Select Page

డయేరియా రకాలు, కారణాలు, లక్షణాలు మరియు నివారణ చర్యలు

సాధారణంగా వర్షాకాలం ప్రారంభమైతే డయేరియా వ్యాధి బారిన పడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతు ఉంటుంది. డయేరియాని తెలుగులో అతిసార వ్యాధి అని అంటారు. రోజుకి 3 లేదా అంతకంటే ఎక్కువ సార్లు నీళ్ళ విరేచనాలు అవుతుంటే అటువంటి పరిస్థితిని డయేరియా అంటారు. డయేరియా సాధారణంగా కలుషితమైన ఆహారాన్ని తీసుకున్న తర్వాత గంటల నుంచి రోజుల వ్యవధిలో అభివృద్ధి చెందుతుంది. పిల్లల నుంచి పెద్దల వరకు చాలా మందిని డయేరియా ఇబ్బంది పెడుతుంటుంది. చాలా వరకు వర్షాలు, ముసిరే ఈగలు- కీటకాలు మోసుకొచ్చే వైరస్‌లు మరియు బ్యాక్టీరియాలు అవి వదిలే విష పదార్థాలే డయేరియాకు కారణమవుతాయి. ఈ వ్యాధిగ్రస్తుల్లో ఎక్కువగా విరేచనాలు కావడం వల్ల శరీరం ద్రవాలను కోల్పోయి శారీరక పనితీరును నెమ్మదిస్తుంది. డయేరియా వ్యాధి వల్ల ప్రాణాపాయం లేకున్నా చాలా అసౌకర్యంగా, అలసటగా అనిపిస్తుంది.

డయేరియా రకాలు

లక్షణాలు ఎంతకాలం ఉంటాయనే దాని ఆధారంగా డయేరియా తీవ్రమైన లేదా దీర్ఘకాలిక డయేరియాగా  వర్గీకరించవచ్చు. 

  1. తీవ్రమైన డయేరియా: సాధారణంగా తీవ్రమైన డయేరియా వైరల్ ఇన్ఫెక్షన్లు (రోటవైరస్, నోరోవైరస్) బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు (ఇ. కోలి, సాల్మొనెల్లా), పరాన్నజీవి అంటువ్యాధులు (గియార్డియా, క్రిప్టోస్పోరిడియం) ద్వారా సంభవిస్తాయి. తీవ్రమైన డయేరియా యొక్క లక్షణాలు 3-4 రోజుల వరకు ఉంటాయి. ఈ సమస్యకు తగు జాగ్రత్తలు పాటించినట్లు అయితే 4-5 రోజుల్లో తగ్గిపోతుంది.
  2. క్రానిక్ డయేరియా: సాధారణంగా క్రానిక్ డయేరియా అంతర్లీన జీర్ణ సమస్యల కారణంగా అనగా  క్రోన్’స్ డిసీజ్, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (IBS) మరియు సెలియక్ డిసీజ్ (IBD) అల్సరేటివ్ కోలిటిస్ పరిస్థితుల వల్ల వస్తుంది. దీర్ఘకాలిక (క్రానిక్) విరేచనాలు 2-4 వారాల పాటు కొనసాగుతాయి.
  3. నాన్ ఇన్ఫెక్టివ్ డయేరియాలు: ఇన్ఫెక్షన్ కాకుండా ఇతర కారణాల వల్ల వచ్చే డయేరియాను (కలుషితమైన ఆహార పదార్థాలను తీసుకోవడం, పాలు, తాగునీరు, మాంసాహారాలు, నిలవబెట్టిన మరియు తొందరగా పాడైపోయే ఆహారాలను తీసుకోవడం) నాన్ ఇన్ఫెక్టివ్ డయేరియా అంటారు. 

డయేరియా యొక్క లక్షణాలు

  • విరేచనం నీళ్లలాగా కావడం
  • వికారం మరియు వాంతులవ్వడం
  • డీహైడ్రేషన్ కు గురికావడం
  • కాళ్లు, చేతులు లాగడం
  • జ్వరం
  • అలసట మరియు కళ్లు తిరగడం
  • నోరు ఎండిపోవడం
  • చర్మం పొడిబారడం
  • తీవ్రమైన కడుపునొప్పి మరియు పొత్తి కడుపు నొప్పి వంటి లక్షణాలు సైతం కనిపిస్తాయి.
ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?

డయేరియాకు గల కారణాలు

  • డయేరియా యొక్క అత్యంత సాధారణ కారణం వైరల్ గ్యాస్ట్రోఎంటెరిటిస్ (పేగు సంక్రమణం) తో పాటు: 
  • వైరస్, బాక్టీరియల్ మరియు ఇతర పరాన్నజీవుల ద్వారా వ్యాపించే అంటువ్యాధులు
  • కలుషితమైన మరియు జీర్ణవ్యవస్థను దెబ్బతీసే ఆహార పదార్థాలను తినడం
  • యాంటీబయాటిక్స్ మరియు యాంటాసిడ్లు వంటి కొన్ని రకాల మందులను తీసుకోవడం
  • క్రోన్’స్ వ్యాధి & అల్సరేటివ్ కోలిటిస్ వంటి జీర్ణవ్యవస్థ వంటి సమస్యల బారిన పడడం
  • రేడియేషన్ థెరపీ వల్ల కలిగే కొన్ని దుష్ప్రభావాలు డయేరియాకు కారణం కావొచ్చు
  • బహిరంగ మల విసర్జన కూడా డయేరియా విజృంభించడానికి ఒక ముఖ్యమైన కారణం
  • మాలాబ్జర్ప్షన్ సిండ్రోమ్ తో పాటుగా అపెండెక్టమీ మరియు గాల్ బ్లాడర్ సర్జరీ వంటి కడుపు సంబంధ సర్జరీల ద్వారా కూడా డయేరియా సమస్య వచ్చే అవకాశం ఉంటుంది.

డయేరియా వచ్చినప్పుడు పాటించాల్సిన ఆహార నియమాలు

డయేరియా సమస్యతో బాధపడే వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆల్కహాల్, కాఫీ, కార్బొనేటెడ్ పానీయాలతో పాటు

  • వేయించిన ఆహార పదార్థాలు మరియు వేపుళ్లను తీసుకోకూడదు 
  •  తీపి పదార్థాలు, తేనె, ద్రాక్షపళ్లు, పప్పులు, చెర్రీలూ మరియు స్వీట్లు, చాక్లెట్లు వంటి తినకుండా ఉండడం మంచిది.
  • వేడిగా లేని పదార్థాలను తినడం మరియు కలుషిత నీటిని తాగడం మానుకోవాలి
  • వీలైనంత వరకు వీధి వ్యాపారులు మరియు ఫుడ్ ట్రక్కుల దగ్గర తినకపోవడం మంచిది
  • నీళ్లతో కాచిన సగ్గుబియ్యం జావ, ఓట్ మీల్, పల్చటి మజ్జిగ, గంజి లాంటివి తీసుకోవచ్చు
  • ప్రాసెస్డ్ ఫూడ్స్ మరియు కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాలతో పాటుగా అన్ని రకాల డెయిరీ ఉత్పత్తులకు దూరంగా ఉండాలి.
మీ ఆరోగ్య సమస్య గురించి ఆందోళన లో ఉన్నారా?

డయేరియా నివారణ చర్యలు

  • డయేరియా బారిన పడకుండా ఉండేందుకు వ్యక్తిగత పరిశుభ్రత చాలా ముఖ్యం. అంటే భోజనానికి ముందూ, మల విసర్జన తర్వాత సబ్బు లేదా అల్కహాల్ ఆధారిత శానిటైజర్ లతో చేతులు శుభ్రపరుచుకోవాలి
  • డయేరియా సమస్యతో బాధపడే వారు ముఖ్యంగా డీహైడ్రేషన్ నివారించడానికి ద్రవాలు పుష్కలంగా త్రాగాలి
  • ఎట్టి పరిస్థితుల్లోనూ కాచి వడబోసిన నీటిని మాత్రమే తాగాలి
  • ఆహారాన్ని పరిశుభ్రంగా మరియు సురక్షితంగా ఉడికించిన తరువాతనే తీసుకోవాలి
  • వర్షాకాలంలో తాగునీటి ట్యాంకులు, బోరు బావులను తప్పకుండా క్లోరినేషన్ చేస్తుండాలి
  • పండ్లు మరియు కూరగాయలను తినేటప్పుడు శభ్రపరుచుకోవాలి
  • ఉడకని మాంసంను (చేపలు, చికెన్,మటన్) తినకపోవడం మంచిది
  • వీలైనంతవరకూ ఫ్రిజ్‌లో నిల్వ చేసినవి కాకుండా తాజా పండ్లు & కూరగాయలను వాడాలి
  • ఎక్కువగా అతిసారం ఉన్న రోజులు చప్పగా ఉండే ఆహారాలను తీసుకోవడం చాలా ఉత్తమం
  • అమీబా సిస్టులూ, క్రిముల గుడ్లూ గోళ్లకింద ఇరుక్కుని ఆహారంతో పాటు కడుపులో చేరి వ్యాధులను కలగజేస్తాయి కావున గోళ్లు పెరగకుండా చూసుకోవాలి

డయేరియాతో బాధపడే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

విశ్రాంతి: డయేరియాతో బాధపడే వారికి విశ్రాంతి చాలా అవసరం. విశ్రాంతి తీసుకోవడం వల్ల శరీరానికి ఇన్‌ఫెక్షన్స్‌తో పోరాడే శక్తి లభిస్తుంది.

హైడ్రేషన్: డీహైడ్రేషన్ రాకుండా నీరు మరియు ఇతర రకాల క్లియర్ ఫ్లూయిడ్స్ ను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. 

తేలికగా అరిగే పదార్ధాలు తీసుకోవడం: ఈ సమయంలో తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు, డైజెషన్ ని ఇరిటేట్ చేయని పదార్ధాలు తీసుకోవడం అవసరం.

ఆహారాన్ని కొంచెంగా తీసుకోవడం: ఈ సమయంలో ఎక్కువగా ఆహారం తీసుకుంటే శరీరానికి అరిగించుకోవడం కష్టమవుతుంది. అందుకనే, కొంచెం కొంచెంగా, ఎక్కువ సార్లు ఆహారం తీసుకోవడం మంచిది.

కొన్ని రకాల ఆహారాలను తిరస్కరించడం: పాలు మరియు పాల పదార్ధాలు, వేపుళ్ళు, మసాలాలు ఉన్న ఫుడ్స్, ఆల్కహాల్, కెఫీన్ వంటి ఆహారాలు డయేరియా సమస్యని తీవ్రతరం చేస్తాయి కావున వాటిని తీసుకోకపోవడం మంచిది.

కొలనోస్కోపీ: విరోచనాలు తగ్గకుండా దీర్ఘకాలిక సమస్యగా మారినప్పుడు కొలనోస్కోపీ పరీక్ష ద్వార పెద్ద పేగును పరిశీలన చేసి పేగు పూత మరియు ఇతర వ్యాధులను గుర్తించవచ్చు. సరైన సమయంలో ఈ పరీక్ష చేయడం ద్వారా సరైన చికిత్స చేయడానికి అస్కారం ఉంటుంది.

పెద్దవారిలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల చాల మంది ఈ డయేరియా బారిన పడతారు. అయితే ఈ సమస్య పెద్ద తీవ్రతరం కాకపోయినప్పటికీ సరైన సమయంలో ఈ సమస్యను గుర్తించి వైద్యుని సలహా తీసుకోకపోతే మాత్రం చాల అనర్థాలకు దారి తీసే అవకాశం ఉంటుంది. విరేచనాలూ, వాంతుల ద్వారా శరీరం కోల్పోయిన నీటిని, ఎలక్ట్రొలైట్స్‌ను తిరిగి ఇవ్వడం, బ్లడ్ ప్రెషర్ సరైన స్థాయిలో నియంత్రించుకోవడం మరియు మూత్రం సరిగా వచ్చే విధంగా చూసుకోవడం వల్ల ఈ వ్యాధి బారిన పడకుండా ఉండవచ్చు.

About Author –

Dr. Santosh Enaganti, Senior Consultant Gastroenterologist & Hepatologist, Advanced Interventional Endoscopist , Yashoda Hospitals – Hyderabad
MD, MRCP, CCT (Gastro) (UK), FRCP (London)

About Author

Dr. Santosh Enaganti | yashoda hospitals

Dr. Santosh Enaganti

MD, MRCP, CCT (Gastro) (UK), FRCP (London)
Advanced Endoscopy Fellowship, UK
Liver Transplantation fellow, UK
Formerly NHS UK Consultant

Sr. Consultant Medical Gastroenterologist, Hepatologist & Third Space Endoscopist, Clinical Director.