Select Page

మూత్రంలో రక్తం (హెమటూరియా): కారణాలు, లక్షణాలు పరీక్షలు, చికిత్స

మూత్రంలో రక్తం (హెమటూరియా): కారణాలు, లక్షణాలు పరీక్షలు, చికిత్స

హెమటూరియా అంటే ఏమిటి?

మనం ప్రతీరోజూ వివిధ రకాలైన ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాం, మనం తీసుకునే ఆహారంలో శరీరానికి అవసరమైన పోషకాలతో పాటుగా కొన్ని వ్యర్ధ పదార్ధాలు కూడా ఉండవచ్చు. జీర్ణాశయంలో జీర్ణమైన ఆహారం రక్తంలోకి వెళ్తుంది, ఈ రక్తాన్ని మూత్రపిండాలు శుద్ధి చేసి రక్తంలో ఉన్న మలినాలను మూత్రం ద్వారా బయటకు పంపిస్తాయి. అయితే కొన్ని సందర్భాలలో మనం తీసుకునే ఆహారం వలన కానీ, మూత్రపిండాలలో సమస్యల వలన కానీ ఇతర కారణాల వలన కానీ మూత్రంలో రక్తం రావచ్చు. ఇలా మూత్రంలో రక్తం కనిపించడాన్ని హెమటూరియా అంటారు. ఈ సమస్య గురించి ఇక్కడ వివరంగా తెలుసుకోవచ్చు.

మూత్రంలో రక్తం ఎందుకు వస్తుంది?

మూత్రంలో రక్తం రావడానికి వివిధ కారణాలు ఉన్నాయి, వాటిని ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

  • మూత్రాశయంలో ఇన్ఫెక్షన్ : బాక్టీరియా మూత్రాశయంలో లేదా మూత్రనాళం భాగాలలో చేరినప్పుడు అక్కడ ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది. ఇలాంటి ఇన్ఫెక్షన్లను యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI) అని అంటారు. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వలన మూత్రనాళంలో వాపు ఏర్పడవచ్చు. ఇలా మూత్రనాళంలో వాపు ఏర్పడడం వలన అక్కడ ఉండే రక్తనాళాలు దెబ్బతిని వాటిలో ఉండే రక్తం మూత్రంలో కలుస్తుంది.
  • కిడ్నీలో రాళ్ళు : మనం సరైన మోతాదులో నీరు తాగకపోవడం వలన కిడ్నీలో ఉండే లవణాలు గట్టిగా రాళ్ళ లాగా మారిపోతాయి. వీటి వలన మూత్రపిండాల సామర్థ్యం తగ్గిపోతుంది, ఫలితంగా రక్తాన్ని పూర్తిగా శుద్ధి చేయలేవు ఈ కారణంగా మూత్రంలో రక్తం వస్తుంది.
  • కిడ్నీ ఇన్ఫెక్షన్ : సాధారణంగా బాక్టీరియా మరియు ఇతర వైరస్ ల కారణంగా మూత్రనాళ ఇన్ఫెక్షన్లు ఏర్పడతాయి, ఈ మూత్రనాళ ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయకపోతే ఇవి క్రమక్రమంగా మూత్రపిండాల వరకూ వ్యాపించి కిడ్నీ ఇన్ఫెక్షన్ లకు కారణం అవుతాయి. కిడ్నీ ఇన్ఫెక్షన్ వలన కిడ్నీల పనితీరు దెబ్బతినడంతో పాటుగా మూత్రంలో రక్తం కూడా వస్తుంది.
  • ప్రోస్టేట్ గ్రంథి వాపు : పురుషులలో ఉండే ప్రోస్టేట్ గ్రంథి వివిధ కారణాల వలన వాపుకు గురవుతుంది. అంతే కాకుండా కొంతమందిలో ప్రోస్టేట్ గ్రంథి పెరుగుదల సమస్య కూడా ఉంటుంది. ప్రోస్టేట్ గ్రంథి వాపు వలన మూత్రాశయం మరియు మూత్రనాళం దగ్గర ఉన్న రక్తనాళాల మీద ఒత్తిడి పెరుగుతుంది. దీని వలన రక్తనాళాలు దెబ్బతిని రక్తం మూత్రంలోకి వస్తుంది.
  • ఎండోమెట్రియోసిస్ : కొంతమంది మహిళల్లో గర్భాశయం లోపల పెరగాల్సిన కణజాలం గర్భాశయం బయటవైపు పెరుగుతుంది ఈ పరిస్థితిని ఎండోమెట్రియోసిస్ అంటారు. ఎండోమెట్రియోసిస్ మూత్ర నాళాన్ని ప్రభావితం చేసి, మూత్రాశయ ఎండోమెట్రియోసిస్‌కు దారితీసిన సందర్భాలలో మూత్రంలో రక్తం కనిపిస్తుంది. దీని వలన మహిళల్లో అధికంగా ఋతుస్రావం మరియు మూత్రంలో రక్తం ఏర్పడవచ్చు.
  • సికిల్ సెల్ వ్యాధి : సాధారణంగా మన రక్తంలోని ఎర్రరక్త కణాలు గుండ్రంగా ఉంటాయి. అయితే సికిల్ వ్యాధి ఉన్నవారిలో ఎర్రరక్త కణాలు కొడవలి ఆకారంలో ఉంటాయి. ఇవి రక్తంలో కలిసి ప్రవహిస్తూ రక్తనాళ గోడలను గాయపరుస్తాయి. వీటి వలన కిడ్నీలు దెబ్బతిని మూత్రంలో రక్తం వచ్చే ప్రమాదం ఉంది.
  • మూత్రపిండాల క్యాన్సర్ : మూత్రపిండాలలో ఏర్పడే క్యాన్సర్ కణుతులు కిడ్నీల కణజాలాన్ని తీవ్రంగా గాయపరుస్తాయి. దీని వలన పొత్తికడుపులో నొప్పి, మూత్ర విసర్జనలో ఇబ్బందులతో పాటుగా మూత్రంలో రక్తం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
  • ప్రోస్టేట్ క్యాన్సర్ : పురుషుల్లో మూత్రనాళం క్రింద ప్రోస్టేట్ గ్రంథి ఉంటుంది. 50 సంవత్సరాలు పైబడిన వారిలో ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నవారిలో క్యాన్సర్ కణుతుల కారణంగా మూత్రంలో రక్తం వచ్చే అవకాశం ఉంది.
  • మూత్రాశయ క్యాన్సర్ : మూత్రాశయం భాగంలో క్యాన్సర్ కణాలు ఏర్పడడం లేదా ప్రోస్టేట్ లాంటి ఇతర భాగాల నుండి క్యాన్సర్ కణాలు మూత్రాశయానికి విస్తరించడం వలన మూత్రాశయ క్యాన్సర్ ఏర్పడుతుంది. ఈ క్యాన్సర్ వలన మూత్రంలో రక్తం రావడమే కాకుండా మూత్ర విసర్జన సమయంలో నొప్పి మరియు పొత్తి కడుపులో తరచుగా నొప్పి కలగవచ్చు.
  • అధిక వ్యాయామం : కొన్నిసార్లు అధిక వ్యాయామం చేసినప్పుడు మూత్రనాళానికి అతి తక్కువగా ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. ఈ కారణంగా వ్యాయామం తర్వాత కూడా మూత్రంలో రక్తం వచ్చే అవకాశం ఉంది.

హెమటూరియా లక్షణాలు

మూత్రంలో రక్తం రావడానికి పైన వివరించినట్టు వివిధ కారణాలు ఉంటాయి. అయితే మూత్రంతో పాటుగా రక్తం వస్తున్నప్పుడు లక్షణాలు ఈ క్రింది విధంగా ఉంటాయి.

  • మూత్రం ఎరుపు రంగులో ఉండడం
  • మూత్రం గులాబీ రంగులో ఉండడం
  • మూత్రంలో రక్తం గడ్డ కట్టినట్టు అనిపించడం
  • ముదురు గోధుమ రంగులో మూత్రం రావడం
  • మూత్ర విసర్జన సమయంలో నొప్పి
  • పొత్తి కడుపులో నొప్పి
  • నడుము నొప్పి
  • తరచుగా మూత్ర విసర్జన

blood-in-urine-telugu-body

మూత్రంలో రక్తం రాకుండా నివారణ

మూత్రంలో రక్తం రాకుండా నివారించడానికి మన జీవనశైలిలో మార్పులతో పాటుగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

  • సరిపడా నీరు త్రాగడం : మనం శరీరానికి అవసరమైనంత నీరు తాగకపోవడం వలన డీహైడ్రేషన్, కిడ్నీలో రాళ్ళు, గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఏర్పడవచ్చు. వీటి కారణంగా మూత్రంలో రక్తంతో పాటుగా ఇతర సమస్యలు కూడా ఎదురవ్వవచ్చు. ఈ సమస్యలు రాకుండా ప్రతీరోజూ కనీసం రెండు నుండి మూడు లీటర్ల నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి. వేసవి కాలంలో మరికొంత ఎక్కువ పరిమాణంలో నీటిని త్రాగడం అవసరం.
  • ఆల్కహాల్ మానుకోవడం : ఆల్కహాల్ వలన మన శరీరంలో అనేక సమస్యలు కలుగుతాయి. వివిధ రకాలైన క్యాన్సర్లతో పాటుగా గుండె సమస్యలకు కూడా కారణం అవుతుంది. రక్తంలో ఆల్కహాల్ స్థాయులు పెరగడం వలన కిడ్నీలు మరియు మూత్రాశయ సమస్యలు రావచ్చు. ఆల్కహాల్ మానుకోవడం ద్వారా మూత్రంలో రక్తం రాకుండా నివారించవచ్చు.
  • జననాంగాల పరిశుభ్రత : చాలామందిలో యూరినరీ ఇన్ఫెక్షన్లు రావడానికి ప్రధాన కారణం జననాంగాలను సరిగా శుభ్రపరుచుకోకపోవడం. దీనివలన స్త్రీ పురుషులు ఇద్దరిలోనూ యూరినరీ ఇన్ఫెక్షన్ కలిగే అవకాశం ఉంది. ఈ సమస్య కారణంగా మూత్రంలో రక్తం రావచ్చు. కాబట్టి జననాంగాలను శుభ్రంగా ఉంచుకోవడం వలన మూత్రంలో రక్తం రాకుండా నివారించవచ్చు.
  • ఆహారంలో ఉప్పు తగ్గించడం : మన శరీరానికి అవసరమైన ఉప్పుకంటే భారతీయులు దాదాపు మూడు రెట్లు అధికంగా ఉప్పును తీసుకుంటున్నారు. దీని వలన కిడ్నీల మీద భారం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివలన కిడ్నీ సమస్యలు కలుగుతున్నాయి. మన ఆహారంలో ఉప్పు తగ్గించుకోవడం వలన కిడ్నీ సమస్యలను మరియు మూత్రంలో రక్తం రావడాన్ని నివారించవచ్చు.

హెమటూరియా నిర్ధారణ పరీక్షలు

హెమటూరియా ఒక లక్షణం కాబట్టి ఈ సమస్యకు కారణాన్ని గుర్తించడానికి వివిధ రకాలైన పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఈ పరీక్షల గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

  • మూత్ర పరీక్ష: మూత్రంలో రక్తం కనిపించినప్పుడు ఈ సమస్యకు గల కారణాన్ని తెలుసుకోవడానికి మూత్ర పరీక్ష అవసరం అవుతుంది. రక్తంలోని ఎర్రరక్తకణాలు మూత్రంలో ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి ఈ పరీక్ష అవసరం అవుతుంది.
  • రక్తపరీక్షలు: మూత్రంలో రక్తం రావడానికి గల కారణాలను తెలుసుకోవడానికి రక్తపరీక్షలు అవసరం అవుతాయి. దీని ద్వారా రక్తంలో ఏదైనా అసాధారణతలు ఉంటే వాటి గురించి తెలుసుకోవచ్చు.
  • స్కానింగ్ పరీక్షలు : రక్తపరీక్షలు లేదా మూత్ర పరీక్షల ద్వారా హెమటూరియా కారణాలు నిర్ధారణ కాకపోతే అల్ట్రాసౌండ్, MRI, CT స్కాన్ పరీక్షలలో ఏదైనా ఒకటి లేకుంటే అన్నీ అవసరం అవుతాయి. మూత్రాశయం మరియు కడుపులో ఉన్న సమస్యలను గుర్తించడానికి ఈ పరీక్షలు ఉపయోగపడతాయి.
  • బయాప్సీ : కొన్ని అరుదైన సందర్భాలలో మూత్రపిండాలు లేదా మూత్రాశయ భాగంలో ఏదైనా క్యాన్సర్ ఉందో లేదో అని నిర్ధారించడానికి ఆ భాగాల నుండి కొంత కణజాలం సేకరించి బయాప్సీ పరీక్ష నిర్ధారిస్తారు.
  • సిస్టోస్కోపీ : ఈ విధానంలో సిస్టోస్కోప్ అనే ఒక ప్రత్యేకమైన పరికరాన్ని మూత్రనాళం నుండి లోపలికి పంపించడం ద్వారా లోపల ఏదైనా ఇన్ఫెక్షన్ మరియు అసాధారణ కణజాలం గురించి తెలుసుకుంటారు.

హెమటూరియా చికిత్స

హెమటూరియా సమస్య కలగడానికి పైన వివరించిన విధంగా వివిధ రకాలైన కారణాలు ఉంటాయి. అయితే ఈ సమస్య తగ్గడానికి చికిత్స కూడా దానికి గల కారణానికి చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు కిడ్నీలో రాళ్ళ వలన మూత్రంలో రక్తం కనిపిస్తే చికిత్స కూడా కిడ్నీలలో రాళ్లు తగ్గించడానికి చేయాల్సి ఉంటుంది. అయితే హెమటూరియా సమస్య తగ్గించడానికి కొన్ని చికిత్స విధానాలు ఇక్కడ తెలుసుకోవచ్చు.

  • యాంటీబయాటిక్స్ : మూత్రనాళం లేదా మూత్రాశయంకు సంబంధించిన ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి యాంటీబయాటిక్ మందులను డాక్టర్లు సూచించవచ్చు.
  • సర్జరీ: ప్రోస్టేట్, మూత్రాశయ క్యాన్సర్, మూత్రపిండాల క్యాన్సర్ సమస్యల వలన హెమటూరియా సమస్య ఏర్పడితే ఈ సందర్భాలలో సర్జరీ చేయాల్సిన అవసరం రావచ్చు.
  • ప్రోస్టేట్ వాపు తగ్గడానికి మందులు : మూత్రంలో రక్తం రావడానికి పురుషులలో ప్రోస్టేట్ గ్రంథి విస్తరణ కూడా కారణం కావచ్చు. డాక్టర్ సూచించిన మందుల ద్వారా ఈ సమస్యను తగ్గించవచ్చు.
  • కిడ్నీలో రాళ్ళకు చికిత్స: మూత్రంలో రక్తం రావడానికి కిడ్నీ రాళ్లు కారణమైతే వాటి పరిమాణాన్ని బట్టి సర్జరీ లేదా ఇతర చికిత్సల ద్వారా వాటిని తొలగిస్తారు.
  • ఇతర చికిత్సలు : మూత్రంలో రక్తం రావడానికి కారణాన్ని బట్టి మరికొన్ని రకాలైన చికిత్సలు అవసరం అవుతాయి.

వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి?

మనం తీవ్రమైన డీహైడ్రేషన్ పరిస్థితి ఎదురైనప్పుడు కూడా దాదాపుగా మూత్రం పసుపు రంగులో ఉంటుంది. కానీ మూత్రంలో రక్తం లేదా మూత్రం ఎరుపు రంగులో వస్తుంటే తీవ్రమైన కారణాల వలన మాత్రమే ఈ సమస్య కలుగుతుందని గుర్తించాలి. ఇలాంటి సమస్య గుర్తించినప్పుడు వీలైనంత త్వరగా డాక్టర్ ను సంప్రదించాలి. కొన్నిసార్లు హెమటూరియా సమస్యను త్వరగా గుర్తించడం ద్వారా చికిత్స సులభం అవుతుంది. ఆలస్యం చేసే కొద్దీ మరిన్ని ఆరోగ్య సమస్యలను కలగజేయవచ్చు లేదా ఉన్న సమస్య మరింత తీవ్రతరం కావచ్చు.

హెమటూరియా సమస్యకు చికిత్స చేయడానికి యూరాలజీ విభాగంలో అత్యంత అనుభవజ్ఞులైన యశోద డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. మీరు మూత్రంలో రక్తం సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు అయితే చికిత్స కోసం వెంటనే యశోద వైద్య నిపుణులను సంప్రదించండి.

మీ ఆరోగ్య సంరక్షణ గురించి ఏవైనా సందేహాలు ఉన్నాయా? సహాయం చేయడానికి మేము సిద్దంగా ఉన్నాము! మా అనుభవంతులైన నిపుణుల సలహా కొరకు +918065906165 కి కాల్ చేయగలరు.

FAQ’s

మూత్రంలో రక్తం వస్తుంటే కిడ్నీలు దెబ్బతిన్నాయని అర్థమా?

మూత్రంలో రక్తం రావడానికి వివిధ కారణాలు ఉన్నాయి, వాటిలో కిడ్నీ సమస్యలు కూడా ఒకటి.

ఆల్కహాల్ తీసుకోవడం వలన మూత్రంలో రక్తం వస్తుందా?

ఆల్కహాల్ ఎక్కువగా మరియు తరచుగా తీసుకోవడం వలన మూత్రంలో రక్తం వచ్చే ప్రమాదం ఉంది.

మూత్రంలో రక్తం వస్తుంటే క్యాన్సర్ ఉన్నట్టా?

లేదు, కేవలం క్యాన్సర్ వలన మాత్రమే మూత్రంలో రక్తం రాదు. ఈ సమస్యకు అనేక కారణాలు కూడా ఉన్నాయి.

About Author

Dr. T. Yashaswi Reddy

MBBS(OSM), MS, MCh(Urology, PGI Chandigarh)

Consultant Urologist, Andrologist, Uroncologist, Robotic & Renal Transplant Surgeon