డీహైడ్రేషన్‌ (నిర్జలీకరణం): లక్షణాలు, కారణాలు, చికిత్సలు & నివారణ

డీహైడ్రేషన్‌ (నిర్జలీకరణం): లక్షణాలు, కారణాలు, చికిత్సలు & నివారణ

ప్రతి జీవికి పీల్చేగాలి తర్వాత అత్యంతగా అవసరమైంది నీరే. మనిషి ఏమీ తినకుండా బతుకగలడు ఏమో కానీ, వేళకు నీళ్లు తాగకుండా తన మనుగడ సాధించలేడు. మన శరీరంలో అన్ని విధులు సక్రమంగా జరగాలంటే నీరు చాలా అవసరం. మానవ శరీరం దాదాపు 60% నీటితో రూపొందించబడింది. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంతో పాటు పోషకాలను రవాణా చేయడం, వ్యర్థ పదార్థాలను తొలగించడం వంటి వివిధ శరీర విధులకు నీరు అవసరం. ముఖ్యంగా వేసవి దగ్గరపడుతున్న కొద్దీ, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు డీహైడ్రేషన్‌ కు దారితీస్తాయి. శరీరానికి అవసరమైన నీరు అందకపోవడం వల్ల డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. వేసవి కాలంలో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరూ ఈ డీహైడ్రేషన్ సమస్య బారిన పడుతుంటారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.

డీహైడ్రేషన్ అనేది చిన్న సమస్య కాదు, ఇది మీలోని శక్తి పూర్తిగా హరించి వేస్తుంది, అంతే కాకుండా మిమ్మల్ని బలహీనంగా మార్చి మంచానికే పరిమితం అయ్యేలా చేస్తుంది. దీర్ఘకాలంగా కొనసాగే డీహైడ్రేషన్ మూత్రపిండాల పనితీరును సైతం ప్రభావితం చేస్తుంది, కిడ్నీలలో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతుంది. బయట పనిచేసే వ్యక్తులు అంటే వెల్డర్లు, భవన నిర్మాణ కార్మికులు, మెకానిక్స్, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వాళ్ళు, క్రీడాకారుల విషయంలో రన్నర్లు, సైక్లిస్టులు, సాకర్ ప్లేయర్స్ ,శిశువులు, చిన్న పిల్లలు, ఎత్తైన ప్రదేశాలలో నివసించే వాళ్ళశరీరంలో ఎక్కువగా నీటిశాతం తగ్గే ప్రమాదం ఉంది.

డీహైడ్రేషన్ ఎప్పుడు వస్తుంది?

ఈ క్రింది వాటి వల్ల డీహైడ్రేషన్ సమస్యకు గురయ్యే అవకాశం ఉంటుంది.

  • రోజంతా శరీరానికి తగినంత నీరు తీసుకోకపోవడం
  • అధిక ఉష్ణోగ్రతల ప్రభావంతో కూడా ఈ సమస్య ఏర్పడుతుంది.
  • ఎండలో ఎక్కువసేపు ఉండడం వల్ల వడదెబ్బతో పాటు డీహైడ్రేషన్ వచ్చే అవకాశం ఉంటుంది.
  • అధిక వేడి సమయాల్లో మద్యం, కాఫీ వంటి వాటిని తాగడం
  • డయేరియా లేదా ఇతర అనారోగ్య కారణాల వల్ల శరీరంలోని నీరు కోల్పోతే డీహైడ్రేషన్ వస్తుంది.
  • ఎండాకాలంలో కారం, మసాలా, నూనె పదార్థాలతో చేసిన ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం
  • అధిక మద్యపానం, కెఫిన్ అధికంగా ఉండే పానీయాలు సేవించడం వల్ల నీటి శాతం తగ్గుతుంది.
  • చెమట అధికంగా పట్టినప్పుడు లేదా కఠినమైన వ్యాయామం చేసిన తర్వాత డీహైడ్రేషన్ వచ్చే అవకాశం ఉంటుంది.
  • మూత్రవిసర్జనకు ఉపయోగించే కొన్ని రకాల మందులు కూడా ఈ సమస్యకు దారితీస్తాయి

 

డీహైడ్రేషన్ ను గుర్తించే సంకేతాలు మరియు లక్షణాలుDehydration Symptoms Causes_Body 1

  • దాహం: డీహైడ్రేషన్ యొక్క అత్యంత సాధారణ లక్షణం తీవ్రమైన దాహం. అతిగా దాహం వేస్తుంటే మీ శరీరానికి కావాల్సిన నీరు సరిపోవడం లేదని అర్థం.
  • పెదవులు పగలడం: డీహైడ్రేషన్ సమస్యకు మొదటి సంకేతం పెదవులు పగలడం. పెదవులు పొడిగా, బిగుతుగా మారి పగుళ్లు ఏర్పడతాయి. ఎర్రగా, చికాకుగా కనిపిస్తాయి.
  •  ముదురు మూత్రం: ముదురు పసుపు లేదా కాషాయం రంగులో మూత్రం వస్తున్నట్లయితే అది మీ శరీరం డీహైడ్రేషన్ కు గురైందని చెప్పడానికి సంకేతం.
  • అలసట: డీహైడ్రేషన్ అలసట, బలహీనతను కలిగిస్తుంది. మీరు అలసిపోయినట్లు, నీరసంగా ఉంటారు.
  • తలనొప్పి: శరీరంలో నీటి పరిమాణం తగ్గడం వల్ల మనకు తలనొప్పి, మైగ్రేన్‌ వంటి వస్తాయి.
  • మైకము: డీహైడ్రేషన్ వల్ల కళ్లు తిరగడం మరియు తలతిరగడం వంటివి జరుగుతాయి.
  • నోరు పొడిబారడం: డీహైడ్రేషన్ వల్ల నోరు పొడిబారడంతోపాటు నోటిలో జిగటగా అనిపిస్తుంది.
  • చర్మ సమస్యలు: శరీరానికి తగినంత నీరు అందనప్పుడు చర్మం బిగుతుగా, పేలవంగా అనిపించడమే కాక ముఖం కాంతిని సైతం కోల్పోతుంది, అంతే కాకుండా, చర్మం పొడి బారిపోయి పొరలు పొరలుగా కనిపిస్తుంది.
  • గాయాలు మానకపోవడం: చర్మంపై గాయాలు త్వరగా మానడం లేదంటే డీహైడ్రేషన్ సమస్య బారిన పడ్డారని అర్థం. రోగనిరోధక వ్యవస్థ బలహాన పడి చర్మంపై కోతలు, గాయాల నుంచి కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది.
  • ఎసిడిటీ: శరీరంలో డీహైడ్రేషన్ కు గురైతే కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాల శోషణ జరగదు. ఫలితంగా యాసిడ్ రిఫ్లక్స్ పెరగడం ప్రారంభమవుతుంది. ఇది కాకుండా మీ కడుపు pH దెబ్బతిని.. కడుపుకు సంబంధించిన అనేక సమస్యలను కలిగిస్తుంది.
  • ప్రేగులకు మలం అంటుకోవడం: శరీరంలో నీరు తక్కువైనపుడు పేగుల్లో మలం గట్టిగా మారుతుంది.
  • ఉబ్బరం, వికారం: శరీరంలో డీహైడ్రేషన్ కు గురైన్నట్లు అయితే ఆహారం సరిగ్గా జీర్ణం కాక ఉబ్బరం, వికారం తలెత్తుతాయి. ఇది అపానవాయువు, ఉబ్బరానికి దారితీస్తుంది.

 

డీహైడ్రేషన్ నివారణ చర్యలు

డీహైడ్రేషన్ నివారించడానికి మనం రోజు తగి మోతాదులో నీరు తాగుతున్నామో లేదో తెలుసుకోవాలి

  • క్రమం తప్పకుండా నీరు త్రాగాలి: డీహైడ్రేషన్‌ నుంచి ఉపశమనం పొందడానికి మంచి నీటిని మించిన ఔషధం లేదు. దాహం వేసినా, వేయకపోయినా వేసవిలో వీలైనంత ఎక్కువగా మంచినీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి.
  • వాటర్ రిచ్ ఫుడ్స్ తినడం: తోటకూర, పాలకూర లాంటి ఆకు కూరల్లో నీటి శాతం అధికంగా ఉండటమే కాకుండా ఆరోగ్యంగా కూడా చాలా పోషకాలను శరీరానికి అందిస్తాయి. క్యారెట్‌, కీర దోస, బీట్ రూట్‌ లాంటి సలాడ్స్‌తో కూడా డీహైడ్రేషన్‌కు చెక్‌ పెట్టవచ్చు.
  • చక్కెర, కెఫిన్ కలిగిన పానీయాలను నివారించండి: చక్కెర, కెఫిన్ కలిగిన పానీయాలు నిర్జలీకరణానికి కారణమవుతాయి, కాబట్టి వాటిని నివారించడం లేదా మితంగా తీసుకోవడం మంచిది.
  • మూత్రం రంగుపై శ్రద్ధ వహించడం: మీ మూత్రం యొక్క రంగు ముదురు పసుపు లేదా కాషాయం రంగులో ఉన్నట్లయితే, మీరు ఎక్కువ నీరు త్రాగాలి అనే సంకేతం.
  • వ్యాయామానికి ముందు, తరువాత నీరు త్రాగడం: నిర్జలీకరణాన్ని నివారించడానికి వ్యాయామానికి ముందు, సమయంలో, తర్వాత నీరు త్రాగడం ముఖ్యం.
  • వాటర్ బాటిల్ వెంట తీసుకెళ్లడం: మీరు ఎక్కడికి వెళ్లినా వాటర్ బాటిల్‌ని మీతో తీసుకెళ్లడం వల్ల రోజంతా హైడ్రేటెడ్‌గా ఉండేందుకు సహాయపడుతుంది.
  • పెదవులను తేమగా ఉంచుకోవడానికి షియా బటర్ లేదా కొబ్బరి నూనె వంటి హైడ్రేటింగ్ పదార్థాలను పెదవులకు రాసుకోవాలి.
  • డీహైడ్రేషన్ కారణంగా వచ్చే చర్మ సమస్యల నయం చేయడానికి గోరువెచ్చటి నీటితో స్నానం చేయడం మంచిది.
  • UV రేడియేషన్ నుంచి చర్మాన్ని రక్షించుకునేందుకు సన్ స్క్రీన్ ఉపయోగించడం మర్చిపోవద్దు.
  • ఆల్కహాల్ అధికంగా సేవించడం వల్ల శారీరకంగా, మానసికంగా ఎన్నో సమస్యలు తలెత్తడమే కాక శరీరం త్వరగా డీహైడ్రేషన్‌కు గురవుతుంది.
  • అతిసార లక్షణాలుంటే వెంటనే ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్ సేవించడం
  • సాధ్యమైనంతవరకు ఫ్రిజ్‌ వాటర్‌కు దూరంగా ఉండాలి. (ఫ్రిజ్‌ నీటి వల్ల శరీర ఉష్ణోగ్రత పెరగడంతో పాటు గొంతునొప్పి, జలుబు, దగ్గు వంటి అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి)
  • ఎండాకాలంలో కారం, మసాలా, నూనె పదార్థాలను పూర్తిగా తగ్గించుకోవాలి

 

డీహైడ్రేషన్‌ చికిత్స విధానాలు

నీరు మరియు ఎలక్ట్రోలైట్ల సహాయంతో ద్రవ నష్టాన్ని భర్తీ చేయడం నిర్జలీకరణానికి ఉత్తమమైన చికిత్స. చికిత్స యొక్క విధానం వ్యక్తి నుండి వ్యక్తికి భిన్నంగా ఉండవచ్చు మరియు వయస్సు మరియు తీవ్రతతో కూడా మారవచ్చు.

ఒక వ్యక్తి డీ హైడ్రేషన్‌కు గురైనప్పుడు వెంటనే ఓఆర్ఎస్ అంటే ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ ఇస్తారు. తద్వారా సదరు వ్యక్తి శరీరంలో నీటిశాతం పెరుగుతుంది. ఓఆర్ఎస్ ద్రావణం ఇవ్వడం ద్వారా ఆయా వ్యక్తులను డీహైడ్రేషన్ సమస్య నుంచి కాపాడొచ్చు. ముఖ్యంగా శరీరంలో నీటికొరతను అధిగమించేందుకు ఓఆర్ఎస్ ఔషధంలా పని చేస్తుంది.

  • కొబ్బరి నీరు : వడదెబ్బ (హీట్ స్ట్రోక్), డయేరియా మరియు వాంతులు వంటి సందర్భాల్లో శరీరంలో కోల్పోయిన ద్రవం మరియు ఎలక్ట్రోలైట్లను తిరిగి పొందడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది.
  • శరీరానికి తేమను అద్దడం(కోల్డ్ స్పాంజింగ్): వడదెబ్బ (హీట్‌స్ట్రోక్‌)తో బాధపడేవారిలో శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి, మొత్తం శరీరం అంతటా తరచూ చల్లటి నీటిని స్పాంజింగ్ (స్పాంజితో తడి అద్దటం) చేయడం సహాయపడుతుంది.
  • విశ్రాంతి: భారీ వ్యాయామం కారణంగా నిర్జలీకరణం (డీహైడ్రేషన్) సంభవించిన పక్షంలో, శరీరం యొక్క ద్రవం మరియు ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుకోవడంతో పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవడం చికిత్సలో ముఖ్యమైన భాగమే.
  • జ్వరనిరోధక మందులు (Antipyretic drugs): వడదెబ్బ (హీట్‌స్ట్రోక్) సందర్భాల్లో, శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది, ఇది పారాసెటమాల్ వంటి జ్వరనిరోధక (యాంటిపైరేటిక్) మందులను తీసుకోవడం ద్వారా నియంత్రించబడుతుంది. 
  • విషక్రిమినాశకాలు-యాంటిబయాటిక్స్ (Antibiotics) : అంటువ్యాధుల వల్ల నిర్జలీకరణం సంభవించిన సందర్భాల్లో, రీహైడ్రేషన్ థెరపీతో పాటు క్రిమినాశక (యాంటీబయాటిక్) చికిత్స అవసరం అవుతుంది.

అతిసారం, వాంతులు మరియు కారణంగా డీహైడ్రేషన్‌తో బాధపడుతున్న శిశువులు మరియు పిల్లల విషయంలో జ్వరం, వారికి నిర్దిష్ట భాగాలలో నీరు మరియు ఉప్పు ఉండే ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ ఇవ్వవచ్చు. ఈ పరిష్కారం వారి శరీరంలోని ద్రవాలు మరియు ఎలక్ట్రోలైట్లను తిరిగి నింపుతుంది.

పెద్దల విషయంలో కూడా ద్రవ మరియు ద్రవ వినియోగంలో పెరుగుదల ఉండాలి, కానీ నీటి ఆధారిత ద్రవాలను మాత్రమే తీసుకోవాలి. అయితే శీతల పానీయాలు మరియు పండ్ల రసాలు తీసుకోవడం అంత ప్రభావవంతంగా ఉండకపోవచ్చు.

మీరు చాలా చురుకుగా మరియు వేడి మరియు తేమతో కూడిన వాతావరణంలో ఆరుబయట వ్యాయామం చేస్తే, మీరు తగినంత ద్రవపదార్థాలను తీసుకోవాలి. దీంతో ఎలక్ట్రోలైట్స్ మరియు గ్లూకోజ్ సొల్యూషన్స్ కూడా మిమ్మల్ని యాక్టివ్ గా మరియు హైడ్రేట్ గా ఉంచడానికి సహాయపడతాయి.

తీవ్రమైన డీహైడ్రేషన్ బారిన పడిన వారికి వైద్య నిపుణులు మాత్రమే చికిత్స చేయగలరు. వారు ఇంట్రావీనస్ (IV) ద్రవాలను (ఉదా: RL, NS మొదలైనవి) అందించమని సిఫారసు చేయవచ్చు, ఇవి మీకు అవసరమైన ద్రవాలను అందిస్తాయి మరియు త్వరగా మరియు ప్రభావవంతంగా కోలుకునేలా చేస్తాయి.

మీ ఆరోగ్య సంరక్షణ గురించి ఏవైనా సందేహాలు ఉన్నాయా? సహాయం చేయడానికి మేము సిద్దంగా ఉన్నాము! మా అనుభవంతులైన నిపుణుల సలహా కొరకు +918929967127 కి కాల్ చేయగలరు.

About Author –

Dr. Sashidhar Reddy Gutha,Consultant General Physician and Diabetologist, Yashoda Hospitals – Hyderabad
MBBS, MD (Internal Medicine), CCEBDM (Fellowship in Diabetology)

About Author

Dr. Sashidhar Reddy Gutha | yashoda hospitals

Dr. Sashidhar Reddy Gutha

MBBS, MD (Internal Medicine), CCEBDM (Fellowship in Diabetology)

Consultant General Physician and Diabetologist