PCOD & PCOS: కారణాలు, లక్షణాలు, నిర్ధారణ మరియు నివారణ చర్యలు
ఆధునిక జీవనశైలి, మారిన ఆహారపు అలవాట్ల వల్ల ప్రస్తుతం చాలా మంది స్త్రీలు PCOD (పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్) మరియు PCOS (పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్) సమస్యలకు గురవుతున్నారు. స్త్రీలల్లో నెలసరి ఆరోగ్యం గురించి మాట్లాడేటప్పుడు PCOS లేదా PCOD గురించి కచ్చితంగా ప్రస్తావన వస్తుంది. PCOD లేదా PCOS అనేది స్త్రీల అండాశయాలను ప్రభావితం చేసే ఒక అసాధారణ పరిస్థితి. అయితే చాలామంది PCOS & PCOD అంటే ఒకటే అనే భావన కలిగి ఉంటారు, కానీ స్త్రీలల్లో ఈ రెండు వేరువేరుగా కనిపించే అనారోగ్య సమస్యలు.
అండాశయాలు సాధారణంగా ఆడ సెక్స్ హార్మోన్లను ఎక్కువగా మరియు మగ సెక్స్ హార్మోన్లను (ఆండ్రోజెన్) తక్కువ మోతాదులో ఉత్పత్తి చేస్తాయి. ప్రతి ఋతు చక్రంలో అండాశయాలలోని గుడ్లు సక్రమంగా అభివృద్ధి చెందడానికి ఈ హార్మోన్స్ అనేవి సహాయపడతాయి. ప్రొజెస్టెరాన్ మరియు ఈస్ట్రోజెన్ హార్మోన్లను ఉత్పత్తి చేసే పునరుత్పత్తి అవయవాలు ఋతు చక్రాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి అదేవిధంగా తక్కువ మొత్తంలో ఇన్హిబిన్, రిలాక్సిన్ మరియు ఆండ్రోజెన్ అనే హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి.
పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ (PCOS): PCOS అనేది హార్మోన్లలో వచ్చే మార్పుల వల్ల మహిళల్లో వచ్చే సమస్య. ఇది అండాశయాలపై చిన్న తిత్తులు ఏర్పడటానికి దారితీస్తుంది. అంతే కాకుండా ఈ సమస్యతో బాధపడే స్త్రీలు తరచుగా క్రమరహిత ఋతు క్రమం, అధిక ఆండ్రోజెన్ (పురుష హార్మోన్లు) స్థాయిలు మరియు ఇన్సులిన్ నిరోధకతను కలిగి ఉంటారు. PCOS సమస్య వంధ్యత్వం, బరువు పెరగడం, మొటిమలు మరియు అధిక జుట్టు పెరుగుదల వంటి అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.
పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ (PCOD): PCOD అనేది స్త్రీ యొక్క అండాశయాలు పునరుత్పత్తి వయస్సులో పెద్ద సంఖ్యలో అపరిపక్వ లేదా పాక్షికంగా పరిపక్వమైన గుడ్లను ఉత్పత్తి చేసే పరిస్థితి. ఈ గుడ్లు కాలక్రమేణా అండాశయాలలో తిత్తులుగా అభివృద్ధి చెందుతాయి. ఈ పరిస్థితి హార్మోన్ల అసమతుల్యత, క్రమరహిత రుతుక్రమం, బరువు పెరగడం మరియు ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. సాధారణంగా PCOD అనేది PCOS కంటే తక్కువ తీవ్రతను కలిగి ఉంటుంది. ఈ సమస్యకు సరైన మందులు మరియు జీవనశైలిలో తగిన మార్పుల చేయడం ద్వారా నియంత్రించడానికి వీలవుతుంది.
PCOD/PCOS యొక్క లక్షణాలు
సాధారణంగా మహిళల్లో PCOD లేదా PCOS అనేవి ఈ క్రింది లక్షణాలకు దారితీస్తాయి:
- హార్మోన్లు సమతుల్యత కోల్పోవడం
- అండోత్సర్గము లేకపోవడం
- క్రమరహిత ఋతు చక్రం
- గర్భధారణలో ఇబ్బంది
- బరువు పెరగడం
- రుతుక్రమ సమయంలో తీవ్రమైన కడుపు నొప్పి & బ్లీడింగ్ అవ్వడం
- చర్మం నల్లబడడం & చర్మంపై మొటిమలు రావడం
- శరరీంలో ఇన్సులిన్ నిరోధకత పెరగడం
- జుట్టు రాలడం లేదా పలచబడడం (శరీరంలో మగ హార్మోన్ల ఉత్పత్తి పెరగడం వల్ల)
కొన్ని సార్లు ఈ సమస్యకు చికిత్స చేయకుండా వదిలేస్తే, మధుమేహం, ఊబకాయం, గుండె జబ్బులు మరియు అధిక కొలెస్ట్రాల్ వంటి మరిన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.
PCOD & PCOS యొక్క కారణాలు
మహిళల్లో PCOS/PCOD సమస్యకు గల ముఖ్యమైన కారణాలు:
- అదనపు ఇన్సులిన్ ఉత్పత్తి: శరీరంలోని అదనపు ఇన్సులిన్ స్థాయిలు ఆండ్రోజెన్ ఉత్పత్తిని పెంచుతాయి (ఆడవారిలో చాలా తక్కువగా ఉండే మగ హార్మోన్). ఇది అండోత్సర్గమును కష్టతరం చేస్తుంది.
- అధిక ఆండ్రోజెన్ ఉత్పత్తి: PCOS ఉన్న స్త్రీలలో అండాశయాలు అసాధారణంగా అధిక ఆండ్రోజెన్ హార్మోన్లను విడుదల చేస్తాయి, ఇది మొటిమలు మరియు హిర్సుటిజం (ముఖం మరియు శరీరంపై జుట్టు పెరుగుదల) కారణమవుతుంది.
- తక్కువ గ్రేడ్ ఇన్ఫ్లమేషన్: PCOS ఉన్న స్త్రీలు తక్కువ-గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ కలిగి ఉంటారు. ఇది ఆండ్రోజెన్ ఉత్పత్తి స్థాయిని పెంచడం వల్ల రక్త నాళాలు లేదా గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
- వంశపారంపర్యం: PCOS సమస్య స్త్రీలలో నిర్దిష్ట జన్యుపరమైన లక్షణాలను కలిగి వంశపారంపర్యం వల్ల కూడా రావొచ్చు.
పైన వివరించిన వాటితో పాటుగా ఈ క్రింది కారణాలు కూడా PCOS/PCOD రావడానికి దోహదపడుతాయి:
- జీవనశైలిలోని మార్పులు
- నిద్రలేమి
- అధిక పని ఒత్తిడి
- సమయానికి ఆహారం తీసుకోకపోవడం
- అధిక బరువు కలిగి ఉండడం
- జంక్ ఫుడ్స్ కి అలవాటు పడడం వంటివి కారణాలుగా చెప్పవచ్చు
PCOD లేదా PCOS కి నిర్ధారణ పరీక్షలు
పెల్విక్ పరీక్ష: స్త్రీ యొక్క బాహ్య మరియు అంతర్గత కటి అవయవాల (యోని, గర్భాశయం, ఫెలోపియన్ నాళాలు, అండాశయాలు మరియు పురీషనాళం) పనితీరును తెలుసుకోవడానికి చేసే శారీరక పరీక్ష.
రక్త పరీక్షలు: మీ శరీరంలోని హార్మోన్ స్థాయిలను అర్థం చేసుకోవడంలో రక్త పరీక్షలు సహాయపడతాయి. రక్త పరీక్షలలో గ్లూకోస్ టాలరెన్స్ పరీక్షలు, కొలెస్ట్రాల్ పరీక్షలు మరియు PCOD/PCOS సమస్యని బహిర్గతం చేసే ఇతర రక్త పరీక్షలు ఉంటాయి.
ఇమేజింగ్ పరీక్ష: అండాశయాల పరిమాణం, గర్భాశయం యొక్క రుపాన్ని అదే విధంగా అండాశయాలలో తిత్తులు యొక్క స్వరుపాన్ని తెలుసుకోవడానికి అల్ట్రాసౌండ్ ఇమేజింగ్ పరీక్ష చేయబడుతుంది.
పైన పేర్కొన్న వాటితో పాటుగా గైనకాలజిస్ట్ వారు కొన్నిసంక్లిష్టతలను నిర్ధారించడానికి అదనంగా ఈ కింది పరీక్షలను సైతం సిఫార్సు చేయవచ్చు.
- హార్మోన్ స్థాయిలు పర్యవేక్షించడం
- రక్తపోటు, గ్లూకోస్ టాలరెన్స్, కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్ స్థాయిలను చెక్ చేయడం
- డిప్రెషన్ మరియు ఆందోళన కోసం స్క్రీనింగ్ పరీక్షలు చేయడం
- అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (OSA) ను కలిగి ఉన్నారా అనే నిర్థారణ కూడా చేయవచ్చు
PCOD & PCOS నివారణ చర్యలు
ఆహారంలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవడం వల్ల ఈ సమస్యను అదుపులో ఉంచుకోవచ్చు. అంతే కాకుండా:
- ఆరోగ్యకరమైన శరీర బరువును నిర్వహించడం
- పిజ్జాలు, బర్గర్లు, నూడల్స్ వంటి ఫాస్ట్ ఫుడ్స్‌కు దూరంగా ఉండడం
- ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం
- మానసిక ఒత్తిడి నియంత్రించుకోవడం
- కార్బోహైడ్రేట్ వినియోగాన్ని పరిమితం చేయడం
- తీపి పదార్థాలు తినకపోవడం
- క్రమం తప్పకుండా వ్యాయామం, కార్డియో ఎక్సర్‌సైజ్, సైక్లింగ్ మరియు ఈత కొట్టడం వంటివి చేయడం
- తీసుకునే ఆహారంలో విటమిన్-బి ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడంతో ఈ సమస్యను నివారించుకోవచ్చు.
పై నియమాలను క్రమం తప్పకుండా పాటిస్తే పరిస్థితి దాదాపుగా అదుపులోకి వస్తుంది. అంతే కాకుండా హార్మోన్స్‌ను సమతుల్యం చేసుకోవటం ద్వారా ఈ వ్యాధిని పూర్తిగా నయం చేసుకుని సాధారణ జీవితం గడపవచ్చు.
About Author –
Dr. Lepakshi Dasari, Consultant Gynaecologist & Laparoscopic Surgeon, Yashoda Hospital, Hyderabad