Select Page

ఆరోగ్యకరమైన వర్షాకాలం: రుతుపవనాలు రాకతో వచ్చే జ్వరాలు & అంటువ్యాధులు రాకుండా ఎలా జాగ్రత్తపడాలి?

ఆరోగ్యకరమైన వర్షాకాలం: రుతుపవనాలు రాకతో వచ్చే జ్వరాలు & అంటువ్యాధులు రాకుండా ఎలా జాగ్రత్తపడాలి?

రుతుపవనాలు అనేవి వర్షా కాలానికి నాంది, ఇవి మండే వేసవి వేడి నుండి ఆహ్లాదకరమైన ఉపశమనాన్ని ఇస్తాయి. పచ్చదనాన్ని, చల్లదనాన్ని వాతావరణానికి తెస్తాయి. అయితే, వర్షాల అందంతో పాటు వివిధ వ్యాధులు మరియు అంటురోగాల ప్రమాదం కూడా పెరుగుతుంది. అధిక తేమ, నిలిచిపోయిన నీరు మరియు తేమతో కూడిన పరిస్థితులు ముఖ్యంగా బ్యాక్టీరియా, వైరస్‌లు, శిలీంధ్రాలు మరియు వ్యాధులను మోసే కీటకాలకు సంతానోత్పత్తికి అనువైన స్థావరాన్ని సృష్టిస్తాయి. భారతదేశంలో, ప్రత్యేకించి నగరాల్లో, సాధారణ వర్షాకాల సంబంధిత వ్యాధుల గురించి తెలుసుకోవడం, మరియు అంతకంటే ముఖ్యంగా, మీ ఆరోగ్యాన్ని, మీ కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం చాలా కీలకం.

రుతుపవనాల వల్ల వచ్చే సాధారణ రుగ్మతలు మరియు అంటువ్యాధులు

రుతుపవన వ్యాధులను ప్రధానంగా వాటి సంక్రమణ పద్ధతి ఆధారంగా వర్గీకరించవచ్చు: నీటి ద్వారా వ్యాపించేవి, వాహకాల ద్వారా వ్యాపించేవి, గాలి ద్వారా వ్యాపించేవి మరియు చర్మ అంటువ్యాధులు.

  1. నీటి ద్వారా వ్యాపించే వ్యాధులు: కలుషితమైన నీటిలో దాగి ఉన్న ప్రమాదం

అధిక వర్షపాతం తరచుగా నీరు నిలిచిపోవడానికి, మురుగునీరు పొంగిపొర్లడానికి మరియు త్రాగునీటి వనరులు కలుషితం కావడానికి దారితీస్తుంది, ఇది నీటి ద్వారా వ్యాపించే వ్యాధులను విపరీతంగా పెంచుతుంది.

  • టైఫాయిడ్ (ఎంటెరిక్ ఫీవర్): సాల్మోనెల్లా టైఫీ (Salmonella Typhi) అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే టైఫాయిడ్, కలుషితమైన ఆహారం మరియు నీటి ద్వారా వ్యాపిస్తుంది. దీని యొక్క లక్షణాలు దీర్ఘకాలిక అధిక జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, బలహీనత, కడుపు నొప్పి, ఆకలి లేకపోవడం, మలబద్ధకం లేదా కొన్నిసార్లు అతిసారం. తీవ్రమైన సందర్భాల్లో, ప్రేగులలో రక్తస్రావం సంభవించవచ్చు.
  • కలరా: ఇది విబ్రియో కలరా (Vibrio cholerae) అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే తీవ్రమైన అతిసార వ్యాధి, ఇది తరచుగా కలుషితమైన ఆహారం మరియు నీటి ద్వారా సంక్రమిస్తుంది. దీని యొక్క లక్షణాలు తీవ్రమైన నీళ్ల విరేచనాలు (తరచుగా “బియ్యం నీరు వంటి మలం”గా వర్ణించబడతాయి), తీవ్రమైన వాంతులు, అధిక డీహైడ్రేషన్ (నిర్జలీకరణం) మరియు కండరాల తిమ్మిర్లుగా ఉన్నాయి.
  • కామెర్లు (హెపటైటిస్ A & E): ఈ వైరల్ ఇన్ఫెక్షన్లు కాలేయాన్ని ప్రభావితం చేస్తాయి మరియు కలుషితమైన ఆహారం మరియు నీటి ద్వారా ఇవి వ్యాపిస్తాయి, ఇది తరచుగా సరైన పారిశుధ్య లోపం వల్ల జరుగుతుంది. దీని యొక్క లక్షణాలు చర్మం మరియు కళ్ళు పసుపు రంగులోకి మారడం (స్క్లెరా), ముదురు రంగు మూత్రం, అలసట, వికారం, వాంతులు, కడుపు నొప్పి మరియు ఆకలి లేకపోవడంగా ఉంటాయి. హెపటైటిస్ E గర్భిణులకు ప్రమాదకరంగా ఎంచబడింది.
  • గ్యాస్ట్రోఎంటెరిటిస్ / స్టమక్ ఫ్లూ (అతిసారం మరియు డీసెంటరీ): వివిధ వైరస్‌లు, బ్యాక్టీరియా లేదా పరాన్నజీవుల వల్ల కడుపు మరియు ప్రేగులలో వాపు వచ్చి ఫుడ్ పాయిజనింగ్ లేదా కడుపు ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. వికారం, వాంతులు, నీళ్ల విరేచనాలు, కడుపు తిమ్మిర్లు వీటి యొక్క లక్షణాలుగా ఉన్నాయి. కొన్ని సందర్భాలలో జ్వరం కూడా వస్తుంది.
  • లెప్టోస్పిరోసిస్: ఇది వ్యాధికి గురికాబడిన జంతువుల (ఎలుకలు వంటివి) మూత్రంతో కలుషితమైన నీరు లేదా మట్టితో సంబంధం ఏర్పడటం వల్ల వచ్చే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్. ఇది తరచుగా బురద లేదా మురికి నీటిలో నడిచినప్పుడు సంభవిస్తుంది, ముఖ్యంగా కాళ్ళకు కోతలు లేదా గాయాలు ఉన్నప్పుడు కూడా గురికాబడే అవకాశం ఎక్కువగా ఉంది. మరి ముఖ్యంగా అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పులు, చలి, వాంతులు మరియు కొన్నిసార్లు కామెర్లు లేదా ఎర్ర కళ్ళు మొదలైనవి వీటి యొక్క ప్రధాన లక్షణాలుగా ఉన్నాయి.

      2. వాహకాల ద్వారా వ్యాపించే వ్యాధులు: దోమల బెడద

గుంతలు, పాత టైర్లు, కూలర్‌లు మరియు మూతలు లేని పాత్రలలో నిలిచి ఉన్న నీరు దోమలకు సంతానోత్పత్తి ప్రదేశాలుగా మారతాయి, ఫలితంగా వాహకాల ద్వారా సంక్రమించే వ్యాధులు పెరుగుతాయి.

  • డెంగ్యూ జ్వరం: డెంగ్యూ జ్వరం అనేది ఏడెస్ ఈజిప్టి (Aedes aegypti) దోమ ద్వారా వ్యాపిస్తుంది. ఈ దోమ సాధారణంగా పగటిపూట కుడుతుంది, నిలిచి ఉన్న నీటిలో ఇది గుడ్లు పెడుతుంది. అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కళ్ళ వెనుక నొప్పి, కీళ్ల మరియు కండరాల నొప్పి, దద్దుర్లు, వికారం, వాంతులు మొదలైనవి డెంగ్యూ జ్వరం యొక్క లక్షణాలు.
  • మలేరియా: మలేరియా అనేది ప్లాస్మోడియం (Plasmodium) పరాన్నజీవి వల్ల వస్తుంది, ఇది సోకిన అనాఫిలెస్ (Anopheles) దోమ కుట్టడం ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. ఈ దోమ తరచుగా నిలిచి ఉన్న లేదా మురికి నీటిలో గుడ్లు పెడుతుంది. చలితో కూడిన అధిక జ్వరం మరియు తీవ్రమైన చెమట, తలనొప్పి, వికారం మరియు కండరాల నొప్పి మొదలైనవి మలేరియా జ్వరం యొక్క ముఖ్య లక్షణాలు.
  • చికున్‌గున్యా: ఇది కూడా ఏడెస్ ఈజిప్టి (Aedes aegypti) మరియు ఏడెస్ ఆల్బోపిక్టస్ (Aedes albopictus) దోమల ద్వారా వ్యాపిస్తుంది. అధిక జ్వరం, తీవ్రమైన మరియు తరచుగా బలహీనపరిచే కీళ్ల నొప్పి (ఇది వారాలు లేదా నెలల తరబడి కొనసాగవచ్చు), కండరాల నొప్పి, తలనొప్పి, అలసట మరియు దద్దుర్లు మొదలైనవి ఈ చికున్‌గున్యా యొక్క ప్రధాన లక్షణాలు.

      3. గాలి ద్వారా వ్యాపించే వ్యాధులు: శ్వాసకోశ ప్రమాదాలు

వర్షాకాలంలో ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గులు మరియు పెరిగిన తేమ శ్వాసకోశ అంటువ్యాధులకు గురయ్యే అవకాశాన్ని పెంచుతాయి.

  • సాధారణ జలుబు మరియు ఫ్లూ (ఇన్‌ఫ్లుయెంజా): వివిధ వైరస్‌ల వల్ల వచ్చే ఈ వ్యాధులు అత్యంత సాధారణంగా ప్రబలే అంటువ్యాధులు. ముక్కు కారడం లేదా మూసుకుపోవడం, గొంతు నొప్పి, దగ్గు, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, జ్వరం మరియు చలి వీటి యొక్క ప్రధాన లక్షణాలు.
  • వైరల్ జ్వరాలు: వివిధ వైరస్ల వల్ల వచ్చే జ్వరాలకు ఇది ఒక సాధారణ పదం. తరచుగా సాధారణ అనారోగ్యం, ఒళ్లు నొప్పులు, జ్వరం, మరియు అలసటతో లక్షణాలు కూడి ఉంటాయి.

4. అంటువ్యాధులు: తేమ సమ్మేళన

వర్షాకాలంలో అధిక తేమ మరియు నిరంతర తడి వాతావరణం శిలీంధ్ర (ఫంగల్) మరియు బ్యాక్టీరియా తో కూడిన చర్మ అంటువ్యాధులకు అనువైన వాతావరణాన్ని సృష్టిస్తుంది.

  • శిలీంధ్ర అంటువ్యాధులు (Fungal Infections):
    • రింగ్‌వార్మ్ (గజ్జి/తామర): ఇది ఒక శిలీంధ్ర అంటువ్యాధి, ఇది గుండ్రని మరియు దురదతో కూడిన దద్దుర్లు ఏర్పరుస్తుంది.
    • అథ్లెట్స్ ఫుట్: కాలి వేళ్ళ మధ్య వచ్చే శిలీంధ్ర అంటువ్యాధి, ఇది దురద, ఎరుపుదనం మరియు చర్మం పొరలుగా ఊడిపోవడానికి కారణమవుతుంది.
    • నెయిల్ ఫంగస్ (గోళ్లకి ఫంగస్ రావడం): ఈ ఫంగస్ వేలి గోళ్లు లేదా కాలి గోళ్లను ప్రభావితం చేస్తుంది, వాటిని మందంగా, రంగు మారినట్లుగా మరియు పెళుసుగా చేస్తుంది.
  • బ్యాక్టీరియా అంటువ్యాధులు (Bacterial Infections):
    • ఇంపెటిగో: ఇది బ్యాక్టీరియా వల్ల వచ్చే చర్మ ఇన్ఫెక్షన్, ఇది ఎర్రటి పుండ్లకు కారణమవుతుంది, అవి త్వరగా పగిలి ద్రవాన్ని కారుస్తాయి.
    • ఫోలిక్యులైటిస్: ఇది వెంట్రుకల కుదుళ్లలో (హెయిర్ ఫోలికల్స్) వాపు, ఇది తరచుగా చిన్న, ఎర్రటి గడ్డలు లేదా చీముతో నిండిన మొటిమలుగా కనిపిస్తుంది.

 

డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల లక్షణాలున్నాయా?

వర్షాకాలంకి తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తలు

రుతుపవన రాకతో మొదలయ్యే సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండటానికి అదేవిధంగా మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ముందుగానే నివారణ చర్యలను పాటించడం ఉత్తమ మార్గం.

  1. వ్యక్తిగత పరిశుభ్రత: మొదటి రక్షణ వలయం

వర్షాకాలంలో నిష్కళంకమైన వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవచ్చు:

  • తరచుగా చేతులు కడుక్కోవడం: ముఖ్యంగా భోజనం చేయడానికి ముందు, టాయిలెట్ ఉపయోగించిన తర్వాత, మరియు వర్షపు నీరు లేదా బురదతో సంబంధంలోకి వచ్చిన తర్వాత సబ్బు మరియు నీటితో మీ చేతులను పూర్తిగా కడుక్కోండి. బయట ఉన్నప్పుడు హ్యాండ్ శానిటైజర్ని ఉపయోగించండి.
  • క్రమం తప్పకుండా స్నానం చేయండి: ప్రతిరోజూ స్నానం చేయండి, ముఖ్యంగా వర్షంలో తడిచినప్పుడు, సూక్ష్మక్రిములను మన దరికి చేరకుండా ఉండటానికి ఇది సహాయపడుతుంది.
  • చర్మం పొడిగా ఉంచుకోండి: అధిక తేమ శిలీంధ్రాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. స్నానం చేసిన తర్వాత లేదా తడిసిన తర్వాత మీ శరీరాన్ని పూర్తిగా ఆరబెట్టుకోండి. చర్మం మడతలు, చంకలు, గజ్జలు మరియు కాలి వేళ్ళ మధ్య ప్రత్యేక శ్రద్ధ వహించండి. తేమకు గురయ్యే అవకాశం ఉన్న ప్రదేశాలలో యాంటీఫంగల్ పౌడర్‌ను ఉపయోగించండి.
  • శుభ్రమైన దుస్తులు: శుభ్రమైన, పొడి మరియు గాలి తగిలే దుస్తులను, లోదుస్తులను ధరించండి. తడి దుస్తులను ధరించడం మానుకోండి, ఎందుకంటే అవి శిలీంధ్ర అంటువ్యాధులకు దారితీయవచ్చు. వీలైతే, తడిచిన దుస్తులను సూర్యరశ్మిలో పూర్తిగా ఆరబెట్టండి.
  • పాదాల సంరక్షణ: గుంతలలో లేదా బురద నీటిలో చెప్పులు లేకుండా నడవడం మానుకోండి. కలుషితమైన నీటి నుండి మీ పాదాలను రక్షించుకోవడానికి మరియు లెప్టోస్పిరోసిస్ మరియు అథ్లెట్స్ ఫుట్ వంటి శిలీంధ్ర అంటువ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి తగిన సంరక్షణ అవసరం. ఒకవేళ పాదరక్షలు గనక తడిస్తే వెంటనే కడిగి వాటిని పూర్తిగా ఆరబెట్టండి.
  • ముఖాన్ని తాకడం మానుకోండి: మీ చేతులను మీ కళ్ళు, ముక్కు మరియు నోటికి దూరంగా ఉంచండి, ఎందుకంటే ఇది సూక్ష్మక్రిముల వ్యాప్తికి ఒక సాధారణ మార్గం.
  • గోళ్లను కత్తిరించండి: మురికి మరియు సూక్ష్మక్రిములు పేరుకుపోకుండా నిరోధించడానికి గోళ్లను ఎప్పటికప్పుడు క్రమంగా కత్తిరించి శుభ్రంగా ఉంచుకోండి.

Monsoon-seasonal diseases

      2. ఆహారం మరియు నీటి భద్రత

వర్షాకాలంలో కలుషితమైన ఆహారం మరియు నీరు వ్యాధుల వ్యాప్తికి ప్రధాన కారణాలు. ఆహార భద్రతా మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించడం చాలా ముఖ్యం.

  • సురక్షితమైన నీరు త్రాగండి: ఎల్లప్పుడూ మరిగించిన లేదా శుద్ధి చేసిన నీటిని మాత్రమే త్రాగండి. మీరు ట్యాప్ నీటిపై ఆధారపడితే, మంచి వాటర్ ప్యూరిఫైయర్‌ను ఉపయోగించండి లేదా నీటిని కనీసం 10 నిమిషాలు మరిగించండి.
  • వీధి ఆహారానికి దూరంగా ఉండండి: ముఖ్యంగా కట్ చేసి ఉంచిన పండ్లు, మూతలు లేని ఆహార పదార్థాలు, అపరిశుభ్రమైన పరిస్థితులలో తయారుచేసిన ఆహారాలు మొదలైనవి తీసుకోకండి. ఇవి తీసుకోవడం ద్వారా ఆరోగ్యం చాలా ప్రమాదంలో పడుతుంది.
  • తాజాగా వండిన ఆహారాన్ని తినండి: వేడి వేడిగా ఉన్నప్పుడే ఆహారాన్ని భుజించేలా చూసుకోండి, ఇంట్లో వండిన భోజనానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. తేమతో కూడిన వాతావరణంలో ఆహారం త్వరగా పాడైపోతుంది. సరిగ్గా రిఫ్రిజిరేట్ చేసి, పూర్తిగా వేడి చేసి వాడుకోండి. ముందటి రోజు మిగిలిపోయిన ఆహారాన్ని తినడం మానుకోండి.
  • పండ్లు మరియు కూరగాయలను పూర్తిగా కడగండి: అన్ని పండ్లు మరియు కూరగాయలను, ముఖ్యంగా ఆకుకూరలను మరియు పచ్చిగా తినే వాటిని, పారే నీటి కింద శుభ్రంగా కడగండి. అదనపు జాగ్రత్తగా వెజిటబుల్ వాష్ లేదా తేలికపాటి ఉప్పు ద్రావణాన్ని ఉపయోగించడాన్ని పరిగణించండి.
  • పచ్చి ఆహారాలను పరిమితం చేయండి: పచ్చి సలాడ్‌లు మరియు మొలకల వినియోగాన్ని తగ్గించండి, ఎందుకంటే వాటిలో బ్యాక్టీరియా ఉండే అవకాశం వర్షాకాలంలో ఎక్కువగా ఉంటుంది. బదులుగా కూరగాయలను కొద్దిగా ఆవిరిపై ఉడికించండి.
  • పాల ఉత్పత్తులను పర్యవేక్షించండి: పాల ఉత్పత్తుల విషయంలో జాగ్రత్తగా ఉండండి మరియు అవి తాజాగా ఉన్నాయని మరియు సరిగ్గా నిల్వ చేయబడ్డాయని నిర్ధారించుకోండి.
  • సీఫుడ్‌కు దూరంగా ఉండండి: వర్షాకాలం తరచుగా చేపలు మరియు సీఫుడ్‌కు సంతానోత్పత్తి కాలం, అందువల్ల ఈ సమయంలో సీఫుడ్‌ను పరిమితం చేయడం లేదా పూర్తిగా మానుకోవడం మంచిది.

Monsoon-seasonal diseases

     3. దోమల నియంత్రణ

వాహకాల ద్వారా వ్యాపించే వ్యాధులను నివారించేందుకు దోమల సంతానోత్పత్తిని నియంత్రించడం చాలా అవసరం.

  • నిలిచి ఉన్న నీటిని తొలగించండి: మీ ఇల్లు మరియు పరిసరాలలో నీరు నిలిచే అవకాశం ఉన్న ఏవైనా పాత్రలను – పూల కుండీలు, కూలర్‌లు, పక్షుల స్నానపు తొట్టెలు, పాత టైర్లు, పారవేసిన సీసాలు మరియు పెంపుడు జంతువుల నీటి గిన్నెలను కూడా – క్రమం తప్పకుండా తనిఖీ చేసి ఖాళీ చేయండి. ఈ పనిని కనీసం వారానికి ఒకసారి చేయండి.
  • నీటి నిల్వను శుభ్రంగా ఉంచండి: దోమలు గుడ్లు పెట్టకుండా నిరోధించడానికి ఓవర్‌హెడ్ ట్యాంకులు మరియు ఇతర నీటి నిల్వ కంటైనర్‌లు సరిగ్గా మూసివేయబడ్డాయో లేదో నిర్ధారించుకోండి.
  • దోమల నివారణ మందులను ఉపయోగించండి: దోమలు ఎక్కువగా చురుకుగా ఉండే తెల్లవారుజామున మరియు సాయంత్రం వేళల్లో బహిర్గతమైన చర్మంపై దోమల నివారణ మందులను (రిపెల్లెంట్స్) పూయండి.
  • రక్షణ దుస్తులను ధరించండి: దోమలు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో ఉన్నట్లయితే, బహిర్గతమైన చర్మాన్ని కప్పబడటానికి పొడవాటి చేతుల చొక్కాలు, ప్యాంటు మరియు సాక్స్ ను ధరించండి.
  • దోమ తెరలను ఉపయోగించండి: ముఖ్యంగా దోమలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్నట్లయితే, దోమ తెరల కింద నిద్రపోండి.
  • దోమల మెష్లను అమర్చండి: దోమలు మీ ఇంట్లోకి ప్రవేశించకుండా నిరోధించడానికి కిటికీలు మరియు తలుపులపై దోమల మెష్లను అమర్చండి.
  • ఫ్యూమిగేషన్: మీ ప్రాంతంలో స్థానిక ప్రభుత్వం నిర్వహించే ఫ్యూమిగేషన్ కార్యక్రమాలలో పాల్గొనండి లేదా వాటికి మద్దతు ఇవ్వండి.

Monsoon seasonal diseases

     4. ఇల్లు మరియు పరిసరాల పరిశుభ్రత

ప్రతిఒక్కరూ తమ నివాస వాతావరణాన్ని శుభ్రంగాను మరియు పొడిగాను ఉంచుకోవాలి. ఈ క్రింద చెప్పబడిన పరిశుభ్రతలను పాటించండం ఎంతో అవసరం:

  • క్రమం తప్పకుండా శుభ్రపరచడం: ఫ్లోర్‌లను క్రిమిసంహారక ద్రావణంతో క్రమం తప్పకుండా తుడవండి. బాత్రూమ్‌లు మరియు కిచెన్‌ల వంటి తడిగా ఉండే ప్రదేశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి.
  • తేమ మరియు బూజును నివారించండి: అధిక తేమ మరియు బూజు అనేవి శిలీంధ్రాలు పెరగడానికి దారితీస్తుంది. మీ ఇంట్లో సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోండి. వర్షం పడనప్పుడు గాలి ప్రసరణ కోసం కిటికీలను తెరవండి. బాత్రూమ్‌లు మరియు కిచెన్‌లలో ఎగ్జాస్ట్ ఫ్యాన్‌లను ఉపయోగించండి.
  • లీక్‌లను తనిఖీ చేయండి: మీ పైకప్పు, గోడలు మరియు పైపులలో ఏవైనా లీక్‌లు లేదా పగుళ్లను తనిఖీ చేయండి అదేవిధంగా నీరు ఇంకడం మరియు తేమను నివారించడానికి వెంటనే మరమ్మత్తులను చేయించండి.
  • డ్రైన్‌లను శుభ్రంగా ఉంచండి: నీరు నిలిచిపోకుండా మరియు పొంగిపొర్ల కుండా నిరోధించడానికి అన్ని డ్రైన్‌లు మరియు గాటర్లు అడ్డంకులు (ఆకులు, చెత్త) లేకుండా చూసుకోండి.
  • వ్యర్థాల నిర్వహణ: ఈగలు మరియు ఇతర కీటకాలు సంతానోత్పత్తి చేయకుండా నిరోధించడానికి చెత్తను మూత ఉన్న డబ్బాలలో సరిగ్గా పారవేయండి.
  • ఫర్నిచర్‌ను రక్షించండి: చెక్క ఫర్నిచర్ తేమను గ్రహించి బూజు పట్టవచ్చు. గదులను బాగా వెంటిలేట్ చేయండి మరియు పొడి వస్త్రంతో ఫర్నిచర్‌ను తుడవండి.
  • విద్యుత్ భద్రత: విద్యుత్ వైరింగ్ మరియు ఉపకరణాలలో ఏవైనా నష్టాన్ని తనిఖీ చేయండి. తడి పరిస్థితులలో కరెంటు వైర్లు చాలా ప్రమాదకరంగా ఉంటాయి.

Monsoon-seasonal diseases

     5. సాధారణ ఆరోగ్యం మరియు రోగనిరోధక శక్తి

బలమైన రోగనిరోధక వ్యవస్థ అనేది మీ శరీరం అంటువ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది. ఈ క్రింది జాగ్రత్తలు అనేవి ముఖ్యంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉపయోగపడతాయి:

  • సమతుల్య ఆహారం: తాజా పండ్లు, కూరగాయలు మరియు తృణధాన్యాలు తీసుకోవాలి. అలాగే సమృద్ధిగా ఉండే పోషకమైన మరియు సమతుల్య ఆహారాన్ని తీసుకోండి. అల్లం, వెల్లుల్లి, పసుపు మరియు సిట్రస్ పండ్లు వంటి రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోండి.
  • డీహైడ్రేషన్ కాకుండా ఉండండి: డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటానికి పుష్కలంగా ద్రవాలు త్రాగండి, ముఖ్యంగా గోరువెచ్చని నీరు, హెర్బల్ టీలు లేదా క్లియర్ సూప్‌లు ఉత్తమం. చల్లని పానీయాలను నివారించండి.
  • వర్షంలో తడవకుండా ఉండండి: బయటకు వెళ్ళినప్పుడు గొడుగు లేదా రెయిన్‌కోట్ తీసుకెళ్లండి. ఒకవేళ మీరు వర్షంలో తడిస్తే, సాధారణ జలుబు మరియు ఫ్లూ రాకుండా నిరోధించడానికి వీలైనంత త్వరగా పొడి దుస్తులను మార్చుకోండి.
  • క్రమం తప్పకుండా వ్యాయామం: మీ శరీరాన్ని ఫిట్‌గా ఉంచడానికి మరియు మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి మితమైన వ్యాయామ దినచర్యను కొనసాగించండి.
  • ఒత్తిడిని నిర్వహించండి: ఒత్తిడి మీ రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంది. ధ్యానం, యోగా వంటి ఒత్తిడిని తగ్గించే కార్యకలాపాలను అలవర్చుకోండి.
  • టీకాల కోసం సంప్రదించండి: వర్షాకాలంలో ప్రయోజనకరంగా ఉండే ఏవైనా సిఫార్సు చేయబడిన టీకాల (ఉదాహరణకు, హెపటైటిస్ A, టైఫాయిడ్) గురించి మీ వైద్యుడితో చర్చించండి, ముఖ్యంగా పిల్లల కోసం.
  • వెంటనే వైద్య సహాయం తీసుకోండి: మీకు వర్షాకాల సంబంధిత వ్యాధుల లక్షణాలు ఏవైనా కనిపిస్తే, స్వీయ-వైద్యం చేసుకోకండి. ఖచ్చితమైన నిర్ధారణ మరియు సకాలంలో చికిత్స కోసం వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ముందుగానే చికిత్స తీసుకోవడం సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.

వైద్య సహాయం ఎప్పుడు తీసుకోవాలి?

వర్షాకాలంలో వచ్చే జ్వరాలు మరియు అంటువ్యాధులు సాధారణమే అయినప్పటికీ, కొన్ని లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. సకాలంలో వైద్య సహాయం తీసుకోవడం ద్వారా సమస్యలు తీవ్రతరం కాకుండా నివారించవచ్చు. కింది లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి:

  • జ్వరం తగ్గకపోతే లేదా తీవ్రమైతే: 2-3 రోజులకు మించి జ్వరం కొనసాగితే, లేదా జ్వరం తీవ్రత పెరిగి అధిక ఉష్ణోగ్రతలకు చేరుకుంటే (102°F/39°C కంటే ఎక్కువ).
  • తీవ్రమైన శరీర నొప్పులు లేదా కీళ్ల నొప్పులు: డెంగ్యూ, చికున్‌గున్యా వంటి వ్యాధులలో కనిపించే విధంగా తీవ్రమైన కండరాల లేదా కీళ్ల నొప్పులు ఉంటే, ముఖ్యంగా రోజువారీ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తే.
  • తీవ్రమైన అలసట మరియు బలహీనత: సాధారణ అలసట కంటే ఎక్కువ, పనులు చేయడానికి శక్తి లేకపోవడం.
  • తలనొప్పి మరియు కళ్ళ వెనుక నొప్పి: తీవ్రమైన, నిరంతర తలనొప్పి, ముఖ్యంగా కళ్ళ వెనుక నొప్పి ఉంటే, ఇది డెంగ్యూకు సంకేతం కావచ్చు.
  • వాంతులు మరియు అతిసారం తీవ్రమైతే: తరచుగా వాంతులు, నీళ్ల విరేచనాలు (ముఖ్యంగా బియ్యం నీటిలాంటివి), లేదా రక్తం కలిసిన విరేచనాలు ఉంటే. నిర్జలీకరణం (డీహైడ్రేషన్) లక్షణాలు (నోరు ఎండిపోవడం, మూత్రం తక్కువగా రావడం) కనిపిస్తే వెంటనే వైద్యుడిని కలవాలి.
  • చర్మంపై దద్దుర్లు లేదా రక్తస్రావం: శరీరంలో ఎక్కడైనా అసాధారణ దద్దుర్లు, లేదా పళ్ళు తోముకునేటప్పుడు చిగుళ్ళ నుండి, ముక్కు నుండి రక్తస్రావం వంటివి కనిపిస్తే.
  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది: దగ్గుతో కూడిన జ్వరం, ఊపిరి తీసుకోవడంలో కష్టం లేదా ఛాతీలో నొప్పి ఉంటే.
  • మూత్రపిండాల సమస్యలు: మూత్రం రంగు మారడం, మూత్రవిసర్జన తగ్గుదల లేదా నొప్పి ఉంటే.
  • కామెర్ల లక్షణాలు: చర్మం లేదా కళ్ళు పసుపు రంగులోకి మారడం, ముదురు రంగు మూత్రం, ఆకలి లేకపోవడం వంటివి కనిపిస్తే.

పైన పేర్కొన్న ఏ లక్షణాలు కనిపించినా సొంతంగా మందులు వాడకుండా, వెంటనే అర్హత కలిగిన వైద్యుడిని సంప్రదించి, సరైన నిర్ధారణ మరియు చికిత్స పొందడం చాలా ముఖ్యం. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, మరియు రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు వర్షాకాలంలో అనారోగ్యానికి గురైతే త్వరగా వైద్య సహాయం తీసుకోవడం మంచిది. మీ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండటం ద్వారా వర్షాకాలంలో వచ్చే తీవ్రమైన ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు.

ముగింపు

వర్షాలతో కూడిన రుతుపవన కాలం మన పర్యావరణ వ్యవస్థలో మరియు సాంస్కృతిక నిర్మాణంలో ఒక ముఖ్యమైన భాగం. ఇది ఆనందాన్ని మరియు ఉపశమనాన్ని తెచ్చినప్పటికీ, ఆరోగ్యం పట్ల అప్రమత్తత అనేది చాలా అవసరం. వ్యక్తిగత పరిశుభ్రత, ఆహారం మరియు నీటి భద్రత, దోమల నియంత్రణ, ఇంటి పరిశుభ్రత మరియు సాధారణ ఆరోగ్యం పట్ల ఈ వివరణాత్మక జాగ్రత్తలను శ్రద్ధగా పాటించడం ద్వారా, మీరు అనారోగ్యం బారిన పడే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు. నివారణ ఎల్లప్పుడూ చికిత్స కంటే ఉత్తమం అని గుర్తుంచుకోండి. రుతుపవనాల అందాన్ని బాధ్యతాయుతంగా ఆస్వాదించండి.

హైదరాబాద్ యశోద హాస్పిటల్స్ నందు వివిధ రకాల ఇన్ఫెక్షన్లు, సీజన్ మారే కొద్దీ వచ్చే అనారోగ్యాలకు, వ్యాధులకు అనుభవజ్ఞులైన వైద్యులు అందుబాటులో ఉన్నారు. వర్షాకాలంలో సాధారణంగా వచ్చే డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, కామెర్లు వంటి వ్యాధులకు చికిత్స చేయడానికి యశోద హాస్పిటల్స్ అత్యాధునిక సౌకర్యాలు, ల్యాబ్ లను కలిగి ఉంది. పేషెంటులకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి యశోద హాస్పిటల్స్ కట్టుబడి ఉంది. సమగ్ర రోగనిర్ధారణ పరీక్షలు మరియు చికిత్సలను వ్యక్తికి అనుగుణంగా అందించడం జరుగుతుంది.

మీ ఆరోగ్య సంరక్షణ గురించి ఏవైనా సందేహాలు ఉన్నాయా? సహాయం చేయడానికి మేము సిద్దంగా ఉన్నాము! మా అనుభవంతులైన నిపుణుల సలహా కొరకు +918929967127 కి కాల్ చేయగలరు.