మడమ నొప్పి : కారణాలు, పరీక్షలు, చికిత్స, జాగ్రత్తలు

మన పాదం యొక్క వెనక భాగాన్ని మడమ అంటాము, ఈ భాగంలో ఉండే ఎముక గుండ్రంగా ఉంటుంది, ఈ ఎముకను కాల్కేనియం అని అంటారు. మనం నిలబడినప్పుడు మన శరీర బరువు ఎక్కువగా మడమ మీదనే పడుతుంది. నడుస్తున్న సమయంలో కూడా మన బరువు దాదాపుగా మడమ మీద పడుతుంది. ఎక్కువసేపు నడిచినా, నిలబడినా మడమ నొప్పి కలగడం సాధారణమైన విషయమే, ఈ మడమ నొప్పిని మడమ శూల నొప్పి అని కూడా అంటారు. ఇలాంటి సందర్భాల్లో కొంతసేపు విశ్రాంతి తీసుకోవడం మరియు ఆ భాగంలో మసాజ్ చేయడం ద్వారా ఈ నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. అయితే మడమ నొప్పి దీర్ఘకాలికంగా వస్తుంటే దానికి సరైన కారణాలు తెలుసుకుని సరైన చికిత్స చేయడం అవసరం. మడమ నొప్పి ఎందుకు వస్తుంది? మడమ నొప్పికి ఎలాంటి చికిత్స చేస్తారు? నొప్పి రాకుండా ఎలా నివారించాలి అనే విషయాలను ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మడమ నొప్పి సమస్యకు గల కారణాలు
మడమ నొప్పి రావడానికి వివిధ కారణాలు ఉంటాయి, మడమ నొప్పి ఎందుకు వస్తుంది అని ఆలోచిస్తుంటారు. మడమ నొప్పి సమస్యకు గల కారణాల గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
- అచిలిస్ టెండింటిస్ : అచిలిస్ అనేది మడమలో ఉండే ఎముకలను అనుసంధానించే కండరం. మనం ఒక్కసారిగా ఎక్కువగా నడవడం లేదా క్రీడలు ఆడడం వలన కొన్ని సందర్భాలలో అచిలిస్ కండరాలు వాపుకు గురవుతాయి. ఈ పరిస్థితి వలన మడమ నొప్పి కలుగుతుంది. క్రీడాకారులలో ఎక్కువగా ఈ పరిస్థితి ఏర్పడుతుంది.
- ప్లాంటర్ ఫాసిటిస్ : మన పాదం యొక్క అడుగు భాగాన్ని ప్లాంటర్ ఫాసియా అని అంటారు, దీనిని ఒక లిగమెంట్ అని చెప్పవచ్చు. ఈ భాగంలో వాపు కలగడం వలన మడమ నొప్పి కలిగే అవకాశం ఉంది. కొంతమందిలో పాదం క్రింది భాగం చదునుగా ఉంటుంది, అలాంటి వారిలో ప్లాంటార్ ఫాసిటిస్ సమస్య కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
- మడమ బర్సిటిస్ (Heel Bursitis) : మన శరీరంలో అనేక ఎముకలు ఉంటాయి, ఇవి ఒకదానికి ఒకటి కండరాల ద్వారా అనుసంధానం అవుతాయి. మడమ భాగంలో కూడా ఇలాంటి నిర్మాణం ఉంటుంది. ఈ కండరాలకు మరియు ఎముకలకు మధ్య రాపిడి ఏర్పడకుండా ద్రవాన్ని ఉత్పత్తి చేసే తిత్తులు అక్కడ ఉంటాయి. వీటిలో వాపు ఏర్పడడం వలన కూడా మడమ నొప్పి కలుగుతుంది.
- సెవర్స్ వ్యాధి : మడమ ఎముక యొక్క పెరుగుదలలో వాపు రావడాన్ని సెవర్స్ వ్యాధిగా పరిగణిస్తారు. ఈ వ్యాధి పిల్లలలో వస్తుంది, క్రీడలు ఆడే వారిలో మరింత ఎక్కువగా వచ్చే ప్రమాద ఉంది. దీని వలన కూడా మడమ నొప్పి కలుగుతుంది.
- అధిక బరువు : మన శరీరపు బరువు ఎక్కువగా ఉండడం కూడా మడమనొప్పికి కారణం అవుతుంది. అధిక బరువు ఉండడం వలన మనం నిలబడినప్పుడు మరియు నడిచే సందర్భంలో బరువు అంతా మోకాళ్ళ మీద , మడమ మీద పడుతుంది. దాని వలన మడమ ఎముక కు ఒత్తిడి కలిగి నొప్పి వస్తుంది.
- ఎక్కువ సమయం నిలబడి పని చేయడం : రోజులో అధిక భాగం నిలబడి పని చేసేవారిలో కూడా మడమ నొప్పి వచ్చే ప్రమాదం ఉంటుంది.
- ఆర్థరైటిస్ : కీళ్ళవాతాన్ని మనం ఆర్థరైటిస్ అంటాం. ఆర్థరైటిస్ వలన ఎక్కువగా మోకాళ్లలో నొప్పి కలుగుతుంది, అయితే ఆర్థరైటిస్ వలన కేవలం మోకాళ్ళ నొప్పి మాత్రమే కాకుండా మడమ నొప్పి కూడా కలుగుతుంది.
- స్పోర్ట్స్ ఇంజ్యురీస్ : మడమ నొప్పి క్రీడాకారులలో ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది. క్రీడాకారులు ఎక్కువగా పరిగెత్తడం , దూకడం మొదలైనవి చేస్తారు కాబట్టి వారికి మడమ భాగం పైన ఒత్తిడి అధికంగా ఉంటుంది, అంతే కాకుండా ఆటలు ఆడే సందర్భంలో కలిగే స్పోర్ట్స్ ఇంజ్యురీస్ వలన కూడా మడమ నొప్పి కలుగుతుంది.
- చెప్పులు : చాలా మంది వివిధ కారణాల వలన ఎక్కువ ఎత్తు మరియు సన్నటి హీల్ కలిగిన చెప్పులు ధరిస్తారు. అయితే వీటి వలన పాదం మీద బరువు అసమానంగా ఉండడం వలన మడమ నొప్పి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది.
- గాయాలు : మడమ భాగంలో ఏదైనా గాయాలు తగలడం వలన కానీ, తగిలిన గాయాలు పూర్తిగా మానకపోవడం వలన కానీ మడమ నొప్పి కలుగుతుంది. గాయం పూర్తిగా మానకుండా నడవడం వలన మడమ మీద ఒత్తిడి పెరిగి నొప్పి తీవ్రమయ్యే ప్రమాదం ఉంది.
మడమ నొప్పి నిర్ధారణకు అవసరమైన పరీక్షలు
మనకు వివిధ కారణాల వలన మడమ నొప్పి కలుగుతుంది, అయితే సరైన కారణం తెలుసుకోవడం వలన మాత్రమే సరైన చికిత్స అందించడానికి వీలవుతుంది. మడమ నొప్పికి కారణాలు తెలుసుకోవడానికి కొన్ని పరీక్షలు అవసరం అవుతాయ, అవి ఇక్కడ తెలుసుకుందాం.
- ఎక్స్ – రే
- MRI
- అల్ట్రా సౌండ్
మడమ నొప్పి చికిత్స
మడమ నొప్పి ఎక్కువగా ఉండడం వలన మన జీవనశైలిలో అనేక మార్పులు కనిపించవచ్చు. మడమ నొప్పి వలన నడకలో ఇబ్బందులు కలుగుతాయి, దీనివలన రోజువారీ పనులు చేసుకోవడం కష్టతరం కావచ్చు, కాబట్టి మడమ నొప్పికి చికిత్స అవసరం. మడమ నొప్పికి చేయగల చికిత్సలను ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
- విశ్రాంతి : చాలా సందర్భాలలో విశ్రాంతి తీసుకోవడం వలన మడమ నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. మడమ మీద ఎక్కువ ఒత్తిడి కలగడం వలన వచ్చే నొప్పి విశ్రాంతి తీసుకోవడం వలన తగ్గుతుంది. అయితే నొప్పి తగ్గగానే వెంటనే లేచి నడవడం లాంటివి చేయకూడదు.
- ఐస్ ప్యాక్ : మడమ నొప్పికి ఐస్ ప్యాక్ తో మసాజ్ చేయడం మంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. నొప్పి ఉన్న భాగాన్ని క్రమంగా మసాజ్ చేస్తూ ఉండాలి, దీని వలన నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.
- ఫిజియోథెరపీ : మడమ నొప్పి తగ్గించడానికి ఫిజియోథెరపీ చాలా సహాయపడుతుంది. ఈ పద్దతిలో ఫిజియోథెరపీ నిపుణులు మడమ భాగంలో మసాజ్ చేయడం, నొప్పి తగ్గేలాగా కదలికలు చేపించండం మొదలైనవి చేస్తారు. వీటి ద్వారా మడమ భాగంలో నొప్పి తగ్గడమే కాకుండా మడమ ఎముకలు దృఢంగా మారుతాయి.
- కొన్ని రకాల మందులు : పేషేంట్ కు మడమ నొప్పి ఎక్కువగా ఉంటే ఆ నొప్పి తగ్గించడానికి కొన్ని రకాలైన పెయిన్ కిల్లర్స్ మందులను డాక్టర్ సూచించవచ్చు. మడమ దగ్గర ఎటువంటి ఫ్రాక్చర్ లేకపోతే ఈ మందుల ద్వారా నొప్పిని తగ్గించవచ్చు.
- సర్జరీ : మడమ లోపలి భాగంలోని ఎముక విరిగినా లేదా కండరాలలో ఏదైనా సమస్య ఉన్న సందర్భంలో పేషేంట్ కు సర్జరీ అవసరం అవుతుంది. మడమ నొప్పికి సర్జరీ చేయాల్సి రావడం అరుదైన సందర్భాలలో జరుగుతుంది. నొప్పి ఉన్నప్పుడు మొదట్లోనే సరైన చికిత్స తీసుకుంటే సర్జరీ పరిస్థితి రాకుండా నివారించవచ్చు.
మడమ నొప్పి నివారణ మరియు మడమ నొప్పి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మడమ నొప్పి వలన మన జీవితం సాధారణ స్థితిని కోల్పోతుంది అనడంలో సందేహం లేదు. ఇలాంటి పరిస్థితి ఏర్పడకుండా ఇక్కడ వివరించిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.
- సరైన చెప్పులు/ షూస్ వాడకం : మనం ప్రతీరోజు ఉపయోగించే చెప్పులు లేదా బూట్లు మన పాదాలకు సరిపోకపోతే వాటి వలన మడమ నొప్పి కలిగే అవకాశం ఉంది, కాబట్టి వాటిని ఎంచుకునే సమయంలో పాదాలకు ఒత్తిడి కలగకుండా చేసే వాటిని తీసుకోవాలి.
- గట్టి నేల మీద నడవకూడదు : చాలామంది నడక మంచి వ్యాయామం అనే ఉద్దేశంతో సరైన చెప్పులు లేదా బూట్లు లేకుండా గట్టి నేల మీద లేదా రోడ్డు మీద నడుస్తుంటారు. దీని వలన మడమ మరియు మోకాళ్ళ మీద తీవ్రమైన ఒత్తిడి కలిగే ప్రమాదం ఉంది. కాబట్టి గట్టి నేల మీద నడిచే అప్పుడు సరైన బూట్లు తప్పనిసరిగా ధరించడం అవసరం.
- పని మధ్యలో చిన్న విరామాలు : ఎక్కువ సమయం నిలబడి పనిచేసే వారు, మధ్య మధ్యలో చిన్న విరామాలు తీసుకుంటూ ఉండాలి. ప్రతీ రెండు గంటలకు ఒకసారి పది నిమిషాలపాటు విరామం తీసుకుంటూ ఉండడం వలన మడమ నొప్పి రాకుండా నివారించవచ్చు.
- శారీరక బరువు నిర్వహణ : అధిక బరువు ఉండడం వలన నడిచే సమయంలో మరియు నిలబడి పని చేసే సమయంలో ఆ ఒత్తిడి మడమ పైన ఉంటుంది. బరువు సరిగా ఉంటే మడమ మీద ఒత్తిడి తగ్గించవచ్చు, తద్వారా నొప్పి రాకుండా నివారించవచ్చు.
ముగింపు
మడమ నొప్పి అనేది తక్కువ తీవ్రత కలిగినప్పుడు సాధారణ విషయమే అయినా కూడా నొప్పి ఎక్కువరోజులు ఉంటే తప్పకుండా వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. మడమ నొప్పి తీవ్రత ఎక్కువగా ఉన్నా కూడా వెంటనే వైద్యులను సంప్రదించడం ద్వారా శస్త్రచికిత్స చేయాల్సిన పరిస్థితిని నివారించవచ్చు.
మీ ఆరోగ్య సంరక్షణ గురించి ఏవైనా సందేహాలు ఉన్నాయా? సహాయం చేయడానికి మేము సిద్దంగా ఉన్నాము! మా అనుభవంతులైన నిపుణుల సలహా కొరకు +918065906165 కి కాల్ చేయగలరు.
FAQ’s
మడమ వాపు వలన కలిగే నొప్పి దేనికి సంకేతం?
సాధారణంగా అరికాలు ఫాసిటిస్ వలన మడమ వాపు ఎక్కువగా కలిగే అవకాశం ఉంది.
మడమ నొప్పికి కేవలం ఐస్ ప్యాక్ మసాజ్ సరిపోతుందా?
మడమ నొప్పి తీవ్రతను బట్టి చికిత్స అవసరం అవుతుంది, కొన్ని సందర్భాలలో ఐస్ ప్యాక్ తో నొప్పి తగ్గవచ్చు. మరికొన్ని సందర్భాలలో మందులు అవసరం అవ్వవచ్చు.
మడమ నొప్పి ఎందుకు వస్తుంది?
మడమ నొప్పి రావడానికి అనేక కారణాలు ఉన్నాయి, ఎక్కువసేపు నిలబడడం, అరికాలు ఫాసిటిస్, సరైన షూస్ ధరించకపోవడం తో పాటుగా ఇతర కారణాలను ఈ బ్లాగ్ లో వివరంగా తెలుసుకోవచ్చు.
మడమ నొప్పి తగ్గాలంటే ఏం చేయాలి?
మడమ నొప్పి తగ్గడానికి కొన్ని ఇంటి చిట్కాలతో పాటుగా కొన్ని చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. పేషేంట్ యొక్క నొప్పి తీవ్రతను బట్టి ఈ చికిత్సను డాక్టర్ సూచిస్తారు.


















Appointment
WhatsApp
Call
More