మెనింజైటిస్ : కారణాలు, లక్షణాలు, నివారణ మరియు చికిత్స

మెనింజైటిస్ అంటే అర్ధం ఏమిటి?
మన శరీరంలో అతి ముఖ్యమైన అవయవం మెదడు, మనం ఏ పని చేయాలన్నా మెదడు నుండి సంకేతాలు రావాలి, మన శరీరంలో ఏ చిన్న కదలిక కావాలన్నా దానికి మెదడు నుండి సంకేతం కావాలి. మన మెదడుకి ఎటువంటి ఇన్ఫెక్షన్లు రాకుండా మరియు బాక్టీరియా వైరస్ లు మెదడుకు సోకకుండా మెదడు పైభాగంలో మూడు పొరలు అడ్డుగా ఉంటాయి. ఈ పొరలు మెదడు మరియు వెన్నుపాములను కప్పి ఉంచుతాయి, ఏదైనా బాక్టీరియా, వైరస్, శిలీంద్రాలు (ఫంగస్) లేదా ఇతర కారణాల వలన ఈ పొరలు వాపుకు గురవ్వచ్చు. మెదడు, వెన్నుపాము లను కప్పిఉంచే పొరల వాపును మెనింజైటిస్ అంటారు. మెనింజైటిస్ తరుచుగా మెదడు ఇన్ఫెక్షన్ కు దారి తీస్తుంది, అప్పుడు ఆ వ్యాధిని మెనింగోఎన్సెఫాలిటిస్ అంటారు. ఇది ప్రాణాంతకమైన వ్యాధి, ఈ వ్యాధి సంక్రమణ అరుదుగా ఉంటుంది, ఈ వ్యాధి సంక్రమించిన వెంటనే వైద్యం అందకపోతే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ వ్యాధి వలన చూపు మరియు వినికిడి శక్తి కోల్పోయే ప్రమాదం కూడా ఉంది.
మెనింజైటిస్ వ్యాధి ఎందుకు వస్తుంది?
ఇన్ఫెక్షన్స్ వలన తరుచుగా మెనింజైటిస్ సంక్రమిస్తుంది, వివిధ రకాల క్రిములు అనగా బాక్టీరియా , వైరస్, ఫంగస్, ఈస్ట్ల వలన వస్తుంది. అరుదుగా క్యాన్సర్ ( కార్సినొమాటస్ మెనింజైటిస్) , ఆటోఇమ్యూన్ వ్యాధులు (సర్కాయిడోసిస్, వాస్కులైటిస్, ఐజీ G4) వ్యాధుల వలన కూడా రావచ్చు. పిల్లలకు అధికంగా వైరల్ మెనింజైటిస్ సోకుతుంది. బాక్టీరియా కారణంగా సంభవించే మెనింజైటిస్ ప్రాణాంతకంగా మారవచ్చు, వైరస్ ల వలన సంభవించే మెనింజైటిస్ ప్రాణాంతకం కాదు. మెనింజైటిస్ వ్యాధి సోకడానికి గల కారణాలు ఇక్కడ వివరంగా తెలుసుకోండి.
- నైసేరియా మెనింజైటిడిస్ బాక్టీరియా : ఈ బాక్టీరియా శ్వాసకోశం ద్వారా శరీరం లోపలికి వెళ్లి రక్తప్రవాహంలో కలుస్తుంది. ఈ బాక్టీరియా రక్తం ద్వారా మెదడులోకి చేరినప్పుడు మెదడు పైన ఉన్న పొరల మీద ప్రభావం చూపిస్తుంది, దీని కారణంగా ఆ పొరల్లో వాపు ఏర్పడుతుంది.
- స్ట్రెప్టోకోకస్ న్యుమోనియా : ఇది న్యుమోనియాను కలగజేసే బాక్టీరియా, ఈ బాక్టీరియా మెదడు లేదా వెన్నుపాము లాంటి భాగాలకు వ్యాపించినప్పుడు అక్కడున్న కణజాలం మీద దాడి చేస్తుంది, ఈ ప్రభావం వలన మెనింజైటిస్ వ్యాధి సంక్రమిస్తుంది.
- వైరస్ : వైరస్ లలో మెనింజైటిస్ కు కారణమయ్యే వైరస్ లు అనేక రకాలుగా ఉన్నాయి. అవి ఎంటరోవైరస్, హెర్పెస్ వైరస్, HIV, మంప్స్ లేదా గవదబిళ్ళ వైరస్ లు. సాధారణంగా ఈ వైరస్ లకు చికిత్స చేయడం వలన అవి మెనింజైటిస్ వ్యాధిగా సంక్రమించక ముందే నయం అవుతాయి. కానీ ఈ వైరస్ మెదడు మరియు వెన్నుపామును కప్పి ఉన్న పొరలలోకి చేరి మెనింజైటిస్ వ్యాధికి కారణమైతే అది ప్రాణాంతకంగా మారుతుంది.
- వైరల్ ఇన్ఫెక్షన్ : కొన్ని రకాలైన వైరల్ ఇన్ఫెక్షన్లు కూడా మెనింజైటిస్ వ్యాధికి కారణమవుతాయి.
- శిలీంధ్రాలు (ఫంగస్) : మెదడును కప్పి ఉంచే పొరలలో ఫంగస్ ఏర్పడడం వలన కూడా మెనింజైటిస్ వ్యాధి సంక్రమిస్తుంది.
- పరాన్నజీవులు (పారాసైట్) : పరాన్నజీవులు అంటే తను జీవించడం కోసం ఇతరుల మీద ఆధారపడేవి, ఈ పరాన్నజీవుల వలన వేటి మీద ఐతే ఆధారపడతాయో అవి చనిపోయే అవకాశం ఉంది. ఇలాంటి పరాన్నజీవులు మెదడుని కప్పి ఉంచే పొరల్లోకి చేరి మెనింజైటిస్ వ్యాధికి కారణం అవుతాయి.
మెనింజైటిస్ యొక్క లక్షణాలు
మెనింజైటిస్ వ్యాధి సంక్రమించిన వారికి దీర్ఘకాలిక తలనొప్పి, మెడ నొప్పి, జ్వరం మొదలైన లక్షణాలు ఉంటాయి. మెనింజైటిస్ వ్యాధి లక్షణాలు ఇక్కడ వివరంగా తెలుసుకోవచ్చు.
- తీవ్రమైన తలనొప్పి: మెనింజైటిస్ వ్యాధి సంక్రమించిన వారికి తలనొప్పి తీవ్రంగా ఉంటుంది, పైగా ఈ తలనొప్పి దీర్ఘకాలికంగా ఉంటుంది.
- వినికిడి లోపం: మెనింజైటిస్ వ్యాధి సోకిన వారికి వెంటనే చికిత్స అవసరం, ఒకొక్కసారి చికిత్స చేసిన తర్వాత కూడా వినికిడి లోపం సమస్య అలాగే ఉండిపోతుంది, ఈ సమస్య జీవితాంతం ఉండవచ్చు.
- చూపు మందగించడం: మెనింజైటిస్ వ్యాధి పేషేంట్ చూపు మీద కూడా ప్రభావం చూపిస్తుంది. కొన్నిసార్లు చూపు పూర్తిగా మందగించే ప్రమాదం కూడా ఉంది.
- మెడ కదిలించలేక పోవడం: మెనింజైటిస్ వ్యాధి ఉన్నవారికి మెడనొప్పి ఎక్కువగా ఉంటుంది, మెడ తిప్పడానికి వీలు లేకుండా పట్టేసినట్టు ఉంటుంది.
- జ్వరం: మెనింజైటిస్ వ్యాధి ఉన్నవారికి జ్వరం అధికంగా మరియు దీర్ఘకాలికంగా ఉంటుంది.
- మూర్ఛ: మెనింజైటిస్ ఇన్ఫెక్షన్ కారణంగా మెదడు పై ఒత్తిడి పెరుగుతుంది మరియు మెదడులో వాపు ఏర్పడుతుంది అందువలన మెనింజైటిస్ ఉన్నవారు అకస్మాత్తుగా స్పృహ కోల్పోతూ ఉంటారు.
- ఎక్కువ కాంతిని చూడలేకపోవడం: మెనింజైటిస్ ఉన్నవారు వెలుతురు లేదా కాంతిని చూడలేకపోవచ్చు, మెనింజైటిస్ కారణంగా వెలుతురును చూస్తే కళ్ళు నొప్పిగా ఉంటాయి.
మెనింజైటిస్ వ్యాధిని ఎలా నివారించవచ్చు?
మెనింజైటిస్ వ్యాధి సోకకుండా నివారించడానికి కొన్ని టీకాలు అందుబాటులో ఉన్నాయి, ఈ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా మెనింజైటిస్ వ్యాధి సోకకుండా నివారించవచ్చు. మెనింజైటిస్ వ్యాధి నివారించడానికి ముందుగానే ఈ టీకాలు తీసుకోవాలి. మెనింగోకాకల్ కంజుగేట్ వ్యాక్సిన్ (MenACWY), మెనింగోకాకల్ B వ్యాక్సిన్ (MenB) లను డాక్టర్ల సూచన మేరకు తీసుకోవడం వలన మెనింజైటిస్ వ్యాధి రాకుండా నివారించవచ్చు. మనం వాడే వస్తువులను (నీళ్ళ గ్లాసులు, భోజనం ప్లేట్లు, టూత్ బ్రష్ లు మొదలైనవి ఇతరులతో పంచుకోకుండా ఉండడం వలన మెనింజైటిస్ సోకకుండా నివారించవచ్చు.
మెనింజైటిస్ వ్యాధికి ఎలాంటి చికిత్స చేస్తారు?
మెనింజైటిస్ వ్యాధి ప్రాణాంతకమైనది, ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తే ఎటువంటి ఆలస్యం చేయకుండా డాక్టరుని సంప్రదించాలి. మెనింజైటిస్ వ్యాధి సోకిన వారిని అత్యవసర చికిత్స విభాగంలో ఉంచి చికిత్స అందించాలి. మెనింజైటిస్ వ్యాధి లక్షణాలను తగ్గించడానికి యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్, ఆక్సిజన్ థెరపీ మొదలైన చికిత్సలను పేషేంట్ లక్షణాలను బట్టి అందిస్తారు.
మెనింజైటిస్ వ్యాధి ఏ వయసు వారిలో ఎక్కువగా వస్తుంది?
మెనింజైటిస్ వ్యాధి అన్ని వయసుల వారికి సంక్రమించే ప్రమాదం ఉంది, సాధారణంగా రోగ నిరోధకత తక్కువ ఉన్నవారికి ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మెనింజైటిస్ వ్యాధి 5 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లల్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఈ వయసు కలిగిన పిల్లల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడంతో బాక్టీరియా మెదడు పైన పొరల్లో ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది. యుక్త వయసులో ఉన్నవారికి కూడా మెనింజైటిస్ వ్యాధి వచ్చే ముప్పు అధికంగానే ఉంది, వృద్ధులు లేదా పెద్దవారిలో వారికి ఉన్న ఇన్ఫెక్షన్ మరియు ఆరోగ్య సమస్యల కారణంగా ఈ వ్యాధి సంక్రమిస్తుంది.
ముగింపు
మెనింజైటిస్ వ్యాధి ప్రాణాంతకమైనది, ఇప్పటి వరకు మీ పిల్లలకు మెనింజైటిస్ టీకా వేయించకపోతే వెంటనే వైద్యులను సంప్రదించి టీకా వేయించాలి. అలాగే ఈ వ్యాధి సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వసతి గృహాల్లో ఉండేవారికి ఈ వ్యాధి సంక్రమించే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మెనింజైటిస్ వ్యాధి గురించి ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.
మీ ఆరోగ్య సంరక్షణ గురించి ఏవైనా సందేహాలు ఉన్నాయా? సహాయం చేయడానికి మేము సిద్దంగా ఉన్నాము! మా అనుభవంతులైన నిపుణుల సలహా కొరకు +918929967127 కి కాల్ చేయగలరు.