Select Page

రొమ్ము గడ్డలు కారణాలు, లక్షణాలు, నిర్ధారణ, చికిత్స

రొమ్ము గడ్డలు కారణాలు, లక్షణాలు, నిర్ధారణ, చికిత్స

మహిళల్లో అనేక కారణాల వలన రొమ్ముగడ్డలు ఏర్పడవచ్చు, రొమ్ము గడ్డలు అంటే అవి క్యాన్సర్ అవుతాయి అని చాలామంది భయపడుతూ ఉంటారు. రొమ్ము భాగంలో ఏర్పడే గడ్డలు అన్నీ క్యాన్సర్ కావు. అయితే రొమ్ము గడ్డలు నొప్పితో పాటుగా ఇతర లక్షణాలను కలిగి ఉండవచ్చు. హార్మోన్ల అసమతుల్యత, ప్రసవం తర్వాత, ఎక్కువ పాలు ఉత్పత్తి అవ్వడం, శిశువుకు పాలివ్వడం ఆపడం మొదలైన కారణాల వలన రొమ్ము గడ్డలు ఏర్పడే అవకాశం ఉంది. వీటిని గమనించిన వెంటనే డాక్టర్ ను సంప్రదించడం సమస్య తీవ్రత పెరగకుండా చికిత్స అందించవచ్చు. కొన్ని సందర్భాలలో రొమ్ము గడ్డలు వాటంతట అవే నయం అవుతాయి.

రొమ్ము గడ్డలు ఏర్పడడానికి కారణాలు

మహిళల్లో రొమ్ము గడ్డలు ఏర్పడడానికి అనేక కారణాలు ఉంటాయి. వీటివలన తీవ్రమైన నొప్పి కలగవచ్చు. కొన్ని గడ్డలు నొప్పి లేకుండా ఉండవచ్చు. ఈ రొమ్ము గడ్డలు ఏర్పడడానికి గల కారణాలను ఇక్కడ వివరంగా తెలుసుకోవచ్చు.

  • హార్మోన్ మార్పులు: శరీరంలో హార్మోన్ల కారణంగా కొన్ని మార్పులు చోటు చేసుకుంటుంటాయి. ఈ హార్మోన్ల కారణంగా రొమ్ములో గడ్డలు ఏర్పడతాయి. ఇలా ఏర్పడే రొమ్ము గడ్డలు క్యాన్సర్ కావు, ఐతే వీటి వలన నొప్పి కలిగే అవకాశం ఉంది. సాధారణంగా నెలసరి సమయంలో మరియు నెలసరి పూర్తి అయ్యాక నాలుగు నుండి ఐదు రోజుల వరకూ రొమ్ములో గడ్డలు కలిగే అవకాశం ఉంది.
  • ఇన్ఫెక్షన్ : మహిళల్లో రొమ్ము భాగంలో ఏర్పడే ఇన్ఫెక్షన్ల కారణంగా కూడా రొమ్ము గడ్డలు ఏర్పడవచ్చు. రొమ్ము భాగంలో ఏర్పడే ఇన్ఫెక్షన్ లేదా వాపును మాస్టిటిస్ గా పరిగణిస్తారు.
  • క్యాన్సర్ : రొమ్ము భాగంలో ఏర్పడే క్యాన్సర్ కారణంగా గడ్డలు ఏర్పడతాయి, క్యాన్సర్ గడ్డలు ప్రారంభ దశలో ఎక్కువగా నొప్పిని కలిగించవు. కానీ వీటిని మొదట్లోనే గుర్తించకపోతే అత్యంత ప్రమాదకరమైన స్థాయికి చేరుకుంటాయి. రొమ్మును తాకినప్పుడు ఇవి గడ్డల లాగా గుండ్రంగా గట్టిగా అనిపిస్తాయి.
  • లిపోమా : మన శరీరంలో ఉండే కొవ్వు కణాలు కొన్నిసార్లు గడ్డలు లాగా ఏర్పడతాయి, ఏఈ గడ్డలు రొమ్ము తో సహా ఏ భాగంలో అయినా ఏర్పడవచ్చు. అయితే వీటి వలన నొప్పి కలగకపోవచ్చు, వీటి పరిమాణం కొంతమందిలో చిన్నగాను, మరికొందరిలో పెద్దగానూ ఉండవచ్చు. ఇవి ప్రాణంతాకమైనవి కావు.
  • గాయాలు : రొమ్ము భాగంలో తగిలిన గాయాల వలన గడ్డలు ఏర్పడవచ్చు. ఇవి ప్రాణాంతకం కాకపోయినా నొప్పిని ఇబ్బందిని కలిగిస్తాయి.
  • రక్తం గడ్డకట్టడం : రొమ్ము భాగానికి ఏదైనా గాయం అవ్వడం లేదా రొమ్ము భాగం మీద ఒత్తిడి కలగడం వలన రొమ్ములో రక్తం గడ్డ కట్టవచ్చు.
  • పాల నాళాలు మూసుకుపోవడం : పాలిచ్చే తల్లులలో కొన్నిసార్లు పాల నాళాలు అనేవి మూసుకుపోతాయి. ఇలా జరిగినప్పుడు రొమ్ములో ఉత్పత్తి అయిన పాలు గడ్డ కడతాయి, శిశువుకు పాలిచ్చే తల్లులలో అధికంగా పాలు ఉత్పత్తి కావడం లేదా ఉత్పత్తి అయిన పాలలో కొంతభాగం మిగిలిపోవడం వలన ఇవి లోపల గడ్డలాగా ఏర్పడి పాల నాళాలు మూసుకుపోవడానికి కారణం అవుతాయి. దీని వలన తీవ్రమైన నొప్పి కలిగే అవకాశం ఉంది.
  • రొమ్ము తిత్తులు : కొన్నిసార్లు రొమ్ము లోపలి భాగంలో ఉన్న నీరు కూడా గడ్డల లాగా ఏర్పడుతుంది. ఈ తిత్తులను తాకినప్పుడు అటూ ఇటూ కదలవచ్చు.
  • ఫైబ్రోడెనోమాస్ : సాధారణంగా మహిళల్లో హార్మన్ల మార్పుల వలన రొమ్ము గడ్డలు ఏర్పడతాయి, అయితే ముఖ్యంగా ఈస్ట్రోజెన్ స్థాయిలు పెరగడం వలన కూడా రొమ్ము గడ్డలు ఏర్పడతాయి. దీనిని ఫైబ్రోడెనోమాస్ గా పరిగణిస్తారు. సాధారణంగా ఈ గడ్డలు నిరపాయకరమైనవి.

Causes of breast lumps types

రొమ్ము గడ్డల లక్షణాలు ఎలా ఉంటాయి?

శరీరంలోని రొమ్ము భాగంలో ఏర్పడిన గడ్డల యొక్క లక్షణాలు, ఆ గడ్డలు ఏర్పడడానికి గల కారణాలను బట్టి ఉంటాయి. అయితే సాధారణంగా క్యానర్ కాని గడ్డల లక్షణాలు ఇక్కడ తెలియజేసిన విధంగా ఉండవచ్చు.

  • తీవ్రమైన నొప్పి : రొమ్ము గడ్డల వలన మహిళల రొమ్ము ప్రాంతంలో తీవ్రమైన నొప్పి కలిగే అవకాశం ఉంది. ఈ నొప్పి తీవ్రత పేషేంట్ ను బట్టి మారవచ్చు.
  • చనుమొనలో మార్పులు : రొమ్ము గడ్డలు ఏర్పడినప్పుడు చనుమొనల్లో మార్పులు ఏర్పడవచ్చు. చనుమొనలు రొమ్ము లోపలకి నొక్కుకునిపోవచ్చు లేదా మెలితిరిగివచ్చు. ఇలాంటి సందర్భాలలో చనుమొనల దగ్గర కూడా నొప్పి కలగవచ్చు.
  • రొమ్ము వాపు : మహిళల్లో రొమ్ము గడ్డలు ఉండడం వలన అవి రొమ్ము వాపుకు కారణం అవుతాయి, దాని వలన ఒక రొమ్ము పెద్దది గాను మరొకటి చిన్నగాను కనిపించవచ్చు.
  • రొమ్ము ఎర్రబడడం : రొమ్ము గడ్డల వలన శరీరం సాధారణ రంగు కంటే రొమ్ము భాగం ఎర్రగా ఉండడం మరియు చనుమొనలు కూడా ఎర్రగా ఉండడం జరుగుతుంది.
మీ రొమ్ము భాగంలో గడ్డలు ఉన్నాయా?

రొమ్ము గడ్డల నిర్ధారణ కోసం చేసే పరీక్షలు

మహిళల్లో రొమ్ము గడ్డలు ఏర్పడితే వాటి రకాన్ని నిర్ధారించడానికి కొన్ని పరీక్షలు అవసరం కావచ్చు.

  • అల్ట్రా సౌండ్ : రొమ్ము గడ్డలను నిర్ధారించడానికి అల్ట్రా సౌండ్ పరీక్ష చేయవచ్చు.
  • MRI : రొమ్ము భాగంలో గడ్డలను గుర్తించడానికి కొన్నిసార్లు MRI పరీక్ష అవసరం అవుతుంది.
  • మామోగ్రామ్ : రొమ్ము భాగంలో ఉన్న గడ్డలను గురించి స్పష్టంగా తెలుసుకోవడానికి ఈ పరీక్షను సూచిస్తారు.

రొమ్ము గడ్డలు చికిత్స

రొమ్ము గడ్డలకు అందించే చికిత్స పేషేంట్ లో ఉన్న రొమ్ము గడ్డల రకాన్ని బట్టి మారుతూ ఉంటుంది. సాధారణంగా కొన్నిసార్లు రొమ్ము గడ్డలు ఎటువంటి చికిత్స లేకుండానే నయం అవుతాయి. మరికొన్ని సందర్భాలలో వాటికి చికిత్స లేదా తీవ్రమైన పరిస్థితుల్లో సర్జరీ అవసరం అవుతుంది.

  • యాంటీబయాటిక్స్ : ఇన్ఫెక్షన్ కారణంగా ఏర్పడే రొమ్ము గడ్డలను తగ్గించడానికి యాంటీబయాటిక్స్ ను సూచించవచ్చు.
  • పెయిన్ కిల్లర్స్ : రొమ్ము గడ్డల వలన కలిగే నొప్పి తగ్గించడానికి పారాసిటమాల్ లాంటి పెయిన్ కిల్లర్ మందులను డాక్టర్లు సూచించవచ్చు.
  • ఐస్ ప్యాక్ : రొమ్ము వాపు ఉన్నప్పుడు నొప్పి మరియు వాపు నుండి ఉపశమనం కోసం ఐస్ ప్యాక్ ను ఉపయోగించవచ్చు.
  • సూది ద్వారా చికిత్స (FNAC) : కొన్ని సందర్భాలలో ద్రవాలు రొమ్ము లోపలి భాగంలో గడ్డకడతాయి, ఇవి ప్రమాదకరమైనవి కాకపోయినా వీటి వలన నొప్పి కలుగుతుంది, అయితే రొమ్ము లోపలికి ఒక సూది ద్వారా ఈ ద్రవాలను పీలుస్తూ బయటకు తీసుకుని రావచ్చు.
  • సర్జరీ : రొమ్ము గడ్డలు దీర్ఘకాలికంగా మరియు ఎక్కువ నొప్పిని కలగజేస్తుంటే వాటిని తొలగించడానికి శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది.

ముగింపు

చాలామంది మహిళలు వారికి రొమ్ము భాగంలో గడ్డలు వచ్చినా కూడా డాక్టర్ ను సంప్రదించడానికి మొహమాట పడుతూ ఉంటారు. శరీరంలో కలిగిన అనారోగ్యం గురించి డాక్టర్ ను సంప్రదించడానికి మొహమాట పడకూడదని గుర్తుంచుకోవాలి. కొన్ని సార్లు చికిత్స ఆలస్యం అయితే ఈ రొమ్ము గడ్డలు ప్రాణాంతకంగా మారగలవు. కాబట్టి రొమ్ము గడ్డలను గుర్తించిన వెంటనే డాక్టర్ ను సంప్రదించడం మంచిది. అనుభవజ్ఞులైన మహిళా వైద్య నిపుణులు యశోద హాస్పిటల్స్ లో అందుబాటులో ఉన్నారు, మహిళా వైద్యులు రొమ్ము గడ్డలను పరీక్షించి అత్యుత్తమ చికిత్స అందించగలరు.

మీ ఆరోగ్య సంరక్షణ గురించి ఏవైనా సందేహాలు ఉన్నాయా? సహాయం చేయడానికి మేము సిద్దంగా ఉన్నాము! మా అనుభవంతులైన నిపుణుల సలహా కొరకు +918929967127 కి కాల్ చేయగలరు.

About Author –

Dr. Sarada M, Sr. Consultant Obstetrician & Gynecologist, Laparoscopic & Robotic Surgeon

About Author

Dr. Sarada M | yashoda hospitals

Dr. Sarada M

DGO, DNB (Obs & Gyn), FRCOG (UK)

Sr. Consultant Obstetrician & Gynecologist, Laparoscopic & Robotic Surgeon