%1$s
blank
blank
blank

వేసవిలో వేధించే మూత్రనాళ, కిడ్నీ వ్యాధులు ముందు జాగ్రతతో ఉపశమనం, ప్రమాదకర సమస్యల నివారణ

prevent kidney stones

ఈ సంవత్సరం ఎండలు అసాధారణ స్థాయిలో, తీవ్రంగా ఉండగలవని వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. ఫిబ్రవరి నెల రెండో వారం నుంచే ఎండ వేడి పెరగటం మొదలయి మార్చ్ చివరకి వేసవి తీవ్రత మరింత స్పష్టం అయ్యింది. ఎండకాలం వచ్చే ఆరోగ్యసమస్యలలో మూత్రపిండాలు, మూత్రసంబంధమైనవి ముందు స్థానంలో ఉంటాయి. వీటిలో మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడటం, యూరినరీ ట్రాక్(మూత్రనాళపు) ఇన్ఫెక్షన్లు ప్రధానమైనవి. మన దేశంలో ఏభై నుంచి డెబ్బయ్ లక్షల మంది మూత్రపిండాల్లో రాళ్లవల్ల అనారోగ్యానికి గురవుతున్నారు. ప్రతీ వెయ్యి మందిలో ఒకరు ఆస్పత్రిలో చేరి చికిత్సచేయించుకోవలసిన పరిస్థితి ఏర్పడుతున్నది. మూత్రపిండాలలో రాళ్ల సమస్య వేసవికాలంలో దాదాపు నలభై శాతం పెరిగిపోతున్నట్లు వెల్లడయ్యింది. ఇందుకు బలమైన కారణాలే ఉన్నాయి. ఎండాకాలంలో వాతావరణ ఉష్ణోగ్రత బాగా పెరగటం, తేమ తగ్గటం, ప్రజల ఆహార అలవాట్లు వేసవికి అనుకూలంగా మారకపోటం  వీటిలో ముఖ్యమైనవి.

 మన రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలలోనే కాకుండా పట్టణాలలోనూ అనేక మంది మండుటెండలో, చాలా వేడిగా ఉండే వాతావరణంలో పనిచేస్తుంటారు. కొంత మంది తమ వృత్తి, ఉద్యోగ విధుల నిర్వహణ సమయంలో తగినన్ని నీళ్లు తాగటానికి వీలుండదు. ఇటువంటి వారిలో మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాతావరణ ఉష్టోగ్రత అయిదు నుంచి ఏడు డిగ్రీలు అధికంగా ఉన్నట్లయితే మూత్రపిండాలలో రాళ్ల సమస్యలు ముప్పయ్ శాతం పెరుగుతున్నట్లు గుర్తించారు. అదే విధంగా వాతావరణ ఉష్ణోగ్రత మధ్యస్థంగా ఉండే ప్రదేశం నుంచి వేడి ప్రదేశానికి వలసవెళ్లి జీవించే వారిలో త్వరితంగా మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడుతున్నాయి. ఈ వ్యాధికి సంబధించి భౌగోళిక పరిస్థితుల ప్రభావం స్పష్టంగా వ్యక్తం అవుతోంది. పొడిగా, వేడిగా ఉండే ప్రదేశాలలో నివసించే వారిలో మూత్రపిండాలలో రాళ్ల సమస్య తక్కిన ప్రాంతాలలో వారికంటే చాలా అధికంగా ఉంటున్నది.శరీరంలో నీటి పరిమామం తగ్గిపోవటం(డీహైడ్రేషన్) వల్ల కూడా మూత్రపిండాలో రాళ్లు ఏర్పడతాయి. వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరగటంతో డీహైడ్రేషన్ ఎక్కువ అవుతుంటుంది. శరీరం నుంచి చెమట రూపంలో నీరు ఆవిరయిపోతున్నా, తగినని నీళ్లు తాగటం ద్వారా ఆ నీటి నష్టాన్ని భర్తిచేయని వారు డీహైడ్రేషనుకు గురవుతున్నారు. శరీరంలో నీరు తక్కువ కావటం మూత్రం చిక్కబడటానికి తద్వారా మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడే అవకాశం భారీగా పెరగటానికి కారణం అవుతుంది.

శరీరంలోకి రాళ్లు ఎక్కడి నుంచి వస్తాయి?

మూత్రపిండాలలో రాళ్లు అంటే మనం ప్రకృతిలో సాధారణంగా చూసే రాళ్లు కాదు. రాళ్లలాగా గట్టిగా ఉండేవి. మూత్రపిండాలలో రాళ్లు చాలావరకు కాల్షియంతో కూడినవి. శరీరంలోని రక్తాన్ని మూత్రపిండాలు వడగడతాయి. శరీరంలో నీరు, ఇతర ద్రవాలు తక్కువ కావటంతో మూత్రం చిక్కబడి ఆమ్ల(ఆసిడిక్)రూపానికి మారుతుంది. మరోవైపు శరీరధర్మక్రియల అనతరం వెల్వడిన ఉప్పు, కాల్షియం – మెగ్నీషియం – ఫాస్పేట్ – ఆగ్సలేట్స్ – యూరిక్ ఆసిడ్  వంటివి మూత్రపిండాలను చేరుకుంటాయి. వడపోత అనంతరం కూడా ఇవి అక్కడే మిగిలిపోతాయి. ఇలా కొంతకాలం గడిచిన తరువాత ఈ మిగులుబడ్డ పదార్థాలు గట్టిబడి స్పటికాలుగా ఏర్పడతాయి. ఇవి క్రమంగా ఒక్కచోటచేరి చిన్న రాళ్లుగా తయారవుతాయి. మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడిన విషయం చాలా కాలం పాటు వ్యక్తి ఎరుకలోకి రాకపోవచ్చు. ఆ రాళ్లు మూత్రపిండాల నుంచి యురేటర్(మూత్రపిండాలను మూత్రాశయాన్ని కలిపే నాళం)లోకి జారి మూత్రాన్ని అడ్డుకున్నప్పుడో లేక ఆనాళంలో ఇరుక్కొని నొప్పి లేచినప్పుడో  ఏదో సమస్య ఉందన్న విషయం తెలిసి వస్తుంది. ఇదే సమయంలో వీపులో, పొట్టలో తీవ్రమైన నొప్పి ఉంటుంది. తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావటం, మూత్ర విసర్జన సమయంలో నొప్పి కూడా మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడ్డాయనేందుకు మరో సూచన. కొన్నిసార్లు ఈ క్రమంలో మూత్రంలో రక్తం పడుతుంది. కడుపులో తిప్పినట్లు ఉండటం, వాంతులవుతాయి.

ఈ లక్షణాలు కనిపించనపుడు డాక్టరును సంప్రదించితే ఎక్స్ రే, యూరిన్ ఎనాల్సిస్,  సి.టి.స్కాన్, అల్ట్రాసౌండ్ వంటి  పరీక్షలు నిర్వహించి మూత్రపిండాలలో రాళ్లు ఉన్నదీ లేనిది నిర్ధారణగా చెప్పగలుగుతారు. అవి చిన్నవిగా ఉండి, రాళ్లు సహజంగానే బయటకు పోవటానికి అవకాశం  ఉన్నట్లయితే బాధానివారణకు మందులు ఇస్తారు. అదే సమయంలో సమృద్ధిగా (రోజుకు కనీసం 3-4 లీ) నీళ్లు తాగాల్సిందిగా సూచిస్తారు. ఆ విధంగా చేయటంవల్ల మూత్రంతో రాళ్ళు బయటకు వెళ్లిపోవటానికి అవకాశం ఏర్పడుతుంది. అయిదు మి.మీ., అంతకంటే చిన్నవిగా ఉన్న రాళ్లు ఈ విధంగా మూత్రంతోపాటు వెళ్లిపోగలుగుతాయి. అంతకంటే పెద్దవిగా ఉన్న పక్షంలో వైద్యనిపుణులు వేర్వేరు పద్దతులు అనుసరించి  వాటిని తొలగించివేస్తారు. మూత్రపిండాలలో రాళ్ల సమస్యను పరిష్కరించటానికి తమ విభాగంలో అత్యాధునికమైన ఏర్పాట్లు ఉన్నాయని యశోద హాస్పిటల్స్ లోని వైద్యనిపుణులు తెలిపారు.కీలక అంశాల విషయంలో తమ విభాగం ప్రపంచస్థాయి ప్రమాణాలు, నైపుణ్యం కలిగి ఉందని యశోద హాస్పిటల్స్ లోని సెంటర్ ఫర్  నెఫ్రాలజీ అండ్ కిడ్నీ ట్లాన్స్ ప్లాంటేషన్ వైద్యనిపుణులు చెప్పారు. కిడ్నీ వ్యాధులు, మూత్రపిండాల మార్పిడికి సంబంధించి ప్రత్యేకంగా కృషిచేస్తూన్న ఇక్కడి వైద్య నిపుణులు ఇప్పటికే  వెయ్యికి  పైగా కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ సర్జరీలు చేశారు. ఈ విభాగంలో అధునాతన పరికరాలతో కూడిన ఆపరేషన్ థియేటర్, రక్తనిధి, వ్యాధినిర్ధారణ పరీక్షలు నిర్వహించే లెబోరేటరీ కూడా ఉన్నాయి.

మూత్రపిండాలలో రాళ్లు నివారించటం ఎలా?

ఆహార అలవాట్లలో కొద్దిపాటి మార్పులు చేసుకోవటం ద్వారా మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడకుండా జాగ్రత్తపడవచ్చు.  మార్పులు ఆ సమస్యను పరిష్కరించటమే కాకుండా మూత్రపిండాలతో సహా మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవటంలోనూ తోడ్పడతాయి. ఇందుకోసం వైద్య, పోషకాహార నిపుణులు చేస్తున్న సూచనలు:

నీళ్లతో నిరోధించవచ్చు:

సంవత్సరంలోని ఏకాలంలోనైనా సమృద్దిగా నీళ్లు తాగటం మూత్రపిండాలను ఆదుకుంటుంది. దినంలోనే కాకుండా పడుకునే ముందు నీళ్లు తాగటం ద్వారా రాత్రిళ్లు శరీరానికి తగినంత నీరు అందేట్లు చూసుకొండి. ఇందుకోసం వేలవి సమయంలో  భవనాలలో ఉండి పనిచేసేవారు మొత్తం మీద రోజు 3-4 లీ., ఆరుబయట పనిచేసే వారు 4-5 లీ. చొప్పున నీళ్లు తాగాలి. గంటల తరబడి మూత్రానికి వెళ్లటంలేదంటే ఆ వ్యక్తి తగినన్ని నీళ్లు తాగటంలేదన్నది స్పష్టం. వయోజనులైన వారు  రోజు మొత్తం మీద 2.5 లీటర్ల మూత్రాన్ని విసర్జిస్తుండటం ఆరోగ్యానికి తోడ్పడుతుంది.

సొడాలు కాదు. నిమ్మరసం తాగండి:

వేసవి చాలా మంది సోడా, ఐస్ టి, చాకొలేట్ షేక్  వంటివి తాగుతుంటారు. ఇవి రక్తంలో ఆక్సలేట్ అనే ఆసిడ్ ను పెంచుతాయి. ఈ ఆసిడ్ మూత్రపిండాలలో రాళ్లు పెరగటానికి కారణం అవుతుంది. వీటికి బదులుగా నిమ్మ రసం తాగండి. ఎండకాలపు ఊష్టోగ్రతలను తట్టుకోవటానికి సాయపడటంతోపాటు మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడటాన్ని నిరోధిస్తున్నట్లు వెల్లడయ్యింది.

మాసాహార ప్రొటీన్ వాడకాన్ని పరిమితం చేసుకొండి:

మాసం, చేపలు, గుడ్ల ద్వారా లభించే ప్రొటీన్ వల్ల కాల్షియం, యూరిక్ ఆసిడ్ స్టోన్స్ పెరుగుతున్నట్లు గుర్తించారు. వీటిలో ఉండే ప్యూరిన్స్ అనే పదార్థాలు జీర్ణక్రియ వల్ల యూరిక్ ఆసిడ్స్ గా విడిపోతాయి.అందువల్ల పోషకాహరంగా ఎంతో ఉపయోగకరమైన ఈ జంతు ఆధారిత ప్రోటీన్లు రోజువారీ ఆహారంలో పరిమితమైన పరిమాణంలో ఉండేట్లు చూసుకోవటం అవసరం.

ఉప్పు, కెఫిన్ తగ్గించండి:

సాధారణ ఉప్పులో ఉండే సోడియం వల్ల మూత్రంలో చేరే కాల్షియం పరిమాణం పెరిగిపోతుంటుంది. దానివల్ల మూత్రపిండాలలో కాల్షియంతో కూడిన రాళ్లు ఏర్పడతాయి. ఇక కాఫీ, టీ తరుచూ తీసుకుంటూ ఉండటం ద్వారా శరీరానికి అదనంగా నీరు అందిస్తున్నట్లు చాలా మంది భావిస్తారు. కానీ వీటిలో ఉండే కెఫెన్ శరీరాన్ని డీహైడ్రేషన్(నీరు కొల్పోయేస్థితి)కి గురిచేస్తుంది. ఈ కారణంగా ఆహారంలో ఉప్పును, టీ-కాఫీ తాగటాన్ని కనీస పరిమాణానికి పరిమితం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

యూనినరీ ఇన్ఫెక్షన్లు:

 సాధారణ సమయాలలో కంటే ఎండాకాలంలో చెమట ఎక్కువగా ఉంటుంది.  పెరిగిన ఉష్ణోగ్రతలను తట్టుకుని శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచేందుకు జరిగే సహజప్రక్రియనే ఇది. కానీ వేసవిలో తగిన పరిమాణంలో నీరు తాగపోవటం వల్ల శరీరంలో నీరు-ద్రవాల శాతం తగ్గుతుంది. ఈ స్థితిని గుర్తించిన మెదడు దేహంలోంచి బయటకు వెళ్లే నీటి పరిమణాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవటం ప్రారంభిస్తుంది. మూత్రం పరిమాణం తగ్గించటం ఈ దిశలో ఎక్కవ ఉపయోగకరంగా ఉంటుందని భావించి ఆమేరకు మూత్రపిండాలకు సూచిస్తుంది. అందువల్ల తక్కువ మొత్తంలో మూత్రం తయారవుతుంది. అది ఎక్కువ సమయం పాటు మూత్రాశయంలో (తగినంత వత్తిడి ఏర్పడటానికిగాను) నిలువ ఉండిపోతుంది. ఈ విధంగా ఎక్కువ సమయం నిలువ ఉండటం దానిలో బాక్టీరియాలు పెరగటానికి కారణం అవుతుంది. ఇది మొత్తం యూనినరీ ట్రాక్(మూత్రనాళ)  ఇన్ఫెక్షన్స్ – యూ.టి.ఐ. కి దారితీస్తుంది.

మూత్రపిండాలు, వాటి నుంచి బయలుదేరే రెండు యురేటర్, మూత్రాశయంను కలిపి యూరినరీ ట్రాక్ గా వ్యవహరిస్తారు. యూ.టి.ఐ.ల్లో సాధారణంగా కనిపించేది సిస్టైటిస్. దీనిలో మూత్రాశయపు లైనింగ్ వాపునకు గురవుతుంది. అందువల్ల తరచూ మూత్రానుమాననం కలుగుతుంటుంది. మూత్రవిస్జన సమయంలో నొప్పి కలుగుతుంది. మూత్రం రక్తంతోనో, ఆసాధారణ వాసనకలిగో ఉంటుంది. పొట్టదిగువ భాగంలో నెమ్మదిగా, నిరంతరాయంగా ఉండే నొప్పి కలుగుతుంది. యూ.టి.ఐ.ల్లో తొంభైశాతం ఇ.కొలై బాక్టీరియా వల్లనే సోకుతున్నట్లు గుర్తించారు. ఆహారనాళంలో సహజంగా ఉండే సూక్షజీవులు యురెత్రాలోకి ప్రవేశించగల్గటం ఇన్ఫెక్షనుకు అవకాశం ఏర్పడుతుంది. ప్రతీవేసవిలో దేశవ్యాప్తంగా కోట్లాది మందికి యూ.టి.ఐ. సోకుతుంది. అయితే వీరిలో కొద్ది మందికి మాత్రమే ఆస్పత్రులలో చేరాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

యూ.టి.ఐ. ని గుర్తించటం ఎలా?

మూత్రనాళపు ఇన్ఫెక్షనును తొలి దశలోనే గుర్తించగలిగితే యూ.టి.ఐ. వల్ల కలిగే తీవ్ర అసౌకర్యాన్ని తగ్గించటమే కాకుండా ఇన్ఫెక్షన్ ముదిరి మూత్రపిండాలకు ప్రమాదం తెచ్చిపెట్టకుండా జాగ్రత్తపడగలుగుతాం. కొన్ని స్పష్టమైన లక్షణాల ఆధారంగా దీనిని గుర్తించవచ్చు. అవి: మూత్ర విసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి వస్తుంది. తరచూ మూత్రానికి వెళ్లాలని అనిపిస్తుంది. అయితే విసర్జించే మూత్ర పరిమాణం మాత్రం స్వల్పంగా ఉంటుంది. పొట్టదిగువ భాగంలో, వీపులో వత్తినట్లు అనిపిస్తుంటుంది. నొప్పి ఉంటుంది. అకారణమైన అలసట, వణుకు కలుగుతుంటుంది. తీవ్రమైన వణుకుతో కూడిన జ్వరం వస్తుంది.(ఇన్ఫెక్షన్ మూత్రపిండాలకు చేరుకున్నదనటానికి ఇది సూచిక). యూ.టి.ఐ. స్ర్తీ, పురుషులు ఇద్దరిలోను కనిపిస్తున్నది. పురుషులలో ఏభై సంవత్సరాల వయస్సు వరకూ ఇది అరుదుగా (వంద మందిలో ఒక్కరికి మాత్రమే) కనిపిస్తుంది. ఆపైన దీనికి గురయ్యే పురుషుల సంఖ్య క్రమంగా పెరుగుతూ ఆరవై అయిదేళ్ల వయస్సు నాటికి పది శాతం పురుషులకు యూ.టి.ఐ. సోకుతుంది.  అయితే స్త్రీలలో ఇది అత్యధికమే కాకుండా వారికి సంబంధించి ఓ ప్రధానమైన ఆరోగ్యసమస్యలలో ఒకటిగా ఉంటూన్నది.

మహిళల్లో ఎందుకు ఎక్కువ?

మీరు స్ర్తీలు అయిన పక్షంలో యూనినరీ ట్రాక్(మూత్రనాళ)  ఇన్ఫెక్షన్స్ – యూ.టి.ఐ. సోకే అవకాశాలు చాలా అధికంగా ఉంటాయి. ఓ స్త్రీ జీవితకాలంలో ఈ ఇన్సెక్షన్లు సోకే అవకాశాలు కనీసం ఏభై శాతమైనా ఉంటాయని నిపుణులు అంచనావేస్తున్నారు. ఏభై సంవత్సరాల వయస్సు దాటిన మహిళలలో ఏభై మూడు శాతం మందిలో ఈ వ్యాధిని గుర్తించారు. యవ్వనంలో ఉన్న స్త్రీలలో ముప్పయ్ ఆరు శాతం మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. కొంత మంది మహిళలు పదేపదే యు.టి.ఐ.కి గురవుతూ సంవత్సరాల తరబడి బాధపడుతుంటారు. ఈ ఇన్పెక్షన్లు స్త్రీలలోనే అత్యధికంగా ఎందుకు వస్తుంటాయన్నది సహజగానే కలిగే సందేహం. మహిళల శరీరనిర్మాణానికి తోడు,  ఇందుకు మరి కొన్ని కారణాలు ఉన్నట్లు డాక్టర్లు పేర్కొంటున్నారు. మూత్రవిసర్జన తరువాత, ఎండకాలపు వేడితో చెమటపట్టినపుడు తమ రహస్యభాగాన్ని శుభ్రం చేసుకునేటపుడు వెనుక నుంచి ముందుకు కాకుండా ముందు నుంచి వెనుకకు తుడుచుకోవాలని సూచిస్తున్నారు. ఎందువల్ల అంటే మూత్రాశయం నుంచి ద్రవాన్ని శరీరం బయటకు తీసుకుని వచ్చే నాళం (యూరేత్రా)  మలద్వారానికి సమీపంగా తెరుచుకుంటుంది. మూత్రవిసర్జన అనంతరం వెనుక నుంచి ముందుకు శుభ్రంచేసుకోవటం వల్ల పెద్ద పేగులోని ఇ -కొలై లాంటి బాక్టీరియా తేలికగా దీనిలోకి ప్రవేశించి మూత్రాశయాన్ని చేరుకోగలుగుతుంది. దీనికితోడు మహిళలో యురెత్రా చిన్నదిగా ఉంటుంది. అందువల్ల బాక్టీరియా వేగంగా మూత్రాశయాన్ని చేరుకొంటుంది.ఈ ఇన్ఫెక్షనుకు చికిత్సచేయని పక్షంలో అది మూత్రపిండాలకు కూడా సోకగలదు. లైంగిక సంబంధం ద్వారా కూడా బాక్టీరియా యురెత్రాలోకి ప్రవేశించి తద్వారా మూత్రాశయానికి చేరుకోగలుగుతుంది.

తక్షణ చికిత్సతో తప్పే ప్రమాదం

యూ.టి.ఐ. సోకినట్లు అనుమానం కలిగినపుడు వెంటనే డాక్టరును సంప్రదించటం అవసరం. మహిళలకు సంబంధించి ఇది మరింత ముఖ్యం. వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయినట్లయితే వెంటనే చికిత్స ప్రారంభించటం ద్వారా ఉపశమనం కలిగించగలుగుతారు. అదే సమయంలో ఇన్ఫెక్షన్ మూత్రపిండాలకు చేరుకుని ప్రమాదకర పరిస్థతి సృష్టించకుండా నివారించగలుగుతారు. పరిస్థతి మరీ తీవ్రంగా ఉంటే తప్పించి యూ.టి.ఐ. నిర్ధారణ జరిగిన వారికి  ఔట్ పెషంట్లుగానే చికిత్స చేస్తారు. యూ.టి.ఐ. కేసుల చికిత్సకు తమ విభాగంలో అవసరమైన సౌకర్యాలన్నీ  ఉన్నాయని, వేసవి నెలలో పెరిగే కేసుల సంఖ్యకు అనుగుణంగా పూర్తి అన్ని ఏర్పాట్లు చేసామని యశోద హాస్పిటల్స్ యూరాలజీ విభాగం వైద్యనిపుణులు తెలిపారు. ఔషధాలు, అలవాట్లలో మార్పులను సూచించటం ద్వారా తొలుత ఉపశమనం కలిగించి ఆపైన మళ్ళీ వ్యాధి సోకకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను సూచిస్తారు. వెంటనే గుర్తించి చికిత్సచేయించుకుంటే యూ.టి.ఐ. పూర్తిగా అదుపులోకి వచ్చే, ఉపశమనం లభించే ఆరోగ్యసమస్య. అదే ఉపేక్షించి నిర్లక్ష్యం వహిస్తే మూత్రపిండాలదాకా చేరుకుని ప్రమాదాన్ని తెచ్చిపెట్టగల వ్యాధి. ఆ చైతన్యం – విచక్షణే ఈ రెండింటి మధ్య ఈ సన్నని రేఖను నిర్ణయిస్తుంది.

About Author –

Dr. Sashi Kiran A, Consultant Nephrologist, Yashoda Hospitals – Hyderabad
MD (Pediatrics), DM (Nephrology)

best Nephrologist Doctor

Dr. Sashi Kiran A

MD (Pediatrics), DM (Nephrology)
Consultant Nephrologist

CONTACT

blank

Enter your mobile number

  • ✓ Valid

Contact

  • Yes Same as WhatsApp number
  • By clicking on Send, you accept to receive communication from Yashoda Hospitals on email, SMS, call and Whatsapp.
×
X
Select Department
Not Sure of the Specialty?
X

Choose your date & Slot

Change Date
Monday, OCTOBER 30
Enter Patient Details

Please Note: This session ends in 3:00 mins

Not Finding Your Preferred Slots?
Change Doctor
or Location
top hospital in hyderabad
Call Helpline
040 - 4567 4567