ప్రోస్టేట్ క్యాన్సర్: కారణాలు, లక్షణాలు, నిర్ధారణ, జాగ్రత్తలు, చికిత్స

ప్రోస్టేట్ గ్రంథి అంటే ఏమిటి?
ప్రోస్టేట్ గ్రంథి అంటే పురుషులలో ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని ఒక అవయవం. ఇది వీర్యాన్ని ఉత్పత్తి చేస్తుంది. మూత్రాశయం క్రింది భాగంలో ఈ గ్రంథి ఉంటుంది, సాధారణంగా ఇది ఒక నేరేడు పండు పరిమాణంలో ఉంటుంది. ప్రోస్టేట్ గ్రంథి ఉత్పత్తి చేసిన వీర్యాన్ని స్కలనం సమయంలో మూత్రనాళం ద్వారా బయటకు పంపిస్తుంది. అయితే ఊబకాయం, వంశపారంపర్యం, అనేక ఇతర కారణాల వలన ప్రోస్టేట్ గ్రంథికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణాలు, రకాలు, నిర్ధారణ, జాగ్రత్తలు, చికిత్స గురించి పూర్తి సమాచారం ఇక్కడ అందించబడింది.
ప్రోస్టేట్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది?
ప్రోస్టేట్ క్యాన్సర్ రావడానికి వివిధ రకాలైన కారణాలు ఉన్నాయి, వాటిని ఇక్కడ వివరంగా తెలుసుకోవచ్చు.
- వయసు : సాధారణంగా 50 ఏళ్ళు పైబడిన వారిలో ప్రోస్టేట్ గ్రంథి పెరుగుదల ఉండే అవకాశం ఉంది, అయితే ఈ పరిస్థితి అందరిలోనూ ఉండదు. ప్రోస్టేట్ గ్రంథి పెరుగుదల ఉన్నవారిలో అతి కొద్ది మందిలో ఇది క్యాన్సర్ గా మారే అవకాశం ఉంది.
- వంశపారంపర్యం : ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది వంశపారంపర్యంగా సంక్రమించే అవకాశం ఉంది. కుటుంబంలో ఎవరికైనా ప్రోస్టేట్ క్యాన్సర్ ఉంటే ఆ తర్వాత తరానికి కూడా ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.
- ఊబకాయం: ఊబకాయం లేదా అధిక బరువును మనం చాలా చిన్న సమస్యగా చూస్తాం, కానీ ఊబకాయం అంతర్లీనంగా మన శరీరంలో అనేక అనారోగ్యాలకు కారణం అవుతుంది. ఊబకాయం వలన ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.
- ఆహారపు అలవాట్లు : మన ఆహారపు అలవాట్లు కూడా ప్రోస్టేట్ క్యాన్సర్ సంక్రమించడానికి కారణం అవుతాయి. ముఖ్యంగా కొవ్వు పదార్ధాలు ఎక్కువగా తీసుకునే వారికి అలాగే జంతువుల కొవ్వు కలిగిన అధికంగా తీసుకోవడం కూడా ప్రోస్టేట్ క్యాన్సర్ కు కారణం అవుతుంది.
- హార్మోన్లు : మన శరీరంలో ఉత్పత్తి అయ్యే హార్మోన్లు ఎక్కువగా ఉండడం వలన కూడా ప్రోస్టేట్ క్యాన్సర్ సంక్రమించవచ్చు. ముఖ్యంగా ఆండ్రోజెన్, టెస్టోస్టెరాన్ హార్మోన్లు అధికంగా ఉత్పత్తి కావడం వలన ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.
- ప్రోస్టేట్ గ్రంథి వాపు : కొంతమందిలో ప్రోస్టేట్ గ్రంథి పెరుగుదల ఉండవచ్చు, ఇలా ప్రోస్టేట్ గ్రంథి వాపు ఉన్నవారిలో అతి తక్కువ మందికి ఈ వాపు, క్యాన్సర్ కు కారణం కావచ్చు.
- ధూమపానం మరియు మద్యపానం : సిగరెట్ మరియు ఆల్కహాల్ మన శరీరంలో వచ్చే అనేక రకాలైన క్యాన్సర్ లకు కారణం అవుతున్నాయి. ప్రోస్టేట్ క్యాన్సర్ సంక్రమించడానికి కూడా ధూమపానం మరియు మద్యపానం కారణం అవుతున్నాయి.
ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణాలు
ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నవారికి ఈ క్రింద లక్షణాలు కనిపించవచ్చు.
- మూత్ర విసర్జనలో ఇబ్బంది : ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నవారికి మూత్ర విసర్జనలో ఇబ్బందిగా ఉంటుంది. మూత్ర విసర్జన సమయంలో మంటగా ఉంటుంది. అంతేకాకుండా మూత్ర విసర్జన ప్రారంభం కాకపోవడం మొదలైన సమస్యలు ఏర్పడతాయి.
- ప్రోస్టేట్ గ్రంథి నొప్పి : ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నవారిలో ప్రోస్టేట్ గ్రంథి భాగంలో నొప్పిగా ఉంటుంది. మూత్ర విసర్జన సమయంలో నొప్పి మరింత తీవ్రంగా ఉండవచ్చు. నడుము క్రింది భాగంలో నొప్పి ఎక్కువగా ఉండవచ్చు.
- అంగస్తంభన లోపాలు : ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నవారు అంగస్తంభన లోపాలు ఎదుర్కోవచ్చు. అంతే కాకుండా సెక్స్ లో పాల్గొంటున్నప్పుడు మరియు వీర్య స్కలనం సందర్భంలో నొప్పి కలగవచ్చు.
- మూత్రం మరియు వీర్యంలో రక్తం : ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నవారిలో మూత్రం మరియు వీర్యంలో రక్తం కనిపించవచ్చు.
- తరచుగా మూత్ర విసర్జన : ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నవారు తరచుగా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. రాత్రి వేళల్లో ఇది మరింత ఎక్కువగా ఉంటుంది.
- మూత్ర విసర్జన పై నియంత్రణ లేకపోవడం : ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నవారికి మూత్ర విసర్జనపై నియంత్రణ ఉండకపోవచ్చు. కొన్నిసార్లు వారికి తెలియకుండానే మూత్ర విసర్జన జరగవచ్చు.
- వెన్నెముక నొప్పి : ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నవారికి వెన్నెముక నొప్పి మరియు తొడ ఎముకల నొప్పి ఎక్కువగా ఉండవచ్చు. కాళ్ళు బలహీనంగా మారి నడవడంతో కూడా ఇబ్బంది కలగవచ్చు.
- బరువు తగ్గడం : ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నవారు అకస్మాత్తుగా బరువు తగ్గిపోతారు మరియు ఎక్కువగా నీరసంగా, అలసటగా ఉంటారు.
ప్రోస్టేట్ క్యాన్సర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ప్రోస్టేట్ క్యాన్సర్ సంక్రమించడానికి మన ఆహారపు అలవాట్లు, జీవనశైలితో పాటుగా అనేక అంశాలు కారణం అవుతాయి. మన జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా ప్రోస్టేట్ క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు.
- ఆహారంలో మార్పులు : మనం తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా ప్రోస్టేట్ క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు. ముఖ్యంగా రెడ్ మీట్, జంతువుల కొవ్వు, కొవ్వు శాతం ఎక్కువగా ఉన్న ఆహారాలు పూర్తిగా తగ్గించాలి. తాజా కూరగాయలు, పండ్లు మొదలైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి.
- తగినంత వ్యాయామం : క్రమం తప్పకుండా తగినంత వ్యాయామం చేయడం ద్వారా కూడా ప్రోస్టేట్ క్యాన్సర్ బారిన పడకుండా మనల్ని కాపాడుకోవచ్చు. ప్రతీరోజూ కనీస వ్యాయామం చేయడం వలన ప్రోస్టేట్ గ్రంథి ఆరోగ్యంగా ఉండడంతో పాటుగా ఊబకాయం వంటి ఇతర సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.
- ధూమపానం మానడం : ప్రోస్టేట్ క్యాన్సర్ కు కారణమయ్యే ధూమపానాన్ని మానుకోవడం ద్వారా క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు. ధూమపానం కేవలం ప్రోస్టేట్ క్యాన్సర్ మాత్రమే కాకుండా మన శరీరంలో అనేక రకాలైన ఇతర క్యాన్సర్లకు కూడా కారణం అవుతుంది. కాబట్టి ధూమపానాన్ని మానుకోవడం చాలా అవసరం.
ప్రోస్టేట్ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు
ప్రోస్టేట్ క్యాన్సర్ ను నిర్దారించడానికి వివిధ రకాలైన పరీక్షలు అవసరం అవుతాయి, వీటిలో రక్త పరీక్ష, CT స్కాన్, బయాప్సీ మొదలైనవి ఉండవచ్చు. ప్రోస్టేట్ క్యాన్సర్ నిర్ధారించగల పరీక్షల జాబితా ఇక్కడ తెలుసుకోవచ్చు.
- ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ (Prostate Specific Antigen – PSA)
- MRI
- డిజిటల్ రెక్టల్ పరీక్ష
- బయాప్సీ
- అల్ట్రాసౌండ్
- 4K స్కోర్ పరీక్ష
ప్రోస్టేట్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రాధాన్యత
చాలా సందర్భాలలో మన శరీరంలో క్యాన్సర్ కణుతులు ఉన్నా కూడా వాటి లక్షణాలు త్వరగా కనిపించవు. క్యాన్సర్ లక్షణాలు కనిపించే సమయానికి క్యాన్సర్ మరింత అడ్వాన్స్డ్ దశలోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇలా జరగకుండా ప్రోస్టేట్ క్యాన్సర్ స్క్రీనింగ్ ద్వారా క్యాన్సర్ లక్షణాలు లేకపోయినా క్యాన్సర్ కణాలను గుర్తించవచ్చు. ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది PSA టెస్ట్ మరియు DRA టెస్ట్ రూపంలో చేయవచ్చు. ప్రోస్టేట్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఎవరికి అవసరం అవుతుంది అనే విషయాన్ని డాక్టర్ నిర్దారిస్తారు. దీని ద్వారా క్యాన్సర్ ను ముందుగానే గుర్తించి నయం చేయడం సులభతరం అవుతుంది. ఒకవేళ ప్రోస్టేట్ గ్రంథిలో వాపు ఉంటే అది క్యాన్సర్ గా పరిణామం చెందుతుందా లేదా అనే విషయాన్నీ స్క్రీనింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. ప్రోస్టేట్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది ఎన్నిసార్లు చేయాలి? ఎప్పుడు చేయాలి అనేది పేషేంట్ నుండి పేషేంట్ కు మారుతూ ఉంటుంది.
ప్రోస్టేట్ క్యాన్సర్ చికిత్స
ప్రోస్టేట్ క్యాన్సర్ కణుతులను పూర్తిగా నిర్మూలించడానికి వివిధ రకాలైన చికిత్సలను క్యాన్సర్ స్పెషలిస్ట్ సూచించవచ్చు. పేషేంట్ యొక్క ప్రోస్టేట్ క్యాన్సర్ దశను బట్టి ఈ చికిత్స ఉంటుంది. సాధారణంగా ప్రోస్టేట్ క్యాన్సర్ కు చేసే చికిత్స విధానాలు ఇక్కడ వివరంగా తెలుసుకోండి.
- సర్జరీ : ప్రోస్టేట్ గ్రంథి లోపల భాగంలో ఉన్న క్యాన్సర్ కణితులను సర్జరీ ద్వారా తొలగిస్తారు. ఈ సందర్భంలో క్యాన్సర్ కణుతుల పక్కన ఉన్న కొంత కణజాలాన్ని కూడా తొలగించవలసి వస్తుంది.
- రేడియేషన్ థెరపీ : ప్రోస్టేట్ క్యాన్సర్ నయం చేయడానికి, రేడియేషన్ థెరపీ పద్దతిని ఉపయోగించవచ్చు. ఎక్స్టర్నల్ రేడియోథెరపీ ద్వారా అత్యధిక శక్తి కలిగిన రేడియో కిరణాలను క్యాన్సర్ కణుతుల మీద మరియు క్యాన్సర్ కణితులు పక్కన ఉన్న కణజాలం మీద ప్రయోగిస్తారు, దీని ద్వారా క్యాన్సర్ కణాలను పూర్తిగా నాశనం చేస్తారు. బ్రాకీ థెరపీ లేదా ఇంటర్నల్ రేడియోథెరపీ లో భాగంగా ఒక రేడియోయాక్టివ్ సోర్స్ ను ప్రోస్టేట్ గ్రంథి లోపల అమర్చుతారు, ఈ రేడియో యాక్టివ్ సౌర్స్ విడుదల చేసిన రేడియేషన్ ద్వారా క్యాన్సర్ కణాలు నాశనం చేయబడతాయి.
- హార్మోన్ థెరపీ : పురుషులలో ఆండ్రోజెన్, టెస్టోస్టెరాన్ హార్మోన్లు అధికంగా ఉత్పత్తి కావడం వలన ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది, అయితే ఈ హార్మోన్ల స్థాయులు తగ్గించండం ద్వారా క్యాన్సర్ కణాల పెరుగుదలను ఆపవచ్చు.
- కీమో థెరపీ : ప్రోస్టేట్ క్యాన్సర్ నయం చేయడానికి అవలంబించే చికిత్సలలో కీమో థెరపీ కూడా ఒకటి. ఈ థెరపీ ద్వారా క్యాన్సర్ కణాలను నాశనం చేయగలిగిన మందులను పేషేంట్ కు అందిస్తారు. కొన్నిసార్లు కీమోథెరపీ తో పాటుగా రేడియేషన్ థెరపీ కూడా కలిపి చికిత్స చేయవచ్చు.
- టార్గెట్ థెరపీ : ఈ విధానంలో పేషేంట్ శరీరంలో ఉన్న క్యాన్సర్ కణాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని వాటిని నిర్ములించే మందులను అందిస్తారు. ఈ చికిత్స విధానంలో ఆరోగ్యకరమైన కణాలకు ఎటువంటి ప్రమాదం లేకుండా ఉంటుంది.
- ఇమ్యునో థెరపీ : పేషేంట్ శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచడం ద్వారా క్యాన్సర్ కణాలను నాశనం చేస్తారు.
ముగింపు
క్యాన్సర్ అనేది ప్రాణాంతకమైన వ్యాధి అయినా కూడా ప్రస్తుతం ఉన్న అత్యాధునిక చికిత్స విధానాలతో క్యాసర్ ను పూర్తిగా నయం చేయవచ్చు. పైగా క్యాన్సర్ మొదటి, రెండు దశల్లో గుర్తించగలిగితే నయం చేయడం సులభంగా మరియు వేగంగా ఉంటుంది. యశోద హాస్పిటల్స్ లో క్యాన్సర్ చికిత్సకు అవసరమైన అత్యాధునిక పరికరాలతో పాటుగా అనుభవజ్ఞులైన ఆంకాలజిస్ట్ లు అందుబాటులో ఉన్నారు. మీరు క్యాన్సర్ తో బాధ పడుతున్నట్లైతే ఏ మాత్రం కృంగిపోవద్దు, యశోద హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య నిపుణులు మీ క్యాన్సర్ నయం చేయగలరు అని గుర్తుంచుకోండి.
మీ ఆరోగ్య సంరక్షణ గురించి ఏవైనా సందేహాలు ఉన్నాయా? సహాయం చేయడానికి మేము సిద్దంగా ఉన్నాము! మా అనుభవంతులైన నిపుణుల సలహా కొరకు +918929967127 కి కాల్ చేయగలరు.