పేజీ ఎంచుకోండి

తలనొప్పి: రకాలు, కారణాలు, లక్షణాలు మరియు నివారణ చర్యలు

తలనొప్పి: రకాలు, కారణాలు, లక్షణాలు మరియు నివారణ చర్యలు

పరిచయం

ప్రస్తుతం జీవనశైలిలో మార్పుల కారణంగా చాలా మంది సాధారణ సమస్య తలనొప్పి. జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఒత్తిడి, ఉద్రిక్తత, హార్మోన్లలో మార్పులు, నిద్ర లేమి, గ్యాస్ట్రిక్ సమస్యలు, పర్యావరణ పరిస్థితులు మరియు దీర్ఘకాలిక ఆరోగ్య పరిస్థితుల కారణంగా ఈ తలనొప్పి సమస్యతో బాధపడతారు. ఇది జబ్బు కాదు, అనేక వ్యాధుల వల్ల కనపడే ఒక లక్షణం. ఈ తలనొప్పి సమస్య వయస్సు, లింగం తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ బాధపెడుతుంటుంది.

తలనొప్పి వచ్చే తీరు ఆ వ్యక్తి యొక్క ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. అయితే కొంతమందికి ఈ తలనొప్పి రోజూ మరికొందరికి వారానికి కనీసం రెండు సార్లైనా వచ్చి చిరాకు పెడుతుంది. కొన్నిసార్లు తలనొప్పిని నిర్లక్ష్యం చేస్తే అది తీవ్రంగా మారి రోజువారీ పనులు చేయడంలో కూడా ఇబ్బంది కలుగుతుంది. అంతే కాకుండా తలనొప్పి రకాన్ని బట్టి వాళ్లకున్న అనారోగ్య సమస్యలను కూడా తెలుసుకోవచ్చు.

తలనొప్పి రకాలు

ఈ తలనొప్పి అనేది తల పైభాగంలో, నుదిటిపై, వెనుక లేదా తలలోని ఏ భాగంలోనైనా రావొచ్చు. అయితే ఈ తలనొప్పి వచ్చే అంశం ఖచ్చితంగా గుర్తించలేము.

ముఖ్యంగా తలనొప్పి 2 రకాలు:

  1. ప్రైమరీ తలనొప్పి: తలనొప్పికి డాక్టర్ రకాల పరీక్షలు చేసి ఏ సమస్య లేదని చెప్పడానికి ఇంకా తలనొప్పి వస్తుంటే ఆ రకమైన తలనొప్పిని ప్రైమరీ తలనొప్పి అంటారు. తల చుట్టూ ఉండే కండరాలు, రక్తనాళాలకు ఏదైనా ఒత్తిడి కలిగినపుడు ఈ రకమైన తలనొప్పి వస్తుంది. సాధారణంగా వచ్చే 90 శాతం తలనొప్పులు ఈ రకానికి చెందినవే. ఈ తలనొప్పి ఎక్కువగా 20-40 సంవత్సరాల మధ్య వయసు గల వారిలో ఎక్కువగా గమనించవచ్చు. ప్రైమరీ తలనొప్పి ప్రమాదం లేనిది మరియు తరచూ వస్తూ పోతూ ఉంటుంది.

ప్రేమరీ తలనొప్పిలోని 3 రకాలు 

  • మైగ్రేన్ తలనొప్పి: దీనినే పార్శ్వనొప్పి అని కూడా అంటారు. ఈ తలనొప్పి ఆడవారిలో ఎక్కువగా, మగవారిలో తక్కువగా ఉంటుంది. ఇది చాలా తీవ్రమైన నొప్పి. ఈ తలనొప్పి ఒక్కోసారి త్వరగా తగ్గుతుంది మరియు కొన్నిసార్లు అలానే ఉండవచ్చు. కొంతమందికి ఈ మైగ్రేన్ తలనొప్పి తలలో ఓ వైపు ఉంటే మరికొంతమందికి తలంతా ఉంటుంది. కొన్నిసార్లు ఇది జన్యుపరంగా కూడా రావచ్చు.
  • ఒత్తిడి ద్వారా వచ్చే తలనొప్పి: పని ఒత్తిడి కారణంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో త’ల’నొప్పి రావడం స’హజం. అయితే ఎవరైనా ఎక్కువసేపు దృష్టి పెట్టినప్పుడు ఒత్తిడి కారణంగా తల బారంగా పని చేయడం, మెడ నొప్పులుగా ఉండటం వల్ల ఈ తలనొప్పి వస్తుంది.
  • క్లాస్టర్ హెడెక్స్: ఈ రకం తలనొప్పి మగ వారిలో ఎక్కువగా కనపడుతుంది. ఇది తలకు ఒక పక్కన వస్తుంది. కంటి చుట్టూ నొప్పిగా ఉండటం, కన్ను ఎర్రబడటం, నీరు కారడం, ఒక్కొక్కసారి కళ్లు మూతబడటం, బుగ్గ వాచడం కూడా ఈ క్లాస్టర్ తలనొప్పికి సంబంధించినది.
  1. సెకండరీ తలనొప్పి: ఇది శరీరంలోని కొన్ని వ్యాధుల ప్రభావం వలన కలిగే తలనొప్పి. బీపీ ఎక్కువగా ఉండటం, చెవులో ఇన్‌క్షన్, మెదడులో ట్యూమర్లు, తలలో ఏమైనా రక్తస్రావం అవడం వంటి కారణాల వల్ల ఈ సెకండరీ తలనొప్పి వస్తుంది.

తలనొప్పి గల కారణాలు

తలనొప్పి రకాలు 1

తలనొప్పి రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో:

  • ఒత్తిడి మరియు మానసిక ఆందోళన
  • నిద్రలేమి
  • ఉదయం అల్పాహారం తీసుకోకపోవడం
  • పదేపదే సైనస్ ఇన్ఫెక్షన్ల బారిన పడడం
  • రక్తపోటు పెరగడం
  • ప్రీ డయాబెటిక్ స్థితిలో మార్పు రావడం
  • సాధారణ వ్యాయామం లేకపోవడం
  • ఎక్కువగా ఏడవటం మరియు వేదన చెందడం
  • ఎక్కువగా మద్యం తాగడం
  • కుటుంబ చరిత్ర ఆధారంగా (వారసత్వంగా)
  • సంగీతం ఎక్కువసేపు వినడం
  • సరిగా కూర్చోలేకపోవడం లేదా ఒకే స్థానంలో ఎక్కువసేపు కూర్చోవడం

తలనొప్పి యొక్క లక్షణాలు

తలనొప్పి యొక్క లక్షణాలు అది వచ్చే రకంపై ఆధారపడి ఉంటుంది. కాకుండా రోజువారీ జీవితంలో లక్షణాలు మరియు వాటి ప్రభావాలు మారవచ్చు.

  • తల యొక్క రెండు వైపులా నొప్పి కలగడం
  • కంటి వెనుక భాగంలో నొప్పి రావడం
  • వికారం లేదా వాంతులు కలగడం
  • తల లోపల ఎక్కువ ఒత్తిడిగా అనిపించడం
  • కళ్లు ఎర్రబడడం, వాయడం మరియు కళ్లలో నీళ్లు రావడం
  • తలనొప్పి మొదలైన సమయం నుండి చాలా రోజుల పాటు నొప్పి ఉండటం

తలనొప్పి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • మైగ్రేన్ సమస్యని దూరం చేయాలంటే ముందుగా దానిని గుర్తించడం చాలా ముఖ్యం. 
  • సమయానుసారం పూర్తి ఆహారం తీసుకోవడం
  • డీహైడ్రేషన్ కు గురి కాకుండా చూసుకోవడం
  • క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం 
  • మంచి నిద్రను అలవరచుకోవడం
  • ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం చేయడం
  • ధూమపానం, ఆల్కహాల్ కు దూరంగా ఉండటం 
  • తమకు పడని ఆహారాలకు, పానీయాల వాసనలకు దూరంగా ఉండటం 
  • విశ్రాంతి మరియు నొప్పి నివారణ మందులు తీసుకోవడం
  • అన్ని రకాల పండ్లు, కొద్ది మొత్తంలో కాఫీ, బ్రోకలీ తలనొప్పి కూడా కొంత వరకు నివారిస్తాయి.

అయితే సాధారణంగా వచ్చే తలనొప్పి 48 గంటల్లో మాయమవుతుంది. అలా కాకుండా ఎల్లప్పుడు తలనొప్పితో బాధపడుతుంటే తప్పకుండా వైద్యులను సంప్రదించడం ఉత్తమం. తలనొప్పి ఏ విధమైన కారణం వల్ల వస్తుందనే విషయాన్ని ముందుగా తెలుసుకుని తగు పరీక్షలు చేయించుకోవాలి. కాకుండా జీవన శైలిలో మార్పులు చేసుకోవడంతో పాటు కొన్ని రకాల వ్యాధులు (మెనింజైటిస్, బ్రెయిన్ ట్యూమర్) వ్యాధులకు తగిన చికిత్స చేయడం ద్వారా కూడా ఈ తలనొప్పి సమస్యను నివారించుకోవచ్చు.

రచయిత గురించి -

డాక్టర్ కండ్రాజు సాయి సతీష్, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ & ఎపిలెప్టాలజిస్ట్, యశోద హాస్పిటల్, హైదరాబాద్

రచయిత గురించి

డా. కండ్రాజు సాయి సతీష్ | యశోద హాస్పిటల్స్

డాక్టర్ కండ్రాజు సాయి సతీష్

ఎపిలెప్సీలో MD, DM (న్యూరాలజీ), PDF

కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ & ఎపిలెప్టాలజిస్ట్