హార్మోన్ల అసమతుల్యత : కారణాలు, లక్షణాలు, సమస్యలు, నిర్ధారణ, చికిత్స మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హార్మోన్లు అంటే ఏమిటి?
మన శరీరంలో ఎండోక్రైన్ అనే ఒక వ్యవస్థ ఉంటుంది, వీటిని తెలుగులో వినాళ గ్రంథులు అని అంటాం. ఇవి హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. ఒకొక్క గ్రంథి ఒకొక్క రకమైన హార్మోన్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇలా ఉత్పత్తి అయిన హార్మోన్లు శరీరంలో జీవక్రియ, సంతానోత్పత్తి, మానసిక ఆరోగ్యం మొదలైన పనులను నిర్వహించడం మరియు నియంత్రించడం చేస్తాయి. సాధారణంగా మనలో కలిగే మూడ్ స్వింగ్స్ కూడా హార్మోన్ల కారణంగానే వస్తాయి. పునరుత్పత్తి హార్మోన్లు, పురుషులు మరియు స్త్రీలలో వేరుగా ఉంటాయి. మిగతా హార్మోన్లు ఇరువురిలోనూ ఒకే విధంగా ఉంటాయి. ఈ హార్మోన్లు రక్తం ద్వారా ప్రయాణిస్తూ నిర్దిష్టమైన అవయవాలకు సంకేతాలు ఇవ్వడం ద్వారా ఆ అవయవాలను ప్రేరేపిస్తాయి.
హార్మోన్ల అసమతుల్యత అంటే ఏంటి?
పైన చెప్పిన విధంగా ఉత్పత్తి అయిన హార్మోన్లు మన శరీరంలో వివిధ పనులను నియంత్రిస్తూ ఉంటాయి. అయితే కొన్నిసార్లు శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ హార్మోన్లు ఉత్పత్తి అవ్వవచ్చు. మరికొన్ని సందర్భాలలో శరీరానికి కావాల్సిన దానికంటే తక్కువ హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. మరికొన్ని సందర్భాలలో హార్మోన్లు సాధారణ స్థాయిలో ఉత్పత్తి అయినా వాటిని శరీరం ఉపయోగించుకోలేక పోవడం జరుగుతుంది. ఇలా శరీరంలో ఏర్పడే హార్మోన్ల హెచ్చు తగ్గులను హార్మోన్ల అసమతుల్యతగా చెప్పవచ్చు.
హార్మోన్ల అసమతుల్యతకు గల కారణాలు
శరీరంలో హార్మోన్ల అసమతుల్యతకు వయసు, కొన్ని రకాల అనారోగ్యాలు, ఆటో ఇమ్యూన్ వ్యాధులు ఇలా అనేకం ఉండవచ్చు. హార్మోన్ల అసమతుల్యతకు గల కారణాలను ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
వయసు : మన శరీరంలో ఉత్పత్తి అయ్యే హార్మోన్లు వయసుతో పాటుగా మారుతూ ఉంటాయి. పురుషులలో వయసు పెరిగే కొద్దీ టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయులు తగ్గుతాయి. మహిళల్లో వయసు పెరిగే కొద్దీ ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ స్థాయులు తగ్గుతూ ఉంటాయి.
ఆహారపు అలవాట్లు : మన శరీరంలో హార్మోన్లు ఉత్పత్తి అవ్వడానికి పోషకాహారం చాలా ముఖ్యమైనది. అయితే పోషకాహార లోపం వలన మరియు జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, ప్రాసెస్ చేసిన ఆహారం ఎక్కువగా తీసుకోవడం వలన హార్మోన్ల ఉత్పత్తి మీద ప్రభావం పడుతుంది. ఈ విధంగా ఆహారం సరిగా తీసుకోకపోవడం హార్మోన్ల అసమతుల్యతకు కారణం అవుతుంది.
శారీరక శ్రమ లేదా వ్యాయామం లేకపోవడం: ప్రస్తుతం చాలామంది డెస్క్ జాబ్స్ చేస్తూ ఉండడంతో రోజంతా కూర్చుని పని చేయాల్సిన పరిస్థితి ఉంది. దీనితో పాటుగా కనీస వ్యాయామం చేయకపోవడం వలన హార్మోన్లు ఉత్పత్తి తగ్గుతూ ఉంటుంది. దీని వలన మన శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది.
తగినంత నిద్ర లేకపోవడం : మన ఆరోగ్యం బావుండాలి అంటే ప్రతీరోజూ ఆరు నుండి ఎనిమిది గంటల పాటు నిద్ర అవసరం అవుతుంది. అయితే నిద్రలేమి సమస్య ఎదుర్కొంటున్న వారిలో హార్మోన్ల ఉత్పత్తి ఘననీయంగా తగ్గిపోతుంది. ఈ విధంగా హార్మోన్ల అసమతుల్యత ఏర్పడడం వలన జీర్ణక్రియ మందగించడంతో సహా అనేక సమస్యలు ఏర్పడతాయి.
పౌష్టికాహార లోపం : ఏ వయసులో వారికి అయినా ఆహారంలో సరైన పోషకాలు లభించకపోవడం వలన హార్మోన్ల ఉత్పత్తి తక్కువగా ఉంటుంది.
ఎండోక్రైన్ రుగ్మతలు: ఎండోక్రైన్ గ్రంథులకు సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలు మన శరీరంలో హార్మోన్ల అసమతుల్యతకు కారణం అవుతాయి. ఫలితంగా మన శరీరంలో వివిధ సమస్యలు ప్రారంభం అవుతాయి.

ఎండోక్రైన్ గ్రంథులు ఉత్పత్తి చేసే హార్మోన్లు
మన శరీరంలో వివిధ గ్రంథులు హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి, వాటిలో ఒకొక్క గ్రంథి ఒకొక్క రకమైన హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ హార్మోన్లు ఒకొక్కటి ఒకొక్క పని చేయడంలో సహాయపడతాయి. అయితే మన శరీరంలో ఏ గ్రంథి ఎలాంటి హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది అని ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
పిట్యూటరీ గ్రంథి ఉత్పత్తి చేసే హార్మోన్లు
పిట్యూటరీ గ్రంథి మన మెదడు భాగంలో ఉంటుంది, ఇది మన శరీరంలో ఇతర గ్రంథులను నియంత్రించే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది, ఈ కారణం వలన పిట్యూటరీ గ్రంథిని మాస్టర్ గ్లాండ్ అని కూడా పిలుస్తారు. పిట్యూటరీ గ్రంథి ఉత్పత్తి చేసే హార్మోన్ల జాబితా ఇక్కడ తెలుసుకోవచ్చు.
- పెరుగుదల హార్మోన్ (Growth Hormone)
- థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ (Thyroid Stimulating Hormone)
- అడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్ (Adrenocorticotropic Hormone)
- లూటినైజింగ్ హార్మోన్ (Luteinizing Hormone)
- ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ (Follicle Stimulating Hormone)
- ప్రోలాక్టిన్ (Prolactin)
- యాంటీడియూరేటిక్ హార్మోన్ (Antidiuretic Hormone)
- ఆక్సిటోసిన్ (Oxytocin)
థైరాయిడ్ గ్రంథి ఉత్పత్తి చేసే హార్మోన్లు
థైరాయిడ్ గ్రంథి మన మెడ భాగంలో సీతాకోక చిలుక ఆకారంలో ఉంటుంది. ఈ గ్రంథి ముఖ్యంగా జీవక్రియకు సహాయపడే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. థైరాయిడ్ గ్రంథి ఉత్పత్తి చేసే హార్మోన్ల జాబితా ఇక్కడ తెలుసుకోవచ్చు.
- థైరాక్సిన్ (T4)
- ట్రైయోడోథైరోనిన్ (T3)
- కాల్సిటోనిన్
- పారాథైరాయిడ్ హార్మోన్
గమనిక : పారాథైరాయిడ్ హార్మోన్ అనేది పారాథైరాయిడ్ గ్రంథుల ద్వారా ఉత్పత్తి అవుతుంది. అయితే ఈ పారాథైరాయిడ్ గ్రంథులు, థైరాయిడ్ గ్రంథిలో భాగంగా ఉంటాయి.
అడ్రినల్ గ్రంథి ఉత్పత్తి చేసే హార్మోన్లు
అడ్రినల్ గ్రంథులు మన శరీరంలో మూత్రపిండాల మీద ఉంటాయి. ఈ గ్రంథులు రెండు రకాలుగా ఉంటాయి. మొదటిది అడ్రినల్ కార్టెక్స్ మరియు రెండవది అడ్రినల్ మెడుల్లా. ఈ గ్రంథులు ఉత్పత్తి చేసే హార్మోన్ల జాబితా ఇక్కడ తెలుసుకోవచ్చు.
- కార్టిసాల్
- ఆల్డోస్టెరాన్
- అడ్రినలిన్
- నోరాడ్రినలిన్
పైన వివరించిన హార్మోన్లలో కార్టిసాల్ మరియు ఆల్డోస్టెరాన్ హార్మోన్లు అడ్రినల్ కార్టెక్స్ భాగంలో ఉత్పత్తి కాగా, అడ్రినలిన్, నోరాడ్రినలిన్ హార్మోన్లు అడ్రినల్ మెడుల్లా భాగంలో ఉత్పత్తి అవుతాయి.
ప్యాంక్రియాస్ గ్రంథి ఉత్పత్తి చేసే హార్మోన్లు
మన శరీరంలో ప్యాంక్రియాస్ పొత్తి కడుపుకి దగ్గరలో ఉంటుంది. ఈ గ్రంథి ఉత్పత్తి చేసే హార్మోన్ల జాబితా ఈ క్రింది విధంగా ఉంది.
- ఇన్సులిన్
- గ్లూకాగాన్
- సోమాటోస్టాటిన్
- ప్యాంక్రియాటిక్ పాలీపెప్టైడ్
పీనియల్ గ్రంథి ఉత్పత్తి చేసే హార్మోన్లు
పీనియల్ గ్రంథి అనేది మన మెదడు యొక్క మధ్య భాగంలో ఉంటుంది. ఈ గ్రంథి విడుదల చేసే హార్మోన్ల జాబితా ఇక్కడ తెలుసుకుందాం.
- మెలటోనిన్
- సెరోటోనిన్
అండాశయం ఉత్పత్తి చేసే హార్మోన్లు – స్త్రీలలో
స్త్రీలలో గర్భాశయానికి ఇరువైపులా అండాశయ గ్రంథులు ఉంటాయి. ఈ గ్రంథులు విడుదల చేసే హార్మోన్ల జాబితా ఇక్కడ తెలుసుకోండి.
- ఈస్ట్రోజెన్
- ప్రొజెస్టెరాన్
- ఆండ్రోజెన్స్
వృషణాలు ఉత్పత్తి చేసే హార్మోన్లు – పురుషులలో
మగవారిలో వృషణాలు పురుషాంగానికి వెనక భాగంలో ఉంటాయి, ఇవి ఉత్పత్తి చేసే హార్మన్లు ఇక్కడ తెలుసుకుందాం.
- టెస్టోస్టెరాన్
- ఇన్హిబిన్
హార్మోన్ల అసమతుల్యత లక్షణాలు
మన శరీరంలో హార్మోన్ల అసమతుల్యత వలన వివిధ రకాలైన పరిస్థితులు ఏర్పడవచ్చు. ఈ లక్షణాలు పురుషులలో మరియు స్త్రీలలో వేరుగా ఉంటాయి. అయితే హార్మోన్ల అసమతుల్యత వలన కలిగే లక్షణాలు ఈ క్రింద వివరంగా తెలుసుకోవచ్చు.
క్రమరహిత రుతుస్రావం : హార్మోన్ల అసమతుల్యత కారణంగా స్త్రీలలో రుతుస్రావం క్రమరహితంగా వచ్చే అవకాశం ఉంది. ఒకొక్కసారి పీరియడ్స్ మధ్యలో వ్యవధి చాలా ఎక్కువగాను కొన్నిసార్లు ఒకే నెలలో రెండు సార్లు పీరియడ్స్ రావడం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. కొంతమందిలో పీరియడ్స్ సమయంలో రక్తస్రావం ఎక్కువగా ఉంటుంది.
సంతానలేమి : హార్మోన్ల అసమతుల్యత సమస్యను చాలామంది తీవ్రమైన సమస్యగా భావించరు. కానీ హార్మోన్ల అసమతుల్యత సంతానలేమికి కూడా కారణం అవుతుంది. మన శరీరంలో హార్మోన్ల అసమతుల్యత కారణంగా అండం విడుదల అవ్వడంతో సమస్యలు ఏర్పడతాయి ఫలితంగా సంతానలేమికి కారణం అవుతుంది.
ఒత్తిడి : థైరాయిడ్ గ్రంథి హార్మోన్లు మరియు కార్టిసాల్ హార్మోన్లలో అసమతుల్యత వలన మనలో ఒత్తిడి అనేది ఎక్కువ అవుతుంది. అంతేకాకుండా ఆందోళన, భయం మొదలైన లక్షణాలు కూడా కనిపిస్తాయి.
నిద్రలేమి : పీనియల్ గ్రంథి విడుదల చేసే మెలటోనిన్ హార్మోన్ మన నిద్ర క్రమాన్ని పర్యవేక్షిస్తుంది. అయితే మెలటోనిన్ హార్మోన్ అసమతుల్యత కారణంగా నిద్రలేమి సమస్యలు ఏర్పడవచ్చు.
మూడ్ స్వింగ్స్ : మూడ్ స్వింగ్స్ అంటే కేవలం ఆడవారిలో మాత్రమే కలుగుతాయి అని చాలా మంది అనుకుంటారు కానీ ఇవి మగవారిలో కూడా ఉంటాయి. గర్భధారణ సమయంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ ప్రభావంగా మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి. థైరాయిడ్ హార్మోన్లు మరియు టెస్టోస్టెరాన్ హార్మోన్ల అసమతుల్యత కారణంగా మగవారిలో కూడా మూడ్ స్వింగ్స్ ఏర్పడతాయి.
అంగస్థంభన సమస్యలు: మగవారిలో టెస్టోస్టెరాన్ హార్మోన్ తక్కువగా ఉంటే దీని వలన అంగస్థంభన సమస్యలు ఏర్పడతాయి, లైంగిక ఆసక్తి సన్నగిల్లుతుంది.
అధిక బరువు : హార్మోన్ల అసమతుల్యత కారణంగా మనం బరువు కూడా పెరగవచ్చు. హార్మోన్ల కారణంగా మనకు భోజనం చేసిన తర్వాత కూడా ఆకలిగా ఉండవచ్చు, దీంతో ఎక్కువ ఆహారం తీసుకోవడం వలన బరువు పెరుగుతాం.
అజీర్తి : మనం తీసుకున్న ఆహారం జీర్ణం అవ్వడానికి హార్మోనులు కూడా అవసరం అవుతాయి. అయితే హార్మోన్ల అసమతుల్యత కారణంగా ఆహారం జీర్ణం కావడానికి ఆలస్యం అవుతుంది. దీని వలన అజీర్తి సమస్య కలుగుతుంది.
చర్మ సమస్యలు : హార్మోన్ల అసమతుల్యత వలన వివిధ రకాలైన చర్మ సమస్యలు కూడా ఏర్పడవచ్చు. కొన్ని సందర్భాలలో చర్మంపై నల్లటి మచ్చలు ఏర్పడవచ్చు.

హార్మోన్ల అసమతుల్యత కారణంగా కలిగే సమస్యలు
మన శరీరంలో హార్మోన్ల అసమతుల్యత కారణంగా కొన్ని వ్యాధులు లేదా రుగ్మతలు ఏర్పడవచ్చు. వాటి గురించి ఇక్కడ వివరంగా తెలుసుకోవచ్చు.
డయాబెటీస్ : మన శరీరంలో పాంక్రియాస్ గ్రంథి ఇన్సులిన్ ను ఉత్పత్తి చేస్తుంది, ఈ హార్మోన్ రక్తంలో ఉన్న చక్కెర స్థాయులను నియంత్రిస్తుంది. అయితే శరీరానికి అవసరమైన ఇన్సులిన్ ఉత్పత్తి అవ్వకపోతే రక్తంలో చక్కెర స్థాయులు పెరుగుతాయి, ఈ పరిస్థితిని డయాబెటీస్ అంటారు.
హైపర్ థైరాయిడిజం మరియు హైపో థైరాయిడిజం : థైరాయిడ్ గ్రంథి విడుదల చేసే హార్మోన్లలో హెచ్చుతగ్గుల కారణంగా ఈ పరిస్థితులు ఏర్పడతాయి. థైరాయిడ్ గ్రంథి హార్మోన్లు ఎక్కువగా ఉత్పత్తి కావడం వలన హైపర్ థైరాయిడిజం మరియు తక్కువగా ఉత్పత్తి కావడం వలన హైపో థైరాయిడిజం పరిస్థితులు ఏర్పడతాయి.
PCOS : హార్మోన్ల అసమతుల్యత కారణంగా మహిళల్లో పాలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ కలిగే ప్రమాదం ఉంది. మహిళల్లో ఇది అనేక సమస్యలకు కారణం అవుతుంది. దీనివలన అవాంఛిత రోమాలు, బరువు పెరగడం, రుతుస్రావం లో సమస్యలు ఏర్పడతాయి.
హార్మోన్ల అసమతుల్యత నిర్ధారణ పరీక్షలు
మన శరీరంలో హార్మోన్లు అసమతుల్యతను నిర్దారించడానికి వివిధ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి వాటిని ఇక్కడ వివరంగా తెలుసుకోవచ్చు.
రక్తపరీక్ష : మన శరీరంలో ఉత్పత్తి అయ్యే హార్మోన్లు రక్తంతో కలిసి వివిధ భాగాలకు చేరతాయి. అందువలన మన శరీరంలో హార్మోన్ల అసమతుల్యత గురించి తెలుసుకోవడానికి రక్త పరీక్షను డాక్టర్లు సూచిస్తారు.
లక్షణాల ద్వారా నిర్ధారణ : హార్మోన్ల అసమతుల్యతను నిర్దారించడానికి కొన్ని సందర్భాలలో పేషేంట్ యొక్క లక్షణాలు సహాయపడతాయి. రుతుక్రమంలో మార్పులు, అవాంఛిత రోమాలు మొదలైనవి హార్మోన్ల అసమతుల్యతను నిర్ధారిస్తాయి.
MRI మరియు అల్ట్రా సౌండ్ స్కాన్ : కొన్ని సందర్భాలలో హార్మోన్లను ఉత్పత్తి చేసే గ్రంథుల పనితీరు తెలుసుకోవడానికి MRI స్కానింగ్ పద్దతిని డాక్టర్లు సూచించవచ్చు. మరికొన్ని సందర్భాలలో అల్ట్రా సౌండ్ స్కాన్ పద్దతిని కూడా ఉపయోగించవచ్చు.
హార్మోన్ల అసమతుల్యతకు ఎలాంటి చికిత్స చేస్తారు?
మన శరీరంలో హార్మోన్లు అనేక రకాలైన విధులు నిర్వహించడానికి తోడ్పడుతూ ఉంటాయి. వీటి అసమతుల్యత కారణంగా అనేక సమస్యలు రావచ్చు. ఇలా జరగకుండా ఉండాలంటే హార్మోన్ల పరిస్థితిని బట్టి కొన్ని చికిత్సలు అవసరం అవుతాయి. ఈ చికిత్స వివరాలు ఇక్కడ వివరంగా తెలుసుకోవచ్చు.
హార్మోన్ రీప్లేస్మెంట్ : మన శరీరంలో హార్మోన్ల అసమతుల్యత నిర్ధారణ అయిన తర్వాత ఏ హార్మోన్ అయితే తక్కువగా ఉంటుందో వాటిని శరీరానికి అందించడానికి హార్మోన్ రీప్లేస్మెంట్ చికిత్స అందిస్తారు.
మందులు : మన శరీరంలో హార్మోన్ స్థాయులను నియంత్రించడానికి కొన్ని రకాలైన మందులను డాక్టర్ సూచించవచ్చు. వీటి ద్వారా ఎక్కువగా ఉత్పత్తి అవుతున్న హార్మోన్లను నియంత్రించవచ్చు.
ఇంజెక్షన్ : ఇన్సులిన్ లాంటి హార్మోన్లు తక్కువగా ఉన్న సందర్భంలో ఇంజెక్షన్ ద్వారా ఆ హార్మోన్ ను శరీరంలోకి పంపిస్తారు. ఈ రకమైన ఇంజెక్షన్లు డాక్టర్లు సూచించిన మేరకు దీర్ఘకాలికంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
హార్మోన్ల అసమతుల్యత ఏర్పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మన శరీరంలో హార్మోన్ల అసమతుల్యత కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ క్రింద వివరంగా తెలుసుకోవచ్చు.
ఆహారం : సమతుల్యమైన ఆహారం తీసుకుంటూ, జంక్ ఫుడ్ మరియు ఫాస్ట్ ఫుడ్ లకు దూరంగా ఉండడం వలన హార్మోన్ల అసమతుల్యత కలగకుండా నివారించవచ్చు. తీసుకునే ఆహారంలో ఫైబర్ మరియు ప్రోటీన్ ఎక్కువగా ఉండేలా జాగరత్తలు తీసుకోవాలి.
ధూమపానం మరియు మద్యపానం మానడం : ఈ రెండు అలవాట్లు మన శరీరంలో అనేక రకాలైన క్యాన్సర్ లకు కారణం కావడమే కాకుండా వివిధ గ్రంథుల పనితీరుకు కూడా ఆటంకం కలిగిస్తాయి ఫలితంగా హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. ధూమపానం మరియు మద్యపానం అలవాట్లను మానుకోవడం ద్వారా హార్మన్ల అసమతుల్యత ఏర్పడకుండా నివారించవచ్చు.
తగినంత వ్యాయామం : మనం రోజువారీ జీవితంలో వ్యాయాయం లేదా శారీరక శ్రమ లేకపోవడం వలన హార్మోన్ల ఉత్పత్తి తగ్గిపోతూ ఉంటుంది. ప్రతీరోజూ వ్యాయామం చేయడం మరియు నడక అలవాటు చేసుకొవడం వలన హార్మోన్ల ఉత్పత్తి సరిగా ఉండేలాగా చూసుకోవచ్చు.
సరైన నిద్ర : ప్రస్తుతం మొబైల్ వినియోగం పెరిగిపోయిన కారణంగా చాలామంది నిద్ర సమయాన్ని గమనించుకోవడం లేదు, రాత్రి కూడా ఎక్కువ సమయాన్ని మొబైల్ వాడుతూ గడుపుతున్నారు. దీర్ఘ్కకాలికంగా సరైన నిద్ర సమయాలు పాటించకపోవడం వలన కూడా హార్మోన్ల ఉత్పత్తి మీద ప్రభావం చూపుతుంది కాబట్టి ప్రతీరోజూ కనీసం 6 నుండి 8 గంటల పాటు నిద్రించాలి.
మీ ఆరోగ్య సంరక్షణ గురించి ఏవైనా సందేహాలు ఉన్నాయా? సహాయం చేయడానికి మేము సిద్దంగా ఉన్నాము! మా అనుభవంతులైన నిపుణుల సలహా కొరకు +918065906165 కి కాల్ చేయగలరు.
FAQ’s
హార్మోన్ అసమతుల్యత యొక్క సాధారణ లక్షణాలు ఏమిటి?
హార్మోన్ అసమతుల్యత వలన మానసిక స్థితిలో మార్పులు, బరువు పెరగడం లేదా తగ్గడం, అలసట, నిద్రలేమి మొదలైన లక్షణాలు కనిపిస్తాయి.
హార్మోన్ అసమతుల్యతకు కారణమేమిటి?
హార్మోన్ అసమతుల్యతకు ఒత్తిడి, కొన్ని వైద్య పరిస్థితులు, మందులు మరియు ఆహారం మరియు వ్యాయామం చేయకపోవడం మొదలైనవి కారణాలు
హార్మోన్ అసమతుల్యత ఎలా నిర్ధారణ చేస్తారు?
హార్మోన్ అసమతుల్యత నిర్ధారణలో సాధారణంగా రక్త పరీక్షలు, శారీరక పరీక్షలు మరియు వైద్య చరిత్ర ఉంటాయి, ఇవి హార్మోన్ స్థాయిలను నిర్ణయించడానికి మరియు అంతర్లీన కారణాలను గుర్తించడానికి ఉపయోగపడతాయి.
హార్మోన్ అసమతుల్యతకు చికిత్స చేయవచ్చా?
హార్మోన్ల అసమతుల్యతను తగ్గించడానికి కొన్ని చికిత్సలు ఉన్నాయి, హార్మోన్ రీప్లేస్మెంట్, జీవనశైలి మార్పులు మరియు ఆహార మార్పులు మరియు ఒత్తిడి నిర్వహణ ద్వారా చికిత్స అందించవచ్చు.
హార్మోన్ అసమతుల్యతను ఎలా నివారించవచ్చు?
ఆరోగ్యకరమైన బరువు కలిగి ఉండడం, ఒత్తిడిని తగ్గించుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మరియు సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా హార్మోన్ల అసమతుల్యత రాకుండా నివారించవచ్చు.





















Appointment
WhatsApp
Call
More