Select Page

తల తిరగడం సమస్య ఎందుకు వస్తుంది? తల తిరగడం తగ్గాలంటే ఏం చేయాలి?

తల తిరగడం సమస్య ఎందుకు వస్తుంది? తల తిరగడం తగ్గాలంటే ఏం చేయాలి?

ఏ మనిషైనా ఆనందమైన జీవితం గడపడానికి ఆరోగ్యాంగా ఉండడం చాలా అవసరం, సాధారణంగా మనం దగ్గు, జలుబు, అలసట, కళ్ళు తిరగడం, తల తిరగడం మొదలైన చిన్న చిన్న అనారోగ్యాలను పెద్దగా పట్టించుకోము. అయితే తల తిరగడం లాంటి చిన్న అనారోగ్యాలు ఒకొక్కసారి మన శరీరంలో తీవ్రమైన సమస్యలకు ముందుగా కనిపించే సంకేతాలు కావచ్చు. చాలా మందిలో తల తిరగడం అనే సమస్య తరచుగా కనిపిస్తుంది, ఈ సమస్యకు కారణాలు ఒకొక్కరిలో ఒకొక్క లాగా ఉండవచ్చు. దీని వలన అలసట, మైకం, స్పృహ తప్పిపోవడం మొదలైన లక్షణాలు ఉంటాయి. వెర్టిగో, స్ట్రోక్ కారణంగా తల తిరగడం అనే సమస్య కలగవచ్చు.

తల ఎందుకు తిరుగుతుంది? దానికి గల కారణాలు

చాలామందిలో అలసట ఎక్కువైతే తల తిరుగుతున్నట్టు అనిపిస్తుంది, మరికొంతమందిలో ఉన్నట్టుండి మైకం కమ్మినట్టు అనిపిస్తుంది. దీనికి గల కారణాలు ఇక్కడ వివరంగా తెలుసుకోవచ్చు.

  • నిర్జలీకరణం (డీహైడ్రేషన్) : రోజులో తగినంత నీళ్లు తీసుకోక పోవడం తల తిరగడానికి కారణమవుతుంది, శరీరంలో నీటి స్థాయిలు రక్త ప్రసరణ పై ప్రభావం చూపిస్తాయి, తగినంత నీరు తాగకపోతే రక్త ప్రసరణ తగ్గి దాని వలన తల తిరుగుతుంది.
  • రక్తపోటు : సాధారణంగా లో బీపీ ఉన్నవారిలో తల తిరగడం ఎక్కువగా కనిపిస్తుంది. మెదడుడికి రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం వలన తల తిరిగడం, మూర్ఛ పోవడం జరుగుతుంది.
  • చెవిలో సమస్యలు : వెర్టిగో, మెనియర్స్ లాంటి చెవికి సంబంధించిన వ్యాధుల కారణంగా కుడా తల తిరుగుతుంది.
  • మధుమేహం : శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువైనప్పుడు తల తిరగడం, మూర్ఛ పోవడం వంటి పరిస్థితులు ఏర్పడతాయి.
  • మైగ్రేన్ : మైగ్రేన్ అనేది ఒక రకమైన తలనొప్పి, ఈ సమస్య ఉన్నవారిలో తల తిరగడం తరచుగా జరుగుతుంది. మైగ్రేన్ ఉన్నవారికి పెద్ద శబ్దాలు విన్నా, ఎక్కువ కాంతిని చూసినా తల తిరగడం సంభవిస్తుంది.
  • కొన్ని రకాల మందులు: అప్పుడప్పుడూ కొన్ని రకాల మందులను వాడడం వలన కూడా తల తిరగడం, నిద్ర మత్తు కలగడం మొదలైనవి జరుగుతాయి.
  • ఒత్తిడి : చాలా మందిలో ఒత్తిడి కూడా తల తిరగడానికి కారణం అవుతుంది.
  • నిద్రలేమి : ప్రతీరోజూ సరైన నిద్ర లేకపోవడం, లేదా రాత్రి సమయాల్లో ఎక్కువగా పనిచేసే వారిలో తల తిరగడం సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.
  • రక్తహీనత (అనీమియా) : రక్తంలో హీమోగ్లోబిన్ స్థాయి తగ్గడాన్ని అనీమియా అంటారు, రక్తహీనత కారణం వలన కూడా తల తిరగడం జరుగుతుంది.

Dizziness cause

తరచుగా తల తిరగడం సమస్యతో బాధ పడుతున్నారా?

తల తిరగడం తగ్గాలంటే ఏం చేయాలి?

సాధారణంగా తల తిరగడానికి ఒకొక్కరిలో ఒకొక్క కారణం ఉంటుంది, ఆ కారణాలను గుర్తిస్తే దానికి తగ్గట్టుగా సూచనలు పాటించాలి. తరచుగా తల తిరుగుతుంటే దానిని నివారించడానికి ఈ సూచనలు పాటించాలి. కొన్నిసార్లు ఈ లక్షణాలను విస్మరిస్తే అది స్ట్రోక్ కు కూడా కారణం అవ్వవచ్చు.

  • తగినంత నీరు తాగాలి : శరీరానికి అవసరమైనంత నీరు తాగకపోతే తల తిరిగే సమస్య వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతీరోజు కచ్చితంగా సరైన మోతాదులో నీరు త్రాగాలి.
  • ఒకేసారి ఎక్కువ భోజనం చేయకూడదు: చాలామంది రోజులో మూడుసార్లు పెద్ద భోజనం చేస్తారు. దీనివలన రక్తంలో చక్కెర స్థాయి ఒక్కసారిగా పెరుగుతుంది, దీని వలన కళ్ళు తిరగడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
  • సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి: సాధారణంగా ఐరన్ లోపం ఉన్నవారికి తల తిరిగే సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఐరన్ అధికంగా ఉండే ఆకుకూరలు, బాదం మొదలైన వాటిని తీసుకోవడం ద్వారా ఈ సమస్యను తగ్గించవచ్చు.
  • ఒత్తిడి తగ్గించుకోవడం : ఒత్తిడి, ఆందోళన తగ్గించుకోవడం ద్వారా తల తిరగడాన్ని నివారించవచ్చు.
  • వ్యాయామం : చాలామంది వ్యాయామం వలన తల తిరిగే లక్షణాలు ఎక్కువ అవుతాయి అని అపోహ పడుతూ ఉంటారు, కానీ ప్రతీరోజూ 30 నుండి 60 నిమిషాల పాటు వ్యాయామం చేయడం వలన శరీరం ఆరోగ్యంగా ఉండడంతో పాటు తల తిరగడం వంటి లక్షణాలు కూడా తగ్గుతాయి.
  • సరైన నిద్ర : రోజుకి కనీసం 7 నుండి 9 గంటలపాటు నిద్రపోవడం వలన తల తిరిగే లక్షణాలను తగ్గించవచ్చు.
  • ధ్యానం (మెడిటేషన్) : ప్రతీరోజు 20 నుండి 30 నిమిషాల పాటు ధ్యానం చేయడం వలన ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి, దీనివలన తల తిరగడాన్ని నివారించవచ్చు.

తల బరువు ఎందుకు ఉంటుంది?

సాధారణంగా తల తిరగడానికి గల కారణాల వలనే తల బరువుగా అనిపించడం కూడా జరుగుతుంది. అయితే తల బరువుగా అనిపించడానికి ఒత్తిడి, ఆందోళన, సరైన నిద్ర లేకపోవడం ప్రధాన కారణాలుగా ఉన్నాయి. సైనటైటిస్ వలన కూడా కొన్నిసార్లు తల బరువుగా ఉంటుంది. ఇలా తల బరువుగా ఉన్నప్పుడు, పని చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది. కొన్ని సందర్భాలలో నిద్రమత్తు వలన కూడా తల బరువుగా ఉన్నట్టు అనిపిస్తుంది.

తల తిరగడం సమస్యకు ఎలాంటి చికిత్స చేస్తారు?

తల తిరగడం సమస్యకు చికిత్స ప్రధానంగా, ఈ సమస్యను కలగజేసే కారణాలను బట్టి ఉంటుంది. ఒకవేళ పేషేంట్ కు మైగ్రేన్ లేదా తలనొప్పి అధికంగా ఉండడం వలన తల తిరిగితే చికిత్స మైగ్రేన్ కు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ తల తిరగడానికి కారణం రక్తహీనత ఐతే, రక్తహీనత కు సంబంధించిన చికిత్స చేయాల్సి ఉంటుంది. తల తిరగడం అనేది వ్యాధి కాదు, మన శరీరంలో ఇతర వ్యాధుల వలన కలిగే ఒక లక్షణం, కాబట్టి ఈ సమస్యకు చికిత్స కూడా ఆ వ్యాధులకు సంబంధించినదిగా ఉంటుంది.

మీ ఆరోగ్య సంరక్షణ గురించి ఏవైనా సందేహాలు ఉన్నాయా? సహాయం చేయడానికి మేము సిద్దంగా ఉన్నాము! మా అనుభవంతులైన నిపుణుల సలహా కొరకు +918065906165 కి కాల్ చేయగలరు.

About Author –

Dr. Shivaram Rao K is a Consultant Neuro Physician

About Author

Dr. Shivaram Rao K | yashoda hospitals

Dr. Shivaram Rao K

MD, DM (Neurology)

Consultant Neuro Physician