అప్పుడే పుట్టిన పిల్లల్లో కామెర్లు ఎందుకు వస్తాయి? ఈ సమస్యకు ఎలాంటి చికిత్స చేస్తారు?

బిలిరుబిన్ అనేది మానవ శరీరంలో సహజంగా ఏర్పడే ఒక పసుపు వర్ణద్రవ్యం . ఇది ఒక వ్యర్థ పదార్థం , ఇది మన శరీరం యొక్క జీవక్రియలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది దెబ్బతిన్న ఎర్ర రక్త కణాలు విచ్ఛిన్నమైనప్పుడు ఏర్పడుతుంది. ఎర్ర రక్త కణాలలో ఉండే హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ విడిపోయినప్పుడు, అందులోని హేమ్ (Heme) భాగం బిలివర్డిన్ గా మారుతుంది, అది చివరకు బిలిరుబిన్‌గా మారుతుంది. ఇది రక్తం నుండి కాలేయానికి రవాణా చేయబడుతుంది, అక్కడ శుద్ధి చేయబడి శరీరం నుండి తొలగించబడుతుంది.
కాలేయం బిలిరుబిన్‌ను సమర్థవంతంగా శుద్ధి చేసి, లేదా తొలగించడంలో విఫలమైనప్పుడు రక్తంలో బిలిరుబిన్ స్థాయిలు పెరుగుతాయి. ఇలా పెరగడం వలన కామెర్లు వస్తాయి. దీని వలన చర్మం, కళ్లలోని తెల్లటి భాగం (స్క్లెరా) మరియు శ్లేష్మ పొరలు పసుపు రంగులోకి మారుతాయి.
నవజాత శిశువుల కాలేయం పూర్తిగా అభివృద్ధి చెందదు, అందువల్ల ఇది పెద్దవారి కాలేయం వలె బిలిరుబిన్‌ను త్వరగా మరియు సమర్థవంతంగా శుద్ధి చేసి తొలగించలేదు. దీనిని శారీరక కామెర్లు (Physiological Jaundice) అంటారు. ఇది చాలా సాధారణం మరియు సాధారణంగా పుట్టిన కొన్ని రోజుల తర్వాత తగ్గిపోతుంది.
నవజాత శిశువుల్లో కామెర్లు (Jaundice in Newborns) చాలా సాధారణం. దీనిని నియోనాటల్ హైపర్‌బైలిరుబినెమియా (Neonatal Hyperbilirubinemia) అని కూడా అంటారు. చర్మం, కళ్లు పసుపు రంగులోకి మారడానికి కారణం రక్తంలో బిలిరుబిన్ (Bilirubin) అనే పదార్థం అధికంగా పేరుకుపోవడం.
నవజాత శిశువుల్లో కామెర్లకు ప్రధాన కారణాలు మరియు కామెర్ల రకాలు
నవజాత శిశువుల్లో కామెర్లు రావడానికి కారణాలను ప్రధానంగా రెండు రకాలుగా విభజించవచ్చు: శారీరక కామెర్లు (Physiological Jaundice) మరియు రోగకారక కామెర్లు (Pathological Jaundice), వీటి గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
1. శారీరక కామెర్లు (Physiological Jaundice)
ఇది అత్యంత సాధారణమైనది మరియు సాధారణంగా ప్రమాదకరం కాదు.
- శిశువు యొక్క కాలేయం పరిణతి చెందకపోవడం: శిశువు పుట్టినప్పుడు, వారి కాలేయం బైలిరుబిన్‌ను సమర్థవంతంగా తొలగించడానికి ఇంకా పూర్తిగా అభివృద్ధి చెంది ఉండదు. అందువల్ల, బిలిరుబిన్ రక్తంలో కొద్దిగా పేరుకుపోతుంది. దీనివలన అప్పుడే పుట్టిన శిశువులలో కామెర్లు వస్తాయి.
- ఎర్ర రక్త కణాల అధిక విచ్ఛిన్నం: నవజాత శిశువులకు పెద్దవారి కంటే ఎక్కువ ఎర్ర రక్త కణాలు ఉంటాయి. అవి వేగంగా విచ్ఛిన్నం అవుతాయి (దీనినే హీమోలిసిస్ అంటారు), దీని వలన ఎక్కువ మొత్తంలో బిలిరుబిన్ ఉత్పత్తి అవుతుంది. ఇది శిశువులలో కామెర్లు రావడానికి కారణం అవుతుంది.
- పునఃశోషణ (Reabsorption): కొన్ని సందర్భాలలో శిశువు పేగుల్లోని బైలిరుబిన్, బయటకు వెళ్ళే ముందు తిరిగి రక్తంలోకి శోషించబడుతుంది. ఇది కూడా శిశువులలో కామెర్ల సమస్యను కలిగిస్తుంది.
శారీరక కామెర్లు సాధారణంగా పుట్టిన 2 నుండి 4 రోజులలో మొదలై, ఒకటి లేదా రెండు వారాల్లో వాటంతట అవే తగ్గుతాయి.
2. రోగకారక కామెర్లు (Pathological Jaundice)
అప్పుడే పుట్టిన శివువులలో వివిధ ఆరోగ్య సమస్యల కారణంగా కామెర్లు వస్తాయి మరియు వీటిని త్వరగా గుర్తించి చికిత్స అందించాలి.
A. రక్తం యొక్క అసమతుల్యత (Blood Incompatibility)
తల్లి మరియు శిశువు యొక్క రక్త రకాలు లేదా Rh కారకాల మధ్య తేడాలు ఉంటే ఇలా జరగవచ్చు.
- Rh అసమతుల్యత (Rh Incompatibility): తల్లి Rh- నెగటివ్ అయి ఉండి, శిశువు Rh- పాజిటివ్ అయితే, తల్లి శరీరం శిశువు యొక్క ఎర్ర రక్త కణాలను నాశనం చేసే యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంది. దీని వలన ఎర్ర రక్త కణాలు వేగంగా విచ్ఛిన్నం అవుతాయి, అందువలన కామెర్లు రావచ్చు.
- ABO అసమతుల్యత (ABO Incompatibility): తల్లి ‘O’ గ్రూప్ అయి ఉండి, శిశువు ‘A’ లేదా ‘B’ గ్రూప్ అయితే కూడా ఎర్ర రక్త కణాలను నాశనం చేసే ప్రతిచర్యలు సంభవించవచ్చు. ఎర్ర రక్త కణాలు వేగంగా విచ్ఛిన్నం కావడం వలన బిలిరుబిన్ స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయి. దీని వలన నవజాత శిశువుల్లో కామెర్లు రావచ్చు.
B. తల్లిపాలు-సంబంధిత కామెర్లు (Breastfeeding-Related Jaundice)
ఇవి రెండు రకాలుగా ఉంటాయి:
- తల్లిపాలు తక్కువగా తాగడం వల్ల వచ్చే కామెర్లు : శిశువు సరిపడా తల్లిపాలు తాగకపోవడం (ముఖ్యంగా మొదటి కొద్ది రోజుల్లో) వలన వారి శరీరం నిర్జలీకరణానికి గురై, బైలిరుబిన్‌ను సమర్థవంతంగా బయటకు పంపలేదు. దీని వలన నవజాత శిశువుల్లో కామెర్లు రావచ్చు.
- తల్లిపాల కారణంగా వచ్చే కామెర్లు: ఇది అరుదుగా వస్తుంది. తల్లి పాలలోని కొన్ని పదార్థాలు బైలిరుబిన్‌ను విచ్ఛిన్నం చేసే కాలేయ సామర్థ్యాన్ని అడ్డుకుంటాయి. ఇది సాధారణంగా ప్రమాదకరం కాదు మరియు కొన్ని వారాలు లేదా నెలల వరకు ఉంటుంది.
C. ఇతర వైద్య పరిస్థితులు
- సెప్సిస్ (Sepsis): శిశువు యొక్క రక్తంలో సంక్రమణ (ఇన్ఫెక్షన్) ఉండటం వలన కూడా కామెర్లు వచ్చే ప్రమాదం ఉంది.
- హైపోథైరాయిడిజం (Hypothyroidism): థైరాయిడ్ హార్మోన్లు శరీరంలోని జీవక్రియ మరియు అవయవాల పనితీరును నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ హార్మోన్లు తగ్గినప్పుడు, కాలేయం బైలిరుబిన్‌ను ప్రాసెస్ చేసే విధానం మందగిస్తుంది. ఫలితంగా శిశువుల్లో కామెర్లు కలగవచ్చు.
- కాళేయు వ్యాధులు:
- పిత్త వాహికల అట్రేసియా (Biliary Atresia):
పిత్త వాహికలు సరిగా అభివృద్ధి చెందకపోవడం, దీని వల్ల పిత్తరసము కాళేయు నుండి మేలుకువ వెళ్లలేకపోవడం. ఇది అత్యంత తీవ్రమైన కాళేయు సమస్య. - హెపటైటిస్ (Hepatitis):
వైరస్ లేదా ఇతర కారణాల వల్ల కాళేయు వాపుకు గురవుతుంది. కాళేయు సరిగా పనిచేయకపోవడం వల్ల, ఆహార జీర్ణం సరిగా జరగకపోవచ్చు. ఇది పిత్తిగా కాళేయు సమస్య.
- పిత్త వాహికల అట్రేసియా (Biliary Atresia):
- జెనెటిక్ లోపాలు : గిల్బర్ట్ సిండ్రోమ్ (Gilbert’s Syndrome) వంటివి, ఇవి బైలిరుబిన్‌ను ప్రాసెస్ చేసే ఎంజైమ్‌లను ప్రభావితం చేస్తాయి.
- ఎర్ర రక్త కణాల లోపాలు (Red Blood Cell Defects): సాధారణంగా ఎర్రరక్త కణాలు గుండ్రంగా ఉంటాయి. అయితే ఎవరిలో అయితే ఇలాంటి ఎర్రరక్తకణాలు తక్కువగా ఉండడం వలన త్వరగా విచ్ఛిన్నం అయ్యేలా చేస్తాయి. దీనివలన శిశువుల్లో కామెర్లు రావచ్చు.
ఇతర ప్రమాద కారకాలు (Risk Factors)
కొన్ని పరిస్థితులు శిశువులలో కామెర్లు వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి:
- ముందస్తు ప్రసవం : 38 వారాల కంటే ముందు జన్మించిన శిశువుల కాలేయం ఇంకా తక్కువ పరిణతి చెంది ఉంటుంది.
- శరీరంపై అధిక గాయాలు : పుట్టినప్పుడు గాయాలు ఏర్పడితే, ఆ ప్రాంతంలో విచ్ఛిన్నమైన రక్తం అధిక బిలిరుబిన్ ఉత్పత్తికి దారితీస్తుంది.
నవజాత శిశువుల్లో కామెర్లు ఉంటే, అది ఎంతవరకు పెరిగిందో తెలుసుకోవడానికి వైద్యులు బిలిరుబిన్ స్థాయిలను పరీక్షించి, దాని తీవ్రతను బట్టి ఫోటోథెరపీ (Phototherapy) వంటి చికిత్సలను అందిస్తారు. అందువల్ల, శిశువులో పసుపు రంగు కనిపించిన వెంటనే శిశువైద్యుడిని (Pediatrician) సంప్రదించడం చాలా ముఖ్యం.
నవజాత శిశువులలో కామెర్ల లక్షణాలు
కామెర్ల యొక్క ప్రధాన మరియు మొదటి లక్షణం చర్మం పసుపు రంగులోకి మారడం. బిలిరుబిన్ స్థాయి పెరిగే కొద్దీ, పసుపు రంగు తల నుండి పాదాల వైపుకు విస్తరిస్తుంది. నవజాత శిశువుల్లో కామెర్లు (Jaundice) యొక్క లక్షణాలు ప్రధానంగా బిలిరుబిన్ (Bilirubin) స్థాయిలు పెరగడం వల్ల చర్మం, కళ్లు మరియు ఇతర శరీర భాగాల రంగులో మార్పుల ద్వారా కనిపిస్తాయి.కామెర్ల లక్షణాలు మరియు తీవ్రత గురించి ఇక్కడ వివరంగా తెలుసుకోవచ్చు.
1. చర్మం మరియు కళ్ల రంగులో మార్పులు (Yellow Discoloration)
- కళ్లలోని తెల్లని భాగం (Sclera): కామెర్లు వచ్చినప్పుడు మొదటగా కళ్లలోని తెల్లని భాగం (స్క్లెరా) పసుపు రంగులోకి మారుతుంది. ఇది తల్లిదండ్రులు సులభంగా గుర్తించే లక్షణం.
- ముఖం మరియు తల: పసుపు రంగు మొదట ముఖం మరియు నుదురు భాగంలో కనిపిస్తుంది.
- శరీరం కిందకు విస్తరించడం: బిలిరుబిన్ స్థాయిలు మరింత పెరిగితే, పసుపు రంగు మెడ, ఛాతీ, పొత్తికడుపు (Stomach), తొడలు మరియు చివరకు పాదాల వరకు వ్యాపిస్తుంది.
- గుర్తించే విధానం: శిశువు చర్మంపై వేలితో సున్నితంగా నొక్కి, వేలును తీసివేసినప్పుడు, చర్మం యొక్క అసలు రంగు కాకుండా పసుపు రంగు కనిపిస్తే అది కామెర్లు ఉన్నట్లు సూచిస్తుంది. ఈ పరీక్షను సహజ కాంతిలో (Natural Light) చేయడం ఉత్తమం.
2. బిలిరుబిన్ అధికంగా పెరిగినప్పుడు కనిపించే లక్షణాలు
సాధారణ (శారీరక) కామెర్లలో పైన చెప్పిన లక్షణాలు మాత్రమే కనిపిస్తాయి. కానీ, బిలిరుబిన్ స్థాయిలు చాలా అధికమై, మెదడును ప్రభావితం చేసే ప్రమాదం (దీనిని కెర్నిక్టెరస్ అంటారు) ఉన్నప్పుడు, శిశువులో ఈ తీవ్రమైన లక్షణాలు కనిపిస్తాయి. ఇవి అత్యవసర వైద్య పరిస్థితిని సూచిస్తాయి:
- అధిక జ్వరం : అకస్మాత్తుగా లేదా అసాధారణంగా పెరిగిన శరీర ఉష్ణోగ్రత, జ్వరం ఎక్కువగా ఉండవచ్చు.
- నిద్ర మత్తు మరియు చురుకుదనం లేకపోవడం : శిశువు చాలా నిదానంగా, మత్తుగా కనిపించడం, ఎప్పుడూ నిద్రపోతూ ఉండడం.
- తక్కువ పాలు తాగడం: శిశువు పాలు తాగడానికి ఆసక్తి చూపకపోవడం లేదా సరిగా పాలు తాగలేకపోవడం కూడా కామెర్ల లక్షణం.
- అధికంగా ఏడవడం : కామెర్లు ఉన్నప్పుడు శిశువు తరచుగా మరియు నిరంతరాయంగా ఏడుస్తూ ఉండవచ్చు.
- శరీరం వెనుకకు వంగడం : శిశువు తన శరీరాన్ని వెనుకకు వంచడం కూడా కామెర్ల లక్షణం.
- కండరాల బలహీనత లేదా బిగుతు: కండరాలు చాలా వదులుగా (ఫ్లాపీగా) లేదా చాలా బిగుతుగా (గట్టిగా) ఉండటం.
- మూర్ఛ : ఇది అత్యంత తీవ్రమైన లక్షణం. కామెర్లు ఉన్నప్పుడు శిశివు మూర్చపోతే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.
3. మలం మరియు మూత్రంలో మార్పులు
కొన్ని రకాల కామెర్లలో (ముఖ్యంగా కాలేయ సమస్యలు లేదా పిత్త వాహిక అడ్డంకులు – పిత్త వాహిక అట్రేసియా వంటివి) మలం మరియు మూత్రం రంగులో కూడా మార్పులు కనిపిస్తాయి:
- లేత/తెల్లటి మలం : పిత్త రసం పేగుల్లోకి చేరకపోతే, మలానికి రంగు ఇచ్చే బిలిరుబిన్ ఉండదు. దీని వలన మలం బూడిద రంగులో లేదా చాలా లేత రంగులో కనిపిస్తుంది.
- ముదురు పసుపు/గోధుమ రంగు మూత్రం : బిలిరుబిన్ మూత్రంలోకి ఎక్కువగా విడుదల కావడం వల్ల మూత్రం రంగు సాధారణం కంటే ముదురు రంగులో ఉంటుంది. సాధారణంగా నవజాత శిశువు మూత్రం రంగు ఉండదు.
నవజాత శిశువులలో కామెర్లకు చికిత్స
నవజాత శిశువుల్లో కామెర్లకు చికిత్స అనేది శిశువు యొక్క వయస్సు, పుట్టిన ఎన్ని రోజుల తర్వాత వచ్చింది, మరియు రక్తంలో బిలిరుబిన్ స్థాయి ఎంత ఉంది అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది.
కామెర్ల చికిత్సలో ప్రధాన లక్ష్యం, బిలిరుబిన్ స్థాయిలు మెదడును దెబ్బతీసే (కెర్నిక్టెరస్) ప్రమాదకర స్థాయికి పెరగకుండా నియంత్రించడం. నవజాత శిశువుల్లో కామెర్లకు అందించే చికిత్సల వివరాలు ఇక్కడ వివరంగా తెలుసుకోవచ్చు.
శారీరక కామెర్లకు చికిత్స
చాలా మంది శిశువులలో వచ్చే సాధారణ (శారీరక) కామెర్లకు తరచుగా వైద్య చికిత్స అవసరం లేదు. అవి కొన్ని వారాలలో వాటంతట అవే తగ్గుతాయి. అయితే, వేగంగా తగ్గడానికి ఈ చర్యలు సహాయపడతాయి:
- తరచుగా పాలివ్వడం (Frequent Feeding): శిశువుకు వీలైనంత తరచుగా (రోజుకు 8 నుంచి 12 సార్లు) తల్లిపాలు ఇవ్వాలి. పాలు బాగా తాగడం వల్ల శిశువు శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది.
- ఉపయోగం: ఎక్కువ పాలు తాగడం వలన జీర్ణవ్యవస్థ చురుకుగా పనిచేసి, బైలిరుబిన్‌ను మలం ద్వారా వేగంగా బయటకు పంపుతుంది. మలం రంగు మారడం బిలిరుబిన్ శరీరం నుండి బయటకు వెళ్తున్నట్లు సూచిస్తుంది.
- డాక్టర్ సలహా మేరకు సప్లిమెంట్స్: కొన్ని సందర్భాల్లో, తల్లిపాలు సరిపోకపోతే లేదా శిశువు బరువు తగ్గితే, వైద్యులు తాత్కాలికంగా ఫార్ములా పాలు లేదా సప్లిమెంటరీ ఫీడింగ్‌ను సిఫారసు చేయవచ్చు.
ఫోటోథెరపీ
ఇది నవజాత శిశువు కామెర్లకు అత్యంత సాధారణ మరియు ప్రభావవంతమైన చికిత్సా విధానం. బిలిరుబిన్ స్థాయి ప్రమాదకరమైన స్థాయికి చేరుకున్నప్పుడు లేదా దానికి చేరుకునే అవకాశం ఉన్నప్పుడు ఈ చికిత్సను ప్రారంభిస్తారు.
- చికిత్సా విధానం: శిశువును ప్రత్యేకమైన నీలం-ఆకుపచ్చ వర్ణపటం గల కాంతి కింద (సాధారణంగా ఒక ఉష్ణోగ్రత నియంత్రిత పడకపై) ఉంచుతారు.
- ఎలా పనిచేస్తుంది: ఈ కాంతి శిశువు యొక్క చర్మంపై పడినప్పుడు, అది బిలిరుబిన్ యొక్క ఆకృతిని మారుస్తుంది (దీనిని ఫోటో-ఐసోమెరైజేషన్ అంటారు). ఈ మార్పు చెందిన బిలిరుబిన్ నీటిలో కరిగేలా మారుతుంది.
- ఫలితం: నీటిలో కరిగే బిలిరుబిన్ కాలేయంతో సంబంధం లేకుండా నేరుగా మూత్రం మరియు మలం ద్వారా సులభంగా శరీరం నుండి బయటకు వెళ్లిపోతుంది.
- జాగ్రత్తలు: చికిత్స సమయంలో శిశువు కళ్లను రక్షించడానికి ప్రత్యేక మాస్క్ ధరింపజేస్తారు. శిశువు వీలైనంత ఎక్కువ చర్మాన్ని కాంతికి బహిర్గతం చేయడానికి డైపర్ మినహా మిగిలిన భాగంలో బట్టలు లేకుండా ఉంచుతారు.
ఎక్స్‌ఛేంజ్ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్
ఇది అత్యవసర మరియు తీవ్రమైన కామెర్ల చికిత్స. బిలిరుబిన్ స్థాయిలు చాలా ఎక్కువై, ఫోటోథెరపీకి స్పందించనప్పుడు లేదా మెదడు దెబ్బతినే ప్రమాదం ఉన్నప్పుడు దీనిని ఉపయోగిస్తారు.
- చికిత్సా విధానం: ఈ ప్రక్రియలో, శిశువు యొక్క రక్తం యొక్క కొంత భాగాన్ని కొద్దికొద్దిగా తీసివేసి, దాని స్థానంలో దాత నుండి సేకరించిన రక్తాన్ని (బిలిరుబిన్ లేని రక్తం) ఎక్కిస్తారు.
- ఉపయోగం: ఇది శిశువు రక్తంలోని అధిక బైలిరుబిన్‌ను త్వరగా తొలగించి, అదే సమయంలో రక్తహీనత వంటి ఇతర సమస్యలను సరిచేయడానికి సహాయపడుతుంది.
అంతర్లీన కారణాలకు చికిత్స
కామెర్లు ఏదైనా ఇతర కారణం సమస్య వలన వచ్చి ఉంటే, ఆ సమస్యకు చికిత్స చేస్తారు:
- హైపోథైరాయిడిజం : శిశువుకు థైరాయిడ్ హార్మోన్ లోపం ఉంటే, వారికి హార్మోన్ సప్లిమెంట్లు ఇస్తారు.
- ఇన్ఫెక్షన్: బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ ఉంటే యాంటీబయాటిక్స్ ఇస్తారు.
- రక్తం లో తేడాలు (Rh/ABO Incompatibility): ఈ సమస్య వలన కామెర్లు కలిగితే రక్త మార్పిడి అవసరం కావచ్చు.
- పిత్త వాహిక అట్రేసియా (Biliary Atresia): ఇది కాలేయానికి సంబంధించిన తీవ్రమైన సమస్య. దీనికి శస్త్రచికిత్స (Surgery), ముఖ్యంగా Kasai Procedure, అవసరం కావచ్చు.
కామెర్ల తీవ్రతను మరియు చికిత్స ఎంతవరకు అవసరమో తెలుసుకోవడానికి, వైద్యులు ప్రతి కొన్ని గంటలకు రక్తంలో బిలిరుబిన్ స్థాయిలను నిరంతరం పర్యవేక్షిస్తారు.
నవజాత శిశువుల్లో కామెర్లు సాధారణమైన సమస్య, చాలా సందర్భాలలో ఎటువంటి చికిత్స చేయకుండానే తగ్గిపోతుంది. అయితే కామెర్లు సమస్య ఉన్నప్పుడు తప్పనిసరిగా పీడియాట్రీషియన్ నుండి పర్యవేక్షణ అవసరం. యశోద హాస్పిటల్స్ లో అత్యంత అనుభవజ్ఞులైన పిల్లల వైద్య నిపుణులు అందుబాటులో ఉన్నారు. నవజాత శిశువుల్లో కామెర్లు సమస్యకు అత్యుత్తమ చికిత్స అందిస్తారు.
మీ ఆరోగ్య సంరక్షణ గురించి ఏవైనా సందేహాలు ఉన్నాయా? సహాయం చేయడానికి మేము సిద్దంగా ఉన్నాము! మా అనుభవంతులైన నిపుణుల సలహా కొరకు +918065906165 కి కాల్ చేయగలరు.


















Appointment
WhatsApp
Call
More