General

తీవ్రమైన తలనొప్పి, కాళ్లూచేతుల తిమ్మిర్లా? మెదడులో గడ్డలు కావచ్చు

బ్రెయిన్ సర్జరీలను ఖచ్చితం సురక్షితం చేస్తున్న ఐ ఎం.ఆర్.ఐ.

ఆకాశ్(29) సాఫ్ట్ వేర్ ఇంజనీర్. అమెరికాలో వేగంగా మారిపోతున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని గడువుకంటే ముందే ప్రాజెక్ట్ పూర్తిచేయాలన్నకంపనీ ఆదేశంతో రోజూ అదనపు గంటలు పనిచేస్తున్నాడు. ప్రాజెక్ట్ మూడొంతులు పూర్తయిన దశలో ఓ రోజు సాయంత్రం కాఫీ మిషన్ వద్దకు వెళ్లేందుకు లేచి హఠాత్తుగా కళ్లుతిరిగి పడిపోయాడు.వాంతి చేసుకున్నాడు. ఈ హఠాత్పరిణామంలో ఆందోళన చెందిన టీమ్ లీడర్ పూనుకుని వెంటనే దగ్గరలోని ఓ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు జరిపిన డాక్టర్లు ఆ యువకుడి మెదడులో గడ్డ( బెనిగ్న్ ప్రైమరీ ట్యూమర్) ఉన్నట్లు గుర్తించి శస్త్రచికిత్స చేయించుకోవాలని సిఫార్సుచేశారు. న్యూరోసర్జరీకి సంబంధించి అత్యాధునిక ఏర్పాట్లు, అనుభవజ్ఞులైన వైద్యనిపుణులు అందుబాటులో ఉండటం వల్ల ఆ గడ్డను సమూలంగా తొలగించి వేయటంతో అనూహ్యమైన రీతిలో త్వరగా కోలుకున్న ఆకాశ్ తిరిగి తన ప్రాజెక్ట్ గడువులోగా పూర్తిచేయగలిగాడు.

మెదడుకు శస్త్రచికిత్స (బ్రెయిన్ సర్జరీ)లో మెదడుకు సంబంధించిన సమస్యలను పరిష్కరించే, నిర్మాణ పరమైన లోటుపాట్లను సరిచేసే పలురకాల చికిత్సలు ఉంటాయి. మెదడు ఆపరేషన్లే అనేక రకాలు. మెదడులోని ఏ ప్రాంతానికి చికిత్సచేయాలన్న అంశాన్ని బట్టి డాక్టర్లు అందుకు అనువైన శస్త్రచికిత్సను సిఫార్సుచేస్తారు. వైద్యరంగంలో జరిగిన సాంకేతిక అభివృద్ధి వల్ల బ్రెయిన్ సర్జరీలు ఇదివరకు ఎన్నడూ లేనంత ఖచ్ఛితంగా, ప్రభావ వంతంగా మారాయి. నిజానికి మెదడుకు చేసే శస్త్రచికిత్సలు సంక్లిష్టమైనవి, కీలకమైనవి. మెదడులో అసహజమైన మార్పులు, పరిణామాలను సరిచేయటానికి తప్పనిసరి పరిస్థితుల్లో బ్రెయిన్ సర్జరీని సిఫార్సుచేస్తారు. ఈలోటుపాట్లు పుట్టుకతో వచ్చినవో, ప్రమాదాలు, వ్యాధులు, గాయాలు లేదా ఇతర సమస్యల కారణంగా జరిగి ఉండవచ్చు. కారణం ఏదైనప్పటికీ మెదడులో గడ్డలు తీవ్రమైన తలనొప్పి మొదలుకుని శరీరంలోని వివిధ అవయవాల పనితీరును దెబ్బదీసి వ్యక్తి సాధారణ జీవితాన్ని అతలాకుతలంచేయటం వరకూ అనేక సమస్యలకు కారణం అవుతాయి.

మెదడులో ఏర్పడే గడ్డల శస్త్రచికిత్సకు సంబంధించి పెద్ద ముందడుగు పడింది. విదేశాలలోని ప్రపంచ ప్రఖ్యాత వైద్యకేంద్రాలలో బ్రెయిన్ సర్జరీలకు అపూర్వమైన విధంగా ఖచ్చితత్వాన్ని కలిగించి, గడ్డలను సమూలంగా తొలగించి వేసేందుకు మళ్లీమళ్లీ ఆపరేషన్లు చేయాల్సిన అవసరం లేకుండా చేయటం ద్వారా బ్రెయిన్ సర్జరీలలో విప్లవాన్ని తీసుకువచ్చిన ఇంట్రాఆపరేటివ్ 3డి ఎం.ఆర్.ఐ.(ఐ ఎం.ఆర్.ఐ.) మనదేశంలో అందుబాటులోకి వచ్చింది. తొలిసారిగా యశోద గ్రూప్ హాస్పిటల్స్ లో దీనిని నెలకొల్పారు. దీంతో మనదేశంలో మెదడులో గడ్డలకు ప్రస్తుతం చేస్తున్న శస్త్రచికిత్సను ఇది పూర్తిగా మార్చివేయ గలుగుతుంది. ఈ ఇంట్రా ఆపరేటివ్ ఎం.ఆర్.ఐ. సాయంతో సర్జన్లు కేంద్రనాడీ మండలం(సి.ఎన్.ఎస్.)లో ఏర్పడే గడ్డలను మూలాల వరకూ గుర్తించి కూకటి వేళ్లతో తొలగించి వేయటానికి వీలవుతుంది. దీనితో మెదడులో గడ్డల చికిత్స ఇదివరకు ఎన్నడూ లేనంత ప్రభావశీలంగా, సమర్థంగా రూపొందుతుంది. గడచిన కొద్ది నెలల కాలంలో ఐఎమ్మారై ని ఉపయోగించి యశోద గ్రూప్ హాస్పిటల్స్కు చెందిన సర్జన్లు విజయవంతంగా వంద వరకూ సంక్లిష్టమైన మెదడు గడ్డల ఆపరేషన్లు చేసి మెదడులో గడ్డలను పూర్తిగా తీసివేయగలిగారు.

వ్యక్తి శరీరంలోని అన్ని అవయవాలను నియంత్రిచేదయిన మెదడుకు శస్త్రచికిత్సలంటే ప్రాణాపాయం, శరీరంలో భాగాల పనితీరులో మార్పునకు సంబంధించి భయాందోళన కలిగిస్తూవచ్చింది. అయితే న్యూరోసర్జరీ వైద్యవిభాగంలోకి మైక్రోస్కోప్ ల ప్రవేశం ఈ శస్త్రచికిత్సలను భద్రమైనవిగా, అత్యంత ప్రభావవంతమైనవిగా మార్చటమే కాకుండా ఎంతటి సున్నితమైన భాగాలలోనైనా ఖచ్ఛితంగా సర్జరీ నిర్వహించేట్లుగా మార్చివేశాయి. అయితే మైక్రోస్కోప్ గుండా చూస్తున్నప్పుడు సర్జన్ మెదడులోని ఆ భాగాలను ఊహించగలడు కానీ లోపలి భాగాల్లోకి ప్రవేశించటం కష్టంగా, ప్రమాదాలతో కూడినదిగానే ఉండింది. న్యూరోనావిగేషన్ ఈ ఆపరేషనుకు ముందు అందించే 3డి చిత్రాలు ఇపుడు ఈ సమస్యను అధిగమించేందుకు ఉపయోగపడుతున్నాయి. ఈ న్యూరోనావిగేషన్ మనం విస్తృతంగా వాడుతున్న జి.పి.ఎస్. లాగా సర్జన్ శస్త్రచికిత్స చేస్తున్న మెదడు భాగాన్ని స్పష్టంగా గుర్తించేందుకు సాయపడుతున్నది. నిమ్ ఎక్లిప్స్ వంటి ఇంట్రాఆపరేటివ్ ఎలక్ట్రోఫిజియోలాజికల్ మానిటరింగ్ ను ఉపయోగించుకుని మెదడు తాలూకు ఫంక్షనల్ ప్రాంతాలను గుర్తించి శస్త్రచికిత్స సమయంలో వాటికి ఎటువంటి నష్టం జరగకుండా పూర్తి జాగ్రత్త తీసుకునేందుకు అవకాశం కలుగుతున్నది.

యశోద హాస్పిటల్స్ లో ఇప్పటికే అత్యాధునికమైన పెంటిరో డి900 మైక్రోస్కోప్, అన్ని ఏర్పాట్లతో కూడిన మెడిట్రోనిక్ నావిగేషన్ సిస్టమ్, నిమ్ ఎక్లిప్స్ ఉన్నాయి. ఈ రంగంలోని అత్యంత ఆధునిక సంక్లిష్ట సాంకేతికతో కూడిన ఈ వ్యవస్థను ఉపయోగించి వ్యాధిగ్రస్థులకు గరిష్ట ప్రయోజనం సమకూర్చటంలో కొన్ని ఆచరణకు సంబంధించిన సమస్యలు ఎదురయ్యేవి. మైక్రోస్కోప్ శస్త్రచికిత్స చేస్తున్న ప్రదేశాన్ని న్యూరోనావిగేషన్ తో కలిసి కాంతివంతంగా చూపించగలుగుతుంది. కానీ ఇది మెదడులోని సాధారణ, అసాధారణ కణాల మధ్య వ్యత్యాసాన్ని చూపించలేదు. కొన్నిరకాల గడ్డలు పూర్తిగా మైక్రోస్కోప్ కింద చూసినపుడు మెదడు కణజాలం లాగానే కనిపిస్తాయి. ఈ సమస్యను ఎదుర్కోవటంలో న్యూరో నావిగేషన్ కొంత సాయపడగలదు. అయితే మెత్తని కణజాలంతో కూడిన మెదడు సర్జరీ సమయంలో స్థిరంగా ఉండదు. కదిలికలకు(షిఫ్ట్స్) గురవుతుంటుంది. దీనివల్ల శస్త్రచికిత్స ప్రారంభానికి ముందు న్యూరోనావిగేషన్ ద్వారా అందిన చిత్రాలు ఆపరేషన్ను కొనసాగించే సమయంలో అంతగా ఉపయోగపడవు. అందువల్ల స్పష్టత లేకుండా సర్జరీ కొనసాగించాల్సి రావటం పలు సందర్భాలలో ఆపరేషన్ తరువాత కూడా మెదడులోని గడ్డలో కొంత భాగం మిగిలిపోయి ఉండి మళ్లీ పెరిగేందుకు అవకాశం కల్పిస్తుంది. శస్త్రచికిత్స కొంత పూర్తయిన తరువాత ఇంకా గడ్డ భాగం ఏమైనా మిగిలి ఉందా, దాని అంచులు ఎంతవరకు విస్తరించి ఉన్నాయి స్పష్టంగా చూపిస్తుంటుంది.

ఎం.ఆర్.ఐ.(మాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్) సాయంతో శరీర అంతర్భాగంలోని అవయవాల స్పష్టమైన చిత్రాలను తీయటానికి వీలవుతుంది. ఇప్పటి వరకూ బ్రెయిన్ ట్యూమర్స్ వ్యాధిగ్రస్తులకు శస్త్రచికిత్సచేసేందుకు ముందు ఎం.ఆర్.ఐ. పరీక్షచేస్తున్నారు. ఈ ఎం.ఆర్.ఐ. చిత్రాల ఆధారంగా సర్జరీ చేస్తున్నారు. ఆపరేషన్ తరువాత రెండో రోజున పేషంటును మళ్లీ ఎం.ఆర్.ఐ. గదికి తరలించి మరోసారి పరీక్ష చేసి ట్యూమర్ ఏమేరకు తీసివేయగలిగింది పరిశీలిస్తున్నారు. దీని ఆధారంగా ట్యూమర్ ఇంకా కొంత మిగిలి ఉన్నట్టు గమనిస్తే మళ్లీ సర్జరీ చేస్తున్నారు. దీంతో బ్రెయిన్ ట్యూమరును మొత్తంగా తొలగించి వేయటానికి ఈ విధంగా పలుసార్లు సర్జరీలు చేయాల్సి వస్తున్నది. అదే ఇంట్రాఆపేరేటివ్ ఎం.ఆర్.ఐ. శస్త్ర చికిత్స సమయంలోనే స్కాన్ ను నిర్వహించి అక్కడికక్కడే శస్త్రచికిత్సలో మార్పులు చేయటానికి వీలుకలుగుతుంది. అంటే పదేపదే సర్జరీలు చేయాల్సిన అగత్యం తప్పుతుంది.

బ్రెయిన్ సర్జరీలు చేసేటపుడు తరచూ బ్రెయిన్ షిఫ్ట్స్ జరుగుతుంటాయి. దీంతో శస్త్రచికిత్సకు ముందు తీసిన ఎం.ఆర్.ఐ. చిత్రాలతో పోలిస్తే మెదడు పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. ఒక్క శస్త్రచికిత్సలోనే మెదడు గడ్డలను తొలగించే పనిని విజయవంతంగా పూర్తిచేయటానికి రియల్ టైమ్ ఇమేజెస్ అవసరం అవుతాయి.మెదడు గడ్డల సర్జరీ సమయంలో ఐ ఎం.ఆర్.ఐ. అందుబాటులో ఉంటే ‘బ్రెయిన్ షిప్ట్‘ వల్ల సంభవించే అసాధారణ మార్పులనూ గమనించి ఆపరేషనును నిర్వహించేందుకు వీలుకలుగుతుంది. ఐ.ఎం.ఆర్.ఐ. ద్వారా పొందే ఫొటోలను చూసి తొలగించినది కాకుండా ట్యూమర్ తాలూకు కణజాలం, అసాధారణ కణాలు ఇంకా ఏమైనా మిగిలి ఉన్నాయా పరీశీలించి వ్యవహరించటానికి ఐ ఎం.ఆర్.ఐ. ద్వారా లభించే ఇమేజెస్ ఉపయోగపడతాయని సీనియర్ న్యూరో సర్జన్లు తమ అనుభవంతో చెపుతున్నారు. ఈ రకమైన ఇమేజెస్ లేకుండా బ్రెయిన్ ట్యూమర్ల అంచులను ఖచ్చితంగా నిర్ధారించటం, వాటిని సమూలంగా తొలగించి వేయటం చాలా కష్టమైన పని అని వారు అంటున్నారు.

శస్త్రచికిత్స చేస్తున్న సమయంలో ఇంట్రా ఆపరేటివ్ ఎం.ఆర్.ఐ. ని సర్జన్లకు అందుబాటులో ఉంచే విధంగా ఆపరేషన్ థియేటరు ప్రత్యేకంగా రూపొందించాల్సి ఉంటుంది. మైక్రోస్కోప్, న్యూరోనావిగేషన్ వ్యవస్థలను దీనికి తోడుగా ఏర్పాటుచేస్తారు. అత్యాధునిక పరికరాల సముదాయంతో ఆపరేషన్ జరుగుతుండగానే నిముషనిముషానికి చిత్రాలను అందిచేందుకు వీలుకలుగుతుంది. ఈ ఇమేజస్ అందుబాటులో ఉండటం వల్ల సర్జన్లు ట్యూమరు పరిమాణం, విస్తరణను స్పష్టంగా చూడగల్గటం వల్ల దానిని మూలల నుంచి తొలగించగలుగుతారు. అంతేకాదు. ఆ క్రమంలో మెదడులోని ఆయాప్రాంతాలకు ఏమాత్రం నష్టం జరగకుండా, తద్వారా అవి అదుపుచేసే శరీరాభాగాల పనితీరు దెబ్బతినకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకోగలుగుతారు.

ఐ.ఎం.ఆర్.ఐ. ఎవరెవరికి ఉపయోగపడుతుంది?

ఇంట్రాఆపరేటివ్ ఎం.ఆర్.ఐ. మెదడులో గడ్డలు ఉన్న, డైస్టోనియా, గ్లియోమా, న్యూరోసైక్రియాట్రిక్, పార్కిన్సన్స్ డిసీజ్, వణుకుడు(ఎసెన్షియల్ టెర్మర్స్), పిట్యూటరీ గ్రంధి గడ్డలు, మూర్చ వ్యాధుల చికిత్సలో కీలకమైన పాత్రవహిస్తుంది. ఈ వ్యాధులకు సంబంధించి సంక్లిష్టమైన శస్త్రచికిత్సలను మెదడులోని ఆరోగ్యకరమైన కణాజాలానికి ఎంతమాత్రం నష్టం జరగకుండా నిర్వహించేందుకు దీని ద్వారా వీలుకలుగుతుంది. ఒకే సర్జరీతో పూర్తి ప్రయోజనం పొందగలుగుతారు.

ఇంట్రాఆపరేటివ్ ఎం.ఆర్.ఐ. ఎలా పనిచేస్తుంది?

రేడియో తరంగాలు, అయస్కాంత క్షేత్రాలను ఉపయోగించుకుని ఇంట్రాఆపరేటివ్ ఎం.ఆర్.ఐ. పూర్తి వివరాలు తెలిపే విధంగా శరీరభాగాలు, కణజాలాలకు సంబంధించిన స్పష్టమైన చిత్రాలను తీస్తుంది. కొత్తతరం సాధారణ ఎం.ఆర్.ఐ. లాంటి ఏర్పాట్లు ఉన్నప్పటికీ ఇది శస్త్రచికిత్స చేసే ఆపరేషన్ థియేటరులో పనిచేయగల విధంగా రూపొందించబడి ఉంటుంది. ఆపేరషన్ చేసే సమయంలో సర్జన్లు తమకు అవసరమైన ఇమేజెస్ ను వెంటవెంటనే పొందగలుగుతుంటారు. ఆపరేషన్ చేయించుకుంటున్న వ్యక్తి ఆరోగ్యపరిస్థితి, చేస్తున్న సర్జరీ సంక్లిష్టతను బట్టి ఈ ఇమేజెస్ ను తీసేందుకు ఏర్పాట్లు చేసుకుంటారు. బ్రెయిన్ సూట్ ఆనే ఈ ప్రత్యేక తరహా ఆపరేషన్ థియేటరులో జరిగే సర్జరీని గ్లోబల్ పొజీషనింగ్ సిస్టమ్ (జి.పి.ఎస్.) ఏర్పాటు తో కారును నడిపించటం లాంటిది ప్రతీ దశ పూర్తి స్పష్టతతో, సచిత్రమైన మార్గదర్శకత్వంతో సాగుతుంటుంది. మామూలు ఆపరేషన్ థియేటర్ లో బ్రెయిన్ సర్జరీకి ఇది పూర్తిగా భిన్నమైనదన్నది స్పష్టం.

ఐ ఎం.ఆర్.ఐ. వల్ల అదనపు ప్రయోజనాలు

మెదడు ఆపరేషన్లు చేసేందుకు ప్రణాళికను రూపొందించుకునేటపుడు డాక్టర్లు ఇమేజింగ్ పరీక్షలు చేయించి సిద్ధంగా ఉంచుకుంటారు. అయితే సర్జరీచేస్తున్న సమయంలో అనివార్యంగా జరిగే మెదడు కదలికల(బ్రెయిన్ షిఫ్ట్స్) కారణంగా పరిస్థితి మారిపోతూఉంటుంది. దాంతో అంతకు ముందటి ఇమేజ్ ఆధారంగా మెదడు ఆపరేషన్ను కొనసాగించటం కష్టంగా, నష్టదాయకంగా తయారవుతుంది. ఈ సమయంలో ఇంట్రాఆపరేటివ్ ఎం.ఆర్.ఐ. ఎప్పటికప్పుడు సమకూర్చే చిత్రాలు (రియల్ టైమ్ ఇమేజెస్) మెదడు తాజా పరిస్థితిని, గడ్డ తాలూకు విస్తృతి – దాని అంచులను సుస్పష్టంగా చూపిస్తాయి. మెదడులోని సాధారణ కణాలు, గడ్డల కణాజాలాన్ని విడివిడిగా గుర్తించేందుకు వీలవుతుంది. ఈ విధంగా ఇంట్రాఆపరేటివ్ ఐ ఎం.ఆర్.ఐ. అందిచే చిత్రాలు సర్జన్లకు చాలా ఉపయోగకరంగా ఉండి మెదడు శస్త్రచికిత్సలను సురక్షితం, అపూర్వమైన రీతిలో ఖచ్చితం చేస్తాయి. అంతే కాదు సంప్రదాయ బ్రెయిన్ సర్జరీలకు భిన్నంగా మెదడులో గడ్డను సమూలంగా తొలగించి వేయటం ద్వారా పదేపదే మెదడు ఆపరేషన్లు చేయాల్సిన పరిస్థితిని నివారిస్తుంది.

Yashoda Hospitals

Recent Posts

కళ్లకలక (కంజెక్టివైటీస్‌): రకాలు, లక్షణాలు మరియు నివారణ చర్యలు

దగ్గు, జలుబు మాదిరి సీజనల్‌గా వర్షాకాలంలో వచ్చే సాధారణ వ్యాధుల్లో కళ్లకలక ఒకటి. కళ్లకలక సమస్య స్టాఫిలోకాకల్‌ బ్యాక్టీరియాల ద్వారా…

6 days ago

థైరాయిడ్ వ్యాధి: రకాలు, లక్షణాలు, కారణాలు & నియంత్రణ చర్యలు

థైరాయిడ్ గ్రంథి అనేది మెడ మధ్య స్వరపేటిక క్రింద భాగాన, కాలర్ ఎముక పైన సీతాకోక చిలుకను పోలిన ఆకారంలో…

1 week ago

హెపటైటిస్‌: రకాలు, లక్షణాలు మరియు నివారణ చర్యలు

మన శరీరంలో కాలేయం అనేది చాలా ముఖ్యమైన అవయవం. ఇది శరీరానికి అవసరమైన రసాయనాలను సరఫరా చేసే ప్రయోగశాలగా (రక్తాన్ని…

3 weeks ago

Demystifying Hysteroscopy: A Guide to this Vital Gynecological Procedure

Hysteroscopy has emerged as a valuable solution to various gynecological issues, offering both diagnostic and…

3 weeks ago

Endometriosis Surgery: Your Complete Guide to Treatment, Recovery, and Pain-Free Future

Endometriosis is a medical condition characterized by the growth of tissue similar to the lining…

1 month ago

కొలనోస్కోపీ ఎందుకు & ఎవరికి చేస్తారు? చికిత్స విధానాలు మరియు ప్రయోజనాలు

పెద్ద ప్రేగు అనేది జీర్ణవ్యవస్థలో ఒక ప్రధాన భాగం. ఇది శరీరంలో చాలా ముఖ్యమైన విధులు నిర్వహిస్తుంది. ఇది ఆహారంలోని…

1 month ago