలో అనేక అనారోగ్యాలు ఏర్పాడతాయి. ఆల్కహాల్ ప్రభావం ముఖ్యంగా లివర్ మీద ఎక్కువగా ఉంటుంది, దాని కారణంగా లివర్ సిర్రోసిస్ ఏర్పడవవచ్చు. ఈ ప్రమాదం కలగకుండా ఉండాలంటే ఆల్కహాల్ అలవాటును మానుకోవాలి.
- తగినంత వ్యాయామం : ఫ్యాటీ లివర్ దశ నుండి లివర్ సిర్రోసిస్ దశ రావడానికి మన జీవనశైలి కూడా ముఖ్య కారణం అవుతుంది. ప్రతీరోజు సరైన క్రమంలో వ్యాయామం చేయడం వలన ఫ్యాటీ లివర్ సమస్య తగ్గడమే కాకుండా లివర్ సిర్రోసిస్ రాకుండా ఉంటుంది.
- హెపటైటిస్ వ్యాక్సిన్లు : ఇప్పటి వరకూ మీరు హెపటైటిస్ వ్యాక్సిన్ తీసుకొన్నట్లు అయితే వెంటనే వ్యాక్సినేషన్ చేపించుకోవాలి. హెపటైటిస్ వ్యాధి ఉన్నవారికి లివర్ సంబంధిత సమస్యలు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది.
- క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు : కాలేయం కాకుండా ఏదైనా ఇతర సమస్యలతో హాస్పిటల్ కు వెళ్లిన సందర్భాల్లో చేసిన వైద్య పరీక్షలలో కాలేయ సమస్యలు గుర్తించబడుతున్నాయి. ఇలా కాకుండా ప్రతీ సంవత్సరం ఒకసారి అల్ట్రాసౌండ్ స్కానింగ్ లేదా డాక్టర్ సూచించిన వైద్య పరీక్షలను చేపించుకోవడం ద్వారా కాలేయం యొక్క స్థితిని తెలుసుకుని తద్వారా జాగ్రత్తలు పాటించవచ్చు.
ముగింపు
లివర్ సిర్రోసిస్ అనేది చాలా ప్రమాదకరమైన పరిస్థితి, అయితే కొన్ని సందర్భాలలో ఈ సమస్య ఉన్నవారు పది సంత్సరాలకంటే ఎక్కువ కాలం జీవితాన్ని గడిపిన వారు కూడా ఉన్నారు కానీ ఈ పరిస్థితి అందరికీ ఒకేలా ఉంటుందని చెప్పలేం. కాబట్టి వీలైనంత వరకూ జాగ్రత్తలు తీసుకుంటూ ఏదైనా సమస్య కలిగితే వెంటనే డాక్టర్ ను సంప్రదించడం అవసరం.
మీ ఆరోగ్య సంరక్షణ గురించి ఏవైనా సందేహాలు ఉన్నాయా? సహాయం చేయడానికి మేము సిద్దంగా ఉన్నాము! మా అనుభవంతులైన నిపుణుల సలహా కొరకు +918929967127 కి కాల్ చేయగలరు.