స్లీప్ పెరాలసిస్ అంటే ఏమిటి? ఎందుకు వస్తుంది? లక్షణాలు, చికిత్స

స్లీప్ పెరాలసిస్ (నిద్ర పక్షవాతం) : నిద్రలో ఉన్నప్పుడు ఛాతీ మీద బరువుగా ఉన్నట్లు అనిపిస్తుందా? ఆ సమయంలో ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుందా? నిద్ర నుండి మేలుకున్న వెంటనే పైకి లేవడం కుదరడంలేదా? ఇవన్నీ నిద్ర పక్షవాతం లక్షణాలు. నిద్ర పక్షవాతానికి సాధారణ పక్షవాతానికి చాలా తేడా ఉంది, దాదాపుగా ఈ రెండిటికి సంబంధం లేదనే చెప్పవచ్చు. నిద్ర పక్షవాతం ప్రభావం కేవలం కొన్ని సెకండ్లు లేదా నిమిషాల పాటు మాత్రమే ఉంటుంది. ఉదాహరణకు మీరు నిద్రలో ఉన్నప్పుడు మీకు మెలకువ వచ్చి, స్పృహలో ఉన్నా కూడా, పైకి లేవలేరు, మాట్లాడాలి అనుకున్నా మాట్లాడలేరు, శరీరాన్ని అసలు కదల్చలేరు, అయితే ఈ పరిస్థితి ఎక్కువసేపు ఉండదు. కానీ ఈ పరిస్థితి ఎక్కువసార్లు కలుగుతుంటే మాత్రం డాక్టర్ ను సంప్రదించడం అవసరం.
సాధారణ పక్షవాతానికి, నిద్ర పక్షవాతానికి తేడా ఏంటి?
పక్షవాతానికి, నిద్ర పక్షవాతానికి చాలా తేడా ఉంది, నిద్ర పక్షవాతాన్ని, పక్షవాతంతో పోల్చలేము. మన శరీరంలో ఏదైనా భాగానికి పక్షవాతం వస్తే దాదాపు ఆ అవయవం కదలకుండా ఉండిపోతుంది. కానీ నిద్రపక్షవాతంలో కేవలం కొన్ని సెకన్ల పాటు మాత్రమే ఈ పరిస్థితి ఉంటుంది, తర్వాత మన శరీరం యధాస్థితికి వస్తుంది. చాలామందికి నిద్ర పక్షవాతానికి గురైన విషయం కూడా వారికి గుర్తు ఉండదు.
నిద్ర పక్షవాతం లక్షణాలు ఏంటి?
నిద్ర పక్షవాతం అంత ప్రమాదకరమైనది కాదు కానీ దీని లక్షణాల వలన మనం భయాందోళనలకు గురయ్యే అవకాశం ఉంది.
- నిద్ర పక్షవాతం ఉన్నప్పుడు మెలకువగా ఉన్నా కూడా శరీరాన్ని కదపలేరు. కాళ్ళు కానీ చేతులు కానీ కదిలించడానికి ప్రయత్నం చేసినా వీలు అవ్వదు.
- ఈ స్థితిలో ఉన్నప్పుడు మీరు మాట్లాడాలి అనుకున్నా కూడా మాట్లాడలేరు.
- నిద్ర పక్షవాతం ఉన్నప్పుడు కొద్ది క్షణాల పాటు శ్వాస ఆడకపోవడం, ఛాతీ పైన బరువుగా అనిపించడం జరుగుతాయి. కానీ వెంటనే మాములు స్థితికి వచ్చేస్తారు.
- చుట్టూ ఎవరో ఉన్నట్టు ఎదో జరుగుతున్నట్టు అనిపిస్తుంటుంది, ఇది కలలో కూడా జరగదు, మెలకువలో ఉన్నప్పుడు ఇలాంటి భ్రాంతి చెందుతారు.
- నిద్ర పక్షవాతం ఉన్నవారికి పగటి పూట నిద్రమత్తు అధికంగా ఉంటుంది.
నిద్ర పక్షవాతం ఎందుకు వస్తుంది? దానికి గల కారణాలేంటి?
నిద్ర పక్షవాతం రావడానికి గల కారణాలు ఖచ్చితంగా తెలియనప్పటికీ కొన్ని ముఖ్యమైన కారణాల వలన సంభవించే అవకాశం ఉన్నట్లు తెల్సుస్తుంది.
- నిద్ర సరిపోకపోవడం : నిద్ర పక్షవాతానికి ముఖ్యమైన కారణం ప్రతీరోజూ సరైన నిద్ర లేకపోవడం, సాధారణంగా మనకి వయసుని బట్టి రోజుకి 7 నుండి 9 గంటల పాటు నిద్ర అవసరం, కానీ ప్రతీరోజూ తక్కువ సమయం నిద్రించే వారిలో ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది.
- నైట్ షిఫ్ట్ : రాత్రి సమయాల్లో పని చేసేవారిలో కూడా నిద్ర పక్షవాతం లక్షణాలు కనిపిస్తాయి. నిద్ర వేళల్లో మార్పులు పగటి పూట సరిగా నిద్ర పోకపోవడం రాత్రంతా మేలుకుని పని చేయడం వలన నిద్ర పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది.
- క్రమరహిత నిద్ర వేళలు : ప్రతీరోజూ నిద్రపోయే వేళలు క్రమరహితంగా ఉండడం వలన నిద్ర పక్షవాతం సంభవించే ప్రమాదం ఉంది.
- ఒత్తిడి, ఆందోళన ఇతర మానసిక సమస్యలు : ఎక్కువగా పని ఒత్తిడి, ఆందోళన కలిగిన వారు ఇతర మానసిక సమస్యలు కలిగిన వారికి నిద్ర పక్షవాతం వచ్చే అవకాశం ఉంది.
- నార్కోలెప్సీ : నార్కోలెప్సీ వ్యాధి ఉన్నవారిలో నిద్ర పక్షవాతంకు సంబంధించిన లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. నార్కోలెప్సీ అంటే ఏదైనా పనిచేస్తున్న సమయంలో కూడా ఉన్నట్టుండి నిద్రలోకి జారుకునే వ్యాధి.
స్లీప్ పెరాలసిస్ రకాలు
నిద్ర పక్షవాతం లక్షణాలను బట్టి రెండు రకాలుగా విభజించబడింది. వాటిని ఇక్కడ వివరంగా తెలుసుకోవచ్చు.
ఐసోలేటెడ్ స్లీప్ పెరాలసిస్ (ISP) : నిద్రకు సంబంధించిన సమస్యల వలన కాకుండా ఉన్నఫళంగా సంభవిస్తుంది, నిద్ర మరియు మేల్కొనే సమయానికి మధ్య కొన్ని క్షణాలపాటు కదల్లేని పరిస్థితి ఉంటుంది. ఇది ఎప్పుడైనా ఒక్కసారి ఉన్నట్టుండి జరుగుతుంది.
రిక్కరెంట్ ఐసోలేటెడ్ స్లీప్ పెరాలసిస్ (RISP) : ఓకే రాత్రి అనేకసార్లు, లేదా తరచుగా ఇలాంటి పరిస్థితికి గురవ్వడాన్ని రిక్కరెంట్ ఐసోలేటెడ్ స్లీప్ పరాలైసిస్ అంటారు.
నిద్ర పక్షవాతం చికిత్స
నిద్ర పక్షవాతం ప్రమాదమైన వ్యాధి కాదు, అరుదుగా సంభవించే ఈ వ్యాధి వలన పేషేంట్ కు ఎటువంటి ప్రమాదం ఉండదు. కానీ ఈ పరిస్థితి పేషేంట్ లో తరచుగా కనిపిస్తూ ఉంటే అప్పుడు కొన్ని యాంటీడిప్రసెంట్ మందులను డాక్టర్లు సూచించవచ్చు. కొన్ని రకాలైన వ్యాయామం, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం వలన నిద్ర పక్షవాతాన్ని నివారించవచ్చు.
నిద్ర పక్షవాతం నివారణ మార్గాలు
మన జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా నిద్ర పక్షవాతం రాకుండా నివారించవచ్చు, ఆ మార్గాలను ఇక్కడ తెలుసుకోవచ్చు.
వ్యాయామం : చాలామందిలో కనీస శారీరక శ్రమ లేకపోవడం వలన ఆరోగ్యకరమైన నిద్ర పట్టదు, మంచి నిద్ర కోసం డాక్టర్లు సూచించిన తేలికపాటి వ్యాయామాలను చేయవచ్చు. ప్రతీరోజూ రెండు గంటలపాటు నడక కూడా మంచి నిద్రను ప్రేరేపిస్తుంది.
కెఫీన్ కలిగిన ఆహారం తగ్గించడం : కాఫీ, టీ, కూల్ డ్రింక్స్ మరియు కెఫిన్ కలిగిన పదార్ధాలు నిద్రను దూరం చేస్తాయి, నిద్రలేమి వలన నిద్ర పక్షవాతం వచ్చే అవకాశం ఉంది. అందువలన ఇలాంటి పదార్ధాలను తగ్గించాలి.
మద్యపానం, ధూమపానం తగ్గించడం : అనేక అనారోగ్యాలకు కారణమయ్యే మద్యపానం, ధూమపానం అలవాట్లు నిద్ర పక్షవాతానికి కూడా కారణమవుతున్నాయి, ఈ అలవాట్లను తగ్గించుకోవడం వలన నిద్రపక్షవాతం రాకుండా నివారించవచ్చు.
స్క్రీన్ టైమ్ తగ్గించడం : ప్రస్తుతం అన్నివయసుల వారు సెల్ ఫోన్ లేదా లాప్టాప్ ఎక్కువగా వాడుతుండడం ఎక్కువ అయ్యింది, పనిలో భాగంగానే వీటిని వాడుతున్నా కూడా అనవసరమైన సమయాల్లో టీవీ, మొబైల్ చూడడాన్ని తగ్గించాలి.
నిద్ర పక్షవాతం సాధారణంగా ప్రమాదకరమైనది కాదు, కానీ మీకు తరచుగా ఈ పరిస్థితి ఏర్పడుతుంటే డాక్టర్ ను సంప్రదించాలి. అనుభవజ్ఞులైన యశోద వైద్య నిపుణులు మీరు ఎదుర్కొంటున్న లక్షణాలను బట్టి అత్యుత్తమ చికిత్స అందిస్తారు.
మీ ఆరోగ్య సంరక్షణ గురించి ఏవైనా సందేహాలు ఉన్నాయా? సహాయం చేయడానికి మేము సిద్దంగా ఉన్నాము! మా అనుభవంతులైన నిపుణుల సలహా కొరకు +918929967127 కి కాల్ చేయగలరు.