టెన్నిస్ ఎల్బో అంటే ఏమిటి? కారణాలు, లక్షణాలు, చికిత్స, నివారణ

మన శరీరంలో మోచేతి బయటవైపు భాగంలో కలిగే నొప్పిని టెన్నిస్ ఎల్బో అంటారు. పని చేసే సమయంలో చేతిని ఒకే రకమైన కదలికకు ఎక్కువసార్లు గురిచేయడం వలన ఏర్పడిన గాయంగా వివరించవచ్చు. చేతిని మరియు మణికట్టును ఎక్కువగా ఉపయోగించడం వలన ఈ పరిస్థితి ఏర్పడుతుంది. టెన్నిస్ ఆటలో బాల్ కొట్టడానికి రాకెట్ ను ఒకే దిశలో అత్యధిక సార్లు కదిలించాల్సి ఉంటుంది, ఈ పనికి మోచేతి కండరాలు ఒకే దిశలో ఎక్కువసార్లు కదలాల్సి ఉంటుంది, అందువలన మోచేతి దగ్గర నొప్పి ఏర్పడుతుంది ఈ కారణంగానే దీనిని టెన్నిస్ ఎల్బో అంటారు. వైద్య పరిభాషలో పార్శ్వ ఎపికొండైలిటిస్ లేదా లాటరల్ ఎపికొండైలిటిస్ అని అంటారు. టెన్నిస్ క్రీడ ఆడేవారికి మాత్రమే ఈ నొప్పి కలుగుతుందంటే పొరపాటే, టెన్నిస్ ఎల్బో సమస్య అందరిలోనూ కలిగే అవకాశం ఉంది, ముఖ్యంగా తాపీ పనివాళ్ళు, వండ్రంగి పని వాళ్ళు, మాంసం కొట్టేవారిలో మరియు క్రీడాకారులలో ఈ సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. టెన్నిస్ ఎల్బో సాధారణంగా 30 నుండి 50 సంవత్సరాలు వయసు కలిగిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంది.
టెన్నిస్ ఎల్బో రావడానికి గల కారణాలు
టెన్నిస్ ఎల్బో ఏర్పడడానికి మోచేతి కండరాలను ఎక్కువగా ఉపయోగించడం ప్రధాన కారణంగా కనిపిస్తుంది. ఈ క్రింది కారణాల వలన టెన్నిస్ ఎల్బో ఏర్పడే ప్రమాదం ఉంది.
పెయింటింగ్ : చేతితో బ్రష్ పట్టుకుని ఎక్కువసేపు పెయింటింగ్ వేయడానికి అనేకసార్లు మోచేతిని కదిలించాల్సి వస్తుంది, దీని కారణంగా టెన్నిస్ ఎల్బో వచ్చే ప్రమాదం ఉంది.
తాపీ పని మరియు ప్లంబింగ్ : ఇంటి నిర్మాణంలో తాపీ పని చేసేవారు రోజంతా పనిచేయాల్సి ఉంటుంది, ఇందులో ఎక్కువ భాగం మోచేతి కదలికలు ఉండడం వలన వారికి టెన్నిస్ ఎల్బో వచ్చే ప్రమాదం ఉంది. ప్లంబింగ్ పని చేసే వారిలో కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది.
కంప్యూటర్ మౌస్ వాడడం : రోజంతా కంప్యూటర్ పై పనిచేసే వారు మౌస్ ను వాడడం వలన వారి మోచేతిపై భారం పడుతుంది. దీని వలన కూడా టెన్నిస్ ఎల్బో సమస్య వచ్చే అవకాశం ఉంది.
మోచేతి గాయం : మోచేతికి ఏదైనా గాయం కావడం వలన కూడా టెన్నిస్ ఎల్బో వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మోచేతికి పైన తగిలిన గాయం నయమైనా కూడా టెన్నిస్ ఎల్బో సమస్య అలాగే ఉండవచ్చు.
రాకెట్ క్రీడలు : టెన్నిస్, బ్యాడ్మింటన్ మొదలైన రాకెట్ క్రీడలు ఆడే క్రీడాకారులలో మోచేతి కండరాలు ఎక్కువగా ఒత్తిడికి గురవ్వడం వలన టెన్నిస్ ఎల్బో సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.
టెన్నిస్ ఎల్బో లక్షణాలు ఎలా ఉంటాయి?
టెన్నిస్ ఎల్బో ఉన్నవారికి మోచేతి దగ్గర నొప్పి ఎక్కువగా ఉంటుంది. టెన్నిస్ ఎల్బో సమస్య ఉన్నప్పుడు చిన్న చేతి కదలికలు కూడా చాలా నొప్పిని కలిగిస్తాయి. ఏదైనా వస్తువును పట్టుకున్నప్పుడు, తాళం చెవి లేదా డోర్ నాబ్ మొదలైన వాటిని తిప్పినప్పుడు కరచాలనం చేస్తున్నప్పుడు మోచేతి చుట్టూ తీవ్రమైన నొప్పి కలుగుతుంది. మణికట్టు కదిలినా కూడా నొప్పి కలుగుతుంది. మోచేతి నుండి మణికట్టు వరకూ వాపు ఎక్కువగా ఉంటుంది.
టెన్నిస్ ఎల్బో చికిత్స విధానం
పేషేంట్ యొక్క నొప్పి తీవ్రతను బట్టి టెన్నిస్ ఎల్బో చికిత్స చేయాల్సి ఉంటుంది, సాధారణంగా టెన్నిస్ ఎల్బో సమస్య మందులతో లేదా ఫిజియోథెరపీ చికిత్సతో నయమవుతుంది. అరుదైన పరిస్థితుల్లో శస్త్రచికిత్స అవసరమవుతుంది. చాలా పరిస్థితుల్లో నొప్పిగా ఉన్న చేతిని కదిలించకుండా విశ్రాంతి తీసుకుంటూ ఉండడం వలన కూడా టెన్నిస్ ఎల్బో నయమవుతుంది. అలా కాకుంటే డాక్టర్ కొన్ని మందులను సూచించవచ్చు. టెన్నిస్ ఎల్బో నయం చేయడానికి అనుసరించే చికిత్సను ఇక్కడ తెలుసుకోండి.
ఐసింగ్ : టెన్నిస్ ఎల్బో చికిత్సలో ఐస్ ను ఉపయోగించి నొప్పి తగ్గిస్తారు, ప్రతీ 3 నుండి 4 గంటలకు ఒకసారి 15 నిమిషాల పాటు ఐస్ తో నొప్పి ఉన్న ప్రాంతంలో మర్దన చేయడం వలన టెన్నిస్ ఎల్బో నయం అవుతుంది.
ఫిజియోథెరపీ : అనుభవజ్ఞులైన ఫిజియోథెరఫిస్ట్ టెన్నిస్ ఎల్బోను పరిశీలించిన తర్వాత దానికి అనుగుణంగా చేయవలసిన వ్యాయామాన్ని సూచిస్తారు. ఈ చికిత్స ద్వారా టెన్నిస్ ఎల్బో నొప్పి తగ్గించవచ్చు.
కౌంటర్ ఫోర్స్ బ్రేస్ ధరించడం : చేతికి ధరించడం కోసం ప్రత్యేకంగా రూపొందించిన బ్యాండ్ ను వాడటం వలన టెన్నిస్ ఎల్బో నొప్పిని తగ్గించవచ్చు.
మందులు : టెన్నిస్ ఎల్బో వలన కలిగిన నొప్పి మరియు వాపును తగ్గించడానికి ఆస్ప్రిన్, నాప్రోక్సెన్ మొదలైన మందులను డాక్టర్ సూచించవచ్చు. క్రమం తప్పకుండా ఈ మందులను వాడటం వలన టెన్నిస్ ఎల్బో నుండి ఉపశమనం పొందవచ్చు.
PRP థెరపీ : PRP అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, ఈ విధానంలో పేషేంట్ రక్తంలో నుండి ప్లేట్లెట్లను వేరు చేసి వాటిని మోచేతి దగ్గర స్నాయువుకి ఇంజెక్ట్ చేస్తారు. టెన్నిస్ ఎల్బో త్వరగా నయం అవ్వడానికి ఈ ప్లేట్లెట్లు సహాయపడతాయి.
ఆపరేషన్ : టెన్నిస్ ఎల్బో కారణంగా వచ్చిన నొప్పి మరియు వాపు చికిత్స ప్రారంభించిన రెండు నెలల తర్వాత కూడా వస్తుంటే పేషేంట్ మోచేతికి శస్త్రచికిత్స చేయవలసి ఉంటుంది. ఐతే ఓపెన్ సర్జరీ అవసరమవుతుందా లేక ఆర్ద్రోస్కోపిక్ సర్జరీ చేయాల్సి ఉంటుందా అని డాక్టర్ సూచిస్తారు.
టెన్నిస్ ఎల్బోను ఎలా నివారించాలి?
మనం పని చేసే సందర్భంలో కొన్ని జాగ్రత్తలను పాటించడం వలన టెన్నిస్ ఎల్బో రాకుండా నివారించవచ్చు.
- ఒకేదిశలో చేతిని ఎక్కువసార్లు ఉపయోగించాల్సి వస్తే మధ్యలో విశ్రాంతి తీసుకోవాలి.
- మణికట్టును వంచి పని చేయకుండా నిటారుగా ఉంచి పని చేయండి.
- మీరు క్రీడాకారులైతే వ్యాయామం చేసే సమయానికి లేదా ఆటలు ఆడే సమయానికి ముందు స్ట్రెచింగ్ మరియు వార్మ్-అప్ చేయండి. నేరుగా వ్యాయామం లేదా ఆటలోకి వెళ్ళవద్దు.
మీ ఆరోగ్య సంరక్షణ గురించి ఏవైనా సందేహాలు ఉన్నాయా? సహాయం చేయడానికి మేము సిద్దంగా ఉన్నాము! మా అనుభవంతులైన నిపుణుల సలహా కొరకు +918929967127 కి కాల్ చేయగలరు.
About Author –
Dr. Manish Kumar Jain, Consultant Wrist, Hand & Reconstructive Microsurgeon