సైనసైటిస్ (సైనస్ ఇన్ఫెక్షన్): రకాలు, లక్షణాలు, కారణాలు మరియు చికిత్సలు

వాతావరణం మారిందంటే జలుబు చేయడం సహజం. కానీ, వాతావరణం తో సంబంధం లేకుండా తరచుగా జలుబు చేస్తూ ఉంటే మాత్రం అది సైనసైటిస్ ఇన్ఫెక్షన్ కి దారి తీయొచ్చు. ముఖంలో , కళ్ల దగ్గర, ముక్కు పక్క భాగాల్లోని ఎముకల్లో ఉండే సన్నని గాలితో నిండిన కావిటీస్ లను సైనస్‌లు అంటారు. ఈ భాగంలో ఇన్ఫెక్షన్ సోకి, ద్రవంతో నిండినప్పుడు, సూక్ష్మక్రిములు వృద్ధి చెందుతాయి మరియు సంక్రమణకు కారణమవుతాయి. ఈ పరిస్థితిని సైనసైటిస్ అంటారు. ప్రస్తుత కాలంలో చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య వయస్సు మరియు లింగబేధం లేకుండా అందరికి వస్తుంది. సైనసైటిస్ సమస్య నిత్య జీవితంలో తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది.
సైనసైటిస్ సమస్య కొంతమందిలో దీర్ఘకాలం గా బాధిస్తుంది. కొన్ని నెలల నుండి సంవత్సరాల వరకు బాధించే అవకాశం ఉంది.అయినప్పటికీ, సకాలంలో గుర్తించి తగిన చికిత్స తీసుకుంటే, సమస్యకి చక్కటి పరిష్కారం లభిస్తుంది.
సైనసైటిస్ రకాలు
సైనసిటిస్‌లో ప్రధానంగా నాలుగు రకాలు ఉన్నాయి, ఇవి సైనస్‌లు ఎక్కడ ఉన్నాయనే దాని ఆధారంగా వర్గీకరించబడ్డాయి:
- ఫ్రంటల్ సైనసైటిస్ (Frontal Sinusitis): ఇది నుదిటి ఎముక లోపల ఉండే సైనస్‌లలో వచ్చే వాపు. ఈ రకమైన సైనసైటిస్‌తో బాధపడేవారు సాధారణంగా తమ కనుబొమ్మల పైన లేదా నుదిటి మధ్యలో నొప్పికి గురవుతారు.
- మాగ్జిల్లరీ సైనసైటిస్ (Maxillary Sinusitis): ఈ సైనుస్‌లు మన చెంప ఎముకలతో అనుసంధానమై ముక్కుకు ఇరువైపులా ఉంటాయి. మాగ్జిల్లరీ సైనసైటిస్ ఉన్నవారికి దవడ ఎముకల వద్ద మరియు పై పళ్ళలో లేదా చెంపల భాగంలో నొప్పి వస్తుంది.
- స్పెనాయిడ్ సైనసైటిస్ (Sphenoid Sinusitis): ఈ సైనస్‌లు ముక్కుకు వెనుక భాగంలో, తల మధ్యలో లోపలికి ఉంటాయి. స్పెనాయిడ్ సైనసైటిస్‌తో బాధపడేవారు తల మధ్యలో లేదా తల వెనుక వైపున నొప్పిని అనుభవించడం దీని ప్రధాన లక్షణం.
- ఎథ్మాయిడ్ సైనసైటిస్ (Ethmoid Sinusitis): ఈ సైనుస్‌లు కళ్ళ మధ్య, మన ముక్కుకు ఇరువైపులా ఉంటాయి. ఈ రకమైన సైనసైటిస్ ఉన్నవారిలో కళ్ళ చుట్టూ, ముక్కు మూల వద్ద నొప్పి వస్తుంది, ఇది కొన్నిసార్లు తల నొప్పికి కూడా దారితీయవచ్చు.
అందరికి ఒకేరకమైన సైనసైటిస్ రాదు, వివిధ రకాల సైనసైటిస్ లకు వ్యక్తులు గురికావడం జరుగుతుంది.
సైనసైటిస్ దశలు
సైనసైటిస్ లక్షణాల తీవ్రత మరియు సమయాన్ని బట్టి, దీనిని మూడు ప్రధాన దశలుగా వర్గీకరించవచ్చు:
- అక్యూట్ సైనసైటిస్ (Acute Sinusitis): ఇది సైనసిటిస్‌లో అత్యంత సాధారణ రకం. సైనస్‌లు 4 వారాల కంటే తక్కువ కాలం పాటు వాచి, ఇన్ఫెక్షన్‌కు గురైనప్పుడు ఈ దశగా పరిగణించడం జరుగుతుంది. సాధారణంగా వైరస్‌లు ఈ దశకు ప్రధాన కారణం, అయితే బ్యాక్టీరియా వల్ల కూడా ఈ పరిస్థితి కొన్ని సందర్భాలలో తలెత్తవచ్చు. ఈ దశలో తలనొప్పి, ముక్కు దిబ్బడ, ముఖం నొప్పి వంటి లక్షణాలు తీవ్రంగా కనిపిస్తాయి.
- సబక్యూట్ సైనసైటిస్ (Subacute Sinusitis): లక్షణాలు 4 నుండి 12 వారాల వరకు కొనసాగితే, దానిని సబాక్యూట్ సైనసైటిస్ గా పిలవడం జరుగుతుంది. ఈ దశలోనూ ఇన్ఫెక్షన్ సాధారణంగా బ్యాక్టీరియా వల్ల వస్తుంది, కానీ అరుదుగా వైరస్‌లు లేదా ఫంగస్ కూడా కారణం కావచ్చు. ఈ దశలో లక్షణాలు అక్యూట్ దశ వలె తీవ్రంగా ఉండవు, కానీ తీవ్రమైన అసౌకర్యం కొనసాగుతుంది.
- దీర్ఘకాలిక సైనసిటిస్ (Chronic Sinusitis): దీనిని క్రానిక్ రైనోసైనసైటిస్ అని కూడా పిలుస్తారు. లక్షణాలు 12 వారాల కంటే ఎక్కువ కాలం పాటు కొనసాగితే ఈ దశగా నిర్దారించడం జరుగుతుంది. ఇది సాధారణంగా బ్యాక్టీరియా వల్ల వస్తుంది, అయితే అలర్జీలు, సైనస్ నిర్మాణంలో లోపాలు లేదా పునరావృత ఇన్ఫెక్షన్లు కూడా దీనికి కారణం కావచ్చు. ఈ దశలో లక్షణాల తీవ్రత తక్కువగా ఉన్నా, నిరంతరంగా ఉండి, జీవన నాణ్యతను ప్రభావితం చేస్తాయి.
సైనసైటిస్ యొక్క లక్షణాలు
సైనసైటిస్ సమస్య ఉన్నప్పుడు కనిపించే ప్రధాన లక్షణాలు ఈ క్రింద క్లుప్తంగా వివరించబడ్డాయి:
- సాధారణ జలుబు: సైనసైటిస్‌లో జలుబు లక్షణాలు చాలా కాలం పాటు, సాధారణ జలుబు కంటే ఎక్కువ రోజులు తగ్గకుండా వేధిస్తుంది. ముక్కు కారడం లేదా ముక్కు దిబ్బడ వంటివి సాధారణంగా కనిపిస్తాయి.
- తీవ్రమైన తలనొప్పి: సైనస్ కుహరాలలో ఒత్తిడి పెరగడం వల్ల తలలోని వివిధ భాగాలలో, ముఖ్యంగా నుదిటి, చెంపలు లేదా కళ్ళ వెనుక భాగంలో తీవ్రమైన నొప్పి వస్తుంది. ఇది తరచుగా తల వంచినప్పుడు లేదా పడుకున్నప్పుడు బాగా పెరుగుతుంది.
- తల భారం: తల అంతా బరువుగా, ఏదో పెట్టినట్లు అనిపించడం సైనసైటిస్ యొక్క సాధారణ లక్షణం. ఇది సైనస్‌లలో శ్లేష్మం పేరుకుపోవడం వల్ల ఒత్తిడి కలిగి జరుగుతుంది.
- ముక్కు దిబ్బడ & దురద: ముక్కు చికాకుగా అనిపించడం, ఊపిరి ఆడకపోవడం మరియు ముక్కు లోపల దురదగా ఉండటం వంటివి సైనస్‌లలోని వాపు, శ్లేష్మం పేరుకుపోవడం వల్ల కలుగుతాయి.
- కళ్ళ చుట్టూ & కనుబొమ్మల వద్ద నొప్పి: ఎథ్మాయిడ్ మరియు ఫ్రంటల్ సైనస్‌లలో వాపు వచ్చినప్పుడు కళ్ళ చుట్టూ, కనుబొమ్మల పైన లేదా నుదిటి మధ్యలో నొప్పి వస్తుంది. ఈ నొప్పి కొన్నిసార్లు కళ్ళను కదిపినప్పుడు బాగా తెలుస్తుంది.
- శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది: ముక్కు దిబ్బడ తీవ్రంగా ఉండటం వల్ల ముక్కు ద్వారా సరిగా శ్వాస తీసుకోలేకపోవడం, ముఖ్యంగా రాత్రిపూట నిద్రలో ఈ ఇబ్బంది మరింత పెరుగుతుంది.
- వాసన తెలియకపోవడం: సైనస్‌లలో వాపు మరియు శ్లేష్మం పేరుకుపోవడం వల్ల వాసనను గుర్తించే సామర్థ్యం తగ్గిపోతుంది లేదా కొన్ని సందర్భాలలో పూర్తిగా కోల్పోతారు. దీనివల్ల ఆహారం యొక్క రుచి కూడా సరిగా తెలియదు.
- గొంతు నొప్పి: ముక్కు నుండి కఫం గొంతు వెనక భాగానికి కారడం (పోస్ట్-నాసల్ డ్రిప్) వల్ల గొంతులో చికాకు కలిగి, నొప్పిగా అనిపిస్తుంది. ఇది కొన్ని సందర్భాలలో నిరంతర దగ్గుకు కూడా దారితీయవచ్చు.
- గొంతు బొంగురు పోవడం: దీర్ఘకాలికంగా కఫం గొంతు వెనుకకు కారడం లేదా దగ్గు వల్ల గొంతులోని స్వర తంతువులు ప్రభావితమై, గొంతు బొంగురుపోతుంది.
- ముక్కు నుంచి రక్తం కారడం: సైనసైటిస్ వల్ల ముక్కులోని పొరలు పొడిబారడం, వాపుకు గురికావడం లేదా పదేపదే ముక్కును శుభ్రం చేసుకోవడం వల్ల అరుదుగా ముక్కు నుండి రక్తం కారవచ్చు.
- దవడల చుట్టూ నొప్పి: మాగ్జిల్లరీ సైనస్‌లలో ఇన్ఫెక్షన్ లేదా వాపు ఉన్నప్పుడు చెంప ఎముకలు మరియు దవడల చుట్టూ నొప్పి వస్తుంది. ఇది కొన్నిసార్లు పై పళ్ళలో నొప్పిగా కూడా అనిపించవచ్చు.
- కఫం గొంతు వెనకభాగంలోకి రావడం (పోస్ట్-నాసల్ డ్రిప్): సైనస్‌లలో ఉత్పత్తి అయిన శ్లేష్మం ముక్కు ద్వారా బయటకు రాకుండా, గొంతు వెనక భాగానికి కారడం జరుగుతుంది. దీనివల్ల గొంతులో చికాకు, దగ్గు మరియు తరచుగా గొంతు క్లియర్ చేసుకోవాలనే కోరిక కలుగుతుంది.
కొన్నిసార్లు దగ్గు, కళ్లు ఉబ్బినట్లు అనిపించడమే కాక ముఖం మొత్తం వాపు, కోపం,విసుగు, అలసట, పనిపై శ్రద్ధ లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
సైనసైటిస్ కు గల కారణాలు
సైనసైటిస్ రావడానికి అనేక కారణాలు దోహదపడతాయి. వాటిలో కొన్ని ప్రధాన కారణాలు ఈ క్రింద క్లుప్తంగా చెప్పబడ్డాయి:
- కాలుష్యం, ఇన్‌ఫెక్షన్లు: కాలుష్యం, సాధారణ జలుబు, వైరల్, బ్యాక్టీరియా లేదా ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు మొదలైనవి ముఖ్యంగా ముక్కులోని సున్నితమైన నిర్మాణాలను ప్రభావితం చేసి వాపుకు దారితీస్తాయి, తద్వారా సైనసైటిస్ వస్తుంది.
- అలెర్జీలు & వాతావరణ కారకాలు: పుప్పొడి, ధూళి వంటి అలెర్జీ కారకాలు, పొగ, వాతావరణ కాలుష్యం, మరియు గాలిలో అధిక తేమ కూడా సైనసైటిస్‌కు కారణమయ్యే ముఖ్యమైన అంశాలు. ఇవి సైనస్‌లలో చికాకు, వాపును పెంచుతాయి.
- వైద్య పరిస్థితులు & బలహీనమైన రోగనిరోధక శక్తి : డయాబెటిస్, సిస్టిక్ ఫైబ్రోసిస్, హెచ్‌ఐవి, కీమోథెరపీ వంటి కొన్ని వైద్య పరిస్థితులు శరీర రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తాయి. దీనివల్ల సైనస్‌లు ఇన్‌ఫెక్షన్లకు గురయ్యే అవకాశం బాగా పెరిగి సైనసైటిస్ కు దారితీస్తుంది.
- ముక్కులోని నిర్మాణ లోపాలు : ముక్కులో ఎముక వంకరగా ఉండటం (సెప్టల్ డీవియేషన్) లేదా పిల్లల్లో ఎడినాయిడ్స్ సమస్యలు ఉన్నా సైనసైటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నాసల్ పాలిప్స్ (ముక్కు లోపలి పొరలో పెరిగే సన్నని గడ్డలు) వంటి సమస్యలు సైనసైటిస్ తీవ్రతను మరింత పెంచుతాయి. ఈ నిర్మాణ లోపాలు సైనస్‌లలో గాలి ప్రసరణను అడ్డుకుంటాయి.
- వాతావరణం & ధూమపానం : చల్లని వాతావరణం, కాలుష్యం మరియు ధూమపానం కూడా సైనస్ ఇన్‌ఫెక్షన్లు రావడానికి, అదేవిధంగా అవి దీర్ఘకాలికంగా మారడానికి దోహదపడతాయి. పొగ నేరుగా సైనస్ పొరలను చికాకు పెడుతుంది.
సైనసైటిస్ యొక్క నివారణ చర్యలు
సైనస్ సమస్య తీవ్రంగా వేధించినప్పుడు, మీ జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో తప్పకుండా మార్పులు చేసుకోవాలి. ఈ మార్పులు ఉపశమనాన్ని అందించడమే కాక, సమస్యను మరింత తీవ్రతరం కాకుండా చేస్తాయి.
- అలర్జీ కారకాల నివారణ: సైనస్ బాధల్ని పెంచే ప్రధాన అలర్జీ కారకాలైన దుమ్ము, ధూళి మరియు కాలుష్యం ఉన్న ప్రదేశాలకు వెళ్ళకుండా జాగ్రత్త పడాలి. ఇవి సైనస్‌లలో చికాకును కలిగించి, వాపును మరింత పెంచుతాయి.
- చల్లటి ఆహారం, పానీయాలకు దూరంగా ఉండడం: ఫ్రిడ్జ్‌లో నిల్వ చేసిన డ్రింక్స్, చల్లటి ఆహార పదార్థాలు మొదలైనవి తీసుకోవడం మానేయాలి. అలాగే, చల్లటి గాలిలో ఎక్కువగా తిరగడం కూడా సైనస్ సమస్యను పెంచుతుంది కాబట్టి, సాధ్యమైనంత వరకు చల్లగాలికి దూరంగా ఉండాలి.
- ఫ్యాన్ కింద పడుకోవడం తగ్గించాలి: సైనసైటిస్ సమస్య ఉన్నవారు నేరుగా ఫ్యాన్ కింద పడుకోవడం వల్ల గాలిలోని చల్లదనం, దుమ్ము సైనస్‌లను ప్రభావితం చేసి సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. కాబట్టి ఫ్యాన్ కింద పడుకోవడం తగ్గించాలి.
- చలికాలంలో చెవులకు సంరక్షణ: చలికాలంలో చెవులకు చల్లని గాలి తగలకుండా చెవిలో దూది పెట్టుకోవడం లేదా స్కార్ఫ్ కట్టుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇది సైనస్ ఇన్ఫెక్షన్లు రాకుండా చాలావరకు సహాయపడుతుంది.
- ఆవిరి పట్టడం: నాసికా రంధ్రాలు మూసుకుపోయినట్లు అనిపించినా లేదా తరచుగా ముక్కు కారుతున్న సమయంలో వేడినీటితో ఆవిరి పట్టడం వల్ల శ్లేష్మం పల్చబడి, ముక్కు దిబ్బడ తగ్గి కొంతమేర ఉపశమనం కలుగుతుంది.
- ధూమపానం మానేయండి: ధూమపానం ముక్కు లోపలి సైనస్ ను క్లియర్ చేసే వ్యవస్థను పాడుచేస్తుంది, ఇది సైనస్ ఇన్ఫెక్షన్లకు గురికావడాన్ని పెంచుతుంది. కావున, స్మోకింగ్‌ను పూర్తిగా మానివేయడం ఆరోగ్యానికి చాలా మంచిది.
- ఈత కొలనులో ఈత వేసే సమయాన్ని పరిమితం చేయండి: ఈత కొలనులో ఎక్కువ సమయం గడపడం మానుకోవాలి. ఎందుకంటే స్విమ్మింగ్ పూల్స్‌లోని క్లోరిన్ నీరు ముక్కు లోపలి సున్నితమైన దళసరి చర్మాన్ని దెబ్బతీసి, సైనస్‌లను చికాకు పెట్టగలదు.
- తగినంత విశ్రాంతిని పొందండి: సైనసైటిస్ సమస్యతో బాధపడేవారు ఎక్కువ విశ్రాంతి తీసుకోవడం మంచిది. విశ్రాంతి తీసుకోవడం వల్ల శరీరం తన రోగనిరోధక శక్తిని పెంచుకొని, ఇన్ఫ్లమేషన్‌తో సమర్థవంతంగా పోరాడటానికి సహాయపడుతుంది.
- మద్యాన్ని మానివేయండి: మద్యం సేవించడం వల్ల సైనస్‌లలోని శ్లేష్మ పొరలు మరింతగా వాచి, సైనస్ సమస్యలు తీవ్రమవుతాయి. కావున, మద్యం మానేయడం ఆరోగ్యానికి చాలా మంచిది.
- వైద్య నిపుణులను సంప్రదించండి: రోగనిరోధక శక్తిని ప్రభావితం చేసే డయాబెటిస్, క్యాన్సర్, హెచ్‌ఐవీ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న పేషెంట్లు, అలాగే అవయవ మార్పిడి చేసుకున్న వారు సైనస్ సమస్య తీవ్రంగా ఉంటే తప్పకుండా వైద్య నిపుణులను సంప్రదించాలి. వారిలో సమస్యలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది.
సైనసైటిస్ కు చికిత్స
సైనసైటిస్ లక్షణాలను బట్టి చికిత్స ఉంటుంది. జలుబు, అలర్జీలను తగ్గించే ముందులు, ముక్కు దిబ్బడను తగ్గించే డీ-కంజెస్టెంట్స్ను వాడటం ద్వారా ముక్కు రంధ్రాలను శుభ్రం చేయడంతో సైనస్ బాధలను స్వీయ రక్షణ ద్వారా నియంత్రించుకోవచ్చు.
సైనస్ లక్షణాలను త్వరగా గుర్తించి, చికిత్స తీసుకోవడం ఉత్తమం. నేసల్ ఎండోస్కోపీ, సీటీ స్కాన్ విధానం ద్వారా ముక్కులో ఏదైనా సమస్య తెలుస్తుంది. ఆపరేషన్ అంటే భయంతో చాలామంది సైనస్ ట్రీట్ మెంట్ తీసుకోవడానికి వెనుకంజ వేస్తుంటారు. కానీ, ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన అధునాతనమైన పద్ధతుల వల్ల చాలా సులువుగా సర్జరీ పక్రియ అయిపోతుంది. అయినా మందులు క్రమం తప్పకుండా వాడితే చాలావరకు ఆపరేషన్ అవసరం లేకుండానే సైనసైటిస్ సమస్య నుంచి బయటపడవచ్చు.
సైనసైటిస్ కోసం డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
- లక్షణాలు 10-14 రోజులకు మించి ఉంటే: మీ ముక్కు దిబ్బడ, ముఖం నొప్పి, తలనొప్పి లేదా ఇతర సైనస్ లక్షణాలు పది రోజుల తర్వాత కూడా మెరుగుపడకపోతే, లేదా మొదట తగ్గి మళ్ళీ తీవ్రమైతే, వైద్యుడిని కలవాల్సిన సమయం ఇదేనని గుర్తుంచుకోవాలి.
- తీవ్రమైన లక్షణాలు: మీకు తీవ్రమైన ముఖం నొప్పి, కొన్ని రోజుల నుండి అధిక జ్వరం (102°F లేదా 39°C కంటే ఎక్కువ).
- తరుచూ సైనసైటిస్ కు గురికావడం: ఒక సంవత్సరంలో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ సార్లు మీకుసైనసైటిస్ వచ్చి ఉంటే, లేదా మీకు క్రానిక్ సైనసైటిస్ (12 వారాలకు పైగా లక్షణాలు) ఉంటే.
- సమస్యలు లేదా హెచ్చరిక సంకేతాలు: కింది తీవ్రమైన లక్షణాలలో ఏవైనా మీకు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోండి, ఎందుకంటే ఇవి ఇన్ఫెక్షన్ వ్యాప్తిని సూచించవచ్చు:
- కళ్ల చుట్టూ లేదా ముఖంపై అకస్మాత్తుగా వాపు లేదా ఎరుపుదనం.
- దృష్టిలో మార్పులు (మసకబారిన లేదా రెండు కళ్ళు కనిపించడం వంటివి).
- మెడ పట్టేయడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి.
- కళ్ళు కదపడానికి ఇబ్బంది లేదా అలా చేసినప్పుడు తీవ్రమైన నొప్పి.
- బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ: మీకు డయాబెటిస్, HIV, క్యాన్సర్ (ముఖ్యంగా కీమోథెరపీ చేయించుకుంటే), లేదా అవయవ మార్పిడి చేయించుకున్నట్లుగా రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉంటే, ఏదైనా సైనస్ లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
మీ లక్షణాల గురించి గనుక ఆందోళన చెందుతుంటే వైద్య నిపుణుడిని సంప్రదించడానికి వెనుకాడకండి. ముందుగానే నిర్ధారణ మరియు చికిత్స తీసుకోవడం వల్ల మరింత తీవ్రమైన సమస్యలను నివారించవచ్చు.
ముగింపు
మాటిమాటికి జలుబు అవుతుందనుకున్నా, చల్లని వాతావరణంలో, చల్లని వస్తువుల వల్ల తలనొప్పి వస్తున్నా, వెంటనే అవసరమైన టెస్టులు చేయించి సమస్య పెద్దది కాకుండానే చికిత్స చేయించుకోవడం ఉత్తమం. నాలుగు వారాల కంటే ఎక్కువగా సైనసైటిస్ లక్షణాలు కనిపిస్తే ఈఎన్‌టీ వైద్యుడిని సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. ఒకవేళ చికిత్స తీసుకోవడంలో మరింత ఆలస్యం జరిగితే సైనస్ ఇన్ఫెక్షన్లు ప్రాణాంతక ఇన్ఫెక్షన్లకు సైతం దారి తీయవచ్చు.
మీ ఆరోగ్య సంరక్షణ గురించి ఏవైనా సందేహాలు ఉన్నాయా? సహాయం చేయడానికి మేము సిద్దంగా ఉన్నాము! మా అనుభవంతులైన నిపుణుల సలహా కొరకు +918929967127 కి కాల్ చేయగలరు.