%1$s

కిడ్నీ సమస్యలకు అత్యాధునిక రోబోటిక్‌ సర్జరీలు

robotic surgeries kidney problems

ఒకప్పుడు ఆపరేషన్‌ అంటే కత్తులు, కటార్లతో పెద్ద కోతలు పెట్టి చేసేవాళ్లు. ఎక్కడ సర్జరీ అవసరం అయితే అక్కడ కోసి లోపలున్న అవయవాలను సరిచేసేవాళ్లు. కాని అభివృద్ధి చెందిన వైద్యరంగం కష్టంలేని సర్జరీలను ఆవిష్కరిస్తున్నది. అలా వచ్చిందే లాపరోస్కోపిక్‌ సర్జరీ. ఇప్పుడు లాపరోస్కోపిక్‌ సర్జరీల కన్నా ఆధునికమైన రోబోలు వచ్చేశాయి. ఎక్కువ రక్తం పోకుండా అటు డాక్టర్‌కూ, ఇటు రోగికీ చాలా సౌకర్య వంతమైన శస్త్రచికిత్సలుగా ఇవి అత్యధిక ప్రయోజనాలనిస్తున్నాయి. కిడ్నీ సంబంధ సమస్యల చికిత్సల్లో కూడా ఇప్పుడు రోబోలు చకచకా సర్జరీలను చేసేస్తున్నాయి. నాలుగు నెలల క్రితం…ఆపరేషన్‌ థియేటర్‌ అంతటా ఉత్కంఠ నిండి ఉంది. ఆపరేషన్‌ బెడ్‌ మీద 9 నెలల బాబు. అతనికి పుట్టుకతోనే కిడ్నీలో సమస్య ఉంది. అతనికి అదనంగా మరో మూత్రనాళం ఉంది. నిజానికి అంత పసివాడికి ఆపరేషన్‌ అంటే డాక్టర్‌కి కత్తి మీద సామే. కాని ఆపరేషన్‌ చేస్తున్న డాక్టర్‌ చాలా కూల్‌గా ఉన్నాడు. చకచకా ఆపరేషన్‌ జరిగిపోతోంది. కారణం..డావిన్సీ రోబో..!లోపలి అవయవాలను స్క్రీన్‌ మీద 3 డైమెన్షనల్‌గా చూస్తూ ఒకవైపు ఆపరేట్‌ చేస్తున్నాడు డాక్టర్‌. మరోవైపు రోబో యంత్రం తన చేతులతో పేషెంట్‌కి ఆపరేషన్‌ నిర్వహిస్తోంది. రోబో చేస్తున్న ఆపరేషన్‌ అంతా డాక్టర్‌ కంట్రోల్‌లో ఉంది. ఆ పసివాడికి ఏ సమస్యా లేకుండా చాలా కచ్చితత్వంతో, రక్తస్రావం లేకుండా ఆపరేషన్‌ అయిపోతుందన్న నిశ్చింతతో రోబోని ఆపరేట్‌ చేస్తున్నాడాయన. కట్‌ చేస్తే…ఇప్పుడు ఆ బాబు పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడు. ఇందుకు రోబో చేసిన సర్జరీ ఒక కారణమైతే, దాన్ని సమర్థంగా కంట్రోల్‌ చేసిన డాక్టర్‌ మరో కారణం.

బాబుకేమైంది?

బాబుకి పదే పదే జ్వరం రావడంతో పీడియాట్రీషియన్‌ దగ్గరికి వెళ్లారు. మూత్రపరీక్ష, అబ్డామినల్‌ స్కాన్‌ చేయించారు. మూత్రంలో ఇన్‌ఫెక్షన్‌, కిడ్నీ నిర్మాణంలో తేడా ఉన్నట్టు ఇందులో తేలింది. ఆపరేషన్‌ ద్వారా దాన్ని సరిచేయాలని చెప్పారు డాక్టర్లు. మనకు ఉండేవి రెండు కిడ్నీలు. సాధారణంగా ఒక కిడ్నీ నుంచి ఒక మూత్రనాళం వస్తుంది. అలా రెండు మూత్రనాళాలు వెళ్లి యూరినరీ బ్లాడర్‌ (మూత్రకోశం)లో తెరుచుకుంటాయి. కాని ఈ బాబులో కుడి కిడ్నీ బాగానే ఉంది. కానీ ఎడమ కిడ్నీ రెండుగా విడిపోయి, రెండు భాగాల నుంచి రెండు మూత్రనాళాలు ఏర్పడ్డాయి. కుడి కిడ్నీలోని మూత్ర నాళంతో పాటుగా ఎడమ కిడ్నీలోని రెండింటిలో ఒక మూత్రనాళం బ్లాడర్‌లోకి, మరోటి ప్రొస్టేట్‌లోకి తెరుచుకున్నాయి. దాంతో ప్రొస్టేట్‌ దగ్గరి మూత్రనాళం బ్లాక్‌ అయింది. అందువల్ల యూరిన్‌ ఇన్‌ఫెక్షన్‌ వచ్చి, కిడ్నీలో వాపు వచ్చింది. ఆ భాగం సరిగా పనిచేయకుండా పోయింది. సీటీ స్కాన్‌లో సమస్య కనుక్కుని సర్జరీ చేశారు. రోబోటిక్‌ సర్జరీతో అదనపు మూత్రనాళాన్ని కత్తిరించేసి, రెండవ మూత్రనాళానికి కలిపారు. పసిపిల్లవాడైనా ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా సేఫ్‌గా సర్జరీ పూర్తయింది. బాబును మూడో రోజే ఇంటికి పంపించారు. ఇలాంటి ఎన్నో రకాల కిడ్నీ సమస్యలకు సురక్షితమైన పరిష్కారం చూపిస్తున్నది రోబోటిక్‌ సర్జరీ.

ఓపెన్‌ నుంచి రోబో వరకు..

వైద్యరంగంలో ఎన్ని మార్పులు వచ్చినా పేషెంట్‌ సేఫ్టీనే చివరి లక్ష్యంగా ఉంటుంది. మెరుగైన వైద్యాన్ని, సౌకర్యవంతంగా, సేఫ్‌గా అందించే దిశగా నిరంతరం పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అలాంటి పరిశోధనల ఫలితమే ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన రోబోటిక్‌ సర్జరీ. మొదట్లో సర్జరీ అంటేనే పెద్ద కోత పెట్టి చేసే ఓపెన్‌ సర్జరీయే. గుండె, ఊపిరితిత్తులకు సంబంధించినవైతే ఛాతి తెరిచి సర్జరీ చేయాలి. పొట్టలోని అవయవాలకు సంబంధించిందైతే పొట్టపై గాటు పెట్టాలి. కాని లాపరోస్కోపిక్‌ సర్జరీ అందుబాటులోకి వచ్చిన తరువాత పెద్ద కోత అవసరం లేకుండా మూడు నాలుగు రంధ్రాలు మాత్రమే పెట్టి చేసే కీహోల్‌ సర్జరీ రోగులకు వరమైంది. కిడ్నీకి సంబంధించిన ఆపరేషన్లకు కూడా లాపరోస్కోపీ చేసేవాళ్లు. అయితే లాపరోస్కోపిక్‌ సర్జరీల్లో ఉండే లోపాలు కూడా లేనిది రోబోటిక్‌ సర్జరీ. ఓపెన్‌ సర్జరీ కిడ్నీలు, ఇతర మూత్ర వ్యవస్థ అవయవాలను చూడాలంటే కూడా పెద్ద కోత పెట్టాల్సి వచ్చేది. ఇందుకోసం 15 నుంచి 20 సెం.మీ. కోత పెట్టాల్సి వస్తుంది. అందువల్ల నొప్పి చాలా ఉంటుంది. నొప్పి తగ్గడానికి పెయిన్‌ కిల్లర్లు వాడాల్సి వస్తుంది. దాంతో ఈ నొప్పి తగ్గించే మాత్రల వల్ల కలిగే దుష్ఫలితాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పెద్ద కోత పెట్టి ఓపెన్‌ చేస్తారు కాబట్టి శస్త్రచికిత్స సమయంలో రక్తం ఎక్కువగా పోతుంది. కాబట్టి రికవర్‌ కావడానికి ఎక్కువ కాలం పడుతుంది. హాస్పిటల్‌లోనే 10 రోజులు ఉండాల్సి ఉంటుంది. ఆ తర్వాత కోలుకోవడానికి 15 నుంచి 20 రోజులు పడుతుంది. ఆపరేషన్‌ సమయంలో పెట్టిన పెద్ద కోత గాయమవుతుంది. ఇది తొందరగా మానకపోతే ఇన్‌ఫెక్షన్లు వస్తాయి. అంతేకాదు హెర్నియా లాంటి సమస్యలు కూడా రావొచ్చు. అప్పుడు సమస్య మరింత జటిలం అవుతుంది.

లాపరోస్కోపిక్‌ సర్జరీ

లాపరోస్కోపీ అందుబాటులోకి వచ్చిన తరువాత శరీరాన్ని కోసే బాధ తప్పింది. కత్తుల గాట్లు లేకుండా చిన్న చిన్న రంధ్రాలతో లోపలికి కెమెరా, లాపరోస్కోపిక్‌ పరికరాన్ని పంపి సర్జరీ చేయవచ్చు. లోపలి అవయవాలను స్క్రీన్‌ మీద స్పష్టంగా చూడవచ్చు. వాటిని తెర మీద చూస్తూ లోపల సర్జరీ చేయవచ్చు. లాపరోస్కోపిక్‌ పరికరం 2డి విజన్‌ను కలిగివుంటుంది. అందువల్ల లోపలి అవయవాలను 2 డైమెన్షనల్‌గా చూపిస్తుంది. కోత ఉండదు. 1 సెం.మీ. రంధ్రం పెడితే చాలు. ఇలాంటి రంధ్రాలు మూడు నాలుగు చేస్తారు. పెద్ద గాటు ఏమీ ఉండదు కాబట్టి ఆపరేషన్‌ సమయంలో రక్తం పోయే అవకాశం ఉండదు. చాలా తక్కువ బ్లడ్‌ లాస్‌ ఉంటుంది. లాపరోస్కోపీ ద్వారా ఆపరేషన్‌ చేయించుకుంటే హాస్పిటల్‌లో మూడు నాలుగు రోజులుంటే చాలు. ఆ తర్వాత తొందరగా కోలుకుంటారు. అయితే కొన్ని ప్రొసిజర్లను లాపరోస్కోపీలో చేయడం చాలా కష్టం. ఉదాహరణకి రీకన్‌స్ట్రక్టివ్‌ ప్రొసిజర్లను లాపరోస్కోపీ ద్వారా చేయడం కష్టం.

మూత్రనాళం బ్లాక్‌ అయినప్పుడు దాన్ని కట్‌ చేసి బ్లాక్‌ తీసేసి మళ్లీ జాయిన్‌ చేయాల్సి ఉంటుంది. లాపరోస్కోపీలో కుట్లు వేయడం కష్టం అవుతుంది. ఇలాంటప్పుడు ఓపెన్‌ చేసి చేయాల్సి వచ్చేది. అదేవిధంగా కిడ్నీలో ట్యూమర్‌ ఉంటే కణితి వరకే తీసేసి మిగిలింది కుట్లు వేయాలి. ఇది లాపరోస్కోపీతో కష్టం. దీనికి స్కిల్‌ అవసరం. ఎంతో అనుభవం కావాలి. స్థూలకాయం ఉన్నవాళ్లలో కూడా ఆపరేషన్‌ లాపరోస్కోపీతో కష్టమవుతుంది.

రోబోటిక్‌ సర్జరీ

రోబోతో చేసే సర్జరీకి డాక్టర్‌ చేతులు అవసరం లేదు. రోబో చేతులతోనే సర్జరీ చేయిస్తారు. తెరమీద లోపలి అవయవాలను చూస్తూ రోబో పరికరాన్ని ఎటు ఎలా తిప్పాలనేది డాక్టర్‌ కంట్రోల్‌ చేస్తుంటారు. అందుకు అనుగుణంగా రోబో చేతులు చకచకా ఆపరేషన్‌ చేసేస్తుంటాయి. రోబోటిక్‌ సర్జరీకి కూడా పెద్ద కోత పెట్టాల్సిన అవసరం లేదు. దీనికి కూడా లాపరోస్కోపీ లాగానే 1 సెం.మీ. రంధ్రం మూడు నాలుగు వేయాలి. రోబోటిక్‌ సర్జరీ చేయడానికి పెద్దగా స్కిల్స్‌ అవసరం లేదు. టెక్నాలజీ తెలిసి, కొద్దిగా అనుభవం ఉంటే చాలు. లాపరోస్కోపీ ద్వారా చేయలేని సర్జరీలను రోబోతో చేయొచ్చు. రోబో యంత్రానికి 3డి విజన్‌ ఉంటుంది. అందుకే లోపలి అవయవాలను 3 డైమెన్షనల్‌గా చూడవచ్చు. ఓపెన్‌ సర్జరీలో డాక్టర్‌ తన చేతులతో చేసినట్టు ఇక్కడ రోబో చేతులతో చేయించవచ్చు. మన చేతులను గుండ్రంగా తిప్పగలిగినట్టుగానే రోబో చేయిని కూడా 360 డిగ్రీలలో తిప్పవచ్చు. ఒకరకంగా చెప్పాలంటే చెయ్యి కన్నా కూడా బెటర్‌. అప్పుడప్పుడు చెయ్యి వణికి అటు ఇటు కదలిపోవచ్చు. కాని రోబో చెయ్యి వణకదు. లాపరోస్కోపీలో అయితే ఒకరు కెమెరా పట్టుకుని ఉండాలి. కాని ఇందులో రోబో యంత్రానికే కెమెరా అమర్చి ఉంటుంది. లోతుగా ఉండే భాగాలకు చేసినప్పుడు కూడా సర్జరీ సులువు అవుతుంది. స్థూలకాయులకు కూడా చాలా సులువుగా కిడ్నీ సర్జరీలను చేయొచ్చు.

రోబోతో లాభాలూ.. నష్టాలూ..

రోబో ఒక యంత్రం కాబట్టి దీనిలో మృదువైన కణజాలమేదో, గట్టిగా ఉన్నదేదో తెలియదు. కాని ఇందువల్ల పెద్దగా నష్టాలేమీ ఉండవు. ఇకపోతే ప్రస్తుతం కేవలం ఒకే కంపెనీ రోబో యంత్రాన్ని తయారుచేస్తోంది కాబట్టి ఖర్చు ఎక్కువ. ఇలాంటి వాటితో పోలిస్తే రోబోటిక్‌ సర్జరీతో కలిగే ప్రయోజనాలే ఎక్కువ. – కోత ఉండదు కాబట్టి ఇది మినిమల్లీ ఇన్వేసివ్‌ సర్జరీ – అధిక రక్తస్రావం ఉండదు. – సర్జరీ తొందరగా అయిపోతుంది. – 10 వంతులు ఎక్కువ మాగ్నిఫికేషన్‌ ఉంటుంది. అంటే చిన్నవి కూడా పదొంతులు ఎక్కువ పెద్దగా కనిపిస్తాయి. కాబట్టి లోపలి అవయవాలను చాలా స్పష్టంగా చూడొచ్చు. చిన్న చిన్న నాడులు కూడా కనిపిస్తాయి కాబట్టి పొరపాటున వాటిని కట్‌ చేయకుండా ఉంటారు. – ఇది పూర్తిగా పేషెంట్‌ సేఫ్టీ సర్జరీ. ఎటువంటి దుష్ప్రభావాలూ ఉండవు. ఏ సమస్యలకు?

ప్రొస్టేట్‌ క్యాన్సర్‌

ప్రొస్టేట్‌ గ్రంథిలో సమస్యలున్నప్పుడు ముఖ్యంగా క్యాన్సర్‌ ఉన్నప్పుడు దాన్ని తొలగించాల్సి వస్తుంది. దీన్ని రాడికల్‌ ప్రొస్టెక్టమీ అంటారు. లాపరోస్కోపీ ద్వారా ప్రొస్టేట్‌ను తీసేసినప్పుడు దాని చుట్టుపక్కలున్న చిన్న నాడులు సరిగా కన్పించక పొరపాటున అవి తెగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అందువల్ల వాళ్లలో వంధ్యత్వం వస్తుంది. ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ తొలగిపోయి, ప్రాణాపాయం లేకపోయినప్పటికీ వాళ్లు ఇంపొటెంట్‌ కావడం చాలా బాధాకరంగా ఉంటుంది. ఇలాంటప్పుడు ఈ సమస్య రాకుండా సర్జరీ చేయడం రోబోటిక్స్‌ ద్వారా సాధ్యమవుతుంది. లోపలున్న అన్ని శరీర భాగాలూ 10 వంతులు ఎక్కువ పెద్దగా కనిపించడం వల్ల చిన్న చిన్న నాడులు కనిపించకపోయే ప్రసక్తే లేదు. కాబట్టి అవి తెగిపోకుండా జాగ్రత్తగా సర్జరీ చేయడం సాధ్యమవుతుంది.

కిడ్నీ ట్యూమర్లు

పెద్ద పెద్ద ట్యూమర్లు ఉంటే కొన్ని సందర్భాల్లో కిడ్నీ మొత్తాన్నీ తీసేయాల్సి వస్తుంది. దీన్ని రాడికల్‌ నెఫ్రెక్టమీ అంటారు. కాని చిన్న సైజు ట్యూమర్లు ఉన్నప్పుడు కణితి వరకు మాత్రమే తీసేసి, మిగిలిన కిడ్నీని కాపాడవచ్చు. దీన్ని పార్షియల్‌ నెఫ్రెక్టమీ అంటారు. ఓపెన్‌, లాపరోస్కోపీ, రోబోటిక్‌ సర్జరీలన్నిటి ద్వారా కూడా పార్షియల్‌ నెఫ్రెక్టమీ చేయొచ్చు. కానీ రోబోటిక్స్‌ ద్వారా సమర్థవంతంగా చేయవచ్చు.ట్యూమర్‌ తీసేసేటప్పుడు కిడ్నీ కట్‌ చేయాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు రక్తం ఎక్కువగా పోతుంది. ఇది అరగంట కన్నా ఎక్కువ సేపు అయితే కిడ్నీ డ్యామేజి అవుతుంది. లాపరోస్కోపీలో ఇది కష్టం అవుతుంది. కాని రోబో ద్వారా కిడ్నీ కట్‌ చేయడం, కుట్లు వేయడం అన్ని తొందరగా అయిపోతాయి. కాబట్టి అధిక రక్తస్రావం ఉండదు. కిడ్నీ దెబ్బతినేందుకు ఆస్కారం ఉండదు.

బ్లాడర్‌ క్యాన్సర్‌

మూత్రకోశంలో క్యాన్సర్‌ ఉన్నప్పుడు దాన్ని సర్జరీ ద్వారా తీసేయాల్సి వస్తుంది. ఇలా బ్లాడర్‌ను తొలగించినప్పుడు రకరకాల పద్ధతుల ద్వారా బ్లాడర్‌ లాంటి నిర్మాణాన్ని తయారుచేస్తారు. ఈ సర్జరీకి రోబోటిక్స్‌ బాగా ఉపయోగపడుతుంది. బ్లాడర్‌ను తీసేసిన తరువాత మూత్రనాళాన్ని పేగుకు కలుపుతారు. కొన్నిసార్లు పేగులోపలే ఒక సంచీలాంటి నిర్మాణాన్ని అమరుస్తారు. ఇది బ్లాడర్‌ లాగా పనిచేస్తుంది. అయితే ఇలాంటప్పుడు మూడు నాలుగు గంటలకోసారి పైపు ద్వారా యూరిన్‌ను బయటకు తీయాలి. కొందరికి మూత్రనాళాన్ని పేగుకు కలిపిన తరువాత శరీరం బయట స్టోమా లాగా సంచీని ఏర్పాటు చేస్తారు. మరో పద్ధతి పేగుతోనే కొత్త బ్లాడర్‌ను తయారుచేయడం. ఇలా తయారుచేసిన బ్లాడర్‌ను మూత్రనాళానికి కలుపుతారు. ఇలాంటి చికిత్సల్లో రోబోటిక్స్‌ బాగా ఉపయోగపడుతాయి.

గైనిక్‌ సర్జరీల తరువాత..

కొన్నిసార్లు స్త్రీ సంబంధ సమస్యలున్నప్పుడు చేసిన గైనిక్‌ సర్జరీల వల్ల ఫిస్టులా ఏర్పడి దాన్ని తొలగించాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు రోబోటిక్‌ సర్జరీ మంచి ఫలితాన్నిస్తుంది. ఉదాహరణకు హిస్టరెక్టమీ, ఫైబ్రాయిడ్స్‌ లాంటి సర్జరీల తరువాత బ్లాడర్‌ డ్యామేజి అయ్యేందుకు అవకాశం ఉంటుంది. బ్లాడర్‌కి, వ్జైనాకి మధ్యలో ఫిస్టులా ఏర్పడవచ్చు. దీన్ని వెసైకో వ్జైనల్‌ ఫిస్టులా అంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు మూత్రం ఎప్పుడూ లీక్‌ అవుతూనే ఉంటుంది. ప్యాడ్స్‌ పెట్టుకోవాల్సి వస్తుంది. ఇది చాలా ఇబ్బందికరమైన సమస్య. రోబో యంత్రం ద్వారా ఫిస్టులాను కత్తిరించి, మిగిలిన భాగాన్ని జాయింట్‌ చేస్తారు. దాంతో మూత్రం లీక్‌ సమస్య పోతుంది. యురెటిరో వ్జైనల్‌ ఫిస్టులా ఉన్నప్పుడు కూడా ఫిస్టులా కట్‌చేసి, నార్మల్‌ మూత్రానాళాన్ని మూత్రాశయానికి అటాచ్‌ చేస్తారు. గైనకాలాజికల్‌ క్యాన్సర్లు ఉన్నప్పుడు, రెక్టల్‌ క్యాన్సర్‌ ఉన్నప్పుడు కూడా రోబోటిక్‌ సర్జరీ మంచి ఫలితాన్ని ఇస్తుంది.

రీకన్‌స్ట్రక్టివ్‌ సర్జరీ

పుట్టుకతో మూత్రవిసర్జన వ్యవస్థలో ఏ లోపం ఉన్నా దాన్ని రీకన్‌స్ట్రక్టివ్‌ సర్జరీ ద్వారా సరిచేస్తారు. ఈ సమస్యలు పుట్టుకతోనే బయటపడవచ్చు. కొందరిలో పుట్టిన కొన్నాళ్ల తరువాత బయటపడవచ్చు. మూత్రనాళంలో ఎక్కడ బ్లాక్‌ ఉన్నా ఈ సర్జరీ ద్వారా సరిచేస్తారు. అలాంటి సర్జరీల్లో పైలోప్లాస్టీ ఒకటి. కొందరిలో పుట్టుకతోనే కిడ్నీ, మూత్రనాళం (యురెటర్‌) కలిసేచోట బ్లాక్‌ ఉంటుంది. దీన్ని పెల్వి యురెటర్‌ జంక్షన్‌ అబ్‌స్ట్రక్షన్‌ అంటారు. ఈ సమస్య కొందరిలో పుట్టుకతోనే బయటపడితే, మరికొందరిలో కొన్నాళ్ల తరువాత బయటపడుతుంది. ఈ బ్లాక్‌ తీసేయడానికి, బ్లాక్‌ భాగాన్ని కట్‌ చేసి, తిరిగి కుట్లు వేస్తారు. దీన్ని పైలోప్లాస్టీ సర్జరీ అంటారు. రోబోటిక్స్‌ ద్వారా ఈ సర్జరీ సులువు అవుతుంది.

అబ్‌స్ట్రక్టివ్‌ మెగా యురెటర్‌

మూత్రనాళం కిడ్నీ నుంచి బయలుదేరి, యూరినరీ బ్లాడర్‌ (మూత్రకోశం) లోకి వెళ్తుంది. ఇలా మూత్ర నాళం బ్లాడర్‌లో ప్రవేశించే చోట బ్లాక్‌ ఏర్పడితే కిడ్నీ డ్యామేజి అవుతుంది. ఇలాంటప్పుడు కూడా బ్లాక్‌ ఉన్న మూత్రనాళ భాగాన్ని కత్తిరించివేసి, మిగిలిన భాగాలను తిరిగి కుట్లువేసి అతికిస్తారు.

రిఫ్లక్స్‌

మూత్రం కిడ్నీలో తయారై మూత్రనాళం ద్వారా బ్లాడర్‌లో ప్రవేశించి, అక్కడి నుంచి బయటికి వెళ్లిపోవడం సహజమైన ప్రక్రియ. కాని కొందరిలో పుట్టుకతో లోపం వల్ల మూత్రం బ్లాడర్‌లో నుంచి బయటికి వెళ్లకుండా తిరిగి వెనక్కి కిడ్నీవైపు వెళ్లిపోతుంది. దీన్ని రిఫ్లక్స్‌ డిసీజ్‌ అంటారు. ఇలాంటప్పుడు మూత్రం కిడ్నీలోకి చేరి, ఇన్‌ఫెక్షన్‌ అవుతుంది. క్రమంగా కిడ్నీ దెబ్బతినవచ్చు. ఈ సమస్యకు కూడా రోబోటిక్‌ రీకన్‌స్ట్రక్టివ్‌ సర్జరీ మంచి పరిష్కారం చూపిస్తుంది.

About Author –

Dr. V. Surya Prakash ,Consultant Urologist, Laparoscopic, Robotic & Transplant Surgeon

MS (Gen Surgery), FRCSED, M.Ch(Urology), DNB(Urology), D.Lap

best urologist in hyderabad

Dr. V. Surya Prakash

MS (Gen Surgery), FRCSED, MCh (Urology), DNB (Urology), Diploma (Laparoscopy)
Consultant Urologist, Laparoscopic, Robotic & Transplant Surgeon

X
Select Department
Not Sure of the Specialty?
X

Choose your date & Slot

Change Date
Monday, OCTOBER 30
Enter Patient Details

Please Note: This session ends in 3:00 mins

Not Finding Your Preferred Slots?
Change Doctor
or Location
top hospital in hyderabad
Call Helpline
040 - 4567 4567