covid

ఒమైక్రాన్‌తో జర భద్రం బ్రదరూ!

కరోనా థర్డ్‌ వేవ్‌ ఒమైక్రాన్‌ శరవేగంతో విజృంభిస్తోంది! ఈ వైరస్‌ తీవ్రత గురించి, బూస్టర్‌ డోస్‌ యొక్క ప్రయోజనం గురించి మనలో ఎన్నో అనుమానాలు. ఒమైక్రాన్‌ రాకుండా ఏం జాగ్రత్తలు పాటించాలి? వస్తే ఏం చేయాలి? ఈ ప్రశ్నలకు వైద్యులిస్తున్న సమాధానాలివే!

వ్యాక్సిన్‌ వేయించుకుంటే కొవిడ్‌ వైరస్‌ నుంచి రక్షణ దక్కే మాట నిజమే అయినా, ఈ రక్షణ డెల్టా వేరియెంట్‌ వరకే పరిమితం. ఇప్పటివరకు మనం వేయించుకున్న రెండు వ్యాక్సిన్లు స్పైక్‌ ప్రొటీన్‌ లక్ష్యంగా తయారైనవి. వైరస్‌, కణం లోపలికి వెళ్లడానికి తోడ్పడే ఈ స్పైక్‌ ప్రొటీన్‌ ఒమైక్రాన్‌లో భిన్నంగా ఉంటుంది. కాబట్టి మునుపటి వ్యాక్సిన్లు దీన్ని అడ్డుకోలేవు. కాబట్టే కొవిడ్‌ సోకినా, సోకకపోయినా, వ్యాక్సిన్‌ వేయించుకున్నా, వేయించుకోకపోయినా.. ఎవరికైనా ఒమైక్రాన్‌ తేలికగా సోకే వీలుంది. ఒమైక్రాన్‌లో మిగతా వేరియెంట్ల కంటే మ్యుటేషన్లు, వ్యాప్తి చెందే వేగం ఎక్కువ.

సోకితే ఏం జరుగుతుంది?

ఒమైక్రాన్‌ సోకినా లక్షణాల తీవ్రత తక్కువగా ఉండే వీలుంది. ఫ్లూను పోలిన దగ్గు, జలుబు, గొంతు నొప్పి, జ్వరం లక్షణాలు రెండు మూడు రోజులు వేధించి తగ్గిపోవచ్చు. అయితే లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించి చికిత్స మొదలుపెట్టడం అవసరం. వ్యాక్సిన్‌ తీసుకోని వారిలో ఒమైక్రాన్‌ తీవ్రత పెరిగిపోయే అవకాశం ఉంది కాబట్టి, ఈ కోవకు చెందినవాళ్లు మరింత జాగ్రత్తగా ఉండాలి.

యాంటీబాడీల ప్రభావం ఎంత?

యాంటీబాడీలతో చేకూరిన రోగనిరోధకశక్తి, టి సెల్‌తో సమకూరిన రోగనిరోధకశక్తి… ఈ రెండు రకాల ఇమ్యూనిటీలు శరీరంలో ఉంటాయి. యాంటీబాడీ ఇమ్యూనిటీ, వైర్‌స్ ను సెల్‌లోకి చొరబడనివ్వకుండా అడ్డుకుంటుంది. అయితే ఒమైక్రాన్‌ విషయంలో దాని స్పైక్‌ ప్రొటీన్‌ రూపం మారిపోయింది. కాబట్టి శరీరంలో ఇప్పటివరకూ ఉన్న యాంటీబాడీ ఇమ్యూనిటీని ఈ వైరస్‌ తప్పించుకోగలుగుతోంది. అయితే టి సెల్‌ ఇమ్యూనిటీని ఒమైక్రాన్‌ తప్పించుకోలేదు. ఈ రకమైన ఇమ్యూనిటీ… కొవిడ్‌ వ్యాక్సిన్ల వల్ల, కొవిడ్‌ సోకడం వల్ల సమకూరుతుంది. ఒమైక్రాన్‌ సోకినా తీవ్రత పెరగకుండానే తగ్గిపోతూ ఉండడానికి కారణం ఇదే!

 

 

 

బూస్టర్‌ డోస్‌తో ఉపయోగం ఉందా?

వ్యాక్సిన్లతో శరీరంలో వృద్ధి చెందే యాంటీబాడీల జీవిత కాలం ఆరు నెలలు మాత్రమే! ఆ తర్వాత నుంచి వీటి సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది. అయితే టి సెల్‌ ఇమ్యునిటీ యాంటీబాడీల కంటే కొంత ఎక్కువ కాలం పాటు కొనసాగి, తగ్గడం ప్రారంభిస్తుంది. కాబట్టి ఇమ్యునిటీని అప్‌గ్రేడ్‌ చేసుకోవాలంటే బూస్టర్‌ డోస్‌ తీసుకోక తప్పదు. మున్ముందు కూడా వేరియెంట్లు మారేకొద్దీ బూస్టర్‌ డోసులను తీసుకుంటూ ఉండవలసిందే!

క్రాస్‌ వ్యాక్సినేషన్‌

ఫైజర్‌, మోడెర్నా వ్యాక్సిన్ల విషయంలో క్రాస్‌ వ్యాక్సినేషన్‌ వల్ల ప్రయోజనం ఉంటుంది. అయితే కొవిషీల్డ్‌, కొవ్యాక్సిన్ల విషయంలో క్రాస్‌ వ్యాక్సినేషన్‌ వల్ల ప్రయోజనం ఉంటుందనే ఆధారాలు శాస్త్రీయంగా రుజువు కాలేదు. కాబట్టే ప్రభుత్వం కూడా బూస్టర్‌ డోస్‌గా పూర్వపు వ్యాక్సిన్‌నే వేయించుకోవాలని సూచిస్తోంది. అయినప్పటికీ అదనపు రక్షణ కోసం బూస్టర్‌ డోస్‌లో భాగంగా క్రాస్‌ వ్యాక్సినేషన్‌ వేయించుకోవాలి అనుకునేవాళ్లు వేయించుకోవచ్చు.

ఒమైక్రాన్‌తో రిస్క్‌… వారికే!

గుండె సమస్యలు, ఇతరత్రా తీవ్ర ఆరోగ్య సమస్యలు కలిగి ఉండే హై రిస్క్‌ వ్యక్తుల మీద ఒమైక్రాన్‌ ప్రభావం ఎక్కువ. డెల్టా మాదిరిగానే ఒమైక్రాన్‌ ఇన్‌ఫెక్షన్‌ తీవ్రతను బట్టి యాంటీ వైరల్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ… ఇలా రెండు రకాల చికిత్సలు తీసుకోవలసి ఉంటుంది. మొదటి దశలో యాంటీబాడీ కాక్‌టెయిల్‌, యాంటీవైరల్‌ డ్రగ్స్‌ను వైద్యులు సూచిస్తారు. అయితే ఈ మొదటి దశ కాక్‌టెయిల్‌ మందులు కూడా ఎస్‌ ప్రొటీన్‌ లక్ష్యంగా తయారైనవి. కాబట్టి ఇప్పుడు అందుబాటులో ఉన్న మందులు ఒమైక్రాన్‌కు పని చేయకపోవచ్చు. అయితే యాంటీవైరల్‌ డ్రగ్స్‌ ఏ వైరస్‌ అడ్డుకట్టకైనా పని చేస్తాయి. కాబట్టి డెల్టా వేరియెంట్‌కు వాడుకున్న రెమిడిసివిర్‌, మోల్నోపిరవిర్‌ యాంటీ వైరల్‌ మందులనే ఒమైక్రాన్‌కూ వాడుకోవచ్చు. ఈ మందులు వైరస్‌ మల్టిప్లై అవకుండా అడ్డుకుంటాయి. వైరస్‌ ఊపిరితిత్తులకు చేరిన రెండో దశలో స్టిరాయిడ్లు వాడవలసి ఉంటుంది.

పరీక్షలో తేలుతుందా?

ఆర్‌టిపిసిఆర్‌తో ఒమైక్రాన్‌ను నిర్థారించడం కుదరదు. ఈ వేరియెంట్‌ను కచ్చితంగా గుర్తించాలంటే జెనోమిక్‌ సీక్వెన్సింగ్‌ చేయవలసి ఉంటుంది. దీనికి ప్రత్యామ్నాయంగా ఆర్‌టిపిసిఆర్‌ పరీక్షలో ఎస్‌ జీన్‌ ఫలితాన్ని పరిగణలోకి తీసుకుంటున్నారు. ఎస్‌ జీన్‌ నెగిటివ్‌ వస్తే ఒమైక్రాన్‌గా, పాజిటివ్‌గా వస్తే డెల్టాగా నిర్థారిస్తున్నారు. ఈ వేరియెంట్‌ను కచ్చితంగా గుర్తించాలంటే జెనోమిక్‌ సీక్వెన్సింగ్‌ చేయవలసి ఉంటుంది. దీనికి ప్రత్యామ్నాయంగా ఆర్‌టిపిసిఆర్‌ పరీక్షలో ఎస్‌ జీన్‌ ఫలితాన్ని పరిగణలోకి తీసుకుంటున్నారు. ఎస్‌ జీన్‌ నెగిటివ్‌ వస్తే ఒమైక్రాన్‌గా, పాజిటివ్‌గా వస్తే డెల్టాగా నిర్థారిస్తున్నారు. ఒమైక్రాన్‌ మొదటి దశలోనే ఉన్నాం కాబట్టి పాత, కొత్త వేరియెంట్లు రెండూ రకాల కేసులు కనిపిస్తున్నాయి. కాబట్టి కొంత గందరగోళ పరిస్థితి నెలకొని ఉంది. రెండు వారాలు గడిస్తే డెల్టా పూర్తిగా కనుమరుగై, ఒమైక్రాన్‌ పెరుగుతుంది.

వ్యాప్తి ఎక్కువ ఇందుకే!

ఎక్కువ శాతం మంది వ్యాక్సిన్‌ రెండు డోసులు వేయించుకున్నారు. దాంతో ఒమైక్రాన్‌ సోకి, లక్షణాలు మొదలైనా.. నేను రెండు డోసులు వేయించుకున్నాను కాబట్టి నాకు ఒమైక్రాన్‌ సోకే వీలు లేదనే నిర్లక్ష్యంతో, ఐసొలేట్‌ కాకుండా తిరిగేయడం వల్ల వైరస్‌ ఎక్కువగా వ్యాప్తి అవుతోంది.

దీర్ఘకాల ప్రభావం?

మన దేశంలో ఒమైక్రాన్‌ గత నవంబరులోనే పుట్టుకొచ్చింది. కాబట్టి కొవిడ్‌ దీర్ఘకాల ప్రభావాలు తెలియాలంటే మరికొంత కాలం ఆగక తప్పదు. అయితే ఇప్పటికే ఒమైక్రాన్‌ విజృంభించి, తగ్గుముఖం పడుతున్న దశలో ఉన్న దక్షిణాఫ్రికాలో దాని తాలూకు లాంగ్‌ కొవిడ్‌ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఒమైక్రాన్‌ తీవ్రత తక్కువ కాబట్టి దీనికి దీర్ఘకాల ప్రభావాలు ఉండకపోవచ్చు అనుకోకూడదు.

ఒమైక్రాన్‌ సోకితే?
  1. ఆర్‌టిపిసిఆర్‌ పరీక్ష చేయించుకోవాలి.
  2. ఒమైక్రాన్‌ నిర్థారణ జరిగితే వైద్యులను సంప్రదించాలి.
  3. స్వీయ ఐసొలేషన్‌ చేసుకోవాలి.
  4. లక్షణాల ఆధారంగా జ్వరానికి పారాసిటమాల్‌, దగ్గు మందు, విటమిన్‌ టాబ్లెట్లు తీసుకోవాలి.
  5. వైద్యుల సూచన మేరకు ఇన్‌ఫెక్షన్‌ తీవ్రతను బట్టి యాంటీ వైరల్‌ డ్రగ్స్‌ తీసుకోవాలి.
  6. పల్స్‌ ఆక్సీమీటర్‌ సహాయంతో రోజుకు రెండు సార్లు ఆక్సిజన్‌ లెవల్స్‌ పరీక్షించుకోవాలి.
  7. ఆక్సిజన్‌ లెవల్స్‌ 94కు తగ్గితే ఆలస్యం చేయకుండా ఆస్పత్రికి చేరుకోవాలి.
  8. పోషకాహారం, ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోవాలి.
  9. విశ్రాంతి తప్పనిసరి.

ప్రభుత్వ మార్గదర్శకాలు ఇవే!

ఆర్‌టిపిసిఆర్‌ పాజిటివ్‌ వచ్చినప్పటి నుంచి లక్షణాలు ఉన్నా, లేకపోయినా ఎవరికి వారు ఐసొలేట్‌ చేసుకోవాలి. వరుసగా మూడు రోజుల పాటు జ్వరం లేకపోయినా, పరీక్షలో పాజిటివ్‌గా తేలితే, ఆ ఫలితం వచ్చినప్పటి నుంచి ఏడు రోజుల పాటు ఐసొలేషన్‌లో ఉండాలి. ఒమైక్రాన్‌ సోకిందనే అనుమానం ఉన్నవాళ్లు, లక్షణాలు కలిగి ఉండి, పాజిటివ్‌ ఫలితం అందుకున్నవాళ్లు 10 రోజుల పాటు ఆస్పత్రిలో, లేదా ఇంట్లో ఐసొలేట్‌ కావాలి. వ్యాధినిరోధకశక్తి తక్కువగా ఉండే వ్యక్తులు (కేన్సర్‌, హెచ్‌ఐవి పాజిటివ్‌, అవయవ మార్పిడి చేయించుకున్నవాళ్లు) ఒమైక్రాన్‌ ఇన్‌ఫెక్షన్‌ బారిన పడితే, ఇంటికి బదులుగా ఆస్పత్రిలో ఐసొలేట్‌ కావాలి. ఐసొలేషన్‌ సమయం ముగిసిన తర్వాత రీటెస్టింగ్‌ అవసరం లేదు.

References

  • Source Link: https://www.andhrajyothy.com/telugunews/omicran-mrgs-navya-192201101107353
Yashoda Hospitals

Recent Posts

కళ్లకలక (కంజెక్టివైటీస్‌): రకాలు, లక్షణాలు మరియు నివారణ చర్యలు

దగ్గు, జలుబు మాదిరి సీజనల్‌గా వర్షాకాలంలో వచ్చే సాధారణ వ్యాధుల్లో కళ్లకలక ఒకటి. కళ్లకలక సమస్య స్టాఫిలోకాకల్‌ బ్యాక్టీరియాల ద్వారా…

2 weeks ago

థైరాయిడ్ వ్యాధి: రకాలు, లక్షణాలు, కారణాలు & నియంత్రణ చర్యలు

థైరాయిడ్ గ్రంథి అనేది మెడ మధ్య స్వరపేటిక క్రింద భాగాన, కాలర్ ఎముక పైన సీతాకోక చిలుకను పోలిన ఆకారంలో…

3 weeks ago

హెపటైటిస్‌: రకాలు, లక్షణాలు మరియు నివారణ చర్యలు

మన శరీరంలో కాలేయం అనేది చాలా ముఖ్యమైన అవయవం. ఇది శరీరానికి అవసరమైన రసాయనాలను సరఫరా చేసే ప్రయోగశాలగా (రక్తాన్ని…

1 month ago

Demystifying Hysteroscopy: A Guide to this Vital Gynecological Procedure

Hysteroscopy has emerged as a valuable solution to various gynecological issues, offering both diagnostic and…

1 month ago

Endometriosis Surgery: Your Complete Guide to Treatment, Recovery, and Pain-Free Future

Endometriosis is a medical condition characterized by the growth of tissue similar to the lining…

1 month ago

కొలనోస్కోపీ ఎందుకు & ఎవరికి చేస్తారు? చికిత్స విధానాలు మరియు ప్రయోజనాలు

పెద్ద ప్రేగు అనేది జీర్ణవ్యవస్థలో ఒక ప్రధాన భాగం. ఇది శరీరంలో చాలా ముఖ్యమైన విధులు నిర్వహిస్తుంది. ఇది ఆహారంలోని…

2 months ago