మన శరీరంపై బొల్లి మచ్చలు ఎందుకు వస్తాయి? బొల్లి నివారణ, లక్షణాలు, చికిత్స
మన శరీరంలో ప్రతీ నిమిషం వివిధ పనులకు అవసరమైన హార్మోన్లు, ఎంజైమ్లు, ఇతర రసాయనాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. మన చర్మంలో మెలనోసైట్లు అనే కణాలు ఉంటాయి, ఈ కణాలు మెలనిన్ అనే ద్రవాన్ని ఉత్పత్తి చేస్తాయి. మెలనిన్ మన శరీరం యొక్క రంగుకి కారణమవుతుంది. మెలనిన్ ఉత్పత్తిని బట్టే మన శరీరం రంగు ఉంటుంది. అంతే కాకుండా ఈ మెలనిన్ కొన్నిసార్లు హెచ్చుతగ్గులకు లోనవుతుంది, ఉదాహరణకు మనం ఎక్కువసేపు ఎండలో ఉంటే ఎండ నుండి మన శరీరాన్ని కాపాడడానికి ఎక్కువ మెలనిన్ ఉత్పత్తి అవుతుంది, దీని కారణంగానే మనం ఎండలో ఎక్కువ సమయం ఉన్నప్పుడు నల్లగా అవుతాం. అయితే కొన్ని కారణాల వలన మన శరీరంలోని మెలనోసైట్లలో మెలనిన్ లోపం కలుగుతుంది, ఈ మెలనిన్ లోపం చర్మంపై ఏ భాగంలో ఉన్న మెలనోసైట్లలో అయినా జరగవచ్చు, ఎక్కడైతే ఈ లోపం ఉంటుందో అక్కడ తెల్ల మచ్చలు ఏర్పడతాయి, ఇలా ఏర్పడడాన్నే బొల్లి వ్యాధిగా(Vitiligo) పరిగణిస్తారు. ఈ మచ్చల వలన నొప్పి కలిగే అవకాశం లేదు, అయితే చర్మంపై ఇలాంటి మచ్చలు ఏర్పడడం వలన చాలామంది మానసిక స్థైర్యం కోల్పోవడం జరుగుతుంది.
బొల్లి మచ్చలు ఎందుకు వస్తాయి?
బొల్లి మచ్చలు రావడానికి కారణం మన శరీరంలో మెలనిన్ లోపం, అయితే శరీరానికి కావాల్సినంత మెలనిన్ ఉత్పత్తి కాకపోవడానికి గల కారణాలను ఇక్కడ వివరంగా తెలుసుకోవచ్చు.
ఆటో ఇమ్యూన్ డిజార్డర్ : మన శరీరంలో ఉండే రోగనిరోధక శక్తి కొన్ని సార్లు చెడు కణాల మీద కాకుండా ఆరోగ్యంగా ఉన్న కణాల మీదనే ప్రభావం చూపించడం ప్రారంభిస్తుంది. మన రోగ నిరోధక శక్తి మెలనోసైట్ కణాల మీద పనిచేసి వాటిని అంతం చేయడం వలన మెలనిన్ స్థాయిలు తగ్గుతాయి. ఇలా జరిగిన సందర్భాల్లో ఆ భాగంలో బొల్లి మచ్చలు ఏర్పడతాయి.
వంశపారంపర్యం లేదా జన్యు కారణాలు: కుటుంబంలో ఎవరికైనా బొల్లి ఉంటే వారి తర్వాత తరానికి బొల్లి వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వారసత్వంగా వచ్చే జన్యువులు లేదా డిఎన్ఏ కారణంగా బొల్లి ఏర్పడుతుంది.
అతినీలలోహిత కిరణాలు: సూర్యుడి నుండి వచ్చే ప్రమాదకరమైన కిరణాలు ఇవి, ఎక్కువసేపు సూర్యరశ్మిలో పనిచేసే వారిపై వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా కూడా బొల్లి మచ్చలు ఏర్పడవచ్చు.
రసాయనాలు / గాయాలు: కొన్ని రకాల రసాయనాలు చర్మంపై పడినప్పుడు చర్మంలో ఉన్న మెలనోసైట్ కణాలు నిర్జీవంగా మారుతాయి, ఇలాంటి సందర్భాలలో బొల్లి మచ్చలు ఏర్పడతాయి. శరీరానికి గాయాలైన సందర్భంలో కూడా బొల్లి మచ్చలు ఏర్పడే అవకాశం ఉంది.
ఇతర ఆటో ఇమ్యూన్ వ్యాధులు: ఒకవేళ పేషేంట్ కు మరేదైనా ఆటో ఇమ్యూన్ వ్యాధులు ఉంటే (ఉదాహరణకు థైరాయిడ్) వాటి కారణంగా కూడా బొల్లి మచ్చలు ఏర్పడే అవకాశం ఉంది.
విటమిన్ లోపం: మన శరీరానికి కావలసిన విటమిన్లు అందకపోవడం వలన లేదా పౌష్టికాహారం లోపం వలన బొల్లి మచ్చలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.
బొల్లి లక్షణాలు ఎలా ఉంటాయి?
బొల్లి మచ్చలు శరీరంలో ఏ భాగంలో అయినా ఏర్పడవచ్చు. అయితే ఈ మచ్చల కారణంగా నొప్పి కలగదు. బొల్లి మచ్చల యొక్క లక్షణాలు ఇక్కడ వివరంగా తెలుసుకోవచ్చు.
శరీరంపై తెల్లటి మచ్చలు: బొల్లి వలన మన చర్మంపై తెల్లటి మచ్చలు ఏర్పడతాయి, ఇవి శరీరంపై ఏ భాగంలోనైనా ఏర్పడవచ్చు. ఇవి చూడడానికి అందవిహీనంగా కనిపిస్తాయి.
సూర్యరశ్మికి సున్నితత్వం: బొల్లి మచ్చలు సూర్యరశ్మికి చాలా సున్నితంగా ఉంటాయి. ఈ సమస్య కలిగిం వాళ్ళు సూర్యరశ్మిలో ఎక్కువ సమయం పని చేస్తే బొల్లి మచ్చలు ఉన్న ప్రాంతంలో దద్దుర్లు వచ్చే అవకాశం ఉంది. బొల్లి మచ్చలు ఉన్నవారికి వడదెబ్బ తగిలే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది.
దురద: కొంతమందిలో బొల్లి మచ్చలు ఉన్న ప్రదేశంలో లేదా ఆ మచ్చల చుట్టూ దురద ఎక్కువగా ఉంటుంది. అయితే అందరిలోనూ ఈ దురద ఉండకపోవచ్చు.
బొల్లి మచ్చలను నివారించవచ్చా?
బొల్లి మచ్చల నివారణ శాస్త్రీయంగా నిర్దారించబడకపోయినా కొన్ని మార్గాలను పాటించడం ద్వారా బొల్లి మచ్చలు కొత్తగా రాకుండా నివారించవచ్చని తెలుస్తుంది.
సమతుల్య ఆహారం: బొల్లి మచ్చలు ఏర్పడడానికి విటమిన్ లోపం ఒక కారణంగా ఉన్నది కాబట్టి సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఈ సమస్య రాకుండా నివారించవచ్చు.
సన్ స్క్రీన్ ఉపయోగం: ఎక్కువ సమయం పాటు ఎండలో పని చేసేవారు మరియు ప్రతీ రోజూ ఎండలో బయటకు వెళ్లేవారు సన్ స్క్రీన్ ఉపయోగించడం చాలా అవసరం, దీని వలన బొల్లి మచ్చలు రాకుండా నివారించే అవకాశం ఉంది.
కాస్మోటిక్స్ పట్ల జాగ్రత్త వహించండి: ప్రస్తుతం మనం వాడే మేకప్, కాస్మోటిక్స్ మొదలైన వాటిలో కెమికల్స్ శాతం అధికంగా ఉంటుంది. ఒకవేళ ఇలాంటి ప్రోడక్ట్స్ వాడుతున్నట్లయితే వాటిలో వాడే కెమికల్స్ శాతాన్ని గురించి నిర్దారించుకోండి. కెమికల్స్ ఉండే మేకప్ వాడకాన్ని నియంత్రించడం ద్వారా కూడా కొంతవరకూ బొల్లి మచ్చలను నివారించవచ్చు.
ఒత్తిడి తగ్గించుకోవడం: ఒత్తిడి అనేది నేరుగా బొల్లికి కారణం కాకపోయినా పరోక్షంగా ఆటో ఇమ్యూన్ వ్యాధులకు కారణం అయ్యే అవకాశం ఉంది. వాటి వలన బొల్లి మచ్చలు ఏర్పడే అవకాశం ఉంది.
బొల్లి మచ్చల ప్రభావం ఉండే భాగాలు
బొల్లి మచ్చలు మన శరీరంలో ఏ భాగంలో అయినా రావచ్చు. అయితే సాధారణంగా బొల్లి మచ్చలు ఎక్కువగా ఏర్పడే భాగాలు ఇవి
- ముఖం
- ఛాతీ
- మణికట్టు
- చేతులు
- కాళ్ళు
- పాదాలు
- కళ్ళు, నోటి పక్కన
బొల్లి మచ్చలు చికిత్స విధానం
బొల్లి మచ్చల చికిత్స గురించి కొన్ని అపోహలు ఉన్నాయి, బొల్లి మచ్చలు చికిత్స ద్వారా నయం అవ్వవని అనేకమంది అంటూ ఉంటారు. అయితే బొల్లి మచ్చలను ఘననీయంగా తగ్గించే చికిత్స విధానాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.
లైట్ థెరపీ : చర్మం కోల్పోయిన రంగును తిరిగి తీసుకునిరావడానికి లైట్ థెరపీ చికిత్సను అవలంబిస్తారు. ఇందులో భాగంగా UV కిరణాలను మచ్చలపై ప్రయోగిస్తారు. ఐతే లైట్ థెరపీ ద్వారా సాధరణ రంగు తీసుకుని రావడానికి అనేక సెషన్లు అవసరం అవుతాయి.
మందులు : మందులు, బొల్లి మచ్చలను తగ్గించలేవు కానీ ప్రస్తుతమున్న మచ్చలు మిగతా శరీర భాగాలకు వ్యాపించకుండా నియంత్రిస్తాయి.
సర్జరీ : బొల్లి మచ్చలను తగ్గించి శరీరాన్ని సాధారణ రంగుకి తీసుకుని రావడానికి కొన్ని శస్త్రచికిత్సలను చేయవచ్చు. వీటిలో శరీరం బాగున్న దగ్గర నుండి కొంత భాగం తీసి బొల్లి మచ్చలు ఉన్న ప్రదేశంలో అమర్చడం, ఒక పొక్కు లేదా బొబ్బ వంటి దానిని సృష్టించడం ద్వారా మచ్చలు ఉన్న భాగాన్ని తిరిగి మాములు రంగు తీసుకుని రావడం మరియు శరీరంలో ఆరోగ్యకరమైన మెలనోసైట్లను తీసి మచ్చలు ఉన్న ప్రాంతంలో ఉంచడం ద్వారా తిరిగి శరీరం రంగు యాధస్థితికి తీసుకునిరావడం మొదలైనవి ఉంటాయి.
ముగింపు
మనదేశంలో ప్రతీ వంద మందిలో ఐదుగురు వ్యక్తులకు బొల్లి మచ్చలు ఉంటున్నాయి, దీని కారణంగా మానసికంగా కృంగిపోతున్నారు మరియు మనోవేదనకు గురవుతున్నారు. ఈ వ్యాధి ఉన్నవారు మానసికంగా ధైర్యంగా ఉండడం కూడా చాలా అవసరమని గుర్తు ఉంచుకోవాలి. బొల్లి మచ్చలు చికిత్స అందించడానికి అనుభవజ్ఞులైన యశోద వైద్య నిపుణలను సంప్రదించండి.
మీ ఆరోగ్య సంరక్షణ గురించి ఏవైనా సందేహాలు ఉన్నాయా? సహాయం చేయడానికి మేము సిద్దంగా ఉన్నాము! మా అనుభవంతులైన నిపుణుల సలహా కొరకు +918929967127 కి కాల్ చేయగలరు.