Pulmonology

ఆగంచేసే ఆస్థమాకు అందుబాటులో శాశ్వత పరిష్కారం

బ్రాంకియల్ థర్మోప్లాస్టీతో ఆస్థమాకు ప్రపంచస్థాయి చికిత్సలు..ఇపుడు హైదరాబాద్ లో లభ్యం

ఆస్థమా. మనదేశంలో దాదాపు రెండు కోట్ల మందిని వేధిస్తున్న వ్యాధి ఇది. అన్ని వయస్సుల వారినీ జీవితకాలం వెంటాడే రుగ్మత.పెరుగుతున్న వాతావరణ కాలుష్యం, మారుతున్న జీవనశైలిలో లోటుపాట్ల కారణంగా ఆస్థమా తీవ్రత ఎక్కువ అవుతున్నది. తీవ్రమైన ఆస్థమాతో బాధపడుతున్న వారి సంఖ్య గడచిన కొద్ది సంవత్సరాలలో పెరిగిపోయింది. ఇతరత్రా పూర్తి ఆరోగ్యంతో ఉన్నా అనేక మంది కేవలం తీవ్రమైన ఆస్థమా వ్యాధి కారణంగా తమ వృత్తి, ఉద్యోగాలలో అనుకున్నమేరకు కృషిచేయలేక అసంతృప్తికి గురవుతూన్నారు. వ్యాధిగ్రస్థుల్లో అనేక మందికి సంబంధించి ఇది వ్యక్తి ప్రాణలతో చెలగాటం ఆడగలుగుతోంది. తరతరాలుగా వేధిస్తున్న ఈ మొండి వ్యాధికి సంబంధించి పరిస్థితులు ఇప్పుడు వేగంగా మారిపోతున్నాయి. గడచిన ఇరవై ఏళ్ల కాలంలో ప్రపంచవ్యాప్తంగా పరిశోధనా సంస్థలు, వైద్యకేంద్రాలలో జరిగిన పరిశోధనల ఫలితంగా ఆస్థమాను అదుపు చేయటమే కాకుండా తీవ్రమైన ఆస్థమా దాడి నుంచి ఏళ్లతరబడి రక్షించగల చికిత్సా విధానాలు రూపొందాయి. ప్రపంచస్థాయి వైద్యకేంద్రాలకే పరిమితమవుతూ వచ్చిన ఈ ఆధునిక చికిత్సలు ఇప్పుడు మన దేశంలో కూడా అందుబాటులోకి వచ్చాయి. సంప్రదాయ చికిత్సలకు బదులుగా ఈ అత్యాధునిక చికిత్సలను ఎంచుకోవటం, వైద్యులు సూచించిన జాగ్రత్తలను పాటించటం ద్వారా తీవ్రమైన ఆస్థమాను పూర్తిగా అదుపుచేసుకుని అది విధించే పరిమితుల నుంచి తేలికగా బయటపడటం సాధ్యపడుతున్నది.

ఊపిరి తిత్తులకు ఆక్సీజన్ తో కూడిన గాలి తీసుకువెళ్లే, వాటి నుంచి కార్బన్ డైయాక్సైడ్ కలిగిన గాలిని వెలుపలికి పంపించే వాయునాళాలకు సోకేవ్యాధి ఆస్థమా. ఎక్కువ కాలంపాటు కొనసాగటంతోపాటుగా వేర్వేరు సీజన్లలో ఇది ఎక్కువ అవుతూ ఉంటుంది. ఆస్థమా వ్యాధిగ్రస్థులలో శ్వాస మార్గం సాధారణ వ్యక్తుల కంటే చాలా ఇరుకుగా ఉంటుంది. రెండు కారణాల వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. మొదటిది శ్వాసమార్గపు గోడలలో మృదువైన కండరాలు ఎక్కువ కావటం. దుమ్మూ -ధూళి, వాతావరణ ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గులకు శ్వాసమార్గపు కణజాలం అతిగా స్పందించటం . ఈ విధంగా ఆస్థమా సోకినపుడు  వాపుతో వాయునాళాల లోపలి భాగం వాచుతుంది.  వాపు వల్ల ఈ వాయు నాళాలు చాలా సున్నితంగా తయారవుతాయి. తేలికగా అలర్జీలకు గురవుతాయి. వాపు, అలర్జీలతో వాయునాళాలు కుంచించుకుని గాలి వెళ్లాల్సిన స్థలం సన్నగా మారిపోతుంది. ఊపిరి తిత్తులకు వచ్చే, వాటి నుంచి బయటకు వెళ్లే గాలి పరిమాణం చాలావరకు తగ్గిపోతుంది. దీంతో వ్యక్తి ఊపిరి పీల్చినపుడు, వదిలినపుడు కీచు శబ్దం వస్తుంటుంది. చాతీ బరువుగా అనిపిస్తుంది. ఉమ్మితో తెమడపడుతుంటుంది. శ్వాస పీల్చుకోవటంలో సమస్యలతో దగ్గు వస్తుంటుంది. శ్వాసతీసుకోవటం కష్టంగా తయారవుతుంది. అందువల్లనే సాధారణ పరిభాషలో ఆస్థమాను ‘దగ్గు దమ్ము’ అంటుంటారు. వ్యాధిగ్రస్థులు చాలా వరకు రాత్రిళ్లు, తెలవారుజామున ఈ సమస్యలతో సతమతమవుతుంటారు.


అత్యవసర ఆధునిక వైద్యసేవలే ప్రాణాలు కాపాడతాయి

ఆస్థమా జీవిత కాలం వేధించే వ్యాధి అన్నమాట నిజమే. ఇదివరకటి రోజుల్లో ఈ వ్యాధి వ్యక్తులను పూర్తిస్థాయి రోగులుగా మార్చి వారి కార్యక్రమాలను పరిమితం చేసేది. వైద్య పరిశోధనలు, నూతన చికిత్సా విధానాల అభివృద్ధితో  ప్రస్తతం పరిస్థితి మారిపోయింది. శాశ్వత నివారణ సాధ్యంకాకపోయినా వయోజనుల్లో కనీసం పది సంవత్సరాల పాటు బాధను ఖచ్చితంగానివారించే  చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. ఆస్థమా చికిత్స ప్రధానంగా ఇన్హేలర్ల ద్వారా ఉపయోగించే మందుల రూపంలో జరుగుతుంటుంది. ఈ ఇన్హేలర్లు మందులను నేరుగా శ్వాసమార్గంలోకి ప్రవేశపెడతాయి. ఆస్థమాలో ఉపయోగించే ఈ రకమైన మందులను బ్రాంకోడైలేటర్లు ఇన్హేల్డ్ స్టెరాయిడ్స్ అంటారు. బ్రాంకోడైలేటర్లు శ్వాసమార్గంలో పేరుకుపోయిన మృదువైన కండరాల సాంధ్రతను తగ్గించి శ్వాసమార్గాలు తెరచుకోవటానికి తోడ్పడతాయి. ఇక ఇన్హేల్డ్ స్టేరియిడ్స్ శ్వాసనాళాల వాపును తగ్గిస్తాయి. ఆస్థమా వ్యాధిగ్రస్థులలో దాదాపు 90శాతం మందికి ఈ చికిత్స వల్ల ఉపశమనం పొందగలుగుతున్నారు.

అయితే తీవ్రమైన ఆస్థమా ఉన్న తక్కిన పదిశాతం మందికి ఈ ఇన్హేలర్లతో చికిత్స వల్ల ప్రయోజనం ఉండటంలేదు.పెద్ద మొత్తంలో ఇన్హెలర్ మందులు వాడినప్పటికీ తీవ్రమైన ఆస్థమా ఉన్న వ్యక్తులు తగ్గని దగ్గూ, దమ్ముతో బాధపడుతునే ఉంటారు. తరచూ ఆస్థమా అటాక్స్ కు గురవుతుంటారు. దీంతో వారి సాధారణ జీవితం దెబ్బదినటమే కాకుండా, మానసికంగా దెబ్బదింటారు.తీవ్రమైన ఆస్థమాతో ఆస్పత్రికి వచ్చినపుడు అత్యసర సేవలుగా మొదట కృత్రిమంగా శ్వాసఅందించే ఏర్పాటు చేసి, స్టెరాయిడ్ మందులను గోలీలు, సూదిమందుల రూపంలో ఇవ్వటం ద్వారా వాయునాళాలు తెరిచి సహజంగా ఊపిరి తీసుకునేట్లు చేస్తారు. కానీ ఈ మందుల ద్వారా వెంటనే ఉపశమనం లభించినా దీర్ఘకాలం వాడటం వల్ల ఉపశమనం లభించటం తగ్గిపోతుంది. ఆపైన ఆస్థమా విషమించటానికి కారణమైన గుర్తించి ఆధునిక చికిత్సలు – అలవాట్లలో మార్పులను సూచిస్తూ వయోజనులు మరోసారి ఆస్థమా అటాక్కు గురికాకుండా కాపాడేందుకు ఏర్పాట్లు చేస్తారు. ఇందుకు రెండు ఆధునిక చికిత్సా పద్దతులు ఇప్పుడు మన దేశంలో అందుబాటులోకి వచ్చాయి. ఎంపికచేసుకుని నిపుణులైన వైద్యుల సూచనలను పాటిస్తూ ఆస్థమా వ్యాధిగ్రస్థులు ఏవిధంగా రాజీపడకుండా సాధారణ జీవితం గడపటానికి ఇప్పుడు వీలు కలుగుతున్నది.


బ్రాంకియల్ థర్మోప్లాస్టీ:

తీవ్రమైన ఆస్థమా వ్యాధితో బాధపడుతున్న వారికి పూర్తి ఉపశమనం ఇవ్వగల అత్యాధునిక చికిత్సగా ఇది ముందుకు వచ్చింది. ఈ ప్రక్రియలో ఒక ప్రత్యేక పరికరం (ప్రోబ్)ను ఉపయోగించి శ్వాననాళపు గోడలను వేడిచేస్తారు. బ్రాంకోస్కోప్ ద్వార వెళ్లే ఈ ప్రోబ్ అందించిన వేడిమితో శ్వాసమార్గంలో చేరిన అదనపు మ్యూకస్ తొలగిపోతుంది. దాంతో శ్వాసమార్గం విశాలంగా తెరుచుకుంటుంది. ఈ ప్రక్రియను మూడేసి వారాల చొప్పున వ్యవధిని ఇస్తూ మూడు దఫాలుగా నిర్వహిస్తారు. ఈ మూడు దఫాల చికిత్సా ప్రక్రియ పూర్తయ్యే సరికి తీవ్రమైన ఆస్థమా వ్యాధి లక్షణాలు బాగా తగ్గిపోతాయి. చెప్పుకోదగ్గ ఉపశమనం లభిస్తుంది. సహజంగానే వ్యక్తి జీవన నాణ్యత మెరుగుపడుతుంది. అదే సమయంలో ఆస్థమా అటాక్స్ సంఖ్య, ఆకారణంగా ఆస్పత్రిలో చేరాల్సి రావటం తగ్గిపోతుంది. ఈ చికిత్సా ప్రక్రియ ఫలితం చాలా కాలం పాటు (కనీసం ఎనిమిది సం.లు) నిలిచివుంటుంది. శ్వాసమార్గంలో ఆటంకంగా తయారయిన మృదువైన కండరాల పరిమాణాన్ని తగ్గించే ఒకే ఒక్క చికిత్సగా బ్రాంకియల్ థర్మోప్లాస్టీ నిలబడుతోంది. పద్దెనిమిది సం.లు నిండిన, ఇన్హేలర్ మందుల వల్ల ప్రయోజనం లభించదని ఆస్థమా వ్యాధిగ్రస్తులు ఎవరైనా ఈ ప్రక్రియను ఎంచుకోవచ్చు.


బయోలాజిక్ మెడిసిన్స్:

తీవ్రమైన ఆస్థమా చికిత్సకు సంబంధించి అత్యాధునిక ఔషధాలు కొన్ని అందుబాటులోకి వచ్చాయి. సంబంధిత ప్రభుత్వ సంస్థలు, వైద్యనిపుణుల ఆమోదంపొందిన ఈ మందులు ఆస్థమా వ్యాధిగ్రస్థులలో శ్వాసనాళాల వాపును అధుపుచేయటం పైన కేంద్రీకృతం అయి పనిచేస్తాయి. ఇటువంటి ఔషధాలు అంతర్జాతీయంగా అనేకం ఉన్నప్పటికీ మనదేశంలో మాత్రం ప్రస్తుతం ‘ఒమాలిజుమాబ్’ అనే మందు మాత్రమే ప్రస్తుతం లభిస్తున్నది. అయితే ఈ మందును ఆస్థమా పేషంట్లు అందరికి సిఫార్సుచేయలేం. తీవ్రమైన ఆస్థమా ఉండి, వారి రక్తంలో ఎల్జీ ఇ అనే అణువులు ఎక్కువగా ఉన్నవారు మాత్రమే దీనిని వాడటానికి వీలుంటుంది. దీనిని ప్రతీ రెండు నుంచి నాలుగు వారాలకు ఒకసారి చొప్పున సబ్ క్యుటెనియస్(చర్మదిగువన) ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు. దాదాపు డెబ్బయ్ శాతం తీవ్రమైన ఆస్థమా వ్యాధిగ్రస్థులు దీని వల్ల ప్రయోజనం పొందగలుగుతున్నారు. మందు వాడిన తరువాత మూడు నూంచి నాలుగు నెలల్లో ఫలితాలు కనిపిస్తాయి. ఒకటి రెండు సంవత్సరాల పాటు ఆస్థమా వ్యాధి సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. స్టెరాయిడ్స్ లాగా కాకుండా ఈ మందు వల్ల చప్పుకోదగ్గ దుష్ఫలితాలు ఏమీ ఉండవు. రానున్న రోజుల్లో ‘ఒమాలిజుమాబ్’ తోపాటు మరిన్ని బయోలాజికల్ మెడిసిన్స్ మనదేశంలో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందువల్ల తీవ్రమైన ఆస్థమా వ్యాధిగ్రస్థులకు మరింత ఉపశమనం ఇవ్వగల మందులు అందబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అత్యాధునిక, మెరుగైన ఫలితాలను ఇవ్వగల ప్రాణరక్షణ చికిత్సా విధానాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ మనదేశంలోని తీవ్రమైన ఆస్థమా వ్యాధిగ్రస్థులకు ఈ విషయం తెలియటంలేదు. మారిన పరిస్థితులలో తీవ్రమైన ఆస్థమా వ్యాధి తాలూకు సమస్యల వల్ల ఎవ్వరూ బాధపడనవసరంలేదు. దగ్గు, దమ్మూ వారి సాధారణ జీవితానికి ఆటంకం కానవసరంలేదు. మెరుగైన రోజువారీ జీవితం, ఆస్థమా అటాక్స్ తోసహా ఆస్థమా వ్యాధి లక్షణాల నుంచి విముక్తి ఇప్పుడు వారికి అందని ద్రాక్ష ఎంతమాత్రం కాదు.


ముందు జాగ్రత్తతో ఆస్థమా పై అదుపు

ఆస్థమా ఓ సంక్లిష్టమైన వ్యాధి. పరిసరాలలో పరిస్థితి, వాతావరణం ఈ వ్యాధి తీవ్రతను పెంచటంలో చాలా ముఖ్యమైన పాత్రవహిస్తున్నందువల్ల ముందు జాగ్రత్తలు తీసుకోవటం  ద్వారా ఆస్థమాబారిన పడకుండా చూసుకునేందుకు వీలుకలుగుతుంది. ఆస్థమా వ్యాధిని నిరోధించటం ఓ సవాలు. సులభమైన కొన్ని సూచనలు పాటించటం ద్వారా జాగ్రత్తపడవచ్చు.

  • దిండ్లపై దుమ్ము, ధూళి లేకుండా చూసుకోండి. కనీసం పదిహేను రోజులకు ఓ సారి పక్కబట్టలను  మరుగుతున్న నీళ్లతో ఉతకండి.
  • పెంపుడు జంతువులను పడకగదిలోకి, ఫర్నీచర్ పైన కూర్చోవటానికి అనుమతించకండి.
  • పడక గదిలో కార్పెట్లు వేయకండి. దూదికూరి చేసిన పిల్లల బొమ్మలను పడకగదుల్లో పెట్టకండి.
  • ఇంటి వాతావరణంలో తేమ అధికంగా ఉండకుండా చూసుకొండి. ఇంటిలోకి వస్తున్న గాలి నాణ్యతను గమనిస్తూ ఉండండి
  • ధూమపానం కోసం ఉద్దేశించిన ప్రదేశాలకు దూరంగా ఉండండి.
  • ఇళ్లలో ఫ్లోరింగ్, బాత్రూమ్ లను శుబ్రం చేసేందుకు ఘాటైన క్లీనర్లను, ఆసిడులను వాడకండి.
  • మానసిక వత్తడిని అదుపులో ఉంచుకోండి.
  • తీవ్రమైన వేడి, చలి ఉన్న రోజుల్లో ఆరుబయట వ్యాయామం చేయకండి.
  • ఆస్థమాలక్షణాలు కనిపించినపుడు  ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు  చేయించుకోండి. ప్రారంభంలోనే వైద్యులను కలవటం వల్ల మీ ఆస్థమాకు కారణాలను గుర్తించి చికిత్స చేయటం – జాగ్రత్తలను సూచించటం ద్వారా దానిని పూర్తిగా అదుపులో ఉంచటానికి వీలవుతుంది.
Yashoda Hospitals

View Comments

Recent Posts

కళ్లకలక (కంజెక్టివైటీస్‌): రకాలు, లక్షణాలు మరియు నివారణ చర్యలు

దగ్గు, జలుబు మాదిరి సీజనల్‌గా వర్షాకాలంలో వచ్చే సాధారణ వ్యాధుల్లో కళ్లకలక ఒకటి. కళ్లకలక సమస్య స్టాఫిలోకాకల్‌ బ్యాక్టీరియాల ద్వారా…

1 week ago

థైరాయిడ్ వ్యాధి: రకాలు, లక్షణాలు, కారణాలు & నియంత్రణ చర్యలు

థైరాయిడ్ గ్రంథి అనేది మెడ మధ్య స్వరపేటిక క్రింద భాగాన, కాలర్ ఎముక పైన సీతాకోక చిలుకను పోలిన ఆకారంలో…

2 weeks ago

హెపటైటిస్‌: రకాలు, లక్షణాలు మరియు నివారణ చర్యలు

మన శరీరంలో కాలేయం అనేది చాలా ముఖ్యమైన అవయవం. ఇది శరీరానికి అవసరమైన రసాయనాలను సరఫరా చేసే ప్రయోగశాలగా (రక్తాన్ని…

3 weeks ago

Demystifying Hysteroscopy: A Guide to this Vital Gynecological Procedure

Hysteroscopy has emerged as a valuable solution to various gynecological issues, offering both diagnostic and…

4 weeks ago

Endometriosis Surgery: Your Complete Guide to Treatment, Recovery, and Pain-Free Future

Endometriosis is a medical condition characterized by the growth of tissue similar to the lining…

1 month ago

కొలనోస్కోపీ ఎందుకు & ఎవరికి చేస్తారు? చికిత్స విధానాలు మరియు ప్రయోజనాలు

పెద్ద ప్రేగు అనేది జీర్ణవ్యవస్థలో ఒక ప్రధాన భాగం. ఇది శరీరంలో చాలా ముఖ్యమైన విధులు నిర్వహిస్తుంది. ఇది ఆహారంలోని…

2 months ago