Neuroscience

రేడియో సర్జరీ అంటే ఏమిటి?

మావారి వయసు 36 ఏళ్లు. ఇటీవల తరచుగా తీవ్రమైన తలనొప్పితో(severe headache) బాధపడుతున్నారు. ఎన్ని మందులు వాడినా తగ్గడం లేదు. దాంతో న్యూరాలజిస్ట్‌ను(Neurologist) కలిశాం. ఆయన అన్ని పరీక్షలూ చేసి, మెదడు లోపల కాస్తంత లోతుగా 2.5 సెంటీమీటర్ల సైజ్‌లో కణితి (brain tumor) ఉందని చెప్పారు. ఇలాంటి ట్యూమర్లకు రేడియో సర్జరీ(radiosurgery) మంచిదని సలహా ఇచ్చారు. మేం చాలా ఆందోళనగా ఉన్నాం. పిల్లలిద్దరూ చాలా చిన్నవాళ్లు. ఎంతో భయంగా ఉంది. ఈ సర్జరీ గురించి వివరంగా చెప్పండి.

మెదడులో ఏర్పడే ట్యూమర్ల చికిత్సలో ఇప్పుడు ఎంతో అత్యాధునిక చికిత్సా విధానాలు అందుబాటులోకి వచ్చాయి. అందుకే మీరుగానీ, మీ కుటుంబ సభ్యులుగానీ ట్యూమర్‌ విషయంలో ఎలాంటి ఆందోళనలూ, భయాలు పెట్టుకోనవసరం లేదు. ఇప్పుడు మెదడులో ఏర్పడే ఇలాంటి ట్యూమర్లను శాశ్వతంగా తొలగించడానికి ఎస్‌ఆర్‌ఎస్‌ (stereo tactic radiosurgery) లేదా రేడియో సర్జరీ అని పిలిచే అత్యాధునిక ప్రక్రియ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఫలితాలు కూడా చాలా ఆశాజనకంగా ఉంటాయి. ఆరోగ్యకరమైన కణజాలాన్ని కాపాడుతూ… కేవలం అనారోగ్యకరమైన కణజాలాన్ని మాత్రమే తొలగించే లక్ష్యంతో డాక్టర్లు సర్జరీ నిర్వహిస్తారు. ఈ లక్ష్యాన్ని రేడియో సర్జరీ మరింత ప్రభావవంతంగా నెరవేరుస్తుంది. ఈ ప్రక్రియలో ఎక్స్‌రేల నుంచి ఫోటాన్‌ శక్తిని ట్యూమర్‌పైకి పంపిస్తారు.

మెదడుకు కేవలం 2 గ్రేల రేడియేషన్‌ని మాత్రమే తట్టుకునే శక్తి ఉంటుంది. కానీ ట్యూమర్‌ను సమూలంగా నిర్వీర్యం చేయడానికి అంతకన్నా ఎక్కువ రేడియేషన్‌ అవసరం. అందుకే స్టీరియో టాక్టిక్‌ రేడియో సర్జరీలోఒక ప్రత్యేకమైన ఫిల్టర్‌ గుండా రేడియేషన్‌ను(Radiation) ట్యూమర్‌పైన మాత్రమే కేంద్రీకృతమయ్యేలా చేస్తారు. ఇందుకోసం 13 నుంచి 22 గ్రే ల రేడియేషన్‌ను వాడతారు. ఇది చాలా ఎక్కువ మోతాదు (హై డోస్‌) రేడియేషన్‌. అయినప్పటికీ ఈ రేడియేషన్‌ అంతా ప్రతి కిరణంలోనూ వందో వంతుకు విభజితమవుతుంది. అయితే మొత్తం రేడియేషనంతా ట్యూమర్‌ను టార్టెట్‌గా చేసుకొని పూర్తిగా దానిమీదే కేంద్రీకృతమవుతుంది. మిగిలిన కణాలపై దీని ప్రభావం ఉండదు. ఈ రేడియో సర్జరీలో ఫ్రేమ్‌ వాడరు. అందుకే దీన్ని ఫ్రేమ్‌లెస్‌ స్టీరియోటాక్టిక్‌ రేడియో సర్జరీ అని కూడా అంటారు. అయితే ఈ సర్జరీ చేయాలంటే ట్యూమర్‌ పరిమాణం 3 సెంటీమీటర్ల కన్నా తక్కువగా ఉండాలి.

కానీ అంతకన్నా ఎక్కువ సైజులో ఉంటే సర్జరీ చేసి, దాని పరిణామాన్ని తగ్గించి, ఆ తర్వాత రేడియో సర్జరీ ద్వారా మొత్తం ట్యూమర్‌ను తొలగించవచ్చు. రేడియేషన్‌ పంపించిన తర్వాత రెండేళ్లకు కణితి పూర్తిగా కుంచించుకుపోతుంది. 3 నుంచి 5 ఏళ్లలో 60 నుంచి 70 శాతం తగ్గుతుంది. చివరికి మచ్చలాగా మిగులుతుంది. రెండు లేదా అంతకన్నా ఎక్కువ ట్యూమర్లు ఉన్నప్పుడు కూడా ఒకే సిట్టింగ్‌లో రేడియోసర్జరీ ద్వారా వాటిని తొలగించవచ్చు. ఒకేసారి ఐదు ట్యూమర్లనూ తొలగించవచ్చు. ఈ స్టీరియో టాక్టిక్‌ రేడియో సర్జరీ కోసం హాస్పిటల్‌లో చేరాల్సిన అవసరం లేదు.  ఔట్‌పేషెంట్‌గానే ఈ చికిత్సను పూర్తిచేయవచ్చు. ఇది పూర్తిగా నాన్‌–ఇన్వేజివ్‌ ప్రక్రియ. అంటే దీని కోసం శరీరం మీద ఎలాంటి కోత/గాటు పెట్టాల్సిన అవసరం ఉండదు. ఆపరేషన్‌ అంటే సాధారణంగా ఎంతోకొంత రక్తస్రావం జరుగుతుంది. అయితే ఈ రేడియో సర్జరీలో కోత ఉండదు కాబట్టి దీనిలో ఎలాంటి రక్తస్రావమూ ఉండదు. కోత ఉండదు కాబట్టి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉండదు.

చికిత్స జరిగే సమయంలో ట్యూమర్‌ కణాలు తప్ప, దాని చుట్టుపక్కల ఉండే ఆరోగ్యకరమైన మెదడు కణాలకు ఎలాంటి ప్రమాదమూ జరగదు. శరీరానికి కోత పెట్టి చేసే ఓపెన్‌ సర్జరీలో కణితిలోని కణాలు పక్కకు వెళ్లేందుకు ఆస్కారం ఉంటుంది. కానీ ఇందులో ఆ రిస్కు ఉండదు. సంప్రదాయక శస్త్రచికిత్సలో పొరబాటున మిగిలిపోయిన ట్యూమర్‌ కణాలను కూడా దీని ద్వారా నాశనం చేయవచ్చు. చికిత్స చాలా కచ్చితత్వాన్ని కలిగి ఉంటుంది. సాధారణ సర్జరీతో చికిత్స అందించలేని ట్యూమర్లను కూడా దీని ద్వారా నాశనం చేయవచ్చు. వృద్ధులకు, సర్జరీ చేయడం కుదరని పేషెంట్లకు కూడా ఈ రేడియో సర్జరీని చేయవచ్చు. కాబట్టి మీ డాక్టర్‌ సూచించిన విధంగా మీరు ఎలాంటి ఆందోళన లేకుండా మీ వారికి ఈ సర్జరీ చేయించండి.

ట్యూమర్‌ అంటే అది క్యాన్సరేనా?

మా ఫ్రెండ్‌ వాళ్ల నాన్న చాలాకాలంగా ట్యూమర్‌తో బాధపడుతున్నారు. అసలు ట్యూమర్‌ అంటే ఏమిటి? అంటే అది క్యాన్సరేనా? దీనికి చికిత్స లేదా? శాశ్వత పరిష్కారం ఏమిటి? ట్యూమర్లను ఎలా గుర్తించాలి? వాటి లక్షణాలేమిటి? దయచేసి ఈ వివరాలన్నీ చెప్పండి.

కణాలు తమ నియతి (కంట్రోల్‌) తప్పి, విపరీతంగా విభజన చెంది పెరిగితే కణితి (ట్యూమర్‌) ఏర్పడుతుంది. కణుతులు అన్నీ క్యాన్సర్‌ కాదు. క్యాన్సర్‌ కాని  కణుతులును బినైన్‌ ట్యూమర్లు అంటారు. క్యాన్సర్‌ కణాలైతే కణితి ఏర్పడిన చోటి నుంచి ఇతర భాగాలకు వ్యాపిస్తాయి. కానీ బినైన్‌ కణాలు అలా వ్యాపించవు. కానీ కణితి పక్కనున్న నరంపైన ఒత్తిడి పడేలా చేస్తాయి. దాంతో ఇతర సమస్యలు రావచ్చు. ట్యూమర్‌ పెద్ద సైజులో ఉన్నా, కీలకమైన నరాల దగ్గర ఏర్పడినా ఫిట్స్‌ రావచ్చు. మెదడులో ట్యూమర్‌ వల్ల కొన్నిసార్లు కాళ్లూచేతులు పడిపోవడం లాంటి ప్రమాదం కూడా ఉండవచ్చు. అందుకే బినైన్‌ కణుతులకు కూడా చికిత్స అందించాలి. బినైన్‌ ట్యూమర్లను ఒకసారి తొలగిస్తే ఇక జీవితాంతం సమస్య ఉండదు. సాధారణంగా ఈ ట్యూమర్లు జన్యుపరమైన కారణాల వల్ల ఏర్పడతాయి.

వీటికి పర్యావరణ (ఎన్విరాన్‌మెంటల్‌) కారణాలూ తోడవుతాయి. కాలుష్యం, మానసిక ఒత్తిడి, ఆహారం లాంటి అంశాలు కణితి ఏర్పడే జన్యుతత్వాన్ని ట్రిగ్గర్‌ చేస్తాయి. అందువల్ల బ్రెయిన్‌ ట్యూమర్లు ఏర్పడకుండా నివారించలేము. మంచి ఆహారం తీసుకుంటూ, మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే కొంతవరకు మేలు. మెదడులో ట్యూమర్‌ ఉన్నప్పుడు సాధారణంగా ఎలాంటి లక్షణాలూ కనిపించవు. ఇవి చాలా వరకు పరీక్షల్లో మాత్రమే బయటపడుతుంటాయి. కణితి పెరిగి మరీ పెద్దగా అయినప్పుడు మాత్రమే ఇబ్బందులు తలెత్తవచ్చు. పదేపదే తలనొప్పి వస్తున్నదంటే మెదడులో ఏదైనా సమస్య ఉందేమోనని అనుమానించవచ్చు. తలనొప్పితో పాటు వికారంగా ఉండటం, వాంతులు అవుతుంటే తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించాలి.

Originally published: https://m.sakshi.com/news/family/advanced-treatment-brain-tumor-1254144

About Author –

Dr. Ravi Suman Reddy, Senior Neuro & Spine surgeon, Yashoda Hospitals – Somajiguda

MCH (NIMHANS), Advanced training in Stereotactic Radiosurgery (Brain Lab Academy - Germany). His expertise includes frameless stereotactic neurosurgery, minimally invasive spine surgery, spine stabilization, nerve radiofrequency ablation, cranial micro neurosurgery, cranio-spinal trauma, and endoscopic surgery.

Dr. Ravi Suman Reddy

MBBS, MCh
Consultant Neuro & Spine Surgeon
Yashoda Hospitals

Recent Posts

కళ్లకలక (కంజెక్టివైటీస్‌): రకాలు, లక్షణాలు మరియు నివారణ చర్యలు

దగ్గు, జలుబు మాదిరి సీజనల్‌గా వర్షాకాలంలో వచ్చే సాధారణ వ్యాధుల్లో కళ్లకలక ఒకటి. కళ్లకలక సమస్య స్టాఫిలోకాకల్‌ బ్యాక్టీరియాల ద్వారా…

2 days ago

థైరాయిడ్ వ్యాధి: రకాలు, లక్షణాలు, కారణాలు & నియంత్రణ చర్యలు

థైరాయిడ్ గ్రంథి అనేది మెడ మధ్య స్వరపేటిక క్రింద భాగాన, కాలర్ ఎముక పైన సీతాకోక చిలుకను పోలిన ఆకారంలో…

6 days ago

హెపటైటిస్‌: రకాలు, లక్షణాలు మరియు నివారణ చర్యలు

మన శరీరంలో కాలేయం అనేది చాలా ముఖ్యమైన అవయవం. ఇది శరీరానికి అవసరమైన రసాయనాలను సరఫరా చేసే ప్రయోగశాలగా (రక్తాన్ని…

2 weeks ago

Demystifying Hysteroscopy: A Guide to this Vital Gynecological Procedure

Hysteroscopy has emerged as a valuable solution to various gynecological issues, offering both diagnostic and…

2 weeks ago

Endometriosis Surgery: Your Complete Guide to Treatment, Recovery, and Pain-Free Future

Endometriosis is a medical condition characterized by the growth of tissue similar to the lining…

4 weeks ago

కొలనోస్కోపీ ఎందుకు & ఎవరికి చేస్తారు? చికిత్స విధానాలు మరియు ప్రయోజనాలు

పెద్ద ప్రేగు అనేది జీర్ణవ్యవస్థలో ఒక ప్రధాన భాగం. ఇది శరీరంలో చాలా ముఖ్యమైన విధులు నిర్వహిస్తుంది. ఇది ఆహారంలోని…

1 month ago