చర్మంపై దద్దుర్లు (ఉర్టికేరియా): కారణాలు, లక్షణాలు, చికిత్స, జాగ్రత్తలు

ఉర్టికేరియా అంటే ఏమిటి?
కొన్నిసార్లు మన చేతుల మీద, ముఖం మీద మరియు ఇతర భాగాలలో దద్దుర్లు (ఉర్టికేరియా) వస్తూ ఉంటాయి. ఈ దద్దుర్ల వలన దురద ఎక్కువగా ఉంటుంది. అయితే వీటిని అలాగే వదిలేయడం లేదా దురద కలిగినప్పుడు గోకడం వలన దద్దుర్లు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది, అంతేకాకుండా వాటి నుండి రక్తస్రావం జరగవచ్చు. చర్మంపై దద్దుర్లు రావడానికి అలర్జీలు, ఏదైనా కీటకాల కాటు, అధిక ఉష్ణోగ్రతలు మరియు ఇతర కారణాలు ఉండవచ్చు. చర్మంపై దద్దుర్లు ఏర్పడడానికి గల కారణాలు, వాటి లక్షణాలు, దద్దుర్లు తగ్గడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు చికిత్స గురించి ఇక్కడ వివరంగా తెలుసుకోవచ్చు.
చర్మంపై దద్దుర్లు ఎందుకు వస్తాయి?
మన చర్మంపై దద్దుర్లు రావడానికి అనేక కారణాలు ఉంటాయి, మనం తీసుకునే ఆహారం, కీటకాలు, అలర్జీలు ఇలా అనేక కారణాలు ఉండవచ్చు. వాటి గురించి ఇక్కడ మరింత వివరంగా తెలుసుకోవచ్చు.
అలర్జీ : మన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ చాలా ముఖ్యమైనది, ఇన్ఫెక్షన్ మరియు ఇతర అంటువ్యాధులు మన శరీరానికి సోకకుండా ఈ రోగనిరోధక వ్యవస్థ చూసుకుంటుంది. అయితే కొన్నిసార్లు ఎటువంటి ఇన్ఫెక్షన్ లేకపోయినా రోగ నిరోధక వ్యవస్థ పని చేయడం ప్రారంభిస్తుంది. ఈ కారణంగా విడుదలైన రసాయనాలు చర్మంపై ప్రభావం చూపడం వలన అలర్జీ ఏర్పడతాయి. ఈ అలర్జీలు కారణంగా చర్మంపై వివిధ భాగాల్లో దద్దుర్లు (ఉర్టికేరియా) ఏర్పడతాయి.
ఆహారం : కొన్ని రకాలైన ఆహార పదార్ధాలు కూడా చర్మంపై దద్దుర్లు ఏర్పడడానికి కారణం అవుతాయి. అయితే దద్దుర్లకు కారణమయ్యే ఆహారం ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి భిన్నంగా ఉండవచ్చు. కొంతమందిలో ఉర్టికేరియా ఏర్పడడానికి పాలు, పాల పదార్ధాలు కారణం అయితే మరికొంతమందిలో కెఫిన్ కలిగిన పదార్ధాలు కారణం కావచ్చు.
ఇన్ఫెక్షన్ : కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు, వైరస్, బాక్టీరియా, ఫంగస్ కారణంగా వచ్చే ఇన్ఫెక్షన్లు కూడా ఉర్టికేరియాకు కారణం అవుతాయి.
కీటకాలు : చర్మంపై దద్దుర్లు ఏర్పడడానికి దోమలు లేదా ఇతర కీటకాలు కుట్టడం కూడా కారణమవుతుంది.
కొన్ని రకాల మందులు : మనం ఇతర అనారోగ్యాలకు వాడుతున్న మందుల వలన కూడా శరీరంపై దద్దుర్లు ఏర్పడడానికి కారణం కావచ్చు. ఈ మందులు కూడా అందరిలోనూ ఒకేలా కాకుండా ఒకొక్కరిలో ఒకొక్క విధంగా ఉండవచ్చు.
ఇతర చర్మ వ్యాధులు : ఒకవేళ ఇప్పటికే ఏదైనా చర్మ సంబంధిత వ్యాధులు ఉన్నట్లైతే అవి కూడా దద్దుర్లకు కారణం కావచ్చు. తామర వ్యాధి, రోసేసియా వంటి చర్మవ్యాధులు వలన దద్దుర్లు ఏర్పడతాయి.
మానసిక ఒత్తిడి : మనం తీవ్రమైన ఒత్తిడికి, ఆందోళనకు గురి కావడం వలన శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. దీని వలన కూడా చర్మంపై దద్దుర్లు ఏర్పడే అవకాశం ఉంది.
అధిక ఉష్ణోగ్రతలు : అధిక ఎండ, వేడి పరిస్థితుల్లో ఎక్కువ సమయం పనిచేసే వారిలో దద్దుర్లు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఇది కేవలం వేడి వలన మాత్రమే కాదు, మన శరీరంపై అతినీలలోహిత కిరణాలు పడినప్పుడు కూడా శరీరంపై దద్దుర్లు ఏర్పడవచ్చు. ఎటువంటి ఎండ లేని సమయంలో కూడా ఈ అల్ట్రా వైలెట్ రేస్ శరీరంపై ప్రభావం చూపుతాయి.
రసాయనాలు : వివిధ రకాల రసాయనాలు మన శరీరంపై దద్దుర్లు ఏర్పడడానికి కారణం అవుతాయి. రసాయన పరిశ్రమలో పని చేసేవారు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే దద్దుర్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.
ఉర్టికేరియా లక్షణాలు
ఉర్టికేరియా సమస్య ఉన్నవారిలో ఈ క్రింది లక్షణాలు కనిపించవచ్చు.
దద్దుర్లు : ఈ సమస్య ఉన్నవారిలో చర్మంపై ఎక్కువగా దద్దుర్లు కనిపిస్తాయి. ఇవి శరీరంపై ఏ భాగంలోనైనా ఏర్పడవచ్చు.
దురద : శరీరంపై ఏర్పడిన దద్దుర్ల కారణంగా తరచుగా ఆ భాగం అంతా దురదగా ఉండవచ్చు.
చర్మంపై మంట : శరీరంపై ఏర్పడిన దద్దుర్లుకు ఎండ లేదా వేడి తగలడం వలన ఆ భాగం అంతా మంట ఉన్నట్టు అనిపిస్తుంది.
చర్మం ఎర్రగా మారడం : దద్దుర్లు ఏర్పడిన భాగంలో మరియు వాటి చుట్టూ ఉన్న చర్మం ఎర్రగా మారవచ్చు.
చర్మంపై దద్దుర్లకు చికిత్స – దద్దుర్లు పోవాలంటే ఏం చేయాలి?
ఉర్టికేరియాకు వివిధ రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అయితే దద్దుర్లు ఏర్పడడానికి గల కారణాలను బట్టి చికిత్స అందించాల్సి ఉంటుంది. ఇక్కడ అందించిన విధానాల ద్వారా చర్మంపై ఏర్పడిన దద్దుర్లను తగ్గించుకోవచ్చు.
కార్టికోస్టెరాయిడ్స్ : చర్మంపై ఏర్పడిన దద్దుర్ల వలన ఎక్కువగా మంట, దురద, నొప్పి కలుగుతుంటే కార్టికోస్టెరాయిడ్స్ ను డాక్టర్ సూచించవచ్చు. వీటి వలన నొప్పి మరియు దురద నుండి ఉపశమనం కలుగుతుంది. కార్టికోస్టెరాయిడ్స్ అనేవి క్రీమ్, ఆయింట్మెంట్ లేదా టాబ్లెట్స్ రూపంలో ఉండవచ్చు.
యాంటీహిస్టామైన్లు : ఈ మందులు చర్మంపై ఏర్పడిన దద్దుర్ల కారణంగా దురద రాకుండా నివారిస్తాయి.
మాయిశ్చరైజర్లు : చర్మంపై ఏర్పడిన దద్దుర్లను తగ్గించడానికి కొన్ని రకాల మాయిశ్చరైజర్లను కూడా సూచించవచ్చు. ఇవి ఉర్టికేరియా వలన కలిగే మంటను, నొప్పిని తగ్గిస్తాయి తద్వార ఉపశమనం కలుగుతుంది.
యాంటీబయాటిక్స్ : ఒకవేళ దదుర్ల వలన తీవ్రమైన నొప్పి మరియు మంట కలుగుతున్నట్లు అయితే ఆ సందర్భంలో యాంటీబయాటిక్స్ ను డాక్టర్ సూచించవచ్చు.
ఫొటోథెరపీ : కొన్ని సందర్భాలలో చర్మంపై ఏర్పడిన దద్దుర్లు దీర్ఘకాలికంగా ఉండడమే కాకుండా నిరంతరం దురద కలిగిస్తాయి. ఇలాంటి సందర్భాలలో వాటిని తొలగించడానికి అతినీలలోహిత కిరణాలు (UV) ఉపయోగిస్తారు, ఈ పద్దతిని ఫొటోథెరపీ అంటారు.
ఐస్ క్యూబ్ మసాజ్ : చర్మంపై ఏర్పడిన దద్దుర్ల వలన కలిగే నొప్పి మరియు మంట నుండి ఉపశమనం పొందడానికి ఐస్ క్యూబ్ తో మసాజ్ చేయవచ్చు. దద్దుర్ల ప్రభావం మరియు లక్షణాలను బట్టి రోజుకు ఎన్నిసార్లు మసాజ్ చేయాలి అనే విషయాన్ని డాక్టర్ సూచిస్తారు.
చర్మంపై దద్దుర్లు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మన చర్మంపై దద్దుర్లు ఏర్పడడానికి అనేక కారణాలు ఉంటాయి. ఆ కారణాలను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే దద్దుర్లు రాకుండా నివారించవచ్చు. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
ఆహారం : చర్మంపై దద్దుర్లు ఏర్పడడానికి ఒకొక్కరికి ఒకొక్క ఆహారం కారణం కావచ్చు. వాటిని గుర్తించి ఆ ఆహారాన్ని తగ్గించడం ద్వారా దద్దుర్లను నివారించవచ్చు. ఎక్కువ నూనె కలిగిన పదార్ధాలను కూడా తగ్గించడం మంచిది. కొన్ని సందర్భాలలో పోషకాహార లోపం వలన కూడా ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సరైన ఆహారాన్ని తీసుకోవాలి.
వదులైన దుస్తులు ధరించడం : బిగుతుగా ఉండే దుస్తులు ధరించడం వలన చెమట ఎక్కువయ్యి దద్దుర్లు ఉన్నందున సాధ్యమైనంత వరకూ వదులుగా ఉండే దుస్తులను ధరించడం మంచిది.
తగినంత నీరు : డీహైడ్రేషన్ కూడా మన శరీరం మరియు చర్మం అనేక మార్పులు కలగడానికి కారణం అవుతుంది. తగినంత నీరు తాగడం ద్వారా చర్మ వ్యాధులు, దద్దుర్లు రాకుండా నివారించవచ్చు.
దోమలు, కీటకాలను నివారించడం: చాలా వరకూ మన చర్మంపై ఏర్పడే దద్దుర్లు దోమలు మరియు ఇతర కీటకాలు కుట్టడం వలన కావచ్చు, అందుకే నివసించే ప్రదేశంలో దోమలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
ఎండ, వేడి నుండి రక్షణ : అధిక ఉష్ణోగ్రతలలో పని చేయాల్సి వచ్చినప్పుడు చర్మాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు ధరించడం, ఎండలో బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు సన్ స్క్రీన్ (SPF 30 నుండి 50) ఉపయోగించడం, ఒకవేళ రసాయనాలు ఉన్న ప్రదేశంలో పని చేసే సందర్భాల్లో కాళ్ళకు, చేతులకు సరైన గ్లౌజులు ధరించడం అవసరం.
మీ చర్మం గురించి అవగాహన : మన చర్మం స్వభావం ఒకొక్కరిలో ఒకొక్క విధంగా ఉండవచ్చు, కొంతమందిలో చల్లటి వస్తువులకు సున్నితంగా ఉంటే మరికొంతమందిలో వేడికి సున్నితంగా ఉంటుంది. మన చర్మం ఏ సందర్భాలలో ఎటువంటి వస్తువులకు సున్నితంగా ఉంటుందనే విషయాన్ని గుర్తించడం మరియు వాటికి దూరంగా ఉండడం ద్వారా కూడా ఉర్టికేరియా రాకుండా నివారించవచ్చు.
ముగింపు
మన చర్మంపై ఏర్పడే దద్దుర్లకు వివిధ కారణాలు ఉంటాయి, ఈ దద్దుర్లు నాలుగు నుండి ఐదు రోజుల్లో తగ్గకపోతే వాటి వలన చర్మ వ్యాధులు కలగడం, తీవ్రమైన నొప్పి కలగవచ్చు. ఈ పరిణామాలు తీవ్రం కాకుండా ఉండడానికి సరైన చర్మవ్యాధులు నిపుణులను సంప్రదించాలి. యశోద హాస్పిటల్స్ లో అనుభవజ్ఞులైన చర్మవ్యాధుల నిపుణులు ( డెర్మటాలజిస్ట్) మీకు కేవలం ఒక ఫోన్ కాల్ దూరంలో ఉన్నారని గుర్తుంచుకోండి.
మీ ఆరోగ్య సంరక్షణ గురించి ఏవైనా సందేహాలు ఉన్నాయా? సహాయం చేయడానికి మేము సిద్దంగా ఉన్నాము! మా అనుభవంతులైన నిపుణుల సలహా కొరకు +918065906165 కి కాల్ చేయగలరు.



















Appointment
WhatsApp
Call
More