%1$s

యశోద హాస్పిటల్స్ 10వ వార్షిక ‘యంగ్ డాక్టర్స్ క్యాంప్’ విజయవంతం

“యంగ్ డాక్టర్స్ క్యాంప్” లో పాల్గొన్న “కాబోయే” రేపటి డాక్టర్లకు సర్టిఫికేట్లు అందజేసిన తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి 

హైదరాబాద్, 22 మే 2022: యశోదహాస్పిటల్స్  గ్రూప్ వరుసగా 10వ సారి వార్షిక ‘యంగ్ డాక్టర్స్ క్యాంప్’ ను విజయవంతంగా నిర్వహించింది. ఈ నెల 20వ తేదీ నుంచి 22 వరకు ఏర్పాటుచేసిన శిక్షణా కార్యక్రమం ఈ సారి కూడా పెద్ద ఎత్తున విద్యార్థులను ఆకర్షించింది. ఉత్సాహం ఉరకలు వేస్తున్న మూడు వందల మందికి పైగా బాలబాలికలు ఈ ప్రపంచంలోని వ్యాధిపీడితులు, బాధితులకు ఉపశమనం ఇచ్చే ఉదాత్తమైన వైద్య వృత్తిని ఎంచుకోదలచుకున్నామని ముక్తకంఠంతో  ప్రకటించారు. వీరంతా దేశంలోని వివిధ నగరాల నుంచి హైదరాబాదుకు వచ్చి యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ నిర్వహించిన మూడు రోజుల ‘యంగ్ డాక్టర్స్ క్యాంప్’లో పాల్గొన్న హైస్కూలు విద్యార్థులు. ఈ క్యాంప్ ను విజయవంతంగా పూర్తిచేసిన విద్యార్థులకు ఈ రోజున ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని కాబోయే రేపటి డాక్టర్లకు సర్టిఫికేట్ల ప్రధానం చేయడం జరిగింది.

ఈ సందర్బంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, “వైద్యవృత్తి పట్ల ఉన్న ఆసక్తితో, డాక్టర్ కావాలన్న సంకల్పంతో ఉన్న హైస్కూలు విద్యార్థులకు వైద్య వృత్తి విశిష్టతను, దానిలో సవాళ్లను, తెలియజేసే గొప్ప కార్యక్రమం ఇది.” వైద్యరంగం పట్ల విద్యార్ధి దశలోనే వారికి ఆసక్తిని కలిగించే ఇలాంటి కార్యక్రమాలను పూర్తి ఉచితంగా  నిర్వహిస్తున్న యశోద యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు మంత్రి తెలియజేసారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు, సంపన్న సుఖమయ జీవితాలకు తోడ్పడగల ఇతర వృత్తులు కాదనుకుని ఎన్నో సవాళ్లతో కూడిన వైద్యరంగంలో కృషిచేయటమే తమ లక్ష్యంగా నిశ్చయించుకున్న విద్యార్థులను చూస్తుంటే చాలా గర్వంగా ఉందని వారికి సర్టిఫికేట్లు ప్రధానం చేస్తూ తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.  

యశోద హాస్పిటల్స్ డైరెక్టర్ శ్రీ ధీరజ్ గోరుకంటి, మాట్లాడుతూ, “తెలుగురాష్ట్రాలలో అత్యాధునిక వైద్యచికిత్సా రంగానికి తలమానికమైన యశోద గ్రూపు హాస్పిటల్స్ ఉన్నతమైన ఆశయంతో వైద్యరంగం వైపు విద్యార్థులు ఆకర్షితులు కావాలన్న లక్ష్యంతో వేసవి రోజుల్లో నిర్వహించే ఈ ‘యంగ్ డాక్టర్స్ క్యాంప్’ కు రూపకల్పన చేసింది. తొమ్మిదో తరగతి పూర్తి చేసి పదోతరగతిలోకి ప్రవేశించనున్న బాల బాలికల కోసం పూర్తిగా ఉచితంగా నిర్వహించే ఈ క్యాంప్ ద్వారా వారికి వైద్యవృత్తిని గూర్చి ప్రత్యక్షంగా తెలియజెప్పేందుకు, ప్రేరణ కలిగించేందుకు కృషిచేస్తున్నది.” మూడు రోజుల ఈ ‘యంగ్ డాక్టర్స్ కాంప్’ ను  యశోద గ్రూప్ కు చెందిన సికిందరాబాద్, సోమాజిగూడ, మలక్ పేట్ లలోని మూడు హాస్పిటల్స్ లో ఏకకాలంలో నిర్వహించడం జరిగింది. ఎంపికయిన విద్యార్థులు మూడు బ్యాచ్ లుగా ఈ కాంపులలో పాల్గొన్నారు. వారిని ఆయా యశోద హాస్పిటల్స్ లోని అత్యాధునిక రోగనిర్ధారణ, శస్త్రచికిత్స, అవుట్ పేషంట్, ఇన్ పేషంట్, నర్సింగ్ విభాగాలకు తీసుకెళ్లి అక్కడి పరికరాలు – చికిత్సా విధానాలను తెలియజేశారు. వైద్యపరమైన ఎమర్జన్సీలను ఎదుర్కోవటం గూర్చి తెలియజెప్పారు.

విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనటమే కాకుండా వారి సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ క్యాంప్ లో వారిని వైద్యవిభాగాలకు తీసుకెళ్లటమే కాకుండా సీనియర్ సర్జన్లు, డాక్టర్ల ఉపన్యాసాలు, సర్జరీలకు సంబంధించిన వీడియో ప్రదర్శనలు, పత్యేక క్విజ్ లను ఏర్పాటుచేశామని, డాక్టర్లు కాదలచిన విద్యార్థుల కోసం ఉద్ధేశించిన వినూత్న శిక్షణా కార్యక్రమం అయిన ‘యంగ్ డాక్టర్స్ క్యాంప్’ ఈ సంవత్సరంతో పది సంవత్సరాలు పూర్తిచేసుకుంది. ఈ పదేళ్లలో మా యశోద హాస్పిటల్స్ యాంగ్ డాక్టర్స్ క్యాంప్ లో పాల్గొన్న 200 మందికి పైగా విద్యార్థులు దేశ-విదేశాల్లో వైద్యవృత్తి శిక్షణలోనూ, డాక్టర్లుగాను ఈ రోజు సేవలు అందించడం మాకు ఎంతో గర్వకారణం. దాదాపు 3 వేల మంది ఈసారి ‘యంగ్ డాక్టర్స్ క్యాంప్’ లో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర లకు చెందిన వీరి నుంచి 3 వందల మందిని ఈ క్యాంప్ కోసం ఎంపికచేశారు. తాజా వార్షిక పరీక్షలో వారు సాధించిన మార్కులతో పాటు వైద్యరంగం పట్ల వారి ఆసక్తిని పరీక్షించటం ద్వారా ఈ ఎంపిక జరిగింది. ‘యంగ్ డాక్టర్స్ క్యాంప్’ లో ప్రవేశాలు పూర్తిగా ఉచితం. అంతే కాకుండా దీనిలో పాల్గొన్నవిద్యార్దులకు  ‘యంగ్ డాక్టర్స్ కిట్’ ను అందజేసి ప్రోత్సహిస్తున్నామని యశోద హాస్పిటల్స్ డైరెక్టర్, డాక్టర్. పవన్ కుమార్ గోరుకంటి తెలిపారు.

Videos