Select Page

గుండె దడ అంటే ఏమిటి? కారణాలు, లక్షణాలు, జాగ్రత్తలు, చికిత్స

గుండె దడ అంటే ఏమిటి? కారణాలు, లక్షణాలు, జాగ్రత్తలు, చికిత్స

గుండె దడ అంటే ఏమిటి?

ఈ మధ్య కాలంలో గుండెకు సంబంధించిన సమస్యలు ఎక్కువ అవుతున్నాయి, వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారి మీద ఈ ప్రభావం చూపిస్తున్నాయి. కోవిడ్-19 తర్వాత మన ఆరోగ్య పరిస్థితుల్లో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. వ్యాయామం చేస్తూ, క్రీడలు ఆడుతూ, పని చేసుకుంటూ గుండెపోటుతో మృతి చెందినట్లు వస్తున్న వార్తలు కూడా మనల్ని కలవరపెడుతున్నాయి అనడంలో సందేహం లేదు. సాధారణంగా మనకి అనేక కారణాల వలన ఛాతీలో నొప్పి కలుగుతుంది, అయితే ప్రతీ నొప్పి గుండెపోటు కాదు. ప్రస్తుతం ఉన్న ఉరుకుల పరుగుల జీవితంలో మన ఆరోగ్యం గురించి జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం, అందులోనూ గుండె సంరక్షణ కోసం తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలి. అయితే చాలామందిలో గుండెదడ అనే పరిస్థితి అప్పుడప్పుడు కనిపిస్తుంది. సాధారణంగా మన గుండె నిమిషానికి 60 నుండి 100 సార్లు కొట్టుకుంటుంది, ఈ స్థాయి కంటే వేగంగా కొట్టుకోవడం లేదా గుండె కొట్టుకోవడంలో అసమానతలు ఉన్నా ఈ పరిస్థితిని గుండెదడ అంటారు.

గుండె దడ ఎందుకు వస్తుంది? దానికి గల కారణాలేంటి?

Heart Palpitations Types

సాధారణంగా మనం చేసే కొన్ని రకాలైన పనుల వలన గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. కొన్ని సందర్భాలలో భయం, ఆందోళన కారణంగా గుండె దడ వస్తుంది. గుండె దడకు గల కారణాలు వివరంగా ఇక్కడ తెలుసుకోవచ్చు.

వ్యాయామం : మనం శారీరక వ్యాయామం చేసే సమయంలో శరీరానికి రక్త ప్రసరణ ఎక్కువగా అవసరం అవుతుంది, ఈ రక్తాన్ని శరీర భాగాలకు ప్రసరణ చేయడానికి వేగంగా పనిచేయాల్సి ఉంటుంది.

భయం, ఆందోళన : మనం ఉన్నట్టుండి భయానికి కానీ, ఆందోళనకు కానీ గురైన సందర్భాలలో శరీరం అడ్రినలిన్ అనే హార్మోన్ ను ఉత్పత్తి చేస్తుంది, ఈ హార్మోన్ ప్రభావం వలన గుండె దడ కలుగుతుంది లేదా గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది.

మద్యపానం : ఆల్కహాల్ సేవించడం శరీరంలో అనేక అనారోగ్యాలకు కారణమవుతుంది. మద్యపానం వలన గుండె కొట్టుకునే వేగంలో అసమానతలు కలుగుతాయి.

కెఫిన్ కలిగిన ఆహారం : చాలామంది టీ మరియు కాఫీలను ఎక్కువగా తాగుతూ ఉంటారు వీటిలో కెఫిన్ అనే పదార్ధం ఉంటుంది. కూల్ డ్రింక్స్ లో కూడా కెఫిన్ అధికంగా ఉంటుంది. వీటిని ఎక్కువగా తీసుకునే వారిలో గుండె వేగంగా కొట్టుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా రాత్రి సమయంలో కెఫిన్ కలిగిన ఆహారాన్ని తీసుకోవడం వలన గుండె దడ వస్తుంది.

హైపర్ థైరాయిడిజం : మన శరీరంలో ఉండే థైరాయిడ్ గ్రంధి వివిధ కారణాల వలన ఎక్కువ హార్మోన్లను ఉత్పత్తి చేస్తే ఈ హార్మోన్ల ప్రభావం గుండె కొట్టుకునే వేగం మీద చూపిస్తుంది. హార్మోన్లు ఎక్కవగా విడుదల అవ్వడం వలన గుండె దడ వచ్చే అవకాశం ఉంది.

గుండెకు సంబంధించిన ఇతర సమస్యలు : ఒకవేళ మీకు ఇంతకు ముందే గుండెపోటు లాంటి సమస్యలు ఉంటే వాటి కారణంగా కూడా గుండె దడ రావచ్చు.

డీహైడ్రేషన్ (నిర్జలీకరణం) : తగినంత మోతాదులో నీరు తాగకపోవడం వలన కూడా గుండె కొట్టుకునే వేగంలో మార్పులు సంభవిస్తాయి.

రక్తహీనత : శరీరంలో కణజాలాలకు ఆక్సిజన్ అందించడానికి సరిపడా ఎర్ర రక్త కణాలు లేనప్పుడు, గుండె మరింత వేగంగా పని చేయాల్సి ఉంటుంది. ఈ కారణంగా రక్తహీనత ఉన్నవారిలో కూడా గుండెదడ ఉంటుంది.

కొన్ని రకాలైన మందులు వాడుతున్న వారికి : ఆస్తమా, హై బీపీ, థైరాయిడ్, దగ్గుకు సంబంధించిన మందులు లేదా సిరప్ వాడకం వలన కూడా గుండె కొట్టుకునే వేగంలో అసమానతలు వచ్చే అవకాశం ఉంది.

ఛాతీ లేదా గుండెలో నొప్పి వస్తుందా?

గుండె దడ లక్షణాలు ఎలా ఉంటాయి?

గుండె దడ సాధారణంగా పెద్ద సమస్య కాదు, కానీ ఈ పరిస్థితి తరచుగా సంభవిస్తే తప్పనిసరిగా డాక్టర్ ను సంప్రదించాలి. గుండె దడ లక్షణాలు ఈ క్రింది విధంగా ఉంటాయి.

  • గుండె వేగంగా కొట్టుకోవడం
  • గుండె లయ తప్పడం
  • గుండె కొట్టుకోవడంలో అసమానత
  • శరీరం వణకడం

గుండె దడ లేదా గుండె వేగం తగ్గాలంటే ఏం చేయాలి?

సాధారణంగా కొన్ని సందర్భాలలో మనం చేస్తున్న పనుల వలన గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది, ఐతే కాసేపటి తర్వాత దానంతట అదే సాధారణ స్థాయికి వచ్చేస్తుంది. గుండెదడ తగ్గాలంటే ఈ క్రింది విషయాలలో జాగ్రత్తలు పాటించాలి.

పని ఒత్తిడిని తగ్గించుకోవాలి : చాలామంది పనిలో ఎంత ఒత్తిడి ఉన్నా కూడా దానికి తగిన మార్పులు చేసుకోకుండా పని చేస్తుంటారు, అలా కాకుండా ఒత్తిడి తగ్గించుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మానసిక ఒత్తిడి కూడా గుండె ఆరోగ్యం పై ప్రభావం చూపిస్తుందని గుర్తుంచుకోవాలి.

ఆల్కహాల్ కి నో చెప్పండి : గుండె ఆరోగ్యంగా ఉండడానికి మద్యపానం లేదా ధూమపానం అలవాట్లను మానెయ్యాలి. ఈ అలవాట్ల వలన గుండె పైన ఒత్తిడి పెరుగుతుంది.

ప్రాసెస్ చేసిన ఆహారం వద్దు : ఉరుకులు పరుగుల జీవనశైలిలో ప్రాసెస్ చేసిన ఆహారం ఎక్కువగా లభిస్తుంది, మరియు రుచిగా ఉంటుంది. కానీ ఇలాంటి ఆహారాల్లో గుండెకు హాని చేసే పదార్ధాలు కూడా ఉంటున్నాయి. నెలకి ఒకసారి లేదా రెండుసార్లు ప్రాసెస్ చేసిన ఆహారం తీసుకోవడం వలన ప్రమాదం లేదు కానీ ప్రతీరోజూ ఇల్నాటివి తీసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగి గుండెదడ తో పాటు మరిన్ని గుండె సమస్యలకు కారణమవుతుంది, కాబట్టి ఇలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలి.

తాజా కూరగాయలు / పండ్లు తినండి : తాజా కూరగాయలు, పండ్లు గుండె ఆరోగ్యానికి దోహదపడతాయి, శరీరానికి కావాల్సిన పోషకాలు కూడా వీటి ద్వారా అందుతాయి.

వ్యాయామం / యోగా : కనీస వ్యాయామం, యోగా చేయడం శరీరానికి మంచిది. వ్యాయామం చేస్తున్న సమయంలో గుండె వేగం పెరిగినా కూడా దీర్ఘకాలంలో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ప్రతీరోజూ 30 నిమిషాల పాటు తేలికపాటి వ్యాయామం చేయడం వలన గుండెదడ ను తగ్గించవచ్చు.

గుండె దడకు ఎలాంటి చికిత్స అవసరం?

సాధారణంగా గుండె దడ ప్రమాదకరమైనది కాదు, ఏదైనా పని చేసే సమయంలో గుండె వేగం పెరిగినా కూడా ఆ తర్వాత దానంతట అదే సాధారణ స్థాయికి వస్తుంది. గుండె దడకు ప్రత్యేకమైన చికిత్స అవసరం లేకపోయినా గుండె దడ దీర్ఘకాలికంగా ఉంటే చికిత్స అవసరం అవుతుంది. ఈ సందర్భాల్లో డాక్టర్లు బీటా- బ్లాకర్స్, కాల్షియం ఛానల్ బ్లాకర్స్, యాంటీఅర్రిథమిక్ మందులను సూచిస్తారు.

ముగింపు

మన శరీరంలో గుండె చాలా ముఖ్యమైన అవయవం. గుండెకు సంబంధించిన సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా చిన్న అసౌకర్యం కలిగినా కూడా వెంటనే వైద్యులను సంప్రదించడం అవసరం, ముందుగానే వైద్యుల సూచనల మేరకు తగిన జాగ్రత్తలు పాటిస్తే గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్ లాంటి ప్రమాదాల నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు.

గుండె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం చాలా అవసరం, ఛాతీ నొప్పి వేరే ఏదైనా కారణాల వలన కూడా సంభవించవచ్చు. అయితే కొన్నిసార్లు ఛాతీ నొప్పి మరియు గుండెనొప్పి మధ్య తేడా మనం గమనించలేకపోవచ్చు. మీ గుండె కొట్టుకోవడంలో మీకు ఏదైనా తేడా అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం అవసరం, అనుభవజ్ఞులైన యశోద వైద్య నిపుణులు మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు.

మీ ఆరోగ్య సంరక్షణ గురించి ఏవైనా సందేహాలు ఉన్నాయా? సహాయం చేయడానికి మేము సిద్దంగా ఉన్నాము! మా అనుభవంతులైన నిపుణుల సలహా కొరకు +918065906165 కి కాల్ చేయగలరు.

About Author –

Dr. Shabarinath Samudrala, Consultant Interventional Cardiologist

About Author

Dr. Shabarinath Samudrala | yashoda hospitals

Dr. Shabarinath Samudrala

MBBS, MD (General Medicine), DNB (Cardiology)

Consultant Interventional Cardiologist

Book an appointment
in 2 minutes